Sunday, January 4, 2026

Shodasa Gowri Vratham Katha - షోడశగౌరి వ్రతం

షోడశగౌరి వ్రతం ( తదియ నోములు)

పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజుండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమార్తెలుండిరి. వారు పూర్ణచంద్రుని కళలతో సర్వాంగసుందరంగా యుక్తవయస్కులైనారు. వారికి రూపగుణ, శౌర్యసంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది. మల్లమాంబ తనకున్న సంపదసౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రత దూషణలు చేస్తుండేది. ఫలితంగా పశుసంపదను క్రూరమృగాలు నశింపజేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతైనాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లబాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరుగసాగింది.

దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఆ అరణ్యంలో ఎండకుకాలుతున్న పెద్ద పాషాణం, చెట్టునిండా పండ్లున్నా, ఒక్క పక్షి కూడా వాలని మామిడిచెట్టు, పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగునిండా పాలుండి కారిపోతున్నా దూడ తాగని ఒక బర్రె (గేదె) కనిపించాయి. ఇంకా ముందుకు నడవగా ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద, పచ్చిగడ్డితో నిండిన ఊసరక్షేత్రంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎద్దు కనిపించాయి.

అన్నపానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో "హే జగదంబే! కరుణామయి నన్ను క్షమించు" అని మొక్కుతూ మూర్ఛిల్లింది.

ఆ రోజు భాద్రపద శుక్ల తదియ. ఉపవాసంతో "హే గౌరీ!"  అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యొక్షమైంది. మల్లమాంబ కనులు తెరిచి, చేతులు జోడించి 

నమస్తే గిరిజాయాతే లోకామాత్రే నమో నమః || 
నమస్తే లోక సాక్షిణ్యై తుభ్యం భూయో నమో నమః || 

అమ్మా! కరుణాసాగరి నన్ను క్షమించు. నా అపరాధాన్ని మన్నించుమని కాళ్లమీద పడి ఏడ్వసాగింది. 

గౌరీ సంతుష్టిపొంది, నీవు ధనగర్వంతో షోడశగౌరీ వ్రతం చేయుట మానేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు, సుఖసంతోషాలతో ఉంటావని తెలిపింది. పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవిపూలు, పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది.

"హే జననీ! మార్గమధ్యంలో నేననేక చిత్రవిచిత్రాలన్నీ అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి" అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో ‘‘భర్తరాకముందే భుజించి, పెద్దలను గౌరవించని స్త్రీ అలా పాషాణంగా మారింది. ధనధాన్యాపూన్ని ఉన్నా దానధర్మాలు చేయనివాడు మామిడిచెట్టుగా మారాడు. ఎలాంటి వరుడిని తీసుకొచ్చినా వంకలుపెట్టి పెళ్లికంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది. తానే విద్యావంతుడిని, కీర్తిమంతుడుని అని గర్వంతో తన దగ్గరకు విద్యార్జనకు వచ్చినవారికి విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్రపెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలివ్వని తల్లి పొదుగునిండా పాలున్నా, దూడకివ్వలేని స్థితిలో బర్రెగా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజరుభూమిని దానం చేసిన రాజు ఊసరక్షేత్రంలో ఎద్దుగా తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మ వారనుభవిస్తున్నారని" దేవి తెలియజేసి, దీవెనలందించి అదృశ్యమైంది.

అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధ రాజువచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులు చుట్టుముట్టారు. "ఏ పూజ చేశావు? ఏ నోము నోచావు" అని అడిగారు. అంతట మల్లమాంబ జరిగిన వృతంతము అంత తెలియజేసి, షోడశ గౌరీవ్రతం చేసినందు వల్లనే తన కష్టాలు అన్ని తొలగినవని తెలిపి మిగిలిన అందరుతో ఈవ్రతాన్ని ఆచారింపచేసి సుఖ సంతోషాలను పొందినదనీ తెలియజేసెను .


ఉద్యాపనము: ఈవ్రతాన్ని 16 సంవత్సరాలు నోము నోచుకోవాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తితో వినాయకచవితికి ఒకరోజు ముందు అంటే భాద్రపదశుక్ల తదియరోజు 16 వత్తులు, 16 ముగ్గు, 16 వరుసల దారంతో, 16 ఉత్తరేణి ఆకులు పెట్టి తోరం కట్టుకోవాలి. 16 కుడుములు (బియ్యపు పిండి, పాలు, చక్కెర కలిపి) చేసి నైవేద్యం పెట్టాలి. ఇంకొక 16 కుడుములు పేరంటాలుకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. 16 ఉత్తరేణి ఆకులతో మరో 16 వరుసల తోరం 16 ముళ్లు వేసినది పేరంటాల చేతికి కట్టాలి. తరువాత తోరం కట్టుకొని , చేతిలో అక్షతలు ఉంచుకొని ఈ కథ వినవలెను

No comments:

Post a Comment

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి...