Saturday, January 10, 2026

Kadupu Chedarani Gouri Gowri Nomu Katha - కడుపుచెదరని గౌరీ నోము కథ

కడుపుచెదరని గౌరీ నోము కథ

(దీనినే పాట్టకథలని గౌరీనోము కథ అందురు)

వేదపండితుడేకాని పేదపారుడగుటచే ఆయన కెవ్వరును పిల్లనిచ్చినారుకాదు. ఆ బ్రాహ్మణుని విద్యయు, బుద్ధియుజూచి, గుణము గౌరవముజూచి, నీయమము నిష్టనుజూచి, తెలివితేటలుజూచి, భక్తి శ్రద్ధలజూచి పండితుడైన బ్రాహ్మణుడొకడు - "యీతడే అల్లుడు కాగల'డని భావించి తన ముద్దులకూతురుని చక్కనిచుక్కనిచ్చి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగువేసి ఆ బాల పండితునకు ఆ పేదబాపనికి మహావైభవమున పెండ్లి చేసినాడు.

పెరిగి పెద్దదైన బ్రాహ్మణుని కూతురు కాపురమునకు వెళ్ళినది. పేద బాపడు పెన్నిధి దొరికినట్లానందించుచు తన యిల్లే కైలాసము గాను, తన యిల్లాలే పరమేశ్వరిగాను భావించుకొనుచు పరమానందముతో కాలము గడుపుచుండెను. తండ్రికి కన్యాదానఫలము దక్కనిచ్చి, పేదసారులకు గృహసౌఖ్యము తెలియనిచ్చి ఉన్నదోలేదో రెండవకంటి వారికి తెలియకుండా కలదానితోనే గంపెడు సంతుష్టి నొందుచు, ఇరుగుపొరుగు వారిలో మెరుగులు చూపుచు శుచిగలిగి, శుభ్రతగలిగి, నీమముగలిగి, నిష్టగలిగి, విద్యగలిగి, బుద్ధిగలిగి, శుభంగలిగి, గౌరవంగలిగి, తెలివిగలిగి, తేటగలిగి, అందంగలిగి, చందం గలిగి, భక్తిగలిగి, శ్రద్ధగలిగి, యిట్లు దిద్దుచూ, అత్తమామలకు తలలో నాలుకలాగ ఆడుబిడ్డలకు అక్క చెల్లండ్రలాగు, తోడికోడండ్రుకు తోడునీడలాగు, ఇరుగుపొరుగువారి కిలవేల్పులాగు, భర్తకు ప్రాణాధి దేవతలాగు, సోమయాజులుగారి ముద్దు కూతురు కాపురము చేయుచున్నది.

యీలాగున నుండగా చెఱకునకు పండుపండినట్లా పిల్లకు నెలతప్పినది. సకలజనులు
సంతోషముతో ఆవిడకన్ని గారాబములు జరుపుచున్నారు. రోజురోజుకు కళలుదేరుచు, ఆబాల బంగారు బొమ్మలాగు, రత్నాల రామచిలుకలాగు మెరిసిపోవుచున్నది. రెండు నెలలు గడచినవి మూడునెలలు గడిచినవి, నాలుగు నెలలు గడవకుండ వొకనాడు తగనిబాధ గలిగి యా పిల్లకు గర్భము విచ్చిత్తయిపోయినది. “అయ్యో!” అని యిరుగు పొరుగువారు, అత్తింటివారు, పుట్టింటివారు, అందరు. చిన్నమొగము వేసుకొని విచారించినారు. తరువాత మందులు మ్రాకులు వేసికొని పిల్లనోదార్చుకొని- "పోయింది పొల్లు ఉన్నది గట్టి” అని క్రమముగా మనస్సమాధానము చేసుకొన్నారు. అదియేమి పాపమో! పాలసముద్రములో విషములాగు, చంద్రునిలో మచ్చలాగు,
ఆ చిన్న దానికి ఒక కష్టము కలిగినది. అది మొదలు సోమయాజులుగారి కూతురికి యేయేడు కాయేడు యిలాగు గర్భములు గలుగుచుపోవు చుండెను. అందరు విచారించుచుండిరి. “అయ్యో! కన్నతల్లిదండ్రులకు కలత తెచ్చి పెట్టితిని. అత్తమామల కలసట తెచ్చి పెట్టితిని. పండియు పొల్లయి పోవుటకు పాపమేమి చేసితినో పరమేశ్వరా! పరమేశ్వరీ" యని సోమయాజులుగారి కూతురి ఆ పురాణదంపతులను నిరంతరము ధ్యానించుకొనుచు, చూచిన దైవాలకు మ్రొక్కుచు, చెప్పినదైవాలను సేవించుచు, పుణ్యచింతతో ప్రొద్దులుగడుపుచుండెను. ఈలాగునుండగా నొకనాటి యుదయమున వారింటికొక పండుతమలపాకులాంటి పేదముత్తయిదువ వచ్చినది. ఆ యిల్లాలి కర్ఘ్యపాద్యాలిచ్చి కూర్చుండుమని పీటవేసి మంచిమాటలతో మర్యాదచేసి - “అమ్మా!
దయగలిగి మాయింటికి దయచేసినారు, గౌరీదేవివలె కన్నులకు చల్లగా, మహాలక్ష్మీవలె మనసుకు హాయిగా, మిమ్ములనుచూచి వదలలెకున్నాను, ఈపూట మాయింటి వద్ద మాకున్న భాగ్యములారగించి మమ్ములను ధన్యులను జేసి మరివెళ్ళుదురుగాని తల్లీ! నేటి కాగుమమ్మా" యని యామెను సోమయాజులుగారి కూతురు వేడుకొన్నది.

అందులకా యిల్లాలు సమ్మతించి దయారస మొలుకు కనుబొమ్మలతో చూచిదగ్గరగా దీసికొని గారవించి సోమయాజులు కూతురితో -"అలాగుననే చేతువులేవమ్మా!" అన్నది. ఇంటి లోనివారందరు వచ్చి ఆ ఇల్లాలి నాదరించిరి. భక్తి శ్రద్ధలతో వారు పెట్టిన పప్పన్నమే పదివేల పిండివంటలవలె భోజనముచేసి సంతుష్టివదనముతో చల్లని చూపులతో ఆ యిల్లాలు వాకిట చిరుచాపమీద కూర్చున్నది. వినయవిధేయతలతో వేడుకలాడుచు వీడెము మడచి యిచ్చుచు సోమయాజులుగారి కూతురు ఆమె దగ్గరనే కూర్చుండినది. 

సోమయాజులుగారి కూతురి కప్పుడు మరల నాలుగవ మాసము జరుగుచున్నది. "బుద్దిమంతురాలైన పుణ్యశాలినివేగాని, భక్తి శ్రద్దలున్న భాగ్యశాలినివేగాని, అన్ని సుఖములుగల యదృష్టశాలినివేగాని, గర్భదోష మున్నట్లగు పడుచున్నావు. కాంతా! నిజమేనా?” యని సోమయాజులుగారి కూతురి నడిగినదా యిల్లాలు. ఆమాట వినగానే యాపిల్ల వొడలుజల్లుమన్నది. "బ్రహ్మదేవుని వదనమందలి భాషాదేవియా! విష్ణుదేవుని వక్షమందలి లక్ష్మీదేవియా? దేవదేవుని అర్ధదేహమయిన పార్వతీదేవియా? ఎవరు చెపుమా యీ యిల్లాలు?" "ఈమెను జూడగానే యీమె మాటలు వినగానే పరవశమై పోవుచున్నాను. ఈమె పాదములు పట్టుకొనుటకు బుద్ధితొందర చేయుచున్నది" అని యనుకొని సోమయాజులు గారి కూతురిక నాగలేక నాయిల్లాలు పాదపద్మాలు కన్నుల కద్దుకొని "తల్లీ! నా పాపములుబాపి రక్షించవమ్మా!!" అని ఆమెను ప్రార్థించినది. "కడుపుచెదరని గౌరీదేవి నోముపట్టవే బిడ్డా! కడుపుశోకముండద'ని చెప్పి, దాని కుద్యాపనము చెప్పి యా యిల్లాలు అంతర్జానమైనది. 

ఆ పలుకులు శిరసావహించి- "నీవే నా పాలిటి పార్వతీదేవివ'ని ఈమెకు మ్రొక్కుచు, భక్తిశ్రద్ధలతో ఆ నోముపట్టి సోమయాజులుగారి కూతురు ఉద్యాపనము చేసుకొన్నది.

ఆమె కడుపున పాలసముద్రమున బాలచంద్రునివలె బంగారువంటి కొడుకులు పుట్టి బాగున్నారు. ఆ తరువాత మువ్వలనాడు తెడుకు, గజ్జెలవాడు కొ
డుకు, కొడుకులు తరువాత కొడుకులును, కూతుండ్రు తరువాత కూతుండ్రును పుట్టిన ఇల్లంతయు కొల్లల కొఠారై, కమలాలకొలవై, భాగ్యాలపంటై సోమయాజులుగారి కూతురు తులలేని భోగభాగ్యాలతో తులతూగుచు, పుట్టెడు పసుపు, పుట్టెడు కుంకుమ, పాలకుండ చెదరకుండ కలకాలము సుఖముగా జీవించి కడపట గైలాసము చూరగొన్నది.

ఈకథ చెప్పుకొని అక్షతలు వేసుకొనుచు ఈమె నోచిన నోము భామలంతా నోచిరి.  యీ నోము నోచినమ్మకు కడుపు శోకముండదు. కలిమికి లోటుండదు. కలకాలమైదవతనము, కైలాసప్రాప్తి కలుగును. భక్తి తప్పకున్న ఫలము తప్పదు.

ఉద్యాపనము: అయిదు మానికల బియ్యము కడిగి, నానబెట్టి విసిరి జిల్లేడు కాయలు వండవలెను. అందులో కొబ్బరిపూర్ణమో నువ్వుపప్పు పూర్ణమో పెట్టవలెను. అంత పిండికలిపి యిరవై అయిదు కాయలుచేసి గజ్జికాయలు వాసెనమీదపెట్టి వాని పొట్టలు విచ్చిపోకుండ శ్రద్ధతో వంటచేయవలెను. పొట్టవిచ్చని గౌరీదేవి నోము కనుక జిల్లేడుకాయలు పొట్టలు విచ్చిపోకుండా జాగ్రత్తగా వండవలెను. అవి అయిదు గురు ముత్తయిదువులకు అయిదేసి చొప్పున దక్షిణ తాంబూలములుంచి వాయనము లీయవలెను.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...