Sunday, January 11, 2026

Perugu meedha perina neyyi nomu kadha - పెరుగుమీద పేరిన నెయ్యి నోము కథ

పెరుగుమీద పేరిన నెయ్యి నోము కథ

ఒక బ్రాహ్మణ పండితునకు సకలైశ్వర్యములు కలవు. కాని సంతానములేదు. ఆ బ్రాహ్మణుడు భార్యతో గూడ అనేకమగునోములు, అనేక వ్రతములు చేసిచేసి, దేవునికృపచే చాలా కాలానికి ఒక కూతురుని గన్నాడు ఆ పిల్లని మహాగారాబముతోను పెంచుతూ వుండేవారు.

ఆ బ్రాహ్మణుడు గంగిగోవుపాలు ప్రత్యేకము కాపించి పాలు, పెరుగు, నెయ్యి పిల్లకు కడుపునిండా పెట్టాలని సరదాపడే వాడు. ఆపిల్లకు నెయ్యి, పెరుగు, పాలు, వెన్న చల్ల ఇష్టమయేవికావు. వాటి పెరు చెపితే ఆ పిల్ల కసహ్యము. వాటిని వేటిని కల్లోనైనా రానిచ్చేదికాదు. అందుకోసం తల్లిదండ్రి బెంగపెట్టుకొని అనేక విధాల ఆలోచిస్తూ ఉండేవారు. వారు పిల్లతాగంతే తామేమియు తినుటకు నోటికిపోక ఇంట్లో కొల్లలుగానున్న పాడి ఊరందరకు పంచిపెడుతూ ఉండేవారు.

ఇలావుండగా ఒకనాడు వారింటికో స్వాములవారు భిక్షకు వచ్చారు. ఆయనకు పంచభక్ష్య పరమాన్నములతో వడ్డింపచేసి పిల్ల బంగారు బొమ్మలాగు ఆడుకొంటూవుంటే చూచి స్వాములవారు తమ పంక్తిన పిల్లకు విస్తరవేయమన్నారు. పిల్ల- "అబ్బే! నేనిక్కడ తినను చల్ల, నెయ్యి, పెరుగు, వెన్న. అన్నీ వేస్తారు బాబూ!" అని పారిపోయింది. "అది యేమిని" స్వాములవారడుగగా పిల్ల తల్లితండ్రులా సమాచారమంతా స్వాములవారితో విన్న వించుకున్నారు. అప్పుడు స్వాములవారు దివ్యదృష్టితోచూచి యిలాగు చెప్పినారు. ఈపిల్ల పూర్వజన్మములో విస్తారము పాడిగల యింట్లోపడి ఆపాడితాను, తన పిల్లలు, మగడు త్రాగినంత త్రాగి తక్కినది యిరుగుపొరుగు వారెవ్వరికి కొంచమైన పోయక కడవలతో మిగలిపోయిన పెరుగూ, మజ్జిగా పట్టుకొని వెళ్ళి గొడ్లగోలెంలో పోసివేస్తూ ఉందేది. అంతకుముందు జన్మములో చేసిన విశేష పుణ్యముచేత మరలనట్టి భాగ్యవంతుల యింట్లో పుట్టినది. క్రిందటి జన్మములో చేసిన పాపముచేతనే ఈ జన్మములో
పవిత్రమైన ఆవుపాడి అనుభవించడానికి అధికారము లేకపోయింది. అందుచేత ఒక యేడాది ప్రతిదినమూ ఉదయాన్ని నమస్కరించిన తరువాత యీపిల్ల ఒకనాడు అయిదు సేర్లుగాని, అయిదు సోలలుగాని, ఆవుపాలు ఎర్రగాకాచి తోడుపెట్టి ఆగట్టి పెరుగుమీద పేరిన ఆవునేతిముద్ద పెరుగుకు తగినట్లుగా పెట్టి ఆ పెరుగు ముంత పేరిన నెయ్యి ఒక రవికెల గుడ్డ, కుంకుమ, పసుపు, తాంబూలము, దక్షిణ ఒక ముత్తయిదువకు యియ్యవలెను. అప్పుడీ దోషముపోయి యీ బాలిక సకల సుఖములను పొందుననని చెప్పెను. 

అట్లు తలిదండ్రులు భక్తి శ్రద్దలతో తమపిల్లచేత పెరుగుమీద పేరిన నెయ్యి నోముపట్టించి ఉద్యాపనము చేయించగా ఆ పిల్ల ఆనాటి నుండి ఆనందముతో అతివిచిత్రమైన ఆవుపాలూ, అంతరంగ శుద్ధి కలిగించే ఆవు పెరుగూ, ఆత్మజ్ఞానమునిచ్చే నెయ్యి అన్నియు సుఖముగా అనుభవిస్తూ చిరకాలము అయిదవతనము, పసుపు చలువ కలిగి వర్ధిల్లినది.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...