Thursday, January 8, 2026

Chiluka Muggula Nomu Katha - చిలుకముగ్గుల నోము కథ

చిలుకముగ్గుల నోము కథ

ఒక బ్రాహ్మణునకు సంతానము లేకపోయినది. విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసినాడు. విష్ణుమూర్తిని ప్రత్యక్షమై- "అయిదవతనము లేని ఆడది కావలెనా?, ఆయుర్దాయములేని మగవాడు కావలెనా?" అడిగెను. "అయిదవతనము లేని దయితే మా యింటనయినా" పడియుంటుంది. ఆయువులేని కుమారుండెదుకు? ఐదవతనములేని కూతురునే యిమ్మ"ని అడుగగా "ఆప్రకారము నీకు కూతురు పుట్టుని" ని చెప్పెను. తరువాత ఆ బ్రాహ్మణునకు ఒక ఆడశిశువు కలిగెను. తల్లిదండ్రులు ఆ పిల్లకు నారాయణమ్మ అను పేరుపెట్టి ఆమె వివాహముగూర్చి విచారించు చుండిరి. “ఏచిన్నవానికి యిస్తున్నా" అని చూస్తున్నాడు. ఎవరికి ఇచ్చిచేసినా చచ్చిపోతాడు గదా ఎవరూ చేసుకొన్నారు కారు.

తల్లిదండ్రులు విచారిస్తూ అడవిలోనికి వెళ్ళి ఒకరాతికి పెండ్లి చేయుదమని తలచిరి. అప్పుడు అడవిలో ఒక కృష్ణ విగ్రహము కనపడగా దానికి వివాహముచెసిరి. ఆ విగ్రహము బ్రద్దలై పిండై పోయెను. 

అప్పుడా చిన్నది విచారించుచు ఊళ్లోకివచ్చి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తూ వుండేది. కొన్నాళ్ళకు తల్లిదండ్రులు చనిపోయిరి. ఆ చిన్నది రోజూ తపస్సు చేస్తూ యెవరికి ఎమి పెట్టకుండా- “'నాయింటికి రాకండి నారాయణా! నన్నెవరు అడగకండి నారాయణా” అని అంటూవుండేది. అందరూ ఆ చిన్నదానిని యిలోనారాయణమ్మ అని పేరుపెట్టారు. 

కొన్నాళ్ళకు  ఆమెకు అవసానకాలము వచ్చెను. అప్పుడు నారాయణమూర్తి కాకి అయివచ్చి కావు కావు మని అరువు చుచుండెను. అందుకామె కోపగించి అలుకుతూవున్న అలుకుగుడ్డపుచ్చుకొని కొట్టెను. విష్ణుమూర్తి ఆ గుడ్డపుచ్చుకొని వెళ్ళగా అందులో ఒక కందిగింజ దొరికెను. ఆ గింజ మొలవైచెను. అది మొలిచి చెట్టయ్యేసరికి నారాయణమ్మ చనిపోయెను. 

అప్పుడు విష్ణుమూర్తి దానిని తీసికొనిపోయి -"అలుకుగుడ్డ కట్టుకొని ఆ చెట్టుక్రింద వుండమ" ని చెప్పెను. అందుకా చిన్నది విచారిస్తూ "నేను నీకు భక్తురాలను, నన్నిట్లు చెయ్యివచ్చునా?" యని యడుగగా- "నీవు, యెవరికీ దానధర్మాలు చేసికోలేదు. అందుచేత ఇట్లు తటస్థించినది"ని చెప్పెను.

ఆ చిన్నది పురుగై ఆ చెట్టుమీద కొన్నాళ్ళండగా తిరుగ విష్ణుమూర్తి ప్రత్యక్షమై- "నాభార్య చిలుక ముగ్గుల నోముపట్టును. అప్పుడు నిన్నుపిలుచుటకు వచ్చును. అప్పుడు ఒక బిందువు నాకు ధారపోస్తే వస్తానని చెప్పుము. అప్పుడు నీకు మేలు కలుగుతుంది " ని చెప్పెను. ఆ ప్రకారము లక్ష్మీదేవి చిలుక ముగ్గుల నోము పట్టి యీ యిలోనారాయణమ్మను పిలుచుటకువచ్చెను. అప్పుడు విష్ణుమూర్తి మహిమవల్ల ఆ చిన్నది దివ్యవిగ్రహమై ఒక ఇంట్లో వుండెను. అప్పుడు లక్ష్మీదేవి- "అమ్మాయి! నేను చిలకముగ్గుల నోము పట్టెదను రావలసినదని కోరెను. అందుకా చిన్నది- "అమ్మా! నాకొక బిందువు ధారపోస్తే వస్తాను. లేకపోతే రా" నని చెప్పెను. "ఆ ప్రకారము ధారపోసెదనని లక్ష్మీదేవి చెప్పెను. అప్పుడు చిన్నదానిని తీసుకొనివచ్చి చిలుకముగ్గుల నోముపట్టి చిలుకెతొక్కి ఒక బిందువు ఆ చిన్న దానికి ధారపోసెను. అప్పుడు ఆ చిన్నదానికి సమస్త దోషములు పోయెను.

అప్పుడు విష్ణుమూర్తి "నీకు ఏమి కావలెనని యడుగగా- "నాకు నీ పాదసేవకంటే ఏమి యక్కరలెదనని చెప్పెను. లక్ష్మీదేవి ఆమెకు యెప్పుడు అయిదవతన ముండెలాగున వరమిచ్చెను. నారాయణమూర్తి ఆ చిన్నదానికి ఎప్పుడు తన వైకుంఠం లో సుఖముగా నుండుమని  సెలవిచ్చెను. ఈ నోము నోచుకున్న వాళ్ళకును భోజనానికి వెళ్ళిన వాళ్ళకును, నిత్య సువాసినీత్వము కలిగి సర్వైశ్వర్యము కలుగునని విష్ణుమూర్తి జెప్పెను.

ఉద్యాపనము: ఈ నోము అయిదేళ్ళు నోచుకొని అయిదో సంవత్సరమునగాని అయిదేళ్ళలోగాని అయిదు మానికెల బియ్యము చలిమిడి చెసి, అడ్జెడు తవ్వెడు బియ్యము అప్పాలుచేసి శక్త్యానుసారముగా పంచ ముగ్గులు పదిహేను చిలకలు పెట్టి, పదిహేనుగురు బ్రాహ్మణులకు పదిహేను కలశలు, పదిహేను అంగవస్త్రములు, అయిదుగురు ముత్తయిదువులకు చీరలు, రవికల గుడ్డలు యిచ్చి భోజనముపెట్టి దక్షిణ తాంబూలము లిచ్చి ఉద్యాపనము చేసికొనవలెను. శక్త్యానుసారముగా ఏటా సంతర్పణ చేసుకోవలెను.

భక్తి తప్పినా ఫలము తప్పదు. కథలోపమయినా వ్రతలోపము కాకూడదు.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...