Wednesday, January 7, 2026

Atla Meedha Aava Puvvu Nomu Katha - అట్లమీద ఆవపువ్వు కథ

అట్లమీద ఆవపువ్వు కథ

ఒక బ్రాహ్మణుని కూతురు అట్లమీద ఆవపువ్వు నోముపట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత విధవరికము కడుపుశోకము వచ్చెను. వంశములేకుండ నిర్వంశమయ్యెను. ఆ దుఃఖము భరించలేక ఆమె అడవికివెళ్ళి యేడ్చుచుండగా వనవిహారానికి మారువేషంలో వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి -“ఏమి యిలాగేడ్చుచున్నావ”నియడిగిరి. “మీకెందుకు నాయనా? మీదారి మీరు వెళ్లండి. మీరేమి ఆర్చేవారా? తీర్చేవారా? అని యామె చెప్పెను అప్పుడు వారు- “దీనికింకను కర్మపరివాకము గాలేదు. మనమేమి చేయుదుముని చక్కా వెళ్ళిరి.

ఆమె అలాగే దుఃఖించుచుండెను. వారు కొన్నాళ్ళకు తిరిగి అక్కడికే మునుపటి చోటుననే ఆమెను జూచి “ఏమి యిలాగున్నావ”ని యడిగినారట. అందుకామె- "నాయనా! నాకర్మము మికెందుకని"  చెప్పగా- “ఓహో? యీమె కింకను కర్మపరిపాకము- కాలేద" ని మరలవెళ్లి పోయిరి.

ఆమె చెట్టు పుట్టలూ అడవులవెంట తిరుగుచుండెను. అప్పుడు పార్వతి పరమేశ్వరులు మరలవచ్చి “ఇంకను ఇలాగే తిరుగుచున్నావా?” యని అడిగిరి. అప్పుడామె- "నాయనా, పుట్టిన బిడ్డలు బుగ్గి అయిపోయినారు. తలమీద గొడుగు తర్లిపోయినది. అరణ్యాలపాలై యిలాగు తిరుగుచున్నాను" అని చెప్పెను. అంత పార్వతీ పరమేశ్వరులు "నీవు పూర్వము అట్లమీద ఆవపువ్వుల నోముపట్టి ఉల్లంఘన చేసినావు. అందుచేత ఈలాగు తిరుగుచున్నావు. ఇప్పుడైనా యింటికివెళ్లి ఈ నోముపట్టి కథ చెప్పి అక్షతలు వేసుకొని ఏడాది అయిన తరువాత యుద్యాపనము చేసుకొనవలసినద" ని పార్వతీ పరమేశ్వరులు చెప్పిరి.

ఆమె ఆ ప్రకారము యింటికివెళ్లి ఆ నోముపట్టి కథ చెప్పి అక్షతలు వేసుకొని ఏడాది  అయిన తరువాత ఉద్యాపనము చేసుకొనెను.

ఉద్యాపనము: ఒక ముత్తయిదువకు రవికెలగుడ్డ దక్షిణ తాంబూలము యిచ్చి, పండ్రెండు అట్టు, పూసికాసియున్న ఆవకొమ్మల తెచ్చి పేరిన నెయ్యి బెల్లముతో ఆ ముత్తయిదువకు వాయన మియ్యవలయును. 

శక్తి తప్పినా భక్తి తప్పరాదు. కథ లోపమయిన వ్రతలోపము కాకూడదు.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...