Sunday, January 4, 2026

Grahana Gowri Nomu Katha - గ్రహణ గౌరీ నోము కథ

గ్రహణ గౌరీ నోము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులును, ఒక కూతురు కలరు. ఆకూతురు పుట్టినరోజు మొదలుకొని రాత్రి పురుగులుగాను పగలు మనిషిగాను అగుచుండేది. రాత్రివేళ తల్లి ఆ పురుగులను పోగుచేసికొని విచారించుచుండేది. అలాగునుండగా కొన్నాళ్ళకు ఆ పిల్ల తల్లిని పుట్టింటికి తీసుకొనివెళ్లు నిమిత్తము అన్నగారువచ్చి- “అమ్మా! యీ పిల్లకు ఎడాది వెళ్లినది. గనుక ఒకసారి పుట్టింటికి రమ్మని పిలిచెను. ఆమె "యిప్పుడుకాదు ముందువస్తాను" అని చెప్పెను. ఆ మాటలువిని అతడు వెళ్లిపోయెను. తరువాత నాలుగేండ్లు అయిన పిమ్మట మరల అన్నవచ్చి- "అమ్మాయీ!
రమ్మన" ని పిలువగ "ఇప్పుడు కాదు వస్తానులే!" అని జవాబు చెప్పెను. ఆ మాటలకు సరేయని అతడు వెళ్లిపోయెను. ఆ పిల్ల పెద్దదైనకొద్ది, పురుగులు ఎక్కువ కాజొచ్చెను. ఆ పురుగులను రాత్రి తల్లి జాగ్రత్తగా కాపాడుచుండెను. అంతట ఆ పిల్లలకు పది సంవత్సరములు ఈడువచ్చెను. అప్పుడు తిరుగా అన్నగారువచ్చి - "ఇప్పుడైనా నీవు వచ్చినగాని లేని యెడల నీకు మేములేము, మాకు నీవులేవు" అని గట్టి పట్టుచేయగా ఆమె మరోమాట చెప్పలేక కోడండ్రను పిలిచి నాలుగు రోజులు పిల్లను చూచుచెండెదరా? అని అడిగినదట. వారు "మావల్లకాదని"రి. అప్పుడు నాలుగోకోడలు -"నేను చూచెదను. మీరు వెళ్లిరండిని చెప్పెను. ఆ బ్రాహ్మణునిభార్య నాలుగో కోడలిని తలుపుచాటునకు తీసుకొనిపోయి తన కూతురు రహస్యమును చేప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంటదగ్గర ప్రక్కవేసి ఒక్క పురుగైన చెదరకుండా వానిని లోనికి ప్రోగుచేసి కాపాడవలెనని బహు రహస్యముగా చెప్పి పుట్టింటికి వెళ్ళెను. అంత దీపాలు పెట్టేసరికి వంటచేసి మామగారికి భర్తకు భోజనముపెట్టి ఆపిల్లను గుంటవద్ద చాపవేసి పరుండబెట్టి నాలుగవకోడలా పిల్లవద్ద పరుండెను. తరువాత ఆ బల్ల పురుగులగు చుండగా వాటినన్నింటి ని గుంటలోకిత్రోసి తెల్లవారినదాక జూచుచుండెను. అంతట ఆమెభర్త- "ఇది నాయొద్దకు రావడములేదు. ఎక్కడికోపోవుచున్నది"
అని అనుమానపడి మూడురోజులైన తరువాత నాలుగోరోజున దీపాలు పెట్టగానే భోజనముచేసి ఆ చిన్నది పడుకొనేగది గోడమీద కూర్చుండెను. అంతట ఆమె భోజనముచేసి మామూలు ప్రకారము ఆ పిల్లను కనిపెట్టుకొని కూర్చుండెను. ఆ రాత్రి చర్య అంతయు గోడమీదనుండి యా బ్రాహ్మణ చిన్నవాడుచూచి తెల్లవారిన తరువాత దిగివచ్చి "అయ్యో! నా చెల్లెలు ఇంత కష్టపడుచున్నది. ఇదియేమి?" అని భార్యనడగ "నాలుగురోజులనుంచి యేమిచేస్తున్నావు? నాకు కనబడడంలేదేమి?"
అని కోపపడెను. "ఈ లాంటి పని మీ అమ్మ నాకు అప్పచెప్పినది. అందుచేత కనిపెట్టుకొని యుండవలసివచ్చినది" యని యామె చెప్పగా - "ఈ దురవస్థ యీమెకు ఎందుచేతవచ్చెనో!" అని విచారముపొంది అడవిలోనికి ఆకుమీద ఆకు పోకచెక్క పోక వేసికొని తలక్రిందు కాళ్లుమీదు పెట్టుకొని తపస్సుచేయమొదలు పెట్టెను.

అంతలో నాత్రోవను బోవుచున్న పార్వతీ పరమేశ్వరులు తన తపస్సునకు కారణమేమని యడుగగా అందుకా బ్రాహ్మణ చిన్నవాడు "మాచెల్లెలు పుట్టినది మొదలు పగలు మనిషి, రాత్రి పురుగులుగాను అగుచున్నది అది ఎందుచేతనో తెలుసుకొనగోరి యట్లు తపస్సు చేయుచున్నాన" ని ఆ బ్రాహ్మణచిన్నవాడు చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు దివ్యదృష్టిజూచి "మీ చెల్లెలు క్రిందటి జన్మము రజస్వలై యింటిలో కలిపింది. ఆ దోషముచేత యిలావచ్చినది. కాబట్టి ఆమెచే గ్రహణగౌరీనోము పట్టించి క్రమప్రకారము యుద్యాపనము చేయించిన యెడల దోషము పోవునని చెప్పి యదృశ్యులైరి. అప్పుడా బ్రాహ్మణ చిన్నవాడింటికి వచ్చి పార్వతీపరమేశ్వరులు చెప్పిన గ్రహణ గౌరీనోము చెల్లిలిచేత పట్టించి ఉద్యాపనము చేయించెను. అంతట ఆ పాపముపోయి
ఆ పిల్ల రాత్రి పగలు ఎప్పటిలాగుండెను. తరువాత తల్లివచ్చి పిల్ల రత్నములాగున నుండుటజూచి మునుపటి చిహ్నము లేమీ లేకపోవుటకు సంతోషించుచు "ఏమిటి అమ్మాయీ! ఎలాపోయిందా పురుగులగుట్ట?" యిన కోడలిని యడిగెను. అప్పుడు చిన్నకోడలు అత్తగారు వెళ్ళినది మొదలు భర్తతనమీద యనుమానపడుట, యడవికి వెళ్ళుట గ్రహణగౌరీనోము పట్టించుట, మొదలగు సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి- “ఇది గ్రహణగౌరీనోము పట్టుటచేత పోయినది ఇదిగో మీ అమ్మాయి!” యిన ఆ పిల్లను అత్తగారి కప్పగించెను.

ఉద్యాపనము: సూర్యగ్రహణము పట్టిన క్షణము పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రత్తి, బెల్లం, ఆకు పోక పందిరిలో పెట్ట వలెను. గ్రహణము విడిచినంతనే వాటిని యింటిలో పెట్టవలెను. ఆ తరువాత రోజునుండి తొమ్మిది రోజులవరకు గౌరిని పూజించవలెను. తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు చేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి, తొమ్మిది అట్లు నైవేద్యము పెట్టవలెను. ఆఖరి రోజున ఆకులు, పోకలు, అట్లు క్రొత్తజల్లెడలోపల పెట్టి పాతజల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

No comments:

Post a Comment

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి...