అమావాస్య సోమవారముల నోము కథ
ఒకానొక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులును, నొక కూతురును గలదు. ఆ బ్రాహ్మణుని యింటిలో కోడండ్రు కూతురుగూడ ప్రతిదినము యాయవార బ్రాహ్మణునకు బీయ్యం పెట్టుచుండెడివారు. ఆ యాయవారపు బ్రాహ్మణుడు తనకు బియ్యము వేయుటకువచ్చే కోడండ్రను "సౌభాగ్యవతీభవి" అనియు కూతురును గంగాన్నాన ఫలసిద్ధిరస్తు అనియు దీవించుచున్నాడు.
బ్రాహ్మణుని కూతురు ఆ బ్రాహ్మణుని దీవెన విని యొకనాడు తన తల్లిదండ్రులకు జెప్పగా వారొక రోజున బ్రాహ్మణుని 'ఎమిని యడిగిరి. బ్రాహ్మణుడప్పుడు వారినిజూచి- "ఈచిన్న దానికి
సప్తపాదాలవద్దనే వైధవ్యము రానున్నది?" అని చెప్పెను. అప్పుడా బాలిక తల్లిదండ్రులా
బ్రాహ్మణునికి మొక్కి అతనిని ప్రార్ధించి- "స్వామీ! ఈ దోషమెట్లు నివారణము కాగలదు?" అని వినయముగా ప్రశ్నించిరి. అప్పుడు బ్రాహ్మణుడు "ఏడు సముద్రాల కావల చాకలి పోలియున్నది. ఆ పోలిదగ్గరికి బాలికను తీసుకొని వెళ్ళినచో ఈ దోషమునది నివారణము చేయగలదు" యని చెప్పెను. అప్పుడా తల్లిదండ్రులు తమ ఏడుగురు కొమారుళ్ళనుబిలిచి- "మీలో నెవ్వరైన మీ చెల్లెలను చాకలిపోలివద్దకు దీసికొని పోవలయునిని చెప్పిరి. కాని "వారి యేడుగురు పుత్రులలో కడసారపు కొడుకు మాత్రమే తల్లిదండ్రులాజ్ఞ శిరసావహించి ధైర్యముతో తన చెల్లిలిని "ఏడు
సముద్రాలు దాటించి చాకలిపోలిదగ్గరకు తీసుకొనివెళ్ళెద"నని చెప్పెను.
వెంటనే వారిరువురిని ప్రయాణముచేసి పంపిరి. ఆయన్న చెల్లెలిని వెంటబెట్టుకొని
సముద్రతీరమునకు వచ్చి అచ్చట నొక చెట్టు నీడను నిలుచుండెను. ఆ వృక్షాగ్రము నుండి అప్పుడొక పండినపండు రాలి ఆయన్న చెల్లెండ్ర ముందుపడెను. అప్పుడా పండుగైకొని వారిద్దరు చెరిసగమును భక్షించిన వెంటనే ఆ వృక్షముపై నుండి యొక పక్షి దిగివచ్చి వారిరువురను రెక్కలపై నెక్కించుకొని సప్తసముద్రాలు దాటించి చాకలిపోలి వాకిటదించి అంతర్జానమయ్యెను.
అప్పటినుండి వారు ప్రతిదినము చాకలిపోలి వాకిలి తుడిచి కలయింపులు చల్లి యలికి ముగ్గులిడి వెళ్ళిపోయి యొక బసలో భోజనముచేయుచు కాలము గడుపుచుండెడివారు. ఇట్లుండగా నొకనాడు
చాకలిపోలి వారిని జూచి- "యిదియేమి? మీరెవ్వరు? నాయిల్లు తుడిచి ప్రతిదినము ఇట్లు పనిచేయుచున్నారేమి పాపము?" యని యడిగెను. అప్పుడు వారామెను జూచి- "అమ్మా! నీవలన మాకొక గొప్పసాయము కావలసియున్నది. అందుచేత నీకిట్లు సేవచేయుచున్నాము" యని చెప్పిరి. చాకలిపోలి వారు వచ్చిన కారణమంతయు గ్రహించి వారి కభయమిచ్చి అప్పుడు తన కోడండ్రను జూచి- "బిడ్డలారా! నేను పనిగలిగి యొకచోటికి బోవుచున్నాను. నేను మరల వచ్చులోపల మన యింట నెవ్వరైన చచ్చిపోయినచో వారిని దహనముచేయక నేను వచ్చునందాక అట్లేయుంచి
జాగ్రత్తగా చూచుచుండుడు" యని చెప్పి యాయన్న చెల్లెండ్రను వెంటబెట్టుకొని తన
యోగబలంచే వారితో గూడ ఏడుసముద్రాలు దాటి వారియింటికి వచ్చెను.
తరువాత నామె యా చిన్నదానికి వివాహము చేయింప వివాహ సమయమున సప్తపాదాలు తొక్కుచుండగా చిన్నదాని పెనిమిటి మరణించెను. చాకలిపోలి యప్పుడు తన యమావాస్య సోమవారముల వ్రతఫలము ధారపోసి చనిపోయిన పెండ్లికుమారుని బ్రతికించెను. అదిచూచి అక్కడి వారందరు చాకలిపోలి మహామహిమకు మహాశ్చర్యమునొంది పరమానందభరితులైరి. కాని చాకలిపోలి తన వ్రతఫలము ధారపోయుటచే ఆమె ఇంటివద్ద ఆమె కొడుకు లేడ్వురును చనిపోయిరి.
చాకలిపోలి పెండ్లివారివద్ద సెలవు పుచ్చుకొని తన యింటికి తిరుగువచ్చు దారిలో అమావాస్య సోమవారము రాగా అశ్వత్ధ వృక్షమునకు ప్రదక్షిణములు గావించి అక్కడ ఫలము లేమియు దొరక
నందున 108 గులకరాళ్ళు పట్టుకొని 108 ప్రదక్షిణములు చేయగా ఇంటివద్ద చచ్చిన యామె కొడుకు లేడుగురును మరల బతికిలేచిరి. తరువాత చాకలిపోలి యింటికి వచ్చెను. ఆమె కోడండ్రందరును ఆమెను చుట్టుకొని "అత్తా! ఇది ఏమివింత? ఇట్లు జరిగినదని" యడిగిరి. అప్పుడు పొలి కోడండ్రతో-“అది అంతయు అమావాస్య సోమవారవ్రత ఫలమిని తెలియజెప్పి తన కోడండ్రచే యధావిధిగా నోము పట్టించెను.
వ్రత విధానము: 108 అమావాస్య సోమవారములు ఈ వ్రతము చేయవలెను. అశ్వత్టవృక్షమునకు 108 ప్రదక్షిణములు చేయవలెను. ప్రదక్షిణము చేయునపుడు "మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివ రూపాయ, వృక్ష రాజాయ తే నమః" అను మంత్రమును పఠించుచుండవలెను. 108 ప్రదక్షిణములకును 108 రత్నములుగాను, 108 ఫలములుగాని, ఎవైన నుపయోగమైన వస్తువులు గాని ఒక చోట వేయుచుండవలెను. ఈ విధముగా 108 ప్రదక్షిణములు పూర్తియయినప్పటికి తన చేతిలోనున్న నూటయెనిమిది వస్తువులను క్రిందనొక పళ్ళెములో
పెట్టివేయవలెను. ఐదుసేర్ల బియ్యము అశ్వత్తవ్నక్షమువద్ద మండపముచేసి, లక్ష్మీనారాయణ ప్రతిమ బంగారుతో చేయించి నందుదుంచి లక్ష్మీ నారాయణ పూజయు, అష్టదిక్పాలకపూజయు, యధావిధిగా జేసి తరువాత మండ పము నుత్తమ బ్రాహ్మణునకు ధారపోసి ఆ 108 వస్తువులను అందరకును పంచి పెట్టవలెను. యీ విధముగా 108 అమావాస్యా సోమవారములను నోచుకొనవలెను.
ఉద్యాపనము: నూట ఎనిమిది కలశములుపెట్టి అయిదు కుంచముల బియ్యము మండపము పోసి లక్ష్మినారాయణ ప్రతిమను యుంచి అష్టదిక్పాలకులను పూజించి బ్రాహ్మణునకును, మండప దానముచేసి కలిశములు మొదలగునవి బ్రాహ్మణులకు, ముత్తయిదువులకు తక్కినవారికి పంచి పెట్టవలెను. యీ వ్రతము సిరిసంపదలను వృద్ధిచేసి కైవల్య పదవి నిచ్చుచున్నది.
Subscribe to:
Post Comments (Atom)
Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి
రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment