మాఘ పురాణం - 13 వ అధ్యాయం
శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట
వశిష్ఠులవారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించాను.
"మహామునీ! ఈమాఘమాస మాహాత్మ్యమును ఇంకను వినవలయుననెడికోరిక ఉదయించుచున్నది. గానసెలవిండ"ని ప్రార్ధించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగాను.
మున్ను పార్వతీ దేవికి శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యము గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము.
ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వత మందలి మందారవృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చునివున్న సమయమున జగజ్జనని యగు పార్వతీ దేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి, - "స్వామి! మీ వలన ననేక పుణ్యసంగతులు తెలిసికొంటిని. కానిప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలె ననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమం దాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన! నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను.
దేవీ!నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము.
సూర్యుడు మకర రాశియందు నుండగా మాఘమాసమందు ప్రాతః కాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో, అతడు సకల పాపములనుండి విముక్తు డగుటయేగాక, జన్మాంతమందు మోక్షమును పొందును. ఆటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా, ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాదు, జీవనది వున్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్న చోటగాని తటాక మందుగాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయీగాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానము జేసిన విష్ణులోకమునకు పోవును, మూడవనాటి స్నానము
వలన విష్ణుదర్శనం కలుగును, మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందుగల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు.
దేవీ మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందు వుండగా ఏది అందుబాటులోనవున్న అనగా- నదిగాని, చెరువుగాని, నుయ్యిగాని, కాలువ
గాని లేదా పాదము మునుగునంత నీరున్న చోటగాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి, శివాలయమునగాని, వైష్ణవాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆర్చనచేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.
ఏ మానవునకైననూ తన శరీరంలో శ క్తి లేక, నడువ లేనటువంటివాడు. గోవు పాదం మునుగునంత నీరున్న సెలయేటి యందైనను కడకు బావియంధైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము
చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ, వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశి యందుండగా నదిస్నాన మాచరించిన యెడల అతినికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానంచేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి, విష్ణుమందిరమునగాని, శివాలయమునగాని దీపం వెలిగించి ప్రసాదం సేవించినయెడల అతనికి తప్పక విష్ణు లోక ప్రాప్తి గలుగుటయేగాక, పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించ వచ్చును.
మానవుడు నారా జన్మ మెత్తిన తరువాత మరల ఘోర పాపములుచేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుటకంటె తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి, వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరంగదా!. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గరమార్గం. గాన ఓ పార్వతీ ఇంకనూ వినుము ఏమానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు ఎటువంటి భాధలనుభవించునో వివరించెదను సావధానురాలవై ఆలకింపుము.
నేను తెలియ జేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతః కాలమున. జపంగాని, విష్ణుపూజగాని యధాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించును.కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, రంపముల చేత, ఖడ్గముల చేత, నరుకబడును, సలసల క్రాగు తైలములో పడవేయబడును. భయంకరయమకింకరులచే పీడింపబడును.
ఏ స్త్రీ వేకవజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానముచేసి సూర్య నమస్కారము విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి, ఆత్తమామల సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీ కి ఐదవతనము వర్ధిల్లి, ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు
అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.
మాఘమాస స్నానమునకు వయోవరిమితి లేదు, బాలుడైనను, యువకుడైనన్ను, వృద్ధుడైనను, స్త్రీ యైనను, బాలికైనను జవ్వని యైనను మాఘమాస స్నానమాచరించవచ్చును, ఈ మాసమంతయు కడు నిష్టతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది.
పార్వతీ! దుష్టులలో స్నానంచేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము . దొంగిలించినవారు, గురు భార్యతో సంభోగించువారు, మధ్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీస్నానంచేసి విష్ణువును పూజించిన యెడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును, మరియు కులభ్రష్టులైనవాడును, కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయని వాడునూ, ఇతరులను వంచించి, వారివద్ద ధన మపహారించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్ర ద్రోహియు హత్యలు చేయువాడును,బ్రాహ్మణులను హింసించువాడును,సదా వ్యభిచార గృహములో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువాడును, రాజద్రోహీ, గురుద్రోహీయు, దైవ భక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తాను గొప్పవాడనను
అహంభావముతో దైవకార్యములను, ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి, సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగుల బెట్టువాడును, చేడుపనులకు ప్రేరేపించువాడును, ఈవిధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానముచేసిన యొడలవారందరు పవిత్రులగుదురు.
దేవీ! ఇంకను దాని మహాత్మ్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూరకర్మములు ఆచరించువాడును, సిగ్గువిడిచి తిరుగువాడును, బ్రహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన
యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును, మాఘమాస స్నానములు ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్పలితము కలుగును, ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండీ ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో
ఆటువంటి మానవులకున్న పాపములు తొలిగిపోయి, ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జెర అర్హుడగును.
శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది, అన్ని జాతులలో
బ్రాహ్మణు డధికుడు, అన్ని పర్వతాలలో మేరుపర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచే ఆ మాసమందాచరించే ఏ స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగ జేయును, చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా నున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టేలు తెచ్చి, అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత
స్నానము చేయించినయెడల ఆ స్నానఫలము పొందగలరు, అదియును గాక చలికాగినవారు స్నానముచేసి శ్రీవారిని దర్శించిన పిదవ అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచియై ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల మంచి ఫలితం కలుగును.
ఈ విధంగా ఆచరించినవానిని జూచి ఏ మనుజుడైననూ అపహాస్యముగా జూచినను, లేక అడ్డుతగిలిననూ, మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, తన భార్యను, లేక కుటుంబసభ్యులందరినీ మాఘస్నాన మాచరించునటుల ఏ మానవుడు చేయునో, అతనికి మాఘమాస ఫలితము తప్పకకల్గును. ఆ విధముగానే బ్రాహ్మణునిగాని, వైశ్యునిగాని, క్షత్రియునిగాని, శూద్రునిగాని, మాఘమాసస్నానం చేయమని చెప్పినయెడల, వాడు పుణ్యలోకము బోవుటకు ఏ అడ్డంకులు వుండవు, మాఘమాస స్నానములు చేసినవారికిగాని లేక వారిని ప్రోత్సహించువారలను జూచిగాని ఆక్షేపించి,పరిహాసం లాడువారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశాక్షీణము కలిగి దరిద్రుడగును.
నడచుటకు ఓపిక లేనివారలు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని, తలపై నీళ్లు జల్లుకొని సూర్యనమస్కారమును జేసి మాఘపురాణమును చదివిగాని, వినుటగాని, చేసిన యెడల జన్మాంతమున విష్ణుసానిద్యము పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానముగన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘస్నానము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా నూరు అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చిన నెంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాసస్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మాణహాత్య, పితృహత్యా మహా పాతకములు చేసిన మనుజుడైనను, మాఘమాసము అంతయు కడు నిష్టతో వున్న యెడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.
గనుక ఓ పార్వతీ! మాఘమాసస్నానమువలన యెట్టి ఫలితము కలుగునో వివరించీతినిగాన నే చెప్పిన రీతి ఆచరింపుము.
Subscribe to:
Post Comments (Atom)
Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి
రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment