Wednesday, January 7, 2026

Taraganadivaramula Nomu Katha - తరగనాదివారముల నోము కథ

తరగనాదివారముల నోము కథ

రాజుకూతురు మంత్రి కూతురు తరగని యాదివారములనోము పట్టిరి. మంత్రి కూతురు యేడాదిన్ని ఆదివారమాదివారము తరగని కూర తినకుండగను, తరగకుండగను తరగమనకుండగను ఉండి భక్తి శ్రద్ధలతో నోచుకొని 13 కొబ్బరి కాయలు, 13 కానుకలు, చీర, రవికె పెట్టెలోబెట్టి ముత్తయిదువునకు వాయనమిచ్చుకొన్నది. ఆమెకు గృహము నిండా నెక్కడచూచినను సిరిసంపదలచే తులతూగుచుండెను. 

రాజుకూతురు- "సింగినాదము, తరిగితే నేమివచ్చినది? తింటే నేమి వచ్చినది?” అని తరిగిన కూరలు తినుచు, తరుగురు, భక్తిలేక, శ్రద్దలేక నోము ఉల్లంఘనము చేసినది. రాజకూతురునకు పుట్టినబిడ్డలు చచ్చుచునుండేవారు. ఈమె మంత్రి కుమార్తెను, దాని యదృష్టమును చూచి సహించలేక యొకనాడు మంత్రి కుమార్తెయొక్క బిడ్డలనందరిని తన యింటికి రప్పించి తలకాయలన్నియుకోసి పెట్టెలో బెట్టి మంత్రి కూతురింటికి పంపెను. 

ఇక్కడ రాజకూతురు పిల్లలనందరిని నరుకుసరికి అక్కడ మంత్రికూతురింట్లో పార్వతీదేవి ఇంకో  పదముగ్గురు పిల్లలను వేసివుంచిపోయెను. ఈ పిల్లల కామె యన్నము పెట్టుకొనుచుండగా రాజుకూతురు పంపినట్లు యింటి కిరాగా ఆ పెట్టెతీసి చూచుకొనేసరికి దానిలో నాడుచు పాడుచు పదముగ్గురు పిల్లలును బైటికి వచ్చిరి. వారిని వీరినికూడా చూచుకొని మంత్రికూతురు సంతోషించుచుండెను. 

రాజుకూతురు దాసిదానిని పిలిచి- "మంత్రికూతురేలాగునున్నదిని అడిగినదట. అడిగితే “అమ్మా! పెట్టెలోని పిల్లలను యింట్లో పిల్లలను చూచుకొని ఆమెపట్టరాని యానందముతో నున్నదని చెప్పినది. అదివిని రాజుకూతురాశ్చర్యపడి- "యది పట్టిననోమే నేనున్ను పట్టినాను నాగతి యీలాగు కావడమేమి యనియడవులపాలై పోయెను. అపుడు పార్వతీదేవి ముసలి ముత్తయిదువుగా వచ్చి యామెకు కనబడి- "యెమమ్మా, ఈలాగున వచ్చినావు?" అని యడిగినది. "మంత్రి కూతురును, నేనున్ను ఒకే నోము పట్టినాము. అది యాలాగు సిరిసంపదతలతో తులతూగుచుండా నేనీలాగున్నాను. అందుకొరకుగాను అడవిలోనికి వచ్చితినమ్మా, అని రాజకూతురు పార్వతీదేవితో చెప్పెను. అప్పుడు పార్వతీదేవి- "మంత్రి కూతురు తరగని
ఆదివారముల నోము భక్తి శ్రద్ధలతో తరగకుండాను తరగమనకుండాను, తరిగినది తినకుండాను చేసుకొన్నది. నీవు ఉల్లంఘనము చేయుటనుబట్టి యాలాంటి దశకు వచ్చినావు, అని తిరిగి చెప్పి యామెచేత నోము పట్టించి యధావిధిగా ఉద్యాపనము చేయించి తానే వాయనమందుకొన్నది. అప్పుడు రాజకూతురు కడుపుచలవ, సిరిసపందకలదై యుండెను. నోచిననోము అంతా నోచిరి.

ఉద్యాపనము: యేడాదిపాటు ఆదివారమాదివారము తరగని కూర తినకుండగను, తరగకుండగను తరగమనకుండగను ఉండి భక్తి శ్రద్ధలతో నోచుకొని 13 కొబ్బరి కాయలు, 13 కానుకలు, చీర, రవికె పెట్టెలోబెట్టి ముత్తయిదువునకు వాయనమిచ్చుకొవలెను.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...