చంద్రఘంటా దేవి
శ్యామల నవరాత్రులలో మూడవ రోజు చంద్రఘంటా దేవి అవతారం
చంద్రఘంటా దేవి నవదుర్గలలో మూడవ అవతారం, ఈమెను దుర్గా దేవి రూపంగా పూజిస్తారు, ముఖ్యంగా నవరాత్రుల మూడవ రోజున, ఈమె ధైర్యానికి, శక్తికి ప్రతీక. చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు, అర్ధచంద్రాకారంలో గంటను ధరించి ఉంటుంది, ఈమె పూజ పాపాలు, భయాలు, రోగాలను తొలగిస్తుందని నమ్ముతారు.
దుర్గా దేవి తొమ్మిది రూపాలలో ఇది మూడవ రూపం (నవదుర్గ). 'చంద్రఘంటా' అంటే చంద్రవంక (అర్ధచంద్రుడు) మరియు గంట కలిగి ఉన్నది అని అర్థం. ఈమె ముఖంపై అర్ధచంద్రాకారంలో గంట ఉంటుంది, అందుకే ఈ పేరు వచ్చింది. ధైర్యానికి, శక్తికి, నిర్భయత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈమెను పూజించడం వల్ల భక్తుల పాపాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు తొలగిపోతాయి. ఈమెను చంద్రఖండ, చండిక, రణచండీ అని కూడా పిలుస్తారు.ఈ రోజున అమ్మవారిని పార్వతీ దేవి వివాహ రూపంగా కూడా భావించి పూజిస్తారు.
పురాణ గాథ
శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు.
వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో, నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ, పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.
శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా(అశోక సుందరి) దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని(అశోక సుందరి) ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
రూప వర్ణన
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం మీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.
పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు.
ఈ అమ్మవారిని ఉపాసించేవారి మొహం దైవత్వం తో ప్రకాశిస్తుంటుందని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
ధ్యాన శ్లోకం:
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా ॥
ఆపదుద్ధారిణీ త్వమ్హీ అద్యా శక్తిః శుభపరం ।
అణిమాది సిద్ధిదాత్రీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥
చంద్రముఖీ ఇష్ట దాత్రీ ఇష్టం మంత్ర స్వరూపిణీమ్ ।
ధనదాత్రీ, ఆనందదాత్రీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥
నానారూపధారిణీ ఇచ్ఛామయీ ఐశ్వర్యదాయినీమ్ ।
సౌభాగ్యారోగ్యదాయినీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥
॥ ఇతి శ్రీ చంద్రఘంటా స్తోత్రం ॥
No comments:
Post a Comment