Sunday, January 11, 2026

Vishnu Kamalala Nomu Katha - విష్ణు కమలాల నోము కథ

విష్ణు కమలాల నోము కథ

ఒక రాజుకూతురు, మంత్రి కూతురు వుండేవారు. 
మంత్రి కూతురిని చూచి రాజుకూతురు “అయ్యో! ఎన్ని నగలు పెట్టుకొన్నా ఎంత సంరక్షణచేసినా నా మోమున కందములేదు. ఆకారములేదు. కళాలేదు. కాంతిలేదు, మంత్రి కూతురు మోము కమలంలాగు కలకల లాడుతూ దీపంలాగు తేజరిల్లుతూ చూడముచ్చటగానుంటుంది. అదేమి పుణ్యం చేసిందో!” అని ఆలోచించుకొని విచారించుచుండేది.

ఒకనాడు రాజుగారింటికి రాజపురోహితుని భార్యవచ్చి కధలూ కారుణ్యాలూ చెప్పుచు ఒక కథ చెప్పినదట- ఒకనాడు వైకుంఠ నగరములో రత్నసింహాసనముమీద భక్తులు సెవించుచుండగా శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి తొడలపై పాదాలుంచుకొని చిగురుటాకు వంటి హస్తాలతో తనపాదము లొత్తుచున్న ఆ దేవినిచూచి- "కమలా! నీముఖకమలము వంటి ముఖకమలము కావాలని యెందరు కాంతలు కోరుకొనుచుందురో కనుక వారి కోరిక తీరునట్లు నేనొక వరమిచ్చుచుస్నాను సుమా!" అన్నాడు. లక్ష్మీకాంత నవ్వుచు మారకున్నది. విష్ణుమూర్తి మరల చెప్పుటకు మొదలిడినాడు. "యేస్త్రీయైనాసరే ప్రతిదినము ఒక కమలవత్తి ఆవు నేతితో ఆ రెండు ప్రమిదలలో కమలవత్తులు
దీపాలు వెలిగించి మానెడు సోలడుబియ్యము ఒక క్రొత్త వస్త్రము, దక్షిణ తాంబూలముతో ఆ వెలుగుచున్న వెండి దీపము, బంగారు దీపములతో ఒక బ్రాహ్మణునకు దానమియ్యవలెను. దీపము వెలిగించుటకు ఆటంకమైన రోజులు గలిగినచో ఆ దీపములన్నియు ఒకనాడుగాని, రెన్నాళ్ళుగాని సంవత్సరములోగా ఏప్పుడైనా సరే వెలిగించుకోవచ్చును. 

ఈలా ఎవ్వరు నోచెదరో వారికి లక్ష్మీదేవి ముఖకమలమువంటి ముఖము సౌభాగ్యము కలుగును అని విష్ణుమూర్తి చెప్పేసరికి లక్ష్మీదేవి- "స్వామీ! ఆ నోము నోచిన భామలకు మీవంటి భర్తగలిగి జ్ఞానమువచ్చేటట్టుకూడా ప్రసాదించండి" అని కోరినది. విష్ణుమూర్తి-"తధాస్తూ" అని వర మిచ్చినాడు. అని పురోహితుని భార్య కథ చెప్పేసరికి రాజుకూతురు మనోరథము పండినది. ఆమె గంపంత సంతోషముతో లేచి ఆమెపాదాలకు నమస్కరించి భక్తి శ్రద్దలతో విష్ణు కమలాల నోముపట్టి ఈకథ చెప్పి అక్షతలు వేసుకొని ఏడాది దీపము వెలిగించి ఉద్యాపనము చేసుకొన్నది. ఆమె ముఖము ఆమె కోరినట్లు లక్ష్మి తాండవిస్తూ కనిపించింది. విష్ణుమూర్తి వంటి భర్తను పొంది విజ్ఞానము కలిగి వర్థిల్లినది.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...