Tuesday, January 6, 2026

Pandu Tambulam Nomu Katha - పండు తాంబూలము నోము కథ

పండు తాంబూలము నోము కథ

ఒక రాజు భార్యయు, మంత్రిభార్యయు పండు తాంబూలము నోముపట్టిరి. మంత్రిభార్య ఏరోజు తాంబూలమారోజున యిచ్చు చుండెను. రాజుభార్య భాగ్యము చేత అన్ని ఒక్కమారే యిచ్చెదనని యూరకున్నది. రాజుభార్య నిర్లక్ష్యముచేత సంతానము కలుగక చాల విచారము పొందుచుండెను. మంత్రిభార్య సిరిసంపదగలదై బాగుండెను."నాతో నోముపట్టిన ఈమెకు యిట్టి సంపద కలుగుటయేమి? నాకు లేక పోవుటయేమని" రాజుభార్య విచారముతో అడవిలోకిపోయి తపస్సు చేయ మొదలు పెట్టగా అక్కడకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై -"యిది యేమని యామెనడిగిరి. అప్పుడామె- "మంత్రిభార్య నేను పండుతాంబూలము నోము పట్టినాము. ఆమెకు సిరిసంపదకూడా కలిగినది. నాకులేదు. అందుచేత 
తపస్సు చేయచునానని చెప్పెను. 

పార్వతీ పరమేశ్వరులు - "అప్పుడు నీవు భాగ్యమున్న మూలమున గర్వించి తిన్నగా యిచ్చినావు కావు. అందుచేత నీకు బిడ్డలు పుట్టినారుకారు. ఇప్పుడు తిరుగ యింటికివెళ్ళి యధావిధిగా ఆ నోము పట్టి యుద్యాపనము చేసుకొన్న యెడల నీకు సంతానము కలుగునిని చెప్పి వారు వెడలిపోయిరి.

అప్పుడామె యింటికివచ్చి పార్వతీపరమేశ్వరులు చెప్పిన ప్రకారము తిరుగ పండు తాంబూలము నోము యధావిధిగ పట్టి భక్తి శ్రద్ధలతో ఎడాది అక్షతలు వేసుకొని ఉద్యాపనము చేసుకోగా ఆమెకు సంతానము కలిగెను.

ఉద్యాపనము: ఒక పళ్లెముకొని ఒక ముత్తయిదువకు పిండివంటలతో భోజనముపెట్టి చీర రవికెలగుడ్డ ఇచ్చి పాతికపండ్లు తక్కువలేకుండా ఆ పళ్లెముతో ఆ ముత్తయిదువకు వాయనమీయవలయును. 

కథ లోపమయినను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

No comments:

Post a Comment

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య  స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...