Tuesday, January 6, 2026

Regula Gowri Katha - రేగుల గౌరీ కథ

రేగుల గౌరీ కథ

ఒక రాజుభార్య రేగుల గౌరీనోముపట్టి మరచిపోయెను. ఆమెకు సంతానము లేదు. “సంతానము లేకపోయెనుగదా!” అని విచారముతో ఏడ్చుచుండెను.

ఆ సమయమందు విష్ణుమూర్తి వైష్ణవుని వేషముతోవచ్చి “ఏమి అమ్మాయీ! ఆలాగున 
ఏడ్చుచుండియున్నావు? అని యడుగగా- “సంతానములేక చింతచే ఇలా ఏడ్చుచుండి" నిని చెప్పెను. “నీవు రేగులగౌరీ నోము పట్టి మరచిపోయినావు. అందుచేత నీకు సంతానము కలుగలేదు. ఇప్పుడైనా బంగారు రేగుపండ్లు తవ్వెన్నరసోలెడు చేయించి దక్షిణతాంబూలముతో ఒక బ్రాహ్మణునకు వాయనము యిచ్చినట్లెతే నీకు పిల్లలు పుట్టెదర"ని చెప్పి యాతడు చక్సావెళ్లెను.

అంతట ఆమె అదే ప్రకారము బంగారు రేగుపండ్లు తవ్వెన్నరసోలెడు, చేయించి ఒక బ్రాహ్మణునకు వాయనమిచ్చెను. తరువాత ఆమెకు సంతానము కలిగెను. 

అప్పుడంతావచ్చి- “ఏమినోము పట్టినావమ్మా! ఎమి వ్రతము చేసినావమ్మా! నీకు సంతానము కలిగినదని యడిగిరి. "యేమీలేదు. నేనొకప్పుడు రేగులగౌరీ నోముపట్టి మరచిపోయినాను. అందుకు విష్ణుమూర్తిలా నొక బ్రాహ్మణుడు వచ్చి ఆ సంగతి చెప్పి రేగులగౌరీ నోము తిరిగి పట్టుమని చెప్పగా పట్టినాను. అందుచేత నాకు బిడ్డలు కలిగినార "ని యారాజు భార్య అందరితోను చెప్పెను. అప్పుడంతా ఆ నోముపట్టి యేడాది అక్షతలు వేసుకొని ఏడాది అయిన తరువాత ఉద్యాపన చేసికొనిరి.

ఉద్యాపనము: కుంచెడు తవ్వెడు రేగుపండ్లు తెచ్చి అందులో ఒక బంగారపు రేగుపండుచేసి బ్రాహ్మణునకు పంచెలచాపులు యిచ్చి ఆ కుండెడు తవ్వెడు రేగిపండ్లు, బంగారపు రేగుపండుతో పాటు బ్రాహ్మణునకు వాయన మియవలయును. 

కథలోపమయినను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...