Sunday, January 11, 2026

Nitya Dhanyamu Nomu Katha - నిత్యధాన్యము నోము కథ

నిత్యధాన్యము నోము కథ

ఒకానొక రాజునకు సకలైశ్వర్యములుండెను. గాని అజీర్ణరోగముతో అహర్నిశలు బాధపడుచుండెను. పాపమారాజు చిన్నమెత్తు అన్నమైన తినలేక పండురోత, ఫలమురోత, తిండిరోత, తీర్థము రోత, ఇండ్లురోత, వాకిండ్లురోత, పెండ్లమురోత, బిడ్డలురోత, తనువురోత, తామురోత, సకలమురోతై చావలేక బ్రతుకుతున్నాడు.

స్నేహితులు, పురోహితులు, మంత్రులు, సామంతులు, అందరు చేరి యా రాజుచేత మందులు మ్రాకులు మ్రింగించుచు, ఎన్నెన్నో పున్నెములు చేయించుచున్నారు. ఇట్లుండగా ఆరాజు పట్టణములో నొక వృద్ధబ్రాహ్మణుడు వచ్చి- "పెట్టినవారికి పుట్టినదే సాక్షి" అని పెద్దపెట్టున గొంతెత్తి పాట పాడుచు వీధులవెంట తిరుగుచుండెను. ఆ బ్రాహ్మణుని కంఠమాధుర్యం గోపాల బాలుని వేణుగాన మాధుర్యము లాగున్నది. కనక ఆ యూరివారందరు గోపాలకృష్ణుని గోపికలు లాగున ఆ బ్రాహ్మణుని బట్టుకొని విడువక తిరుగుచున్నారు. ఈ సంగతి వెంటనే మంచము మిదనున్న రాజునకు తెలిసింది. రాజాయనను తక్షణమే భక్తిశ్రద్దలతో తన యొద్దకు రప్పించు కొన్నాడు.

ఆ బ్రాహ్మణుడును దేదీప్యమానముగానున్న అగ్నిశిఖలాగు వెలిగిపోవుచు రాజు యెదుట రత్న పీఠముపై గూర్చుండెను. రాజునకు ఆయనను చూడగానే హృదయ ముప్పొంగిపోయినది. ఎప్పుడు నెరుగని ఈవింత సంతోషమును బొందుచు రాజు బ్రాహ్మణునిజూచి “స్వామీ! ఎంతో పుణ్యము చేయుటచే మీ దర్శనము నేడు నాకు దొరికినది" అని ఇంక నేమేమో చెప్పబోవుచుండగా ఆయన రాజుని జూచి "ఆలాగు చేసినావు కనుకనే యీలాగువచ్చినాను. అది నిజమేగాని నీ పూర్వ వృత్తాంతము వినవోయి రాజా! నీవు పూర్వజన్మమున మహాధనికుడవైయుండి ఒక ప్రాణికొక
పట్టెడన్నమైన పెట్టనొల్లక ధన ధాన్యములన్నియుదాచి పెంచిమూటగట్టి మూలనుబెట్టి
మూలుగునట్లుచేసి మురిసి మురిసి చచ్చినావు. అందుచేతనే నీకిప్పుడా భాగ్యములన్నియు నీయెట్టయెదురుగజేరి ప్రత్యక్షములై పిశాచమువలె నిన్ను పీడించుచున్నవి. పెటినవారికి పుట్టినదే సాక్షి నివెవ్వరికి ననుభవింప బెట్టినావుకాదు. కనుక నీవిప్పుడు వాని ననుభవించుటకు నధికారము లేదు. ఆ పాపముచేతనే యిప్పుడు బాధపడుచున్నావు. ఆ పాప నివారణార్థమని సంకల్పించుకొని నీవిప్పుడొక వ్రతము చేయుము.

నిత్యము వొక బ్రాహ్మణునకొక దోసెడు ధాన్యము, నొక కూరయు దానము చేయుము. ఇట్లొక సంవత్సరము భక్తి శ్రద్ధలతో చేయుము. సంవత్సరము లోపలనైనను, తరువాతనైన ఎద్దు తొక్కని ధాన్యం ఎనుబది కుంచములు ప్రోగుచేసి, బంగారుతీగ దానిచుట్టుజుట్టి, నూతనవస్త్రములుంచి కాయకూరలు, కందకూరలు, పిండివంట సరకులు నేతిమజ్జిగలు సువర్ణ దక్షిణ తాంబూలము లుంచి ఉత్తముడు. సంపన్న గృహస్థుడు నైన పేదపారున కుద్యాపన చేయుము” అని చెప్పి యాదేవుడంతర్జానమయ్యెను. రాజంతాశ్చర్యంపొంది "హితులారా! పురోహితులారా! మంత్రులారా!
సామంతులారా! చెప్పిన పుణ్యములన్నియు చేసితిని, కనుకనే యిప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు. నేనింక ధన్యుడనైతిని. నా పాపములు పటాపంచలైనవని చెప్పి నిత్యధాన్యమగు నోము భక్తిశ్రద్దలతో చేసి ఉద్యాపనము కావించెను. రాజు రోగము రవ్వంతైన లేకుండపోయి యాతం డఖిలభోగభాగ్యముల ననుభవించెను.

పైన చెప్పినవిధముగా వ్రతమాచరించి కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనిన అఖిలభోగభాగ్యములు కల్గును. 

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...