మార్కండేయ ఋషి జయంతిని ఏటా మాఘమాసంలో జరుపుకుంటారు.మార్కండేయ జయంతిని ఏటా మాఘ శుక్ల పక్ష తృతీయ తిథి జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం, బృగు మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు. ఈయన శివుడు, విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవాడు. ఈయన పేరిట ‘మార్కండేయ పురాణం’ అనే పురాణం ఉంది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో ‘మార్కండేయ తీర్థం’ అని పిలువబడే పవిత్ర స్థలం అది.
మార్కండేయుడిని 16 సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే మార్కండేయుని జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మార్కండేయుని చరిత్ర, మార్కండేయ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం. శివ భక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మార్కండేయుని పేరు కచ్చితంగా వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్నీ, కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు.
పూర్వం ఒక మృకండుడు అనే ఒక ఋషి ఉండేవారు. తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట, అందువల్ల అతనికి మృకండుడు అనే పేరు వచ్చింది అని అంటారు.
మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవంతుడి నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న వీరికి ఒక లోటు ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్లి ఈశ్వరుడిని పూజించడం ప్రారంభించారు.
వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి.. ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా? అని అడిగాడు.
అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్నిరోజులు ఉంటే ఏం లాభం.. మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి’ అని మృకండు దంపతులు కోరుకున్నారు. శివుడు సంతసించి వరం ప్రసాదించాడు.
శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం, సకలగుణాలు కలవాడు. బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు.
కొంతకాలం తదుపరి మార్కండేయుని చూడగానే తన ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు. మార్కెండేయుని చూసిన బ్రహ్మ, తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తాడు. శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు.
ఆరోజు నుంచి ఒక శివ లింగం ముందు కూర్చొని మార్కండేయుడు శివ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఓ వైపు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు. అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమ భటులు బయలుదేరారు. కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకు మార్కండేయుని వైపు వెళ్లాడు.
అప్పుడు మార్కండేయుడు, మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు.
అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటికొచ్చాడు. తన మీదకీ, తన భక్తుడి మీదకు పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు.
ఆ సందర్భంలోనే శివుడికి ‘కాలాంతకుడు’ అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువును సైతం అంతం చేసే వాడు అని అర్థం. అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకే దేవతల ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు.
"త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ।
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాఽమృతాత్ ॥"
No comments:
Post a Comment