Friday, August 14, 2026

Sandesham - సందేశం

రామాయణం సుందరకాండ 38, 39, 40 సర్గలు - సందేశం

హనుమా! నీ మాటలు నా హృదయోనికి ఆశ్వాసనం కలిగిస్తూ, పెరుగుతూన్న పంట చేనుకి సకాలంలో పడిన వాన చినుకుల్లా ఉన్నై. శూరశ్రేష్ఠుడయిన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాలి. ఇంతకు ముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను.

మరొక గుర్తుంది.

ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మణిశిల తీసుకుని అరగదీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. అది మరచిపోలేదని చెప్పు,

ఇంద్ర, వరుణ సమ పరాక్రమోపేతుడవైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే, రాక్షసమధ్యంలో క్లేశాలు పడుతూంటే ఎలా సహించ గలుగుతున్నావు? అని అడిగినానని చెప్పూ,

నా సర్వసంపదలకూ ఆధారభూతమూ, ప్రాణప్రదమూ అయిన ఈ చూడామణిని చూచినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. ఇది పంపుతున్నానని చెప్పు.

ఈ బాధలూ, రాక్షస స్త్రీల హృదయవిదారక పరుష భాషణాలూ, ఆయన కోసమే భరిస్తున్నాను.

నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూరదృష్టి నేను భరించలేను, అని శోకదీన వదనయై ఆగింది జానకీదేవి.

అప్పుడు హనుమంతుడు:

అమ్మా! ఆయన నీ కంటె దుఃఖంలో ఉన్నాడు.

లక్ష్మణుడూ అదే దశలో వున్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారుభయులూ హుటాహుటి వచ్చి తన పరాక్రమంతో లంకానగరాన్ని భస్మం చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. 
రేదయినా అయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా? అని అడిగాడు.

జానకి : ఈ చూడామణి నా శిరోభూషణం. అంతకంటె ఉత్తమ మయిన అనవాలు లేదు, అంది.

హనుమంతుడు ప్రయాణ సన్నద్దుడై శరీరం పెంచుతున్నాడు.

అప్పుడు జానకి;

హనుమా! రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరువకు. వారందరినీ యిక్కడకు తీసుకురాగల శక్తి నీకే ఉన్నది. నాస్థితి చూశావు కదా! ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు
చెప్పాలి సుమా! నీకు శుభమగు గాక అంది.

హనుమంతుడు సంతోషంతో 'వచ్చినపని అయింది' కాని మరికొంత మిగిలినట్టు ఉంది, అని ఆలోచిస్తూ ఉత్తరదిశగా సాగాడు.

అశోకవన విధ్వంసం

kakasurudu - కాకాసురుడు

రామాయణం సుందరకాండ 36, 37వ సర్గ- కాకాసురుడు

జానకి మాటలు విన్న హనుమంతుడు:

అమ్మా! పరమసాధ్వీమణీ నీ మాటలు నీ పాతివ్రత్యానికి నిదర్శనంగా ఉన్నాయి. నూరు యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం నీకు భయంగానే ఉంటుంది, నువ్వు స్త్రీవి కనక,

మహాత్ముడయిన రా
చంద్రుని ధర్మపత్నిగా నువ్వాడిన మాట ఉన్నదే!

పరపురుషస్సర్శ సహించనని-

అది నువ్వు మాత్రమే అనగల మాట. మరొక స్త్రీ ఆ పలుకుపలక లేదు.

నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు వినిపిస్తాను.

రామచంద్రునికి సాధ్యమయినంత త్వరలో సంతోషం కలిగించాలనే నా తాపత్రయం; అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను. పయిగా ఆ సముద్రందాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత క్లేశమో తెలిసి మాట్లాడాను.

రాముని మీద నాకున్న స్నేహగౌరవాలు నన్ను అలా మాట్లాడించాయి తప్ప మరొక భావన నాకు లేదు.

ఇప్పుడింక నువ్వు రావు కనక ఆయనకు ఆనవాలు ఏదయినా యిస్తావా అని అడిగాడు.

సీతాదేవి బాష్పావృతనయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది:

ఆయనకు ఒక కథ చెపుతాను గుర్తుగా; అది చెప్పు:

అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని వున్నాము. మా ఆశ్ర
మ   పరిసరాలలో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండే వారు. ఆ కొండకు తూర్పునా, ఉత్తరంలోనూ స్వాదుజలాలూ, ఫలభరిత వృక్షాలూ ఉండేవి.

దగ్గరలోనే మందాకినీ నది.

ఆ ఏటిఒడ్గున సువాసనలీనే లతా, తరువులతో వనాలు.

ఒకనాడు ఆ వనంలో విహరించి, తరంగశీకరాలలో తడిసి ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను.

అప్పుడొక కాకి మాంస ప్రీతితో నన్ను పొడువ రాగా, దాన్ని చిన్న బెడ్డలతో తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఒకసారి అది వచ్చి నా మొలనూలు పట్టి లాగినప్పుడు నా చీరకొంగు జారింది.

అదిచూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా వెళ్ళాను. అయినా ఆ కాకి తన పట్టు విడక నన్ను హింసించగా నేను తిరిగివచ్చి అయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చారు.

అలసటలో వున్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన కూడా నిద్రించారు. మరికొంత సేపటికి నేను నిద్రలేచాను.

ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా శరీరం నుంచి రక్తం కారింది. నేను రాముని లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి చూసి:

నిన్ను హింసించడానికి సాహసిందిన వాడెవడు?

అయిదు పడగల పాముతో చెరలాటమాడే సాహసం ఎవడికి వచ్చింది.

అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా వున్న కాకిని చూశాడు.

అ కాకి ఇంద్రుని తనయుడట!

రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు.

అది బ్రహ్మాస్త్రం!

ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది.

భయంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం యివ్వలేకపోయారు.

దేవతలు, ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు.

శరణాగతరక్షకుడయిన రాముడే దానికి అభయం ఇచ్చి,

ఓ వాయసమా! బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు.

దానికి లక్ష౦ చూపించు, అనగా అది తన కుడికన్ను చూపింది. అలా దానికి చావు తప్పి కన్ను లొట్ట అయింది. అప్పుడది తన ప్రాణ రక్షణ చేసిన రామునీ, వారి తండ్రి దశరథులవారినీ అభినందించి వెళ్ళింది.

అలా కాకిమీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ రాక్షస రావణుని విషయమై ఏం చెయ్యకుండా ఎందుకూరుకున్నాడు?

అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా వున్నాను.

దయను మించిన ధర్మంలేదని ఆయనే అనేవారు. ఉత్సాహబల, పరాక్ర
 సంపన్నుడు.

శత్రుసంహారసమర్థుడు.
సాగర గంభీరుడు.
ఇంద్ర సదృశుడు.
సముద్ర పరీవృత భూమండలాధీశుడు.
వివిధాస్త్రకోవిదుడు.

దేవ, దానవ, నాగ, గంధర్వజాతులను నిర్జింగల శూరుడు. ఇంతటివాడై ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాడాయన.

లక్ష్మణుడయినా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు.

అగ్ని, వాయుదేవులతో సమానులయిన ఆ అన్నదమ్ములింత ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. అంతే! వారు రాకపోవడానికి అదే కారణం, అని దుఃఖిస్తున్నది సీత.

హనుమ : అమ్మా! నీ వియోగదుఃఖంతో ఆయన ఏ పనీ చెయ్యలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం చెందుతున్నాడు.

ఈ క్షణం వరకూ నీ జాడ తెలియదాయనకు. ఇప్పుడు నేను నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సమాప్త
యింది. ఆ రాకుమారు లిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మంచేసి నిన్ను చేరగలరు. ఈ క్రూరరాక్షసుని బంధుసమేతం సంహరించి రాముడు నిన్ను తీసుకువెడతాడు.

నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? అలానే లక్ష్మణునికీ, సుగ్రీవునికీ ఏం వివరించాలి, అని అడిగాడు.

జానకి: హనుమా! లోకనాథుడుగా కౌసల్యాదేవికి ప్రభవించిన రా
చ౦ద్రునికి శిరసా నస్కరించి ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు,

తల్లిదండ్రులయందు అమిత
యిన గౌరవం చూపుతూ, వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధానిని విడిచి మాతో వనవాసక్లేశం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కని సుమిత్రాదేవి ధన్యురాలయింది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. ఆ మహాబాహుడు, సింహస్కంధుడు, ప్రీయవాది నన్ను తల్లిగా, అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నా డింతవరకూ.

ఆనాడు, రాక్షసుడపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు, ఉంటే యింత జరిగేది కాదు, మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వహణదక్షుడు. అయనకు తమ్మునిమిదనే ప్రే
మ ఎక్కువ.
ఆ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృ మరణబాధ మరచి పోగలిగాడు.

అటువంటి మరది క్లేమంగా ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పు - ఇంక నా భర్తతో యీ మాట చెప్పు.

నే నింక ఒక నెలకంటె జీవించను. ఈ పాపి నుండి నన్ను యీ లోపునే రక్షించుకోవాలి, ఈ చూడామణి ఆయనకు అనవాలుగా యిచ్చానని చెప్పు, అంటూ కొంగుముడి నున్న చూడామణి
హనుమంతునికి అందించింది. ఆ అభరణాన్ని ఉంగరంలా వ్రేలికి తొడుగుదామనుకున్నాడు కాని అది కుదరలేదు. దానిని చేతబట్టి సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వినయంగా నిలబడ్డాడు.

అప్పుడే ఆ వాయునందనుని 
నస్సు రామయం అయింది, తిరుగు ప్రయాణానికి సన్నద్దుడవుతున్నాడు.

జానకి: హనుమా! ఈ చూడామణి చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య మా మా
గారు దశరథులు, నేను, ముగ్గురం మనసులో కనిపిస్తాం, అంది,

హనుమంతుడు తలవంచి నమస్కరించాడు,

ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ;

హనుమా! నువ్వు వెళ్ళగానే రా
 లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్దులందరి కుశలం అడుగుతున్నానని చెప్పు.

అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడని ఎరుగుదును.

హనుమ : రాముడు సర్వవానర, భల్లూక సేనా సమేతం యిక్కడకు హుటాహుటిన వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిలిచే వారుండరు, ఇంద్ర, య
, సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీవల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెడతాను, అన్నాడు.

జానకి: నాయనా! ఈ రోజుకి ఎక్కడయినా రహస్యంగా విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరవచ్చు కదా! మరికొంత సేపు నువ్వుంటే నాకు ఆశ్వాసన. ఇంతకూ మీరందరూ వచ్చేవరకూ నా ప్రాణాలు
ఉంటాయో ఉండవో!

ఒకవేళ మీరు రాదలచినా వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని ఎలా దాటగలవు?

వాయుదేవుడూ, గరుత్మంతుడూ, నువ్వూ తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణి 
రొకటి ఉండదు,

అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి నన్ను తీసుకువెడితేనే మాకు కీర్తి ఆ మహాకార్యం ఎలా సాధ్యం, అని ప్రశ్నించింది.

హనుమ : అమ్మా! ఈ సందేహం నీ కనవసరం. మా ప్రభువు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు, మా వానర భల్లూక వీరులందరూ ఆయన అజ్ఞానుసారం నడుచుకుంటారు. వారికి
భూమ్యాకాశాలలో అడ్డంకిలేదు. వారు మహాతేజస్వులు. నదీ నద పర్వత కానన సాగర పరివృత భూమండలం అంతా వారికి కొట్టిన పిండి. మా వారిలో నన్ను మించిన వారూ, నా అంతటివారే
అందరూ. నా కన్న తక్కువవాడు లేడక్కడ. దూతగా మహామహులను పంపరు కదా! నా వంటి సామాన్యులను తప్ప; అంటే ఆలోచించవచ్చు మా వారి బల శక్తులు.

మా వానర బలాధిపులు ఒక్క అంగలో సముద్రం దాటి రాగలరు, రా
 లక్ష్మణులంటావా! ఇద్దరినీ చెరొక భుజంమీద ఎక్కించుకుని నేను వస్తాను. వారు త బాణపరంపరతో ఈ లంకను ముంచుతారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. ప్రజ్వలిగాగ్ని వదనుడయిన రాభద్రుడు అచిరకాలంలో యిక్కడ నీకు కనిపిస్తాడు. నిశ్చింతగా వుండు. నీకు శుభం కలుగుతుంది. ఈ రాక్షస వంశం నేలకూలిన నాడు నువ్వు రోహిణివై రామచంద్రుని చేరుతావు. మలయ పర్వత గుహలలో చరించే సింహ శార్దూల సమ పరాక్రమ సంపన్నులయిన వానర
భల్లూక పతులందరూ నీ కోసం ఈ రాక్షస సంహారానికి వస్తారు.

నువ్వు విచారించకు. వాయువూ, అగ్నీవలె రామ లక్ష్మణులు విజృంభించి నీ రక్షణభార చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణంలో వారు వచ్చి తీరుతారు, అని ఓదార్పు పలికాడు,

సందేశం

Thursday, August 13, 2026

Anuchitam - అనుచితం

రామాయణం సుందరకాండ 35వ సర్గ- అనుచితం

భర్తృ భక్తిం పురస్కృత్య
రామా దన్యస్య వానర
న స్ఫృశామి శరీరం తు
పుంసో వానర పుంగవ॥

వాయునందనా! రాముడు శోకసాగరమగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చెయ్యడం లేదని నువ్వు చెపుతూన్న మాటలు విషంచుక్క పడిన అమృతంలా ఉన్నాయి.

అఖండ సంపదలు వచ్చిపడినా, దారుణక్లేశాలు నెత్తిమీద వున్నా, కాలపాశం ఎప్పుడూ 
న కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. రామలక్ష్మణులూ నేనూ క్లేశాలలో మునిగి వున్నాము.

సాగర
ధ్యంలో విరిగిపోయిన నావనుండి నీటిలో పడి యీధుతూ అలసిన వానిదశలో వున్న రాముడు ఎప్పటికి ఒడ్డు చేరుతాడో! రాక్షసులందరిని, రావణునీ సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడో! ఈ రెండు మాసాలలోపలే ఆయన రావాలి. అది దాటితే ఈ క్రూరుడు నన్ను విడువడు.

ఆ రాక్షసుని సోదరుడయిన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెపుతూనే వున్నా, రావణుని చెవి కెక్కడంలేదనీ, వానిని మృత్యువు వెన్నంటి తరుముతున్నదనీ విభీషణుని పెద్దకూతురు అనల వచ్చి చెప్పింది, ఆ పిల్లను స్వయంగా ఆమె తల్లి పంపిందట.

రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, ధీశాలి, విద్వాంసుడు అయిన అవింద్యుడనే ఆయన కూడా రామునివల్ల రాక్షస నాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట.

మారుతీ!

అన్నింటి కంటె నా అంతరాత్మ పరిశుద్దంగా ఉంది. నా భర్త సర్వసద్గుణరాశి. ఉత్సాహం, పరాక్రమం, మృదుహృదయం, సాహసం, సామర్ధ్యం అన్నీ వున్నవాడాయన.

అలనాడు-

జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా నిలబడి పదునాలుగువేల మంది రాక్షసులను నేల కూల్చినవాడు. ఇంక అయనకు ఎదురు నిలిచేవాడెవడు?

ఇంద్రుని ప్రతాప ప్రభావం శవీదేవికే తెలిసినట్లు మా వారి శక్తి నేనే ఎరుగుదును, అందరికంటె ఎక్కువగా.

ఈ రాక్షస శత్రుజలాన్ని రాముడనే సూర్యుడు తన బాణ కిరణాలతో ఎండబెట్టగలడు, అన్నది జానకి.

అమ్మా! సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు.

అంతవరుకూ ఎందుకమ్మా! నా వీపు మీద కూర్చుంటే యిప్పుడే నిన్ను తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నేకాదు; రావణసమేతం ఈ లంకానగరాన్ని కదలించి తీసుకుపోగలను. హోమ ద్రవ్యాలను అగ్ని హోత్రుడు యింద్రుని ముందుంచేటట్లు నిన్ను నేను రాముని కర్పిస్తాను.

రావణవధోద్యుక్తులయిన రా
లక్ష్మణులను నువ్వు యిప్పుడే చూడవచ్చు. మరే ఆలోచనా లేకుండా రావమ్మా చంద్రుని సరసన రోహిణి వలె రాముని ప్రక్క నువ్వు అలరారుతావు. ఈ లంక అంతా కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు తీసుకువెళ్ళగలను.

జానకి: హనుమా! చాలా సంతోషంగా వుంది నీ మాటలు వింటుంటే. కాని అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు?

నీ వానరత్వం అలా పలికించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో వున్న నువ్వు!

అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అణచుకుని తన దేహాన్ని సువిశాలం చేసి, మేరుగిరిలా నిలిచాడు ఆయన కన్నులు అగ్నిగోళాలవలె వెలుగుతున్నాయి. గోళ్ళు వజ్రకాంతులతో వున్నాయి.

హనుమ : 
తల్లీ ఇప్పుడు చూశావా నా శక్తి! యీ లంకానగరాన్ని, వన, భవన, ప్రాకార, పర్యత సమేతం దీని రాజయిన రావణునితో కలిపి తీసుకుసోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకువెళ్ళి రా లక్ష్మణులను దఃఖసాగరం నుండి ఉద్దరించడమే నా కర్తవ్యం.

జానకి: నీ శక్తి సామర్ఢ్య బల గమనాలు నాకు తెలుసునయ్యా! నువ్వు అగ్ని వంటి తేజస్సు కలవాడవనీ ఎరుగుదును. అంతటి శక్తిలేని వాడెవడయినా యీ అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా?

నువ్వు నన్ను తీసుకుపోగలవు. కాని నీ గమనవేగ తీవ్రతను నేను సహించలేక సృహతప్పి సముద్రంలో పడితే జల జంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి. అందుచేత నేను రాను.

అదీకాక, ఈ వార్త విని రావణుడు 
హాకాయులయిన రాక్షసులను వదులుతాడు. వారు శూల, ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధుడవై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు, ఒకవేళ నువ్వు చేసినా ఆ సమయంలో నేను భయంతో జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోయినా తీసుకుపోతారు. లేదంటే నరికిపారేయగలరు, లేదా లంకలో బహురహస్య ప్రదేశంలో దాచగలరు.

మరొక మాట -

నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు, కాని, అది ప్రభువయిన రామునికి కీర్తికరం కాదే! అందుచేత నువ్వు ఆయనను తీసుకు రావడమే శ్రేయస్కరం.

నీ మాటవిని బయలుదేరితే, నేను చెప్పిన ప్రమాదం జరిగితే రా
లక్ష్మణులతోపాటు మీ వానర భల్లూక పతులు కూడా ప్రాణాలు వదులుతారు.

అన్నిటికంటె ముఖ్యమయిన విషయం-

భర్తృభక్తిపరాయణురాలయిన నేను పరపురుషుని స్పర్శను కూడా సహించను.

మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు, నువ్వు.

అప్పుడు నా భర్త దూరంలో వున్నాడు. నా మనస్సు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగల్గింది లేదు.

ఇకా ఈ దశకంఠుని బంధుసమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం.

దేవ నాగ గంధర్వులను నిగ్రహించగల అయన ధనుష్పాణియై నిలబడితే-

జ్యలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారివైపు కన్నెత్తి చూడగలవాడుండడు. కనక - లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనానులందరూ రాముని వెంట యిక్కడకు రావాలి. అదే నాకు
సంతోషం కలిగించే పని. మరేదీ నాకు రుచించదు అంది.

కాకాసురుడు

Anguliyakam - అంగుళీయకం

రామాయణం సుందరకాండ 33, 34వ సర్గ- అంగుళీయకం

అమ్మా! ఇప్పుడు నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. వాయువు ఎంతశక్తిముంతుడో నేను కూడా అంతశక్తిశాలిని, అని వినయంగా:

ఇదిగో రామముద్రిక. ఈ అంగుళీయకం చూచి నన్ను పూర్తిగా విశ్యసించు. విచారాన్ని విడిచి సంతోషంగా ఉండు, అని ఉంగరం అందించాడు.

ఆ ఉంగరాన్ని చూచే సీతాదేవి వదనం రాహువునోటి నుండి వెలువడిన చంద్రబింబంలా ఉంది. ఎదురుగా రా
చంద్రుడే వచ్చి నిలబడి నట్టనిపించింది. తన కంత సంతోషం కలిగించిన వాయునందనుని కొనియాడుతూ.

నువ్వు తప్ప ఈ పని చెయ్యగలవారు లేరయ్యా. ఈ రాక్షస రాజధానిలో అడుగు పెట్టడం ఎవరితరం! నూరు యోజనాల విస్తీర్ణమయిన మహాసాగరాన్ని గోపాదంలా దాటి రాగలిగిన నీ సాహస పరాక్రమాలు మరెవరికుంటాయి.

ఆత్మవేత్తయైన రామభద్రుడు పంపిన నీతో మాట్లాడడం నాకెంతో సంతోషంగా ఉంది.

ఆయన నా దగ్గరకు సామాన్యులను పంపడు. ఎంతో పరిశీలించి, పరీక్షించి పంపుతాడు. ధర్మ సత్యపరుడయిన రాముడు, అయన సోదరుడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని విన్న నా గుండె తేలికపడింది.

నాకొక సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి ఈ లంకా నగరాన్ని భస్మంచేసి తీరాలి. దేవ గణాలను సైతం నిగ్రహించగలిగిన వారుభయులూ మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి.

ఇంతకూ, బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండడం లేదు కదా! ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా! ఆయన సా
, దాన, భేద, దండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా!

ఆయనకు యోగ్యమిత్రులు చేకూరుతున్నారా! వారు ఆయన శ్రేయస్సు కోరి పని చేస్తున్నారా! గౌరవభావంతో చూస్తున్నారా. అదృష్టాన్ని గ్రహించి పురుషకారంతో దేవతానుగ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా!

నా వియోగ బాధతో కృశించడం లేదు కదా! నన్ను ఈ రాక్షస పీడనుండి విముకంచేసే కృషిలో ఉన్నాడా! అయోధ్యలో వున్న మా అత్త కౌసల్య, ఆవిడతోపాటు సుమిత్ర ఆదిగాగల వారి క్షే
  సమాచారాలు అందుతున్నాయా!

సోదర ప్రేమగల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు పంపుతాడా! వానరేశ్వరుడు సుగ్రీవుడు తన సర్వసేనా బలంతో నన్ను రక్షించడానికి రానున్నాడా! అస్త్రవిదుడయిన మా లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా! రామభద్రుడు త్వరలో యిక్కడకు వచ్చి
ఈ క్రూర రావణుని సంహరిస్తాడా!

నా వియోగంవల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా శుష్కించడం లేదు కదా!

ధర్మనిష్ఠతో రాజ్యసర్వస్వం వదలి అనందంగా అరణ్యానికి వచ్చిన ఆ మహాత్ముడు భార్యావియోగంతో శోకించడం లేదు కదా!

ఆయనకూ నాకూ వున్న స్నేహం తల్లిదండ్రులతో కూడా ఉండదు. ఆయన కుశలవార్త వినడానికే నేను జీవించి ఉన్నాను సుమా, అని ఆగింది.

అప్పుడు హనుమంతుడు.

అమ్మా! ఇంతవరకూ ఆయనకు మీరెక్కడ వున్నదీ తెలియదు. తెలిసిన క్షణంలో ఆయన మా వానర, భల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని స్తంభింపజేసి, అడ్డువచ్చినవారిని కడతేర్చి ఈ లంకానగరాన్ని సర్వరాక్షస సమేతం నాశనం చేసి తీరతాడు.

నీ వియోగంవల్ల ఆయన సింహపు పంజాదెబ్బతిన్న ఏనుగు వలె బాధపడుతున్నాడు. ఇంక ఆ బాధ ఉండదు. త్వరలోనే రా
చంద్రుని పూర్ణచంద్రవదనం నీకు దర్శనమిస్తుంది.

స్వర్గంలో ఇంద్రుని వలె ప్రస్రవణగిరిమీద ఉన్న రామభద్రుని నువ్వు చూడగలవు. ఆయన నీ వియోగంలో, మధపానం మాంసభక్షణ వదిలేశాడు. ఆ బాధలో శరీరంమీద వ్రాలి బాధించే మశక, మక్షికాల స్పర్శకూడా తెలియడంలేదు.

నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాడు.

నీ నామస్మరణమే ఆయన కెప్పుడూ,

అందమయిన పువ్వు, మధుర
యిన ఫలం, మరేదయినా సరే మనస్సును హరించేది కనిపిస్తే చాలు 'హా ప్రియా సీతా' అని విలపిస్తాడు.

నిన్ను దగ్గరకు తెచ్చుకోవడానికే ఆయన కృషి చేస్తున్నాడు,

అని చెపుతూంటే సీతాదేవి వదనం శరత్కాల మేఘాలతో నిండిన ఆకాశంలో చంద్రబింబంలా కనిపించింది.

అనుచితం

Viswasam - విశ్వాసం

రామాయణం సుందరకాండ 32వ సర్గ- విశ్వాసం

ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి:

అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్ళకు కట్టేలా చెప్పు, అని ప్రశ్నించింది.

హనుమ : అమ్మా!

రామ లక్ష్మణుల ఆకార విశేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ విశాలనయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయా హృదయుడు. సూర్యసమతేజస్వి. పృథ్వికున్నంత ఓరిమి ఉంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తికి ఇంద్రుడు.

సర్వభూత రక్షణతో తన పరిజనరక్షణ కూడా చూసుకునే వాడు. ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలనూ ధర్మపదాన నిల బెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, సజ్జనులకు సాయపడుతూ, ఇహ పరాలను చూసుకుంటూ ఉంటాడు.

రాజనీతి నిపుణుడు, విద్వాంసులను నిరంతరం ఆరాధిసాడు, వినయ, విద్యాసంపన్నుడు, శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు.

ఇక ఆయన అవయవాల విశేషాలు-

విపులాంసుడు, దీరబాహుడు, శంఖకంఠుడం, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా ఉంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఉరఃస్దలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా ఉంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ, శార్దూల, గజ, వృషభ గమనుడు.

దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజన ప్రియంగా మాట్లాడగలవాడు.

ఆయన తమ్ముడు సర్వవిధాలా ఆయననే పోలి ఉంటాడు. వారుభయులూ నిన్ను వెదకుతూ వెదకుతూ మా కిష్కింధలో సుగ్రీవుని చేరారు.

అన్నగారి భయంతో మా రాజు ఋశ్యమూకంపై ప్రవాసంలో ఉన్నాడు. మేమంతా సుగ్రీవ సేవలో ఉన్నాం.

అక్కడకు-

నార చీరలతో, ధనుర్పాణధరులై వచ్చిన వారిని చూసి మా ప్రభువు పరుగు ప్రారంభించాడు. కొంత సేపయోాక నన్ను పిలిచి వారెవరో తెలుసుకురమ్మన్నాడు. వారితో విషయాలన్నీ వివరించి, వెంటబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాను.

ఉభయులూ మాట్టాడుకున్నారు. లక్ష్మణస్వామి మీ కథ చెప్పాడు. అది వింటున్నవేళ మా సుగ్రీవుడు విషాదభర హృదయు డయాడు.

అనంతరం౦-

నిన్ను రావణుడు అపహరించుకు వెడుతుండగా నువ్వు విడిచిన నగల మూటను రాముని ముందుంచగా అయన వాటిని ఒడిలో ఉంచుకుని విలపించాడు. నీకోసం, కొంతసేపటికి ఆయనను ఆశ్వాసించగలిగాము.

అమ్మా!

విరహాగ్నితో ఆయన దేహం తపిస్తున్నది. భూకంపవేళ పర్వతంలా ఆయన హృదయం విచలితవువుతున్నది.

అత్యంత సుందర
యిన ఉద్యానవనాలు, మహానదీ ప్రవాహాలు, సెలయేరులు ఏవి కనిపించినా ఆయన మనస్సు నీ కోసమే పరితపిస్తున్నది.

అమ్మా! ఆ రాజశార్టూలుడు నిస్సంశయంగా ఈ రాక్షస రావణుని సర్వనాశనం చేసి నిన్ను స్వీకరిస్తాడు. అందుకు సుగ్రీవుడు కూడా ప్రతిన పూని ఉన్నాడు. చెప్పాను కదా, వాలిని హతమార్చాడు రాముడని.

అనంతరం వానరులందరూ అన్ని దిశలకూ నిన్ను అన్వేషించడానికి బయలుదేరారు. అందులో నేను లంకకు వచ్చి యిక్కడ నిన్ను చూడగలిగాను.

మా బలాధిపతి వాలిసుతుడు అంగదుడు. ఆయన నాయకత్వంలో మేము వింధ్య పర్వతంమీద ఎన్ని రోజులు గడిపామో, అప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. తిరిగి వెడితే ఆయన మా ప్రాణాలు తీసి వేయడం తధ్యం, అని మేము ప్రాణత్యాగం చేయడానికి కొండ శిఖరం చేరాము.

అంగదుడు తీవ్రంగా రోదిస్తున్నాడు. అప్పుడక్కడకు భయం కరముయిన పెద్ద పక్షి వచ్చింది. జటాయువుకు సోదరుడయిన సంపాతి ఆ పక్షి. మా మాటలలో జటాయువు మరణవార్త విని:

'ఎవడురా నా సోదరుని చంపినవాడు.'

అని గర్జించాడు. అప్పుడు మేము రావణుని చేతులలో జటాయువు మరణించిన వార్త వినిపించగా, ఆ పక్షి యింతసేపు విచారించి, నీ వర్తమానం చెప్పాడు.

అప్పుడు మాకు ధైర్యం కలిగింది.

ఉత్సాహంతో సముద్ర తీరానికి బయలుదేరాం. విశాల సాగరాన్ని దాటడం సాధ్యమా అని మా వారందరూ శోకసాగరంలో మునిగారు. వారికి ధైర్యం చెప్పి నేను బయలుదేరాను.

రాత్రి అంతా లంకానగరం మూల మూలలా వెదికాను. రావణుని చూచాను. నిన్ను చూడగలిగాను. ఇది యింతవరకూ జరిగిన కథ. ఇప్పుడు నన్ను విశ్వసించగలవా తల్లీ!

ధనుర్వేద విదుడయిన రాముడు, ఆయన సేవకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు కుశలంగా వున్నారు. వారి దూతగా నేనిక్కడకు వచ్చాను.

ఇప్పుడు నేను వెళ్ళి మా వానర వీరులకు నీ దర్శనభాగ్య విషయం చెపుతాను. అంతకంటె నాకు కీర్తికరం మరొకటి లేదు.

నా కధ కూడా చెపుతాను విను-

పర్వతాలలో శ్రేష్ఠుమయిన మాల్యవంతం మీద మా తండ్రి కేసరి ఉండేవాడు. ఆయన దేవర్షుల ఆజ్ఞానుసారం సముద్రతీరాన గోకర్ణం వద్ద శంబసాదనుడనే రాక్షసుని కడతేర్చిన మహావీరుడు. ఆ కేసరి భార్యకు నేను వాయువువలన కలిగాను నన్ను హనుమంతుడంటారు ఇది నా విషయం.

ఇప్పటికి నీకు విశ్వాసం కలగాలి, అని చెపుతూంటే సీతాదేవికి ఆనంద బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది.

అంగుళీయకం

aaswasana - ఆశ్వాసన

రామాయణం సుందరకాండ 32వ సర్గఆశ్వాసన

శింశుపా వృక్షంమీద కొమ్ముల నడుమ తెల్లని వస్త్రంతో, మెరుపు తీగలవంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుని చూచింది సీతాదేవి,

చూచీ చూడడంతో ఆవిడ గుండె దడదడ లాడింది. అంతలో ఆశ్చర్యం కలిగింది. వానరు డేవిటీ? ఇంత శరీరమేవిటే? అనిపించింది.

మరింత భయంతో విలపించింది. హా రామా! లక్ష్మణా! అంటూ కన్నీరు విడిచింది.

అ వానరుని మళ్ళీ చూడగా వినయవంతునివలె గోచరించాడు. ఇంతకూ ఇది స్వప్నమా? నేను మేలుకుని ఉన్నానా? మళ్ళీ చూసింది. బాగా వంకర తిరిగిన మూతితో కనిపించాడు. మళ్ళీ భయం కలిగింది. కన్నులు మూసుకుంది.

అంతా కల అనిపించింది.

కలలో కోతిని చూడడం కీడుకి సూచన, అనిపించగానే రా
లక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక, అనుకున్నాక యిది కల కాదనిపించింది.

నిరంతర శోకంతో వున్న నాకు నిద్ర కూడా పడుతుందా! పూర్ణచంద్రవదనుడయిన రాముడు దగ్గరలేని నాకు సుఖం లేదే! సుఖంలేనిదే నిద్ర ఎలా పడుతుంది? నా మనస్సు ఆయనను గురించే ఆలోచిస్తున్నది,

ఆయననే ధ్యానించే నాకు ఆ రూపాలే కనిపిస్తాయి. ఆ విషయాలే వినిపిస్తాయి. బహుశః ఆ కోరిక నెరవేరి ఉండాలి. అయినా విశ్వాసం కలగడం లేదు. అయితే యిది మనస్సుకి కనిసించిందా?

కొదు-

స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాడు, వానరుడు.

శబ్దం వినిపిస్తున్నది, అని చేతులు జోడించి:

సర్వేశ్వరుడయిన ఇంద్రునికీ, దేవగురువు బృహస్పతికీ, ప్రజాపతి బ్రహ్మకూ, అగ్నిహోత్రునికీ నమస్కరిస్తున్నాను.

నేను చూసినదీ, విన్నదీ నిజమే కావాలి, అనుకుంటూండగా హనుమంతుడు చెట్టు దిగి, వినయ వినమితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు.

చేతులు జోడించి శిరసున పెట్టుకున్నాడు.

అమ్మా! ఉత్తమురాలవయిన నీవు నలిగిన పట్టుచిరతో ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవ, దానవ, నాగ, గంధర్వ, యక్ష, కిన్నర గణాలలో ఏ జాతికి చెందినదానవు? వసు, రుద్ర, మరుత్తులలో ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తిలా కన్పిస్తున్నావు. చంద్రునికి దూరమై
అకాశాన్ని వీడివచ్చిన రోహిణీతారవా?

మాంగళ్యరూపిణీ! వశిష్ఠులవారిమీద కోపంతోనో, మరే అనుమానంతోనో ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవివి కావు గదా! నీ సోదరుడుకాని, తండ్రికాని, పుత్రుడుకాని, పరలోకగతులైతే వారికోసం శోకిస్తున్నావా?

నీ కన్నీరు, నిట్టూర్పులు!

వీటికితోడు నీ పాదాలు భూమిని తాకుతున్నాయి - వీటిని బట్టి నువ్వు దేవకాంతవు కావనుకుంటున్నాను. నీలో రాచరికపు ఛాయలున్నాయి.

ఆలోచించగా నువ్వు ఏ 
హారాజు భార్యవో అయి వుంటావనిపిస్తున్నది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీ దేవివి అయి వుండాలి. తపస్విజనోచితవేషంతో సౌందర్యరాశిలా వున్న నువ్వు రాముని భార్యవే అనుకుంటాను.

ఆ మాటలు వింటున్న సీతాదేవి రామనామ శ్రవణంతో :

ఆత్మవేత్త, శత్రుసంహార సమర్ధుడు, రాజసింహుడు అయిన దశరథులవారి కోడలిని.

హాత్ముడు, విదేహాదీశుడు అయిన జనక మహారాజు అనుంగుపుత్రిని.

నన్ను 'సీత' అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. అయోధ్యలో ఆయనతో పన్నెండు సంవత్సరాలు సర్యరాజభోగాలూ అనుభవించాను,

ఆ తరువాయి మా మావగారు మావారి పట్టాభిషేకం నిశ్చయించారు. గురువులు ముహూర్తం పెట్టారు. అధే రోజున ఆ వార్త విన్న కైకేయి;

రామపట్టాభిషేకం జరిగితే-

నేను పచ్చి మంచినీళ్ళు త్రాగను,
గుప్పెడు మెతుకులు కతకను,
నా బ్రతుకంతా యింతే; అంది,

న పిబేయం న ఖా దేయం
ప్రత్యహం మ
 భోజనం
ఏష మే జీవితస్యాంతో
రామో య ద్యభిషిచ్యతే

ఇంతకాలంగా నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు అరణ్యానికి పోవాలి, అంది.

ఆ మాటలు వింటూ దశరధులవారు మూర్చపోయోారు. సత్య ధర్మపరుడు కనుక, ఆవిడ వరం ప్రకారం జరిపించాడు. రామచంద్రుడు రాజ్యంకంటె తండ్రి మాటనే అధికంగా భావించాడు.

సత్యపరాక్రముడైన రామచంద్రుడు తమ ప్రాణాలయినా వదులు తాడు కాని ఎదుటివారికి కష్టం కలిగే మాటకూడా మాట్లాడడు.

అందువల్లనే మనసా రాజ్యాన్ని విడిచి, ఉత్తరీయాన్ని చేతులతో వదిలి తల్లి దగ్గరకు, వచ్చి నన్ను ఆవిడకు అప్పగించబోయాడు.

ఆయన లేని దేవలోకం కూడా నాకు అవసరంలేదు. అందుచేత ఆయనకంటె ముందే నేను అడవిదారి పట్టాను. మాకంటె ముందుగా మా లక్ష్మణుడు నారచీరలు ధరించి వచ్చాడు.

అలామేము ముగ్గురం మా మహారాజు మాట ప్రకారం ఘోరాటవులకు వచ్చాం.

అక్కడ దండకారణ్యంలో వుండగా దుష్టరావణుడు నన్ను అపహరించి యిక్కడకు తెచ్చాడు. వాడిచ్చిన గడువు యింక రెండు మాసాలుంది. అది గడిస్తే ప్రాణత్యాగం తప్పుదు, అని జానకి చెపుతూంటే:

దేవి! నేను రా
దూతను. ఆయన కుశలంగా వున్నాడు. నీ క్షేమ సమాచారం తెలుసుకు రమ్మని నన్ను పంపాడు, అని హనుమంతుడు ఆరంభించాడు.

అమ్మా! వేద వేదాంగవేత్త, బ్రహ్మాస్త్ర కోవిదుడు అయిన దశరథ నందనుడు నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజశ్ళాలి అయిన మీ లక్ష్మణుడు శోక దీన వదనంతో మీకు నమస్కరిస్తున్నాడు, అనగా విని సీత, సంతోష పులకితగ్రాతంతో:

మానవుడు బ్రతికివుంటే నూరేళ్ళకయినా సుఖసంతోషాలు పొందుతాడనే పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది, అంది.

అనంతరం వారుభయులూ ఒకరికొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు. హనుమంతుడు నెమ్మదిగా సీతదగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అదిచూచే సీతకు ఈ వ్యక్తి రావణుడేమో అనే శంక బయలుదేరి:

ఛి! ఛీ! ఎంత పారపాటు చేశాను! నా విషయం అంతా చెప్పడంవల్ణ వీడికి సర్వం తెలిసిపోయింది. నిజంగా వీడు కామరూపంతో వచ్చిన రావణుడే, అనుకుంటూ నేలమీద కూలబడింది.

అది చూసి హనుమంతుడు చేతులు జోడించాడు. సీత యిటు చూడడంలేదు. వేడి నిట్టూర్పు విడిచి:

ఓ మాయావి! ఎందుకిలా నన్ను బాధించి వేదిస్తావు. ఆనాడు జనస్థానానికి మాయసన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉపవాసాలతో కృశించి శోకంతో ఉంటే యింకా సంతాపం కలిగిస్తున్నావు. అని క్షణం అగి.

నిన్ను చూస్తూం టే నా మనస్సుకి సంతోషం కలుగుతున్నది. అంటే నువ్వు రావణుడవు కాదేమో అనుకుంటున్నాను.

నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను అశీర్వదిస్తున్నాను. నాకు రామగుణగానంకంటె ప్రీతి కలిగించేది లేదు. అందుచేత ఆయన విషయాలు చెప్పు, అని లోలోపల తన భర్త పంపిన ఈదూత నా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. కలలో అయినా రామ లక్ష్మణులను చూచే అదృష్టం నాకు లేదు. అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదే, ఇది కలే అయి, కలలో నేను కోతిని చూచి ఉంటే కీడు జరగాలి గాని మనస్సుకి సంతోషం కలగకూడదు కదా!

కాక-

భ్రాంతిలో పడ్డానా! వాత ఉన్మాద ప్రకోపమా! ఏదీకాక యిదంతా మృగతృష్ణయా.

కాదు. ఇది పిచ్చికాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు వానరుడని గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా, అని వెనుదిరిగింది.

ఆవిడ తలత్రిప్పి, తనను చూడకుండా ఉండడంతో హనుమంతుడు ఆవిడ శంకను గ్రహించి:

అమ్మా!

రామచంద్రుడు సూర్యసమతేజస్వి. చంద్రసదృశ శీతల హృదయుడు. సర్వలోక ప్రభువయిన కుబేరునివలె భూమండలాధిపతి. విష్ణుసన్నిభ పరాక్రముడు, దేవగురువయిన బృహస్పతివలె మధురభాషి, సత్యవాది. సౌందర్య శోభితుడు. 
న్మథాకారుడు, అనవసరంగా ఆ(గహించడు.
ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు.

ఆయన 
హారధికుడు. ఆయన భుజబలచ్చాయలో ఈలోకం నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది.

ఆనాడు మాయలేడిని పంపి, రా
చంద్రుని సుదూరానికి పంపి, ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు చూస్తావు.

యుద్ధభూమిలో రాముడు పరాక్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని సర్వనాశనం చేసి తీరతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా వచ్చిన దూతనమ్మా!.

సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా. రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశలవార్త వినాలని ఉన్నాడు. అమ్మా! వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు.

ఈ క్రూరరాక్షసీజన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి వుండడం మా అదృష్టం.

అత్యల్పకాలంలోనే రామలక్ష్మణులు శతసహస్రసంఖ్యాక
యిన వానరసేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి యిక్కడకు వస్తారు.

నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనుమంతుడంటారు నన్ను. దుష్టుడయిన రావణుని తలదన్ని, నిన్ను దర్శించడానికి సముద్రందాటి వచ్చానమ్మా!

నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను, తల్లీ, అన్నాడు.

విశ్వాసం

Subhasuchanalu - శుభసూచనలు

రామాయణం సుందరకాండ 28, 29, 30, 31 సర్గలు - శుభసూచనలు

తస్యాః శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణ విశాల శుక్లం
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మ మివాభితామ్రం

శ్రీమంతుని చుట్టూ చేరే సేవకులవలె సీతాదేవి శుభ శకునాలతో అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలంవలె ఆమె విశాలమయిన ఎడమకన్ను, అత్యంత సుందరమయిన ఎడమ భుజం అదిరాయి.

ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది.

అంతవరకూ ఎండకూ. పెనుగాలికీ దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తేశక్తి పొందినట్లు, శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయ అయింది. రాహువు నోటినుండి బయటపడిన చంద్రబింబంలా ఆమె వదనం వికసించింది.

శోకం తొలగింది.
తాపం వైదొలగింది.
సంతోషం పెల్లుబికింది.
శుక్లపక్ష శశాంకరోచు లీనింది - జానకీ ముఖకల్హారం.

అంతనూ చూస్తూ వింటూ అశోకంలో వున్న హనుమంతుడు, ఈవిడే సీత అనే నిశ్చయానికి వచ్చాడు.

ఇప్పుడింక యీవిడను ఓదార్చాలి. ఓదార్చు లేకపోతే యీవిడ ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్లాడి ఆ మాటలు రామచంద్రునికి నివేదిస్తే అయన ఆశ్యాసన పొందుతాడు.

అయితే, ఈ రాక్షసీ మధ్యంలో యీవిడతో మాట్లాడడం ఎలా! మాట్లాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి, ఎలా అయినా ఈవిడతో మాట్లాడాలి.

నేను వానరుడను. ఏ భాషలో మాట్లాడాలి. మానవ వ్యవహారంలో వున్న సంస్కృతంలో మాట్లాడుతాను.

మరి - రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా! వారి భాషా సంస్కృతమే, ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకుంటే...

అనుకున్నాసరే ఈ భాష తప్ప దారిలేదు, ఆవిడకు అర్థం కావాలంటే.

కొని, నా రూపం నా మాట, వీటితో ఆవిడ నన్ను కామ రూపుడయిన రావణుడని శంకించి భయపడి, కేకలువేస్తే ఈ రాక్షసీజనం వారి ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా! అప్పుడు నేను దీర్ఘకాయుడనై కొమ్మలమీదినుంచి దూకుతూంటే ఈ స్త్రీలు రాక్షసబలానికి తెలియజేస్తారు. వారు ఆయుధపాణులై వస్తారు. వీరితో పోరాడుతూ తిరిగి సముద్రం దాటడం సంభవమా! ఈలోగా వారు నన్ను బంధించినా బంధించవచ్చు లేదా ఈ క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు. ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి వర్తమానం అందదు కదా.

మళ్ళీ ఈ విశాలసాగరాన్ని దాటి ఎవడు రాగలడు. ఈ రాక్షసులతో పోరాడి వీరిని కడతేర్చగలిగినా నేను వెళ్ళడం సాధ్యమా. అదీకాక యుద్ధంలో జయాపజయాలు ముందుగా తేలవే. అటువంటప్పుడు పోరాటానికి దిగడం వివేకవంతుల లక్షణం కాదు.

సరే, యిప్పుడెంత ఆలోచించినా ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళడం అవివేకం.

దూత అవివేకి అయితే సర్వకార్యాలూ నాశనమే.

అయితే యిప్పుడు నేనేం చెయ్యాలి. ఎలా ప్రవర్తిస్తే రామకార్యం సక్రమంగా కొనసాగుతుంది.

ఒకే దారి ఉన్నది. సీతాదేవికి పరమ ప్రీతికరుడైన రామచంద్రుని గుణ గణకీర్తనంతో నేను సంభాషణ మొదలుపెడితే ఆవిడ నిస్సంకోచంగా నిర్భయంగా నా మాటలు వింటుంది. అలా ధర్మార్థహితంగా ఆరంభిసాను. అని అ కొమ్మలలోనే దాగి మధుర గళంతో ఆరంభించాడు.

రక్షితా స్వ స్వ వృత్తస్య
స్వజనస్య చ రక్షితా
రక్షితా జీవలోకస్య
ధర్మస్య చ పరంతపః

దశరథుడనే అయోధ్యా ప్రభువు చతురంగబల సమన్వితుడు. సదాచార నిర్వహణతో ఘనయశస్సు పొందిన వా డాయన.

ఆయన రాజర్షి శ్రేష్ఠుడు.

ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు. ఉత్త
 గుణాలతో, భూత దయాపరుడై ఇక్ష్వాకువంశ శ్రేష్ఠుడై, శ్రీమంతుడై, సర్వభోగాలు సర్వజనానికీ సమకూరుస్తూ, తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు.

ఆయన కుమారులలో జ్యేష్ఠుడు రాముడు. రాముడు సర్వ విషయవేత్త; చంద్రునివలె చల్లనివాడు. ధనుర్థారులలో అంతటివాడులేడు.

ముందు తన నడవడి సక్రమంగా ధర్మబద్ధంగా సాగించి, సర్వ ప్రాణికోటినీ, తనవారినీ రక్షిస్తూ, ధర్మ రక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు.

అయన శత్రువులపాలిట యముడు.

సత్యవాక్పాలన నియమం కారణంగా, తన వృద్దజనకుని మాట ప్రకారం భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి వచ్చాడు.

ఆ మహారణ్యంలో క్రూరమృగాలనూ, దుష్ట రాక్షసులనూ సంహరిస్తూ జనస్థానంలో ఖర దూషణుల నాయకత్వంలో ఉన్న సర్వరాక్షసులనూ నేల కూల్చాడు.

ఆ వార్త విని రావణుడు క్రోధంతో జానకీదేవిని అపహరించాడు. రాముని వంచించి, పర్ణశాలకు దూరంగా పంపి.

రాముడు సీతను వెదకుతూ వెదకుతూ, వానరరాజయిన సుగ్రీవునితో స్నేహంచేసి, మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని ప్రభువుగా చేశాడు.

వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కా
రూప శక్తిగల వానర వీరులు సీతాదేవిని వెదకడానికి నాలుగు దిక్కులకూ బయలుదేరారు.

వారిలో ఒకడను నేను, జటాయు సోదరుడయిన సంపాతి మాటను బట్టి యిక్కడకు వచ్చాను, సముద్రం దాటి.

సీతాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా అలానే ఉన్న దేవిని యిక్కడ చూశాను, అని మౌనం వహించాడు.

సీతాదేవి ఆశ్చర్యంతో, భయంతో తల పైకెత్తి చెట్టు మీదికి చూసింది. సీతకు సంతోషం కలిగింది.

అటూ యిటూ చూడగా చూడగా వాయునందను డయిన హనుమంతుడు ఉదయసూర్య సమంగా కనిపించాడు.

ఆశ్వాసన

Brahmastra - బ్రహ్మాస్త్రం

రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు -  బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్‌  । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...