ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అతని దగ్గరకు తత్త్వం తెలిసినవాడు, దయగలవాడూ అయిన నారదుడు వచ్చి అతనికి జ్ఞానాన్ని బోధించటం కోసం ఇలా అన్నాడు. రాజా! నీవు కోరుకొనే శ్రేయస్సు కీడులను తొలగించేదీ, ఇష్టాన్ని సమకూర్చేదీ కావాలి. కానీ అది ఈ కర్మలవలన కలుగదు అని పలుకగా ప్రాచీనబర్హి అతనితో ఇలా అన్నాడు.
పుణ్యాత్మా! మునివరా! మహాభాగా! నేను కర్మలచే నశించిన జ్ఞానం కలవాడనై మోక్షమంటే ఏమిటో తెలియని వాడనయ్యాను. ఇట్టి నాకు ఇప్పుడు స్వచ్చమైనదీ, కర్మబంధాలను నాశనం చేసేదీ అయిన జ్ఞానబోధచెయ్యి. దయాస్వరూపా! కపట ధర్మాలైన ఇల్లూ వాకిలీ ఆలూ, కొడుకూ, ధనమూ మొదలైనవన్నీ గొప్పపురుషార్థాలుగా తలపోసే బుద్ధిహీనుడు సంసారపు దారులలోనే దిక్కులేక గమ్యంలేక తిరుగుతూ ఉంటాడు. ప్రయత్నించి మోక్షపదాన్ని పొందలేడు.
అన్నంతనే ప్రాచీనబర్దితో నారదుడిలా అన్నాడు. పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో దయాదాక్షిణ్యాలు లేక నీవు చంపిన పశువులు వేలకొలదిగా ఉన్నాయి. చూడు.
కాబట్టి, నీవు యజ్ఞాలలో హింసించిన పశువులన్నీ నీ వల్ల కల్గిన హానిని స్మరిస్తూ నిన్ను చంపటానికి ఇనుపయంత్రాల కొమ్ములతో, నీవు ఎప్పుడు చనిపోతావో అని యెదురు చూస్తున్నాయి. ఇటువంటి పెద్ద ఆపద నీకు రాబోతున్నది. దీనినుండి దాటుకోవటానికి వీలు కలిగించే ఒక పాతకాలపుకథను నీకు చెబుతాను విను. అని ఇలా అన్నాడు.
No comments:
Post a Comment