Monday, March 2, 2026

Lord Rudra reciting the hymn called Yogadesh to the Prachetas - రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రముం దెల్పుట

రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రముం దెల్పుట

కాబట్టి భగవంతుడు, దేవదేవుడు అయిన ఆ పరమేశ్వరునితో కలయిక ఆ ప్రచేతసులకు ఏ విధంగా కలిగిందో ఆ తీరునంతటినీ నాకు చక్కగా తెలియజెప్పు.

అని పలుకగా విదురునికి మహర్షిశ్రేష్టుడగు మైత్రేయుడు ఇలా చెప్పాడు. ఆ ప్రచేతసులు సాధువైన బుద్ధి కలవారు. తమ తండ్రి చెప్పిన మంచిమాటలకు సమ్మతించారు.

తండ్రి ఆజ్ఞను తలదాల్చి పడమటి దిక్కుగా బయలుదేరారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఒక పెద్దసరస్సు కనపడినది. అందులో నిండుగా నిర్మలం, సుందరం అయిన నీరు ఉన్నది. సముద్రంకంటె మిక్కిలి వైశాల్యం కలిగి ఉంది.

ఆ కొలనిలో ఎర్రకలువలు, నల్లకలువలు, కమలాలు, సౌగంధికాలు చక్కగా వికసించి ఉన్నవి. పద్మాలలోని కేసరాలను ఇటు అటు కదిలిస్తూ ఆనందంగా మందమలయానిలాలు వీస్తున్నవి. ముద్దులు మాటగట్టే హంసలూ, బెగ్గురుపక్షులూ, చక్రవాకాలూ, కన్నెలేడిపిట్టలూ వీనులవిందుగా కూస్తున్నవి. మదించిన తుమ్మెదల మధురధ్వనులకు సంతోషంతో పులకరించినట్లుగా ఒడ్డున ఉన్న తీగలూ, చెట్లూ చిగురు తొడిగాయి. సిద్ధులు, చారణులు, గంధర్వులు అక్కడ విహరిస్తున్నారు. పుణ్యాలకు ఆలవాలమైన ఆ కొలనులోని నీరు శుచిగా తేటగా తియ్యగా ఉంది.

ఆ సరస్సు సజ్జనుని హృదయంలాగా నిర్మలంగా ఉన్నది. ఆకాశంలాగా దేవతలు సంచరించేదిగా ఉన్నది. గొప్పవాని భాగ్యంలాగా యోగ్యమైన జీవన విధానంకలిగి ఉన్నది. అభిమానవతి ప్రవర్తనలాగా గంభీరంగా ఉన్నది.

ప్రచేతసులు ముందుకు పోవుచుండగా వారికొక పెద్దసరస్సు కానవచ్చింది. అందులోని జలాలు చంద్రకిరణాలలాగా స్వచ్చంగా ఉన్నాయి. పాపాలను పోగొట్టే విష్ణుకథలలాగా మాలిన్యం లేకుండా ఉన్నాయి. అగ్నుల లాగా లోకాలను పవిత్రం చేసేవిగా ఉన్నాయి. అటువంటి నీళ్ళతో అది నిండి ఉన్నది.

ఆ విధంగా అందాలుచిందే ఆ గొప్ప సరస్సును చూచి అందులో ఒక్క దివ్యపురుషుని కనుగొన్నారు. అతడు

ఆ దివ్యపురుషుడు మదంతో ఒప్పారే ఇంపు సొంపులుగల మద్దెల, పిల్లనగ్రోవీ మొదలైన వాద్యాల మిక్కిలి ఇంపైన నాదంకలది, దివ్యుల మార్గాలలో సంచరించేవారి మనస్సులను రంజింపజేసేదీ అయి ఒప్పుచున్న మహనీయమైన గాంధర్వగానాన్ని ప్రీతితో వింటూ దాని మహిమకు అబ్బురం చెందుతూ ఇంకా వినాలి అనే వేడుకతో ఆ సరస్సునుండి వెలుపలికి వచ్చాడు.

ఇలా బయటికి రాగా

ఆ తాపస శ్రేష్ఠులైన ప్రచేతసులు అలా సరస్సునుండి వెలువడి వచ్చిన దివ్యపురుషుని చూచారు. ఆయన రుద్రుడు, పరమేశ్వరుడు, దేవతల లోకాలలో శ్రేష్ఠుడు; పుటంలో కాగిన బంగారంవంటి వన్నె కలవాడు. సనకాది మునులు ఆయనను గొప్పగా కీర్తిస్తున్నారు. మూడుకన్నులతో అలరారుతున్నాడు. భక్తులగుణాలను అనుసరించివారిని చేరుకుంటాడు. చాలా గొప్ప ఐశ్వర్యం కలవాడు. భక్తులను అనుగ్రహించే ప్రసన్నతతో విరాజిల్లే ముఖం కలవాడు. పాపాలను పటాపంచలు చేసుకొనేవారి సంపదలను కాపాడేవాడు.

ఆ తాపసవరులు ఆ రుద్రుని చూచి ప్రీతి, ఆశ్చర్యం ఎడతెరపి లేకుండా కలుగగా వినయం తెలియ వచ్చే తీరున ఆయన పాదాలనే పద్మాలకు మొక్కి భక్తికి వశమైన త్రికరణముల గతులుగల వారయ్యారు. అలా అవుతూ

భగవంతుడు, సర్వధర్మాలూ తెలిసినవాడూ, దయగలవాడూ, దర్శనమాత్రం చేత సర్వపాపాలనూ తొలగించివేసేవాడూ, భక్తులయందు పుత్రత్వప్రేమ కలవాడూ అయిన పరమేశ్వరుడు ప్రీతుడై, ప్రసన్నమైన అంతఃకరణం కలవారూ, ధర్మాలను ఎరిగినవారూ, శీల సంపదతో అలరారేవారూ, మిక్కిలి ప్రీతి పొందినవారూ అయిన ఆ తాపసులతో ఇలా అన్నాడు.

రాజకుమారులారా! వినండి. మీ మనస్సులో ఉన్న భావన అంతా నాకు తెలియ వచ్చింది. మీకు మేలు కలుగుతుంది. మీయందు దయగలబుద్ధితో నేను మీకు దర్శనం ఇచ్చాను. సూక్ష్మమైనదీ, మూడుగుణాలే స్వరూపంగా కలదీ అయిన ఆ ప్రకృతికంటె, భూమి మీద ప్రవర్తించే జీవునికంటే వేరైనవాడు వాసుదేవుడు. అతని పాదపద్మాలను ఉదాత్తభక్తితో కోరికోరి భజించేవారు నాకు చాలా ఇష్టులు. నీతి నడవడి కల ఓ సజ్జనులారా! వారి విషయంలో నేను కూడా ప్రీతికలవాడనై ఉంటాను. గొప్పమహిమతో ఒప్పారుతూ ఉంటాను. ఇంతేకాదు. మరొక్కమాట కూడా మీరు వినండి.

తన ధర్మంలో నిష్ఠగల పురుషుడు పెక్కు పూర్వజన్మల పుణ్యవిశేషాలచేత బ్రహ్మగా అవుతాడు. ఆ తరువాత పెరిగిపోయిన పుణ్యంతో నన్ను చేరుకుంటాడు. మా మా పదవీ బాధ్యతలు ముగిసినప్పుడు నేనూ, ఇతర దేవతల సముదాయాలూ ఆదిలో ఎట్టి వికారాలూ పొందని శ్రీహరి స్థానాన్ని పొందుతాము కదా! అట్టి స్థానాన్ని భగవద్భక్తుడు స్వయంగా పొందుతాడు. కాబట్టి మీరు భగవద్భక్తులయినవారు కనుక నాకు ఎంతో ప్రియమైనవారు. భగవంతునియందు భక్తి పండినవారికి నాకంటె ప్రియమైనవాడు లేడు. కాబట్టీ వివేకవంతమైనదీ, జపించదగినదీ, పవిత్రమైనదీ, శుభమైనదీ, మోక్షాన్ని ప్రసాదించేదీ అయిన నా మాటను ఆలకించండి. సృష్టి మొదట బ్రహ్మ తన కుమారులకు తెలియజేసిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలియజేస్తాను. వినండి. అది ఎటువంటిదంటే

బ్రహ్మదేవుడు తనకుమారులైన సనకుడు మొదలైన వారిని చూచి నాయనలారా! శ్రీ మహావిష్ణువునకు సంబంధించిన శుభప్రదమైన స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. వినండి అన్నాడు.

ఇలా పలికి విష్ణువును గూర్చి వారలు వింటూ ఉండగా ఇలా పలికాడు. స్వామీ! ఆత్మతత్త్వం తెలిసినవారికి నీ మహిమ ఆత్మానందం అనే లాభాన్ని కలిగిస్తుంది; అట్టి ఆత్మానందం మాకు దొరకాలి. నీవు నిండైన ఆనందమే స్వరూపం అయినవాడవు. ఇట్టి సమస్తమూ స్వరూపంగా అయిన నీకు నమస్మారం చేస్తాను అని ఇంకా ఇలా పలికాడు.

(పరిపూర్ణానంద స్వరూపుడు- సత్తు, చిత్తు, ఆనందం అనేవి మూడూ పరమాత్మ స్వరూపాలు; ఏది సత్తో, ఏది చిత్తో, అదే ఆనందం అనే అనుభవమే పరిపూర్ణానందం. అట్టి ఆనందం తప్ప మరే ఇతర భావమూ లేనివాడు పరిపూర్ణానంద స్వరూపుడు.

నమస్కరించటం అంటే అయిదు జ్ఞానేంద్రియాలనూ, అయిదు కర్మేంద్రియాలనూ, మనస్సుతో పాటుగా కలిపి స్వామికి సమర్పించుకుంటున్న భావాన్ని చేతిముద్రద్వారా ప్రకటించటం.

స్వామీ! నీవు నాభిలో పద్మంగలవాడవు. సంకర్షణుడవు. శాంతుడవు. విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడవు. భూతాలూ, సూక్ష్మతత్త్వాలూ, ఇంద్రియాలూ స్వరూపంగా గలవాడవు; సూక్ష్మ దేహం ఆత్మగా అయినవాడవు. వాసుదేవుడవు. పూర్ణుడవు. పుణ్యుడవు. ఏ వికారాలూ లేనివాడవు. కర్మబంధంనుండి జీవులకు మోక్షం కలిగించేవాడవు. వేదాలను సంరక్షించేవాడవు. మూడు లోకాలను పాలించేవాడవు. చంద్రునివంటి రూపం కలవాడవు. తేజస్సుతో, బలంతో అంతటా పేరుపొందినవాడవు. నీ అంత నీవు వెలుగొందే వాడవు. దుష్టులను అంతం చేసేవాడవు. యజ్ఞాది కర్మల సాధనాలుగా అయ్యేవాడవు. సనాతనుదడవు. యజ్ఞాలకు భీజం అయినవాడవు. ప్రాణశక్తితో తృప్తి పొందేవాడవు. భూమి, లోకాలూ, ఆకాశమూ నీ స్వరూపాలే. నీవు ప్రళయ కారుడవు. విశ్వాలు నీ నుండియే పుట్టాయి. నీవు విష్ణుడవు, జిష్టుడవు. అట్టి నీకు నమస్కారం.

(ఇది గొప్పవిష్ణుస్తుతి. ఛందస్సు దేశీయమైనా భావన అంతా వేదాంతతత్తంలో నిండినది కనుక సంస్కృత వాక్యంగా పోతనగారు రచించారు. ఇందులో 'పంకజనాభాయ' అనేది మొదలుకొని 'జిష్టవే' అన్నంతవరకుగల ఇరవై ఎనిమిది పదాలు సంస్కృత భాషలో చతుర్ధి విభక్తి అంతమందుగల పదాలు. “నమః” అనేది ఎవరినుద్దేశించి చేయబడుతుందో అట్టివ్యక్తిని తెలిపేపదానికి చతుర్ధి విభక్తి కలగటం వ్యాకరణ నియమం. 'అస్తు' అనేది విధ్యర్థకక్రియ- అగుగాక! అనిదాని అర్థం.)

స్వామీ! నీవు స్వరానికీ, మోక్షానికీ మంచి ద్వారం అయినవాడవు. అన్ని రసాలూ స్వరూపం అయినవాడవు. పరమహంసవు. ధర్మపాలకుడవు. శ్రేష్ఠం, హితమూ అయిన ఫలమే రూపం అయినవాడవు. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. సర్వశక్తులతో కూడిన వాడవు. గొప్పది అయిన సాంఖ్యయోగం పండించుకొన్నవారికి ప్రభుడవు. సువర్ణం నీ వీర్యం. రుద్రుడవు. ఉత్తమ శీలం కలవారికి రక్షకుడవు. దుష్టులకు శిక్షకుడవు. శూన్యమైన ప్రవృత్తి కలవాడవు. యజ్ఞాది కర్మలు నీవే, మృత్యుదేవతవు. విరాట్టు నీ శరీరం. సర్వధర్మస్వరూపుడవు. వాగ్వైభవమంతా నీవే. నివృత్తి నీతత్త్వం. గొప్ప పుణ్యంతో గొప్పది అయిన వర్చస్సు కలవాడవు. నీ దేహం అఖిల ధర్మాల స్వరూపం. ఆత్మవు. ఏ అడ్డూ ఆటంకమూ లేనివాడవు. పరిపూర్ణ స్వరూపుడవు. అట్టి నీకు నమస్కారం.

సర్వప్రాణి స్వరూపుడవు, దేవుడవు, అన్నింటి ఉనికినీ తన అధీనంలో పెట్టుకొన్నవాడు, వెలుపల, లోపల తానే అయి ఉన్నవాడు; కారణాత్ముడు, సమస్తమైన విషయాలను అభివ్యక్తం చేసేవాడు, నిర్గుణుడు, స్రష్ట మనోనిగ్రహం కలవాడై సాధువైనవాడు అయిన నీకు నమస్కారం.

అని ఇంకా ఇలా అంటున్నాడు. నీవు ప్రద్యుమ్నుడవు, అంతరాత్మవు. సృష్టిలోని సర్వపదార్థాలూ నీ అంశలు. అవి ఏర్పడటానికి కారణమైనవాడవు. యజ్ఞాలలో నాలుగు విధాలుగా ఆయా కార్యాలు నిర్వహించే ఋత్విక్కులుగా అయ్యేవాడవు. సర్వాన్నీ లయం చేసేవాడవు. సర్వజ్ఞానమూర్తివి. జ్ఞాన క్రియలుగా గోచరించేవాడవు. సర్వజీవుల హృదయాలలో నివసించేవాడవు అయిన నీకు నమస్కరిస్తాను.

స్వామీ! పుణ్యపురుషా! నీ పాదాలను తృప్తిగా చూడాలనే కోరిక అధికమైన, వైష్ణవులు గొప్పగా సంభావించే నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించవయ్యా!

ఆ నీదర్శనం ఎటువంటిదంటే

పుణ్యాత్మా! అది ఇంద్రియాలన్నింటి గుణాలైన శబ్దం మొదలగువాని స్పర్శ కలది, భక్తులకు ప్రియమైనది, నీలమేఘంవలె శ్యామలవర్ణం కలది, అందచందాలతో అలరారుతూ ఉండేది, పోలిక లేనిది, నిత్యమంగళాలను కూర్చేది.

దేవా! నీ సుందరమైనమూర్తి తుమ్మెదల గుంపువలె ఒప్పారే ముంగురులతో అలరారే చంద్రరేఖనుపోలెడు ముఖం కలది. ఒకే విధంగా ఉండే కర్ణభూషణాల కాంతులతో కూడి ఉన్నది. తీర్చిదిద్దినట్లున్న కనుబొమలతో, నాసికతో సుందరంగా ఉన్నది. చాలా సుకుమారమైన మల్లెమొగ్గలవంటి పలువరుసతో నిండి నిగనిగలాడుతున్న చెక్కిళ్ళ జంటతో ఒప్పుతున్నది. తామర రేకులవంటి అందమైన కన్నులు విరాజిల్లుతున్నాయి. చిరునగవుతో ఒప్పారే కంటికొనలతో సుందరంగా ఉన్నది. వికసించిన చూపులతో నిరంతరం ప్రసన్నంగా ఉంది మోము. శంఖంవలె సుందరమైన శుభమైన కంఠం కుదురుకొని ఉన్నది. సువర్ణమయహారాల, మణికుండలాల కాంతుల వెల్లువతో కూడిన అందమైన సింహం మూపులవంటి మూపులు కలిగి ఉన్నది.

ఆ భగవంతుని దివ్యరూపం ఈ విధంగా ఉన్నది. శంఖం, చక్రం, గద, పద్మాలతో విరాజిల్లుతున్న నాలుగు చేతులు, వైజయంతి అనే వనమాలతో, కౌస్తుభం అనే మణియొక్క శోభతో ప్రకాశిస్తున్నది. ఎప్పుడూ తన్ను వదలి ఉండని లక్ష్మీదేవి అనే సుందరీమణితో కూడిన చైతన్యంతో ఒప్పారుతున్నది. ఒరగంటిని కాదనగల్గిన రొమ్ము ప్రదేశంతో విరాజిల్లుతున్నది. పీల్చేగాలీ, వదలేగాలీ అనే వానితో అందంగా కదలుతున్న మూడుముడుతలతో సుందరంగా ప్రకాశిస్తున్న సన్నని నడుముతో అలరారుతున్నది. మునుపు వెలుపలికి వచ్చిన సమస్తమైన విశ్వాన్నీ మళ్లీ లోపలికి తీసుకుంటున్నదా అనిపించే నీటి సుడిలాగా ఉన్న లోతైన బొడ్డు ఒప్పారుతున్నది. పద్మంలోని కేసరాలవలె చక్కగా వెలుగొందుతన్న పట్టుబట్ట మీద కట్టబడిన బంగారు మొలతాటి పేటలతో అందగించిన నీలవర్ణంకలదీ, పెద్దదీ అయిన పిరుదుల భాగం శోభిల్లుతూ ఉన్నది. నల్లని అరటి బోదెలవంటి సుందరమైన రెండుతొడలతో అలరారుతున్నది, సమంగా సుందరంగా ఉన్న పిక్కలు కలిగి ఉన్నది. గంభీరమైన మోకాళ్ళ జంటతో ప్రకాశిస్తున్నది. తామరరేకువలె వెలుగొందుతున్న పాదాలజంటతో ప్రకాశిస్తున్నది. నాదైన మనస్సులోని చీకటిని ఆపివేసే చంద్రకళలవలె ఉన్నట్టి గోళ్ళు కలిగి ఉన్నది. కిరీటం, కుండలాలు, మెడలోని హారాలు, భుజకీర్తులు, వలయాలు, ఉంగరాలూ, మణినూపురాలు మొదలైన పెక్కుతీరులైన ఆభరణాలతో అలంకృతమై ఉన్నది. జనులందరి, అన్ని విధాలైన భయాలను తొలగించి వేస్తున్నది. భక్తజనులకు మనోహరంగా ఉన్నది, సర్వశుభాలకూ నిలయమై ఉన్నది. స్వామీ! అటువంటి నీ దివ్యమైన భగవత్స్వరూపాన్ని తామసగుణంతో నీచస్థితికి జారిపోయే జనాలకు కూడా సన్మార్గాన్ని చూపించేవాడవైన నీవు మాకు చూపి మమ్ములను నెరవేరిన ప్రయోజనం కలవారినిగా చెయ్యి అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ పాపభావనలేని ప్రవృత్తి కలవాడా! తామర రేకులవంటి కన్నులున్నవాడా! అందరకు అలవరచుకోవలసిన మంచి చరిత్ర కలవాడా! స్వామీ! నిర్మలత్వాన్ని కోరేవారు ధ్యానించతగిన వస్తువు నీవు. గొప్పదైన స్వర్గరాజ్యానికి అభిషేకం పొందిన వానికైనా చాలా ఎక్కువగా ఆశపడదగినవాడవు నీవు. నిలుకడగా ఉండే భక్తితో కూడిన భక్తజనులకు నీవు సులభుడవు. దుష్టబుద్దులకు నీవు దొరకనే దొరకవు. ఆత్మను దర్శించవలె ననుకొనేవారికి పొందదగిన వాడవు నీవు. ఈ విధంగా ఒప్పారుతూ ఉంటావు. ఈ విధంగా ఎంతో శ్రమతో కానీ ఆరాధించటానికి వీలుకాని స్వామిని నిన్ను వర్ణించటం సుజనులకు కూడా సాధ్యం కాదు. నిన్ను పూజించేవాడు నిన్ను విడువగలడా?

(ఆత్మకు పరిశుద్ధి అంటే నశించే ప్రపంచ సంబంధమైన భోగాల మీద భావన లేకుండటం. ఆత్మదర్శనులు ఆ పరమాత్మ తత్త్వసంబంధం అయిన జ్ఞానం కలవారు.)

పెంపొందిన భక్తియోగంతో నీ పాదపద్మాలను నిరంతరమూ పొందకోరేవాడు వెరపుగొలిపే కోపమూ, భయం పుట్టించే వీర్య శౌర్యాలతో కూడిన బెదరింపు చేష్టలు అనే వాటితో లోకాలన్నింటినీ నాశనం చేసే ఆ సాటిలేని యమునివలన కలిగే భయాన్ని కూడా పొందడు. కాబట్టి

ఎక్కువ తక్కువలులేని ఆనందం కలవాడా! భూమినీ, గోవులనూ, వేదాలనూ, వాక్కులనూ సంతోషపెట్టేవాడా! అజ్ఞానాన్ని హరించేవాడా! ముక్తిని ప్రదానం చేసేవాడా! ఈ విధమైన మీ పాదాలను ఎవ్వడైనా పొంది పుణ్యాత్ముడైతే వాడు పొరపాటున కూడా మరొక దానిని వాంఛిస్తాడా? ఎన్నటికినీ వాంఛించడు.

హరీ! మీ భక్తుల ద్వారా సాటిలేని విధంగా చెలిమిచేసే అరనిముసం మాత్రంతోనైనా మోక్షం సరికాదు. అంటే క్షణభంగురమైన మానవ సుఖం సంగతి చెప్పటం ఎందుకు?

పాపాలను పటాపంచలు చేసే పాదాలనే పద్మాలుగల ఓ స్వామీ! నీ కీర్తి అనే తీర్ధపు నీటి బొట్టులతో వెలుపలలోపల తడిసిన స్టితి కలుగుటచేత రూపుమాసిన పాపాలుగల మానవులు భూమిమీద తీర్థాలుగా అయినవారే కాకుంటారా?

(తీర్థభూతులు ఆ తీర్ధం అంటే తరింపజేసేది. సంసార దుఃఖంనుండి గట్టెక్కించేవారు.)

ఆ విధంగా అన్ని ప్రాణులయందు అనురాగం ఉన్నవారు, రాగం మొదలైనవి లేని హృదయాలు కలవారు, వక్రబుద్ధులు లేకుండటం మొదలైన గుణాలతో కూడినవారు అయిన భగవంతునికి సర్వసమర్పణ చేసికొన్న భక్తజనులతో మాకు నిరంతరమూ మైత్రి ఉండే స్థితిని కలిగించు అని ఇంకా ఇలా పలికాడు.(బ్రహ్మ)

పద్మనాభా! సత్పురుషుల స్నేహంతో గొప్పగా ఏర్పడిన భక్తియోగం ప్రకాశిస్తూ ఉండగా నిర్మలమైన చిత్తం చంచలమైన వెలుపలి దేహాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ చూడదు. పెద్దదైన చీకటే స్వరూపంగాగల సంసారమనే గుహలో ప్రవేశించదు. నీదైన మహిమగల తత్త్వాన్ని ఎల్లప్పుడూ చూడ గలుగుతుంది.

(సజ్జనుల సంగతివలన మూడు ప్రయోజనాలు. 1. అది పొందినవారికి ప్రపంచ సంబంధం తొలగిపోతుంది. 2. గాఢమైన అజ్ఞానం అతనిని లోగొనజాలదు. 3. పరమాత్మ దర్శనం శాశ్వతంగా లభిస్తుంది.

ఆ స్థితి ఏ విధమైనదంటే.

సరియైన చూపుతో చూస్తే ఏ తత్త్వంలో ఈ విశ్వమూ, ఈ విశ్వంలో ఏ తత్త్వం స్పష్టంగా తెలియవస్తూ ఉంటుందో ఆ పరమాత్మ తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అది శాశ్వతమైనది. ఏ విధమైన మార్పులూ లేకుండా ఒకే విధంగా ఉంటుంది. ఆకాశంలాగా అణుమాత్రం కూడా వదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మతత్త్వాన్ని చూస్తే అతడే ఆ పరబ్రహ్మం అవుతాడు అనిచెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఆ పరమాత్మ నిజానికి ఏ వికారాలూ లేకుండా ఉండేవాడే. అయినా ఈ విశ్వాన్ని తనలో నుండియే సత్యమైన దానినిగా సృష్టించాడు. దానిని ప్రకృతి అంటారు. అది తన పనులు తాను చేసుకోలేనిది. పరమాత్మకంటె వేరుగా అయినది అనే బుద్దిని పుట్టించేది.

ఇంకా ఇంకా అనేక పర్యాయాలు ఈ విశ్వం పుట్టుకకూ, పెరుగుదలకూ, ప్రళయానికీ కారణమైన ఈశ్వరుడవై ప్రకాశించే నిన్ను ఆత్మతత్త్వంగా తెలుసుకుంటాము. యోగంపట్ల నిష్ఠగలవారు శ్రద్ధతో కూడినవారై యజ్ఞం మొదలైన క్రియల సముదాయంతో సూక్ష్మదేహంతో గుర్తింపదగిన నీ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వారు వేదాల ఆగమాల తత్త్వాల జ్డానం కలవారు. నీవు సమస్త సృష్టికంటె ముందే ఉన్నవాడవు. నీవు ఆది లేనివాడవు. నీ వంటితత్వం మరొకటి లేదు. మాయాశక్తితో కూడినవాడవై విరాజిల్లుతూ ఉంటావు. ఆ మాయాశక్తి చేత

మాయాశక్తిచేత సత్వం, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలు వరుసగా ఏర్పడ్డాయి. వాటి వలన మహత్తు, అహంకారం, ఐదయిన శబ్దం మొదలైన విషయాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే అయిదు మహాభూతాలు కలిగాయి. మహర్షులు, దేవతలు, ప్రాణుల సముదాయాలుగా ఈ విశ్వమంతా వేరు వేరు రూపాలు కలది అయినది. నీ మాయ చేతనే నాలుగు విధాలైన రూపాలుగల పురాన్ని పురుషుడు ఆత్మాంశతో ప్రవేశిస్తున్నాడు. ఇంద్రియాలతో విషయసుఖాలను అనుభవిస్తున్నాడు. అతడు భూమిమీద తేనెటీగ రూపొందించిన తేనెలాగా ఆ పరమాత్మముందు మెలగుతూ ఉంటాడు. అతనినే జీవుడు అంటారు.

ఈ విధమైన జగత్తును సృష్టించిన నీవు, వాయుదేవుడు మేఘాల గుంపులను చెదరగొట్టినట్లుగా, భూతాల సముదాయాలను భూతాల సముదాయాలతోనే కదలాడిపోయే విధంగా చేస్తూ ఉంటావు. ఆ విధంగా పౌరుషం ప్రకాశించగా

(గాలి ఒక భూతం. అది పొగ, కాంతి, నీరు, గాలి అనే వాని సముదాయమైన మేఘాన్ని దూరంగా పోయేటట్లు చేస్తున్నది. ఈ విధంగా భూతాల సముదాయాలే భూతాల సముదాయాలను కదలిస్తూ ఉంటాయి. అయితే ఆ అన్నింటికి మూలపురుషుడు పరమాత్మ.)

ప్రభూ! నీవు ఆయా పనులకోసం ఏర్పడిన వేరువేరు రూపాలు కలవాడవు, గొప్పగా వెలుగొందుతూ ఉన్న దీప్తి కల వాడవూ, అతితీవ్రమైన వేగంగలవాడవూ అయి విసృతంగా వ్యాపించి ఉన్న భుజాల అతిశయమైన మహిమతో ఈ విశ్వాన్నంతా ఉపసంహరిస్తావు. ఇదంతా నీ సంకల్ప మహిమ.

ఆ సంహారకార్యం ఏ విధమైనది అంటే, ఈ సృష్టి అంతా ఇప్పుడిది చేయదగినపని అనే విచారం విషయంలో ఒడలు తెలియనిదవుతుంది. శబ్దం మొదలైన విషయాల అనుభవం మీదకు ఎగబ్రాకుతూ ఉంటుంది. అత్యధికమైన శక్తి గల లోభం కలది అవుతుంది. అటువంటి సృష్టిని నీవు పూనికతో లోపలికి తీసుకుంటావు.

పద్మనయనా! పుణ్యాత్మా! చాలా ఆకలితో కడుపు కాలిపోతూ ఉన్న మహాసర్పం తననోటి దగ్గరకు వచ్చిన ఎలుకను తినే విధంగా నీవు ఏమరుపాటులేని వాడవై ఈ సృష్టినంతా లోపలికి తీసుకుంటావు.

ఆది శేషతల్పం మీద శయనించే స్వామీ! భక్తులకు కల్పవృక్షం అయినవాడా! మాకు గురువైన బ్రహ్మదేవుడు, ఆ సుప్రసిద్ధులైన మనువులూ, తమ బుద్ధిలో ఏ మాత్రమూ సంశయాలు లేకుండా నీ పాదపద్మాలను మనస్సులో నిల్పుకొని సేవిస్తూ ఉంటారు. అటువంటి నీ పాదాలను విస్మరిస్తే నీ వలన అవమానం కలుగుతుంది అనే గొప్పవేదనను పొందే సజ్జనుడు నీ పాదపద్మాలను విడువగలడా?

కాబట్టి నాకూ వివేక శీలం కల పండితులసముదాయానికీ పుట్టే అన్ని సంశయాలనూ తొలగించటానికీ, రక్షించటానికీ, అభివృద్ధి కలిగించటానికీ సరి అయిన దిక్కు నీవే అని కొనియాడినట్టి ఈ స్తోత్రాన్ని ప్రీతితో రుద్రుడు ప్రచేతసులకు తెలియజేశాడు.

పరమేశ్వరుడు ప్రచేతసులకు ఈ స్తోత్రాన్ని ప్రేమతో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా! ఇది 'యోగాదేశం' అనే పేరుగల స్తోత్రం. పెక్కుమారులు దీనిని జపించి మనస్సులో నిలుపుకోవాలి. చెదరని చిత్తంతో మీరందరూ మన్ననతో నమ్మకం కలిగి మీమీ ధర్మాలు ఆచరిస్తూ, భగవంతునియందు సమర్పించిన భావనలు కలవారై దీనిని జపించండి. సర్వభూతాల యందూ ఉన్నవాడు, తనయందే తాను రమించేవాడూ అయిన సర్వస్వామిని నుతిస్తూ ధ్యానంతో పూజించండి. పూర్వం ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టి చేయగోరినవాడై మాకూ, భృగువు మొదలైన మహర్షులకూ తెలియజేశాడు. మేమూ, భృగువు మొదలైనవారూ బ్రహ్మపేరణ పొంది ఈ స్తోత్రంతో సమస్తమైన తమోగుణాలు నశించిపోయినవారమై పెక్కుతీరులైన ప్రజల సృష్టిని చేశాము. చెదరని బుద్ధితో, వాసుదేవుడే పరమగతి అనే భావనతో ఈ స్తోత్రాన్ని జపించేవాడు శీఘ్రంగా శ్రేయస్సు పొందుతాడు. ఆ శ్రీహరికి సంబంధించిన జ్ఞానం అనే తెప్పతో కష్టాలకడలి (సముద్రం) అయిన సంసారాన్ని చాలా తేలికగా దాటుకుంటాడు. నేను ఉపదేశించిన ఈ స్తోత్రాన్ని పఠిస్తూ, సులభంగా ఆరాధించరాని శ్రీహరిని పూజించేవాడు, నేను చెప్పిన గానంతో సంతోషం పొందేవాడూ, ఒకే ఒక్క ఆశ్రయం అయినవాడూ అయిన శ్రీమన్నారాయణుని వలన కోరికలన్నింటినీ తీర్చుకొన్న వాడవుతాడు. వేకువజామున నిద్రనుండి లేచి చేతులు జోడించి, శ్రద్ధకలవాడై ఈ శుభమైన శ్రేష్ఠమైన స్తోత్రాన్ని వినేవాడూ, ఇతరులకు వినిపించేవాడూ కర్మబంధాల నుండి విడుదల పొందుతాడు. అని ఇంకా ఇలా చెప్పాడు.

రాజకుమారులారా! సర్వదేహధారులకును స్వామీ, పరమపురుషుడూ అయిన ఈశ్వరుని మంచి స్తోత్రాన్ని మీకు ఆదరంతో చెప్పాను. మీరు కూడా గొప్ప భక్తితో జపం చేయండి.

మీరు కూడా భావనలను చెదరకుండా నిగ్రహించుకొని జపం చేస్తూ ఒక దీక్షతో గొప్ప తపస్సును చేసినట్లైతే మీరు కోరిన మహాఫలం లభిస్తుంది.

ఈ విధంగా ఉపదేశంచేసి సదాశివుడు వారలు భక్తితో పూజలు చేయగా కైకొని వారు చూస్తూ ఉండగా అదృశ్యుడయ్యాడు.

సదాశివుడు అదృశ్యం అయిపోయిన తరువాత ఆ ప్రచేతసులు ఆ విష్ణుస్తోత్రాన్ని జపిస్తూ పదివేలయేండ్లు వారించటానికి అలవికాని నీటిలో నిలిచి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

No comments:

Post a Comment

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అ...