Sunday, March 1, 2026

The visit of the Sanakadi Rishis to King Prithu - పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట

ప్రజల పొగడ్తలందిన ఓ మహారాజా! అప్పుడు ఆకాశమార్గం నుండి నెమ్మదిగా ఉదయసూర్యప్రకాశతేజులు, మునిశ్రేష్ఠులు, శేముషీ ధురంధరులు, బుద్ధిమంతులు అయిన సనకాదిమునులు వచ్చారు.

ఈ విధంగా పుణ్యాత్ములు అతిథుల రూపంలో రాగా గృహస్థుని ప్రాణాలు పైకి లేస్తాయి. వారికి ఎదురేగి నమస్కరించడం చేత మళ్లీ లేచిన ప్రాణాలు యథాస్థానం చేరుకుంటాయంటూ

అలా వినిపించే మాటలప్రకారం పైకిపోయే ప్రాణాలను తిరిగి పొందగోరేవానివలె పృథుచక్రవర్తి తన అనుచరులతోను, ఋత్వికగణంతోను సదస్యులతోను గూడినవాడై అంతలో

జీవుడు గంధాది గుణాలనుద్దేశించి చేయునట్లే భక్తితో రాజు వారికి స్వాగతసన్నాహం చేయగోరి ఉత్సాహంతో భక్తితో ఎదురుకోలు నడిపాడు.

అత్యంత గౌరవంతో మునిజనుల మనస్సులచే ఆకర్షింపబడిన ఆరాజు సభ్యతతో వారికిష్టుడై వినయ వినమితమైన కంఠంగలవాడై ఆ పరమయోగీశ్వరుల్ని ఆహ్వానించి

పృథుమహారాజు వారిని ఉచితాసనాలపై కూర్చుండబెట్టి వారికి వైదికోక్తంగా పూజలుచేసి వారి పాదప్రక్షాళన జలాలు శిరస్సుపై జల్లుకొన్నాడు. బంగారు సింహాసనాలపై కూర్చొని వేదికమీది అగ్నులవలె వెలిగే బ్రహ్మమానస పుత్రులైన, శివునికి అగ్రజన్ములైన సనకాదిమునులను చూసి మిక్కిలి శ్రద్ధాసక్తులతో పరమసంతుష్టుడై ఇలా అన్నాడు.

"ఓ శుభవర్తనులార! నేను చేసిన పూర్వపుణ్యకర్మచే ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను".

(సనక, సనందన, సనాతన, సనత్కుమారులు - ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వారెప్పుడూ ఐదేండ్లప్రాయంలోనే ఉంటారు. విష్ణుభక్తులు. వెకుంఠంలో నివసిస్తుంటారు. విష్ణువు అంతరంగ అభిలాష ననుసరించి ప్రవర్తించేవారు. బాలభావంతో ఉంటారు గనుక అవధూత సంప్రదాయం వీరినుండే పుట్టింది. శివునికి కూడా వారు అగ్రజులుగా ఉన్నారు.)

మరియు ఈ లోకంలో బ్రాహ్మణులు, శివుడు, విష్ణుదేవుడు, ఆయన భక్తులు ఎవరిపట్ల ప్రసన్నమవుతారో వారికి ఈ లోకంలో, స్వర్గంలో సాధ్యం కాని పనులంటూ ఉండవు.

పుణ్యాత్ములార! ప్రపంచాన్ని దర్శిస్తూ తిరిగే మిమ్మల్ని లోకం చూడజాలదు. సమస్తలోకాన్ని చూడగలిగిన ఆత్మను దృశ్యం చూడలేనట్లే వారు చూడలేక పోతున్నారు. మహాత్ములయిన మిమ్మల్ని దర్శించడంతో నేను ధన్యుడనయ్యాను. అదీగాక

ఎవని ఇంటికి పూజనీయులు, మహానుభావులు అయిన వ్యక్తులు వచ్చి ఆ ఇంటిలోని వారి సేవలను అంగీకరిస్తారో, ఆ ఇంటిలో యథేచ్చగా సంచరిస్తారో, అల్పమైన ఆహారాన్నీ జలాన్నీ స్వీకరిస్తారో ఆ ఇంటియజమాని పేదవాడైనా లోకంలో అతడే ధన్యాత్ముడు. మీవంటి పెద్దల రాకచే నాకు విశేషశుభాలు లభిస్తాయి అన్నాడు పృథువు.

అదీగాక ఓ శ్రేష్ఠమైన ధిషణగలవారలారా! ఎవని ఇల్లు విష్ణువును మనస్సులో గలవారై విచ్చేసిన భాగవతుల పాదజలాలతో తడువదో ఆ యజమాని మహాధనవంతుడైనప్పటికీ అతని ఇల్లు పాములు చుట్టుకొన్న చెట్టును పోలి ఉంటుందని విజ్ఞులు చెపుతారు.

అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, అతి పవిత్రులైన మునులారా! లోకైకకుశలులారా! మీరు బాల్యంనుండి మోక్షాన్ని కాంక్షించి ఆదరం, శ్రద్ధ మొదలైన సద్గుణాలుగలవారు. ధైర్యం, మోక్షబుద్ధి మీకు అతిసహజాలు. మీ రాకకు స్వాగతం. నిరంతరం వారింపరాని సంసారసాగరంలో మునిగి మేము చేసిన పనులలో మునిగి తేలి ఇంద్రియాల వాంఛలే పురుషార్థాలని భావించే మాకు కుశలం కలదా?

(సంసారలంపటులైనవారు విషయసుఖవాంఛాభోగులవుతారు. ముముక్షువుల దర్శనం, సజ్జన సాంగత్యం వారిని ఆ దారి నుండి మళ్లిస్తుంది. ఇక్కడ సనకసనందనుల ఆగమనం పృథువునకు శుభసూచకం.)

మీరు ఆత్మానందం పొందినవారు కాన మీపట్ల యోగక్షేమాల ప్రశ్న ఉదయించదు. నేను మిక్కిలి నమ్మకంతో బాధాతప్తులకు స్నేహితులైన మిమ్ము సంసారంలో నాకు త్వరగా ఏ విధంగా క్షేమం కలుగుతుందని అడుగుతున్నాను. ఆత్మజ్ఞానంగల మీవంటివారు ఈ లోకంలో తిరిగే భగవంతులుగా సిద్ధరూపంలో ఉంటారు అన్నాడు పృథువు. అతని మాటలలోని అర్థగౌరవం, క్షేమప్రసక్తి ధర్మసమ్మత మితభాషణం, వినసొంపైన మాటలు విని ఆనందించిన హృదయంతో నవ్వుమోముతో సనత్కుమారు డిలా అన్నాడు.

ఓ రాజశ్రేష్ఠ! సమస్తప్రాణుల మంచికోరే ధర్మబుద్ధి, ఐశ్వర్యమూ గల నీవంటి మంచివారినుండి వెలువడే లోకోత్తరమైన ప్రశ్నలు పరంపరగా వస్తున్నాయి. సచ్చరిత్రలనగా ఇట్టివే కదా!

ఓ రాజా! భూమిపై సత్పురుషులతో చెలిమి ఇరువురికీ సమ్మతమవుతుంది. వారు చేసే సరసమైన ప్రశ్నల ధోరణి సమస్తలోకాలకు సుఖదాయక మవుతుంది.

అని ప్రశంసించి మోక్షసాధనోపాయాన్ని తెలుసుకోగోరిన పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు.

ఓ రాజా! విష్ణుని పాదపద్మాలపై ధ్యానంచేత దోషాలను తొలగించుకొనే వైరాగ్యబుద్ధి లోకోత్తరుడవైన నీలోకనిపిస్తోంది. నీవు నిజంగా మహనీయుడవు. చక్కని ఆత్మవిమర్శ, శాస్త్రచర్చ జనులకు క్షేమకరం. ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమైన వస్తువులపట్ల అనురాగం పనికిరాదు. ఆత్మయందు ఆసక్తి ఉండాలి. జనక్షేమానికి ఇవే కారణాలు.

నీవు చేయవలసిన పనియందు ఆసక్తి భగవద్దర్మాచరణ, విశేషాలు తెలుసుకోవాలనే కోరిక, ఆత్మయోగస్థితిని చెందే ప్రయత్నంలో దీక్ష యోగులను ఉపాసించుట, పుణ్యకర్మలు ఆచరించడం ప్రధానం. వారియందలి దైవాన్నిగూర్చి వింటున్నానని తెలుసుకోవాలి. అట్టి నారాయణుని గాథల్ని నోరార కీర్తించాలి. ధనంతోను, ఇంద్రియాలతోను చెలగాటమాడే వారితో స్నేహం విసర్జించాలి. భగవంతుని గుణాలను కీర్తించడం అమృతపానం వంటిది. దానిని అభ్యసించి ఇతరపదార్దాలపై వైరాగ్య మభ్యసించాలి. అంతర్యామిపై మనసు నిలపాలి. ఏకాంత ప్రదేశాలపై అభిలాషపడాలి. అహింస, శమదమాదిగుణాలు ప్రధానంగా పాటించి జీవించాలి. తనకేది మేలో తెలిసినపుడు దానిని అవలంబించాలి. భగవంతుని కథలను మరల మరల స్మరించుకోవాలి. యమనియమాలు అభ్యసించాలి. యోగక్షేమ పరమైన అనవసరకార్యాలను మానుకోవాలి. చల్లదనం, వేడి మొదలైన ద్వంద్వాలు సహించే స్వభావం అలవరచుకోవాలి. భక్తులతో వారి చెవికింపైన భగవద్గుణాల ప్రసక్తి తేవాలి. తద్వారా భక్తియోగాలు. దానివలన ఆత్మకాని వస్తువులపట్ల సంగం తొలగుతుంది. కార్యకారణరూపంలో ఉన్నది అంతర్యామియైన నిర్గుణ బ్రహ్మమే. దానిలో నిశ్చలత సాధన వలన కలుగుతుంది. అది కలిగిననాడు నిజమైన గురువు లభించి అనుగ్రహప్రసారం జరుగుతుంది. ఈషణత్రయం తొలగిపోతుంది. అప్పుడు సాధకుడు ప్రకృతిని చేరక తాను వేరుగా నిలుస్తాడు. అలాంటి అనుభవమే జ్ఞానం. జ్ఞానంతో వైరాగ్యం వేగమై సాధన పూర్తికాగలదు.

(1) ఈషణత్రయం -దారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్య, ధనం, పుత్రులపైగల కోరిక ఈషణత్రయం. (ఏషణత్రయం - సరైన వ్యాకరణ సమ్మతమైన రూపం. కాని, వ్యవహారంలో ఈషణత్రయమనే రూఢికెక్కింది. )

2) యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి - ఇవి అష్టాంగయోగం.)

ఇలా సాధన చేసిన వారికి భక్తియోగం కుదురుతుంది. అందులోంచి యోగాగ్నిగా జ్ఞానం పుడుతుంది. జీవునితో ముడిపడిన ఆత్మముడి దగ్ధమవుతుంది. ఆత్మ భాసిస్తుంది. అరణిని కూడా అగ్ని దహించినట్లు జ్ఞానాగ్నిలో హృదయగ్రంథి దగ్ధమవుతుంది. చిత్తవృత్తులు దహించబడతాయి. గుణాలు మాయమై, 'తాను' మిగులుతుంది. లోపల, వెలుపల అనే తెర తొలగిపోతుంది. వెలుపలి కుండలలోను, లోపలి సుఖదుఃఖాలలోను తానే నిండియున్నాడని తెలుస్తుంది. దానితో దేహంలో దేహబుద్ధి నశిస్తుంది. దేహం తనకు ఆధారం అనే భ్రమ తొలగిపోతుంది.

(దేహం ఆధారమనే భ్రమ తొలగిపోతే, మట్టియందు కల్పింపబడిన కుండ అనేది మట్టికంటె వేరుగా ఉందనే భ్రమ తొలగిపోతుంది. మట్టియే కుండకు ఆధారమని తెలుస్తుంది. ఈ తెలివియే ఉపాధివినాశం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ - గీత.)

ఆత్మ జీవుని అంతర్గతంగా మరుగునబడిపోగా ఏది కంటికి కనబడుతున్నదో అదే సత్యమనే భ్రమను కల్పించే భౌతిక దృష్టియే జీవులను మోసగిస్తూ ఎల్లప్పుడూ ఆడే ఆట! ఈ ఆట తత్త్వం తెలుసుకోవాలి. కనబడేదంతా సత్యం కాదు. తత్త్వం లోపల దాగి ఉన్నది. దాన్ని పట్టుకోవాలి. మానవుడు నిద్రలో కనిన కలలలో తాను రాజైనట్లు, రాజ్యాలేలినట్లు, సిరిసంపదలతో తూగినట్లు ఆనందాలు అనుభవిస్తాడు. అప్పుడు రాజు, భృత్యుడు అనే గుణాలు తెలుస్తాయి. కలలు కరిగిపోయి తెలివిగలిగి లేచినపుడు ఆ తేడాలు లేనట్లుగా మిథ్యగా తోస్తాయి. అట్లే వెలుపల, బయట అనే ఆంతర్యాలు జ్ఞానదశలో కన్పించవు.

చూచువాడు తాను. చూడబడేది తనకంటె వేరగు దృశ్యం, అహంకారం ఈ రెంటికి సంబంధించిన హేతువు. అది అంతఃకరణంలో జాగ్రత్‌ స్వప్న దశల్లో ఈ భేదాన్ని చూస్తుంది. సుషుప్తిలో అంతఃకరణం ఉండదు. అందువల్ల జలమో, అద్దమో లేనప్పుడు బింబ ప్రతిబింబాలకు భేదం తెలియదు. సుషుప్తిలో దృశ్యభేదం లేదు. అంతఃకరణం లేకపోవడమే ఇందుకు కారణం.

విషయ సుఖాలతో ఆకర్షించబడిన ఇంద్రియాలలో మనస్సు తగులుకొని విచారణాశక్తిని కోల్పోతుంది. నీటిమడుగులో ఉండే రెల్లు, దర్భలు, అందులో నీటిని పీల్చివేసినట్లే అటువంటి మనస్సు దేహమందలి విచారశక్తిని హరిస్తుంది. దానిచే లోపలి భావనా సామర్ధ్యము తరిగిపోతుంది. ముందువెనుకలను అనుసంధానంచేసే స్మరణశక్తి నశిస్తుంది. అంతట తనలో తనకు మెలకువ ఉండదు. అంతట యథార్థజ్ఞానం నశిస్తుంది. దానినే ఆత్మ మరుగునపడిపోతుందని పెద్దలు అంటారు.

బాహ్యాభ్యంతర తత్త్వసమన్వయం పొంది అద్వయమైన జ్ఞానంలో జీవుడు నిమగ్నమైనప్పుడు సమస్త జగత్తూ యోగియైన జ్ఞానికీ ప్రియమే అవుతుంది. అనే వేదవాక్యాన్నిబట్టి విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగు పరుస్తుంది. ఆత్మజ్ఞానం మరుగు కావడంవల్ల కలిగే స్వార్థనాశనాన్ని మించిన ఆత్మనాశం మరొకటి లేదు. అది ఎలా అంటే సమస్తసంపదలు నశించడానికి స్థైర్యాన్ని కల్గించే అర్థకామాలచింతచే ప్రత్యక్ష పరోక్ష రూపజ్ఞానం నశిస్తుంది. తనను మరుగు పరచడం కంటె గొప్పదగు సమస్త సంపదలనాశం మరొకటి లేదు. అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ పుణ్యాత్మా! ఈ సంసారాన్ని దాటడానికి నిశ్చయించుకున్నవాడు ధర్మార్థకామమోక్షాలకు విఘాతం కలిగించే అంశంతో పొత్తుపెట్టుకోరాదు. అలాంటి ధర్మార్ధ కామమోక్షాలలో మొదటి మూడు యముని కోపానికి గురి కావడంవల్ల మోక్షమార్గమే ముఖ్యప్రయోజనకారియని పెద్దలు పేర్కొంటారు. భూమిపై గుణాల కలయికవలన జన్మించిన బ్రహ్మమొదలైన వారికి గూడ కాలగతిచే వినాశం తప్పదు. క్షేమం కలుగదు. విను.

(మోక్షమార్గమే ఉత్తమ లక్ష్యమని తెలిసినవారు చెబుతారు. బ్రహ్మాదులు కూడా త్రిగుణాల కలయికతో పుట్టినవారే. త్రివర్గాలలో ఏది క్షేమాన్ని కూర్చలేదు. ధర్మార్థకామమోక్షాలకు భంగం కలిగించే పనులు చేయరాదు. అర్ధకామాలకోసం ధర్మాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందడు.)

మోక్షమే పురుషార్థాలలో శ్రేష్ఠమైనదని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా! దేహం, ఇంద్రియ ప్రాణాలు, బుద్ధి, అహంకారం అనే వాటితో ఏర్పడిన చరాచర ప్రాణుల హృదయాలలో నిండి కంటికి కనిపించే రూపంగల భగవంతుడు మన లోపల నివసిస్తూ వెలుగుతూ ఉంటాడు. విష్ణుని ఈ సత్యరూపం తెలుసుకొమ్మని మరలా ఇలా అన్నాడు.

రాజేంద్రా! ఈ సమస్త విశ్వమూ ఆ పరమేశ్వరునియందు లీనాలీనభావంతో, మాయాప్రభావంతో, వివేకాన్ని నిరోధించే సర్పమాలాభ్రాంతితో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

దుష్టులను శిక్షించి, ప్రజలను రక్షించే ఓ రాజా! అంతర్యామిత్వం, నిత్యముక్తత్వం, తత్త్వజ్ఞత, సర్వవ్యాపిత్వం అనే లక్షణాలతో కూడినవాడై విష్ణుమూర్తి ఉన్నాడు. ప్రకృతి కర్మలను, వాటిఫలాలను తిరస్కరించే ఉత్తమప్రవర్తన, దయ, సద్గుణాలు కలిగి ఉన్నాడు. అట్టి భగవంతుని మనస్సులో స్మరించు.

రాజా! సజ్జనులు భగవానుని పాదపద్మాలపై భక్తిగలిగి ఆ భక్తిస్మరణ ప్రభావంచే కర్మలతో ముడివడిన అహంకారమనే హృదయ గ్రంథిని నశింపజేసుకొంటారు. విషయ చింతలేనివారు, ఇంద్రియాలనరికట్టినవారు నగు యతులకు చేరరాని ఆది పురుషుడను పరమేశ్వరుణ్ణి శరణుసొచ్చి ఆ దేవుని పాదపద్మాలు భక్తితో సేవించు.

అరిషడ్వర్గం అనే గొప్పతరంగాలు అనే మొసళ్ల సముదాయం తిరుగుతుండటంవల్ల కల్లోలంగా ఉన్న సముద్రం వంటిది సంసారం. దానిని దాటడానికి హరినామ సంస్మరణం అనే నావ లేకుండా సాధ్యం కాదు. దానిని ఆశ్రయించడం మాని పాపాలు పోగొట్టుకోవడానికై తీవ్రయోగాభ్యాసాదులు చేసేవారికి ఈ మహాసాగరాన్ని తరించడం అసంభవం.

(కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం - అనే ఆరు దుర్గుణాలను అరిష
డ్వర్గ మంటారు.)

ఓ రాజేంద్రా! నీవు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీమహావిష్టు పాదపద్మాలనే నావను సమకూర్చుకొని దుర్భరమైన బాధలకు నెలవై భయంకరమై దాటరాని సంసారసముద్రాన్ని ఉత్సాహంతో దాటు.

ఇలా బ్రహ్మజ్ఞుడైన సనత్కుమారుడు మహాతత్త్వవేత్తయైన పృథువునకు బ్రహ్మతత్త్వాన్ని గూర్చి బోధించాడు. ఆ రాజు ఆ తత్త్వం గ్రహించాడు.

పృథుచక్రవర్తి సనత్కుమారుని స్తుతించి ఇలా అన్నాడు. "నేను గతజన్మలో నిజంగా నారాయణుని దివ్యానుగ్రహాన్ని పొందినమాట వాస్తవం. ఆయన దీనుల్ని రక్షించే మహానుభావుడుకదా.)

ఆ విధంగా అనుగ్రహం పొందడానికి దయాస్వభావులు, పుణ్యాత్ములు, భాగవతశ్రేష్ఠులు, ఉత్తములు అయిన మీరు విచ్చేశారు.

సాటిలేని గుణసాంద్రా! మునివంశచంద్రా! నిరంతరం నాలో ఉద్భవించిన సర్వసంపదలు రాజ్యంతో, దేహంతో సహా మంచి బ్రాహ్మణులు అనుగ్రహించినవే. పరివారం, ధనాగారం, సైన్యబలం, భూమి, రాజ్యాధికారం, స్పగృహం, స్వీయవైభవాలు, పత్ని, నా ప్రాణంకూడా నావి అని ధైర్యంగా అనుకోలేను. రాజమర్యాదలైన తాంబూలాదులు ఆహారతృప్తి మొదలైన ఉపచారాలు రాజుకు సేవకులు ఏవిధంగా సమర్పిస్తారో అలా నేను భక్తిభావంతో విప్రులకు సమర్పిస్తున్నాను. మరి అలాంటి నేను మీకు ఎలా ఉపచారాలు, మర్యాదలు చేయగలను.

(సర్వం రాజ్యాదికం మదీయం సాధూచ్చిష్టం సత్‌ మహ్యం ప్రసాదరూపేణ దత్తం. అతస్తత్రమమ స్వత్వాభావాత్‌ గురుదక్షిణార్థం కిం దదే - శ్రీధరీయం (4-22-23).

నివేదనం తదీయన్యైవ తస్మై సమర్పణం - శ్రీధరీయ వ్యాఖ్య (4-22-44)

రాజు యాచకుడికి చేసిన దానం వేరు. సేవకుడు ప్రభువుకు చేసిన సేవవలె పృథువు దానంచేశాడు. దానస్వీకర్త ఆదినారాయణుడని తెలిసి, గౌరవంగా చేసేదే దానం. దానగుణమాహాత్యాన్ని పృథువు ఇందులో వివరంగా చెప్పాడు.)

రాజ్యమంతా బ్రాహ్మణుల అధీనం ఎలా అయిందంటారా? సేవలను నడిపించడం, రాజ్యపాలన, దండనాధికారం, మూడులోకాలకు ఆధిపత్యం, వేదశాస్త్రాలు తెలిసినవానికే సాధ్యం. అవి తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల వారి సొత్తుగా సమస్తరాజ్యసంపద భావించబడటంవల్ల లోకానికి మేలు చేకూరుతుంది. రాజ్యంలో అన్నవస్త్రాదులు సద్బ్రాహ్మణుల సొంతవస్తువులు. క్షత్రియాదులు అన్నం మాత్రమే సొంతంగా భావించాలి. మిగతా విషయాలలో వారికి స్వాతంత్య్రం లేదు. కాబట్టి మీకు గురుదక్షిణగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. మీరు సర్వస్వతంత్రులు. ఆధ్యాత్మవిద్యాగురువులు, వేదాంతం తెలిసినవారు. భగవద్భక్తి నుపదేశించేవారు. మీవంటివారికి దక్షిణ ఇవ్వాలనుకొన్నవాడు హాస్యాస్పదుడవుతాడు. నమస్కారం మాత్రమే సమర్పించుకోగలను. మీకు ప్రతిఫలంగా ఈయగలిగినది ఏమీ లేదు. ఇలా మాట్లాడుతున్న ఆదిరాజయిన పృథుచక్రవర్తిచే పూజితులై సనకాదులు అతని స్వభావాన్ని గూర్చి ప్రశంసగా మాట్లాడుకొన్నారు. ఆత్మయోగంలో నిష్ఠగల ఆ సనకాదులు ఆ సదస్యుల ముందే ఆకాశగమనంలో వెళ్లిపోయారు.

పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట

No comments:

Post a Comment

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అ...