ఒక రాజుకూతురు చిన్ననాటినుండి కడుపు శోకము కలిగినదై అయిదుగురు బిడ్డలను పోగొట్టుకొనెను. తరువాత ఆ దుఃఖము తాను భరించలేక అడవిలోకిపోయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించు చుండగా పార్వతీ పరమేశ్వరులామెకు ప్రత్యక్షమై యేమి యిట్లు విచారించుచు కూర్చున్నావని యామెనడిగిరి. అంత నామె "నాయనా! పుట్టిచచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను,”నని చెప్పగా పార్వతీ పరమేశ్వరులు - "నీవు క్రిందటి జన్మమున పూర్ణాదివారము నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. ఆ కారణమున నీ దుఃఖము సంప్రాప్తమైనది. ఇప్పుడు తిరిగి నీవా నోముపట్టి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని యుద్యాపనము చేసుకొన్న యెడల నీకీ దుఃఖము బోవునని చెప్పి అంతర్జానము నొందిరి. ఆ రాజకుమార్తెయు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము నోముపట్టి ఉద్యాపనము చేసుకొని అంతటి నుండి కడుపుశోకము లేనిదయ్యెను.
ఉద్యాపనము: కథ జెప్పి అక్షంతలు వేసికొని ప్రతి ఆదివారము ఒంటిపూట భోజనముచేసి ఒక ముత్తయిదువునకు తలంటి నీళ్ళుపోసి దక్షిణ తాంబూలము యిచ్చి అయిదు మానికల బియ్యము పూర్ణపు ఉండ్రములువండి వాయన మియ్యవలెను.
No comments:
Post a Comment