Saturday, August 15, 2026

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు

మారుతి మాటలు విని అంగదుడు:

సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్నులకు ఉచితంకాదేమో! మన హనుమ రాక్షస సంహారంచేసే వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రా
లక్ష్మణుల ముందుంచి న పరాక్రమం చాటుకుందాం, అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు.

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా 
నం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్దూలుడు మనలను ఏ దృష్టితో చూస్తాడో! అది తన వంశ ప్రతిష్ఠకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు.

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో అయన మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది.

అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే 
న కర్తవ్యం. అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు.

మధువనం

Aalochanalu - ఆలోచనలు

రామాయణం సుందరకాండ 59వ సర్గ - ఆలోచనలు

హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు:

రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తి భావంతో వుంది. ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ గలడు, దహింపజెయ్యనూ గలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపో
గ్ని ఎంత!

సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి.

లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు.

ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్త్రాలు నన్నేమీ చెయ్యలేవు. మరి మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని.

మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది.

అందాకా ఎందుకు! 
న యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస, నీలులు కదిలితే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మ వర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి, నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు.

అంగదుడు

Anveshana Gaadha - అన్వేషణ గాథ

రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ

మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు.

అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ:

నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు.

ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది.

సీతాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు.

మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం వేయి ముక్కలయింది.

అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూత కోటిని నాశనం చే
స్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలో చేర్చాడు.

ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు.

నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి:

ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి:

అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృతాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను.

ఆ కామరూపిణి సురస: ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం కాదు, అంది.

నేను పది ఆమడలు పెరిగాను.

సురస అంతకంటె పెద్ద నోరు తెరిచింది.

ఉత్తర క్షణంలో నేను అంగుష్ఠ దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత:

వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ సంకల్పం ఫలిస్తుంది. సీతా రాములకు సమాగమం కలిగించు, అంది.

గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను.

దక్షిణముఖంగా సాగుతున్నాను,

అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఎదో శక్తి,

క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను. 

ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది.

ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది.

ఆ రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు:

భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు సరిహద్దులో ప్రవేశించాను.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

లంకలో దిగాను.

దిగుతూన్న సమయంలో-

ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పాడిచాను.

నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్ఠానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది.

చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా వున్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు పెట్టాను.

ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్తృ చింతాపరాయణయై వున్న సీతను చూశాను.

ఆమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం.

రక్త మాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది.

ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలి పెట్టె దశలో వుండగా చూశాను.

అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా వస్తున్నట్లు వినిపించింది.

నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను.

రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు.

సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది.

గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు.

ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు.

సీత: రాక్షసాధమా! అమిత తేజశ్శాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే!

నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి వున్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు. అని క్రోధంతో మాట్లాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హా హా రవాలు చేశారు.

వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి:

నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ అంతఃపురంలో.

వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు.

ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ చేర బిలిచి:

ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత.

ఇప్పుడే నాకు కల వచ్చింది.

ఈమె భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే అందరూ ఆమె పాదాలమీద పడ్డారు.

మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, అంది సీత.

అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు.

అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను.

నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ:

ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమయింది? అని అడిగింది.

అప్పుడు నేను:

అమ్మా! బలశాలియైన వానరేశ్వరుడు సుగ్రీవుడు. నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. 

జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! అయనకు ఆనవాలుగా ఏమయినా యిస్తావా, అని అడిగాను.

ఆవిడ ఈ మణి యిచ్చింది.

అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను.

అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. నేను ఓదార్చాను.

ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను.

ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులయిన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం అందుకుని వారిని యమపురికి పంపాను, హతశేషులు వార్తాహరులయ్యారు.

నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను,

రావణుడు జంబుమాలిని పంపించాడు.

వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు.

వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను.

అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు.

వారిని కూడా అంతకు ముందు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు.

వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు, ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి కొనిపోయారు.

ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను.

మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకు రమ్మని, ఇంకా ఏమన్నాడంటే;

రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి అయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు.

రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు, సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దశ దిశలకూ పంపాడు, నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను.

వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం.

ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు,

ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు.

రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు, నన్ను కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులుత్రిప్పుతూంటే నగరం అంతా చూసాను. చూడడం అయింది.

శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి, అంతలో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను.

అప్పుడు ఆకాశచారులమాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా వుందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ.

ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు.

ఆలోచనలు

Mitrasamaagamam - మిత్రసమాగమం

రామాయణం సుందరకాండ 56, 57 సర్గలు - మిత్రసమాగమం

ఆకాశ సముద్రంలో-
చంద్రుడే కలువ
సూర్యుడు నీటి కోడి.
పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు.
పునర్వసు మహా మీనం.
అంగారకుడు మొసలి.
స్వాతి నక్షత్రం హంసపథం.
ఐరావతం ద్వీపం.
మేఘాలే శైవలిని.
చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు.
పద్మాలు, నాగ, యక్ష, గంధర్వులు.

అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు, హనుమంతుడు.

సూర్య, చంద్ర, తారామండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు.

ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. 
బ్బుల మాటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె వున్నాడు.

గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు.

దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో అనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్ధలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని. 

ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేర బిలిచి:

నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.

పర
 సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.

హనుమంతుడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు.

అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలూ, పళ్ళూ కానుక లర్పించారు.

వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే:

ఆలోచించాడు; హనుమంతుడు. 

"దృష్టాసీతా" చూశాను సీతను, అని- 

రాక్షసస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, రా విరహ శోకంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు.

చూశాను అనేమాట అమృత ప్రాయంగా విని వారందరూ సింహ నాదాలతో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ పైకెత్తుతూ. నేలమీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికి ఎగురుతున్నారు. 

అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు మనం రామ దర్శనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనియాలు, నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు, అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు.

ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.

అన్వేషణ గాథ

Aascharyam - ఆశ్చర్యం

రామాయణం సుందరకాండ 55వ సర్గ - ఆశ్చర్యం

క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
క్రుద్ధో హన్యా ద్గురూ నపి

క్రుద్ధః పరుషయా వాచా
నరః సాధూ నధిక్షిపేత్‌


లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు.

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని యింత అఘాయిత్యం చెయ్యడమా! కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు.

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి పనులు కోపిష్ఠి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి.

దుర్బుద్దుడనై, లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి ద్రోహం జరిగిపోయింది.

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను.

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను.

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను.

సీత మరణించిందని వినగానే రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా!

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుణ్ని, అని చింతించే, హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా:

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని దరిజేరలేదు.

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా!

అవసర
యితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన చారణులు:

ఓహో! హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో వున్నా, జానకీదేవి అచంచలంగా ఆశోకవనంలో యథాపూర్వం వున్నది.

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. అయినా ఒక్కమారు తన కంటితో అమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి:

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు.

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం, సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు 
నం చెప్పనవసరంలేదు, అని జానకీదేవి అనగా హనుమంతుడు:

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు సెలవమ్మా, అని బయలుదేరి సముద్రతీరాన వున్న అరిష్ట పర్వతం అధిరోహించాడు.

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె వున్నాయి. రాళ్ళమీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. అకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములయి వెదురువనాలు నిర్విరామంగా కూజిస్తున్నాయి. మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్పులా, మంచునిండిన గండశిలలు ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి.

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు.

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర, గంధర్వులు.

సింహాలతో గుహలు.

శార్దూలాల విహారాలు.

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, గగనవీధికి లేచాడు.

అ పాదతాడనానికి పర్వతం, ముక్కముక్క అయింది. పిడుగుపడి మోడువారి నట్లయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల జేశాయి.

ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు.

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు.

మిత్రసమాగమం

Lanka Dahanam - లంకా దహనం

రామాయణం సుందరకాండ 53, 54 సర్గలు - లంకా దహనం

ఆలోచించాడు హనుమంతుడు.

ఈ వనం విధ్వంసం చేశాను.

రాక్షసయోధులు కొందరు నేలకూలారు.

ఇంక ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది.

అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను, అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించి, మహాపార్శ్వ, వజ్రదంష్ట్ర, శుక, సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు, రశ్మికేతు, మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు.

విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు.

రావణభవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్లు గర్జించాడు.

ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేల కూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధసౌధాలవలె వున్నాయవి.

పసిపిల్లలకు పాలిస్తూన్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధులవెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాలమీది స్త్రీలు తమ బట్టల మంటలవేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు ప్రవహిస్తున్నాయి.

క్వచి త్కింశుక సంకాశాః
క్వచిత్‌ శాల్మలీ సన్నిభాః ।
క్వచిత్‌ కుంకుమ సంకాశాః
శిఖా వహ్నేశ్చ కాసిరే ॥

ఆ మంటలు

ఒకచోట నిండుగా విరిసిన మోదుగుపూలవలె, మరొకచోట బూరుగు పుష్పాలవలె, ఇంకొకచోట కుంకుమ కాంతితో వున్నాయి.

త్రిపుర దాహదృశ్యం గోచరించింది లంకాదహనవేళ, వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే అజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా వున్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది.

వీడు వానరుడు కాడు.

వజ్రపాణియో, త్రిన్రేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి వుండాలి. కాకుంటే సాక్షాత్తూ చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్టవతేజం అవతరించి వుండాలి అనుకున్నారు రాక్షసులు.

లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరంమీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు.

హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి.

ఆశ్చర్యం

Vibhishana - విభీషణుడు

రామాయణం సుందరకాండ 52వ సర్గ - విభీషణుడు

హనుమంతుని మాటలు విని రావణుని క్రోధం అంచులు దాటింది.

ఈ వానరునికి శిరశ్ఛేదం చేయండి, అన్నాడు.

అది విని విభీషణుడు:

రాక్షసేశ్వరా! ఆవేశాన్ని విడిచి క్షమా హృదయంతో ఈ విషయం పరిశీలించాలి. విచక్షణకల ప్రభువులు దూతకు శిర
శ్ఛేదం చెయ్యరు. అది రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది.

నువ్వు ధర్మవిదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరము లేదు. నీ అంతటి వాడే రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార సమర్ధుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలే కాని ఇలా శిక్షించరాదు;
అని చెపుతూంటే రావణుడు:

విభీషణా! పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం శిర
శ్ఛేదమే అన్నాడు.

లంకేశ్వరా! ధర్మార్థ యుక్తంగా చెపుతూన్న నా మాటను ప్రశాంత చిత్తంతో ఆలకించు. యుద్దాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువని నేనూ అంగీకరిస్తాను. వీడు మనకు చాలా నష్టం కలిగించి, ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు దూత.

కొరడాతో కొట్టడం.
బుర్ర గొరిగించడం.

కాలో, చెయ్యో విరిచేయడం - ఇవీ దూతకు విధించే శిక్షలు, అంతే తప్ప దూతను వధించినట్టు మనం వినలేదు, ఎప్పుడూ.

యుక్తా యుక్తా లెరిగి, వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే ఆవేశానికి లొంగితే ఏం కావాలి. నిగ్రహం వివేక లక్షణం. ధర్మనిర్ణయంలో నిన్ను మించినవారులేరు. శాస్త్ర జ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడవు.

నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది.

ఇంకొక్కమాట-

ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు.

విడు తిరిగి వెడితే తప్ప ఆ మానవ వానర ప్రభువులు లంకకు యుద్దానికి రాలేరు.

పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతులయిన అనుచరులు కోట్ల సంఖ్యలో వున్నారు. వారిలో కొందరుపోయి ఆ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి, అన్నాడు.

విన్నాడు రావణుడు.

దేశ కాల యుక్తంగా కనపడింది, విభీషణుని మాట.

నువ్వు చెప్పినట్లు దూతవధ నింద్యమే. వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా యిష్టమయినది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి, అని ఆజ్ఞాపించాడు.

అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాతగుడ్డలు తెచ్చి హనుమంతుని వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు అంటించారు.

లంకలోని ఆబాల గోపాలం హనుమంతుని చూడడానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు.

ఈ లంకలో రాత్రి తిరగడంవల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలుచేస్తారు, అని సంతోషించాడు.

శంఖ, భేరీ ధ్వానాలతో నగరమంతా హనుమంతుని త్రిప్పుతున్నారు.

"వీడు గూఢచారి" అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి.

ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు, మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసా అగ్నిహోత్రుని ప్రార్థించింది.

యద్యస్తి సతి శుశ్రూషా
యద్యస్తి చరితం తపః

యదివా స్త్యేక పత్నీత్వం
శీతో భవ హనూమతః


పతిశుశ్రూషలో, తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్నీ వ్రతఫలం, హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నామీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమయినా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమకాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే అగ్నిజ్వాలలు హనుమంతునికి మలయ పవనాలు కావాలి, అని అనుకుంటున్నది.

ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదలి సీతాదేవికి సంతోషం కలిగించాడు.

కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది.

వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది.

నిన్న సముద్రం దాటుతూంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు, వాడే అలా వచ్చినపుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా!

రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం - ఈ కారణాలచేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి, అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు.

దేహాన్ని సంకుచితం చేశాడు.

అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత మంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను నేలకూల్చాడు.

ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు.

అగ్ని శిఖలతో నిండిన లాంగూలంతో హనుమంతుడు ఆదిత్య మండలంలా కనిపిస్తున్నాడు.

లంకా దహనం

Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు. మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు...