సకల మహర్షులుగాంచి సూతుండిట్లనియె మునీశ్వరులారా ! స్రీలకు సకల సౌభాగ్యముల నొసంగునల్ట వ్రతరాజమును పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పియున్నాడు. దానిని చెప్పెద వినుండు. కైలాసమున మణిగణ ఖచితమగు సింహాసనమున, పరమేశ్వరునిగాంచి పార్వతీదేవి నమస్కరించి “దేవా! లోకములో స్త్రీలు ఏ వ్రతమాచరించిన సకల సౌభాగ్యములును, పుత్రపౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో, యా వ్రతంబు చెప్పవలెననిన పరమేశ్వరుండు సంతసంబున నిట్లనియె "ఓ మనోహరిణీ! స్రీలకు అట్టి సౌభాగ్యాది సంపత్తి గలుగుజేసెడు వ్రతము
వరలక్ష్మీ వ్రతం బనునది కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందువచ్చు శుక్రవారమునాడు జేయవలయు" ననిన పార్వతీదేవి యిట్లనియె "ఓ లోకవంద్యా! నీవానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు .విధియేమి? -ఏ దేవతను పూజింపవలయును? పూర్వమెవరిచే యావ్రతమాచరింపబడియె? వివరంబుగ తెలుపవలయు" ననిన పార్వతికి పరమేశ్వరుడు చెప్పుచున్నాడు. "ఓ గౌరీ! వరలక్ష్మీ వ్రతము సవిస్తరముగ చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణంబు గలదు. ఆ పట్టణము బంగారు గోడల
చేతను, బంగారు యిండ్లతోడను ప్రకాశించుచుండెను. అట్టి పట్టణమున చారుమతి యను నొక బ్రాహ్మణసాధ్వి కలదు. ఆ మానినీ మణి భర్తను దేవునితో సమానునిగా దలంచి ప్రతిదినము నుదయమున మేలుకొని స్నానముచేసి పూవులచే భర్తపాదంబులు పూజించుచు పిదప నత్తమామలకు వివిధోపచారంబులొనర్చి యింటి పనులు చక్కజేసుకొని గయ్యాలికాక మితముగాను ప్రియముగాను భాషింపు చుండెను. ఇట్లుండ ఆ పతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగియొకనాడు స్వప్నమున కనపడి "ఓ చారుమతీ! నేను వరలక్ష్మి దేవిని, నీయందు నాకు దయవచ్చి ప్రత్యక్షమైతిని, శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగావచ్చెడు శుక్రవారంనాడు నన్ను పూజించిన నీ కోరికలు నెరవేర్చుదన" ని యానతిచ్చిన, చారుమతి స్వప్పములోనే వరలక్ష్మి దేవికి
ప్రదక్షిణ నమస్సారముచేసి -
నమస్తే సర్వలోకానాం జననై పుణ్యమూర్తియే
శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాస్తయే
అని యనేక విధంబులుగ స్తుతించి "ఓ తల్లీ! నీ కటాక్షంబు కలిగెనేని మనుజులు ధన్యులుగను, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను పూర్వజన్మమున చేసిన సుకృత విశేషమున నీపాద దర్శనము నాకు లభీంచెను" అనిస్తుతించిన మహాలక్ష్మి సంతోషము జెంది చారుమతి కనేక వరంబులొసంగి యంతర్జానమొందెను. చారుమతి వెంటనే నిదుర మేల్కొని గృహము నాలుగు తట్టులను కలయంజూచి వరలక్ష్మీ దేవిని గానక "ఓహో! నేను కలగంటిననీ యా స్వప్న వృత్తాంతమును భర్త మొదలగు వారితో జెప్పవారు, 'ఈ స్వప్నము మిగుల నుత్తమమైనది. శ్రావణమాసంబు వచ్చినతోడనే వరలక్ష్మి వ్రతమును తప్పక జేయవలెన'ని చెప్పిరి. తరువాత చారుమతియు స్వప్పంబువిన్న స్త్రీలును శ్రావణమాస మెప్పుడు వచ్చునని యెదురు చూచుచుండిరి. ఇట్లుండ వారి భాగ్యమున శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును “ఈ దినమేగదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబ”ని స్నానాదుల నాచరించి చీనిచీనాంబరములు అలంకరించి చారుమతి గృహమున నాకచోట గోమయంబుచే నలికి మంటప మెర్పరచి యందాసనమువైచి దానిపై క్రొత్త్రబియ్యము పోసి మర్రిచిగుళ్లు మొదలగు పంచపల్లవములచే కలశంబు నేర్చరచి, యందు వరలక్ష్మీదేవి
ఆవానముచేసి వారందరును మిగుల భక్తియుక్తులై సాయంకాలమున
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియేదేవీ సుప్రీతాభవ సర్వదా
అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలుచేసి తొమ్మిది సూత్రంబులుగల తోరణంబును దక్షిణహస్తంబునకు గట్టుకొని వరలక్ష్మిదేవికి భక్ష్య భోజ్యంబులచే నైవేద్యమొనర్చి ప్రదక్షిణంబు చేసిరి. యిట్లు ప్రదక్షిణము చేయగనే యా స్త్రీల గాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళను 'జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణంబులు కనపడెను. వారందరు- “ఓహో! వరలక్ష్మీదేవి దయవలన కలిగినవని పరమానందంబు నొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తంబుల దగద్ధగాయ మ్రానంబుగా వెలుగుచు రత్నమణి కంకణములు
మొదలగు నాభరణంబులు కనపడెను. ఇంతయేల! మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్త్రీలందరు సర్వభూషణాలంకృతులైరి. వారి గృహంబులు సువర్ణమయంబులై రధ గజ తురగాది వాహనంబులతో నిండి యండెను. అంత నా స్త్రీలందోడ్కొని పోవుటకు వారివారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు నా వరలక్ష్మి పూజచేయు స్థలమునకు వచ్చి నిలిచియుండెను. తరువాత చారుమతి మొదలగు స్త్రీలు తమకు కల్పోక్త ప్రకారంబుగ పూజచేయించిన బ్రాహ్మణుని పూజించి పండ్రెండు కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కరించి యా బ్రాహ్మణునిచే నాశీర్వాదము నొంది వరలక్ష్మీ దేవికి నైవేద్యము గావించిన భక్ష్యాదులను బందుమిత్ర బృందముల భుజించి తమతమ వాహనముల నెక్కి తమ తమ గృహములకు జనుచు, నొకరితో నొకరు "ఓహో! చారుమతీదేవి భాగ్యమేమని చెప్ప నొప్పును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో దర్శనమిచ్చెను. ఆ చారుమతీదేవి వలననే
కదా మనకిట్టి భాగ్యము గలిగె!" అవి చారుమతీదేవి మిక్కిలి కొనియాడిరి, తరువాత చారుమతీదేవి మొదలగు కాంతలెల్లరును నీ వ్రతంబును ప్రతిసంవత్సరమును జేయుచు, పుత్రపౌత్రాభివృద్ధి గలిగి ధన కనక వస్తు వాహన సమృద్దింగాంచి సుఖంబుగనుండిరి. కావున "ఓ పార్వతీ! ఈ యుత్తమ వ్రతమును బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులువారును జేయవచ్చును. అట్లు చేసిన సర్వసౌభాగ్యంబు గలిగి సుఖీంతురు. ఈ కధ వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదమువలన సకలకార్యసిద్ది కలుగునని పార్వతీదేవితో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతము జెప్పెను.
No comments:
Post a Comment