Monday, May 4, 2026

Goddess Lakshmi as Vedavati - వేదవతిగా లక్ష్మీదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - వేదవతిగా లక్ష్మీదేవి

నారదా! దక్షసావర్ణి అని ఒక మనువు ఉన్నాడు. చాలా పుణ్యాత్ముడు. వైష్ణవుడు, శుచిశీలి, యశస్వి, విష్ణుమూర్తి అంశతో అవతరించాడు. ఆయనగారికి ఒక కుమారుడున్నాడు. బ్రహ్మసావర్ణి ఆని పేరు. అతడూ ధర్మాత్ముడే. విష్ణుభక్తి పరాయణుడే. అతని కుమారుడు ధర్మసావర్ణి. ఇతడూ వైష్ణపుడే. జితేంద్రియుడే. ఇతనికి రుద్రసావర్ణి, అతనికి దేవసావర్ణి, అతనికి ఇంద్రసావర్డి పుత్రులుగా జన్మించారు. అందరూ వైష్ణవులు. అందరూ ధర్మాత్ములు. అందరూ జితేంద్రియులు. ఆందరూ మహాతపస్వులు. వీరిలో ఇంద్రసావర్ణి కుమారుని పేరు వృషధ్వజుడు. పేరుకి తగ్గట్టే ఇతడు శివభక్తుడు. పరమ మాహేశ్వరుడు. ఇతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు మూడు దేవయుగాలపాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గూర్చి వేరేచెప్పాలా! శివుడికికూడా వృషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం. స్నేహం, ప్రేమ. దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతాపూజలనూ యజ్ఞయాగాదులనూ పరిత్యజించాడు. వాణీ లక్ష్మీపూజలను కూడా దూరం చేశాడు. అంతే కాదు వాటిని నిందించనారంబించాడు. అది భరించలేకపోయాడు సూర్యభగవానుడు. సర్వసంపదలూ తొలగి భ్రష్టుడివైపామ్మని శపించాడు. ఆది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంటబడ్డాడు. సూర్యుడూ అతడి తండ్రీ బయపడి పరుగు లంకించుకున్నారు. బ్రహ్మదేవుణ్జి శరణువేడారు. శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. దానితో బ్రహ్మదేవుడికీ హడలెత్తింది. సూర్యుడితో సహా వైకుంఠానికి పరుగెత్తాడు. బ్రహ్మ - కశ్యప - మార్తాండులు ముగ్గురికీ భయంతో నోళ్ళు ఎండిపోయాయి. మాట పెగలలేదు. శ్రీమన్నారాయణుడి పాదాలమీద పడ్డారు. శరణు శరణు అన్నారు. బహుధాస్తుతించారు. జరిగినదంతా చెప్పారు. నారాయణుడు దయతలచి అభయమిచ్చాడు. నేనున్నాను భయపడకండి అన్నాడు. భయార్తులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షమవుతాను. రక్షిస్తాను. ఇది నా వ్రతం. ఈ జగత్తులకు రక్షకుణ్ణి నేను. బ్రహ్మరూపంలో సృష్టిచేసేది నేను. శివరూపంతో సంహరించేది నేను. నువ్వూ శివుడూ సూర్యుడూ అన్ని నేనే. త్రిగుణాత్మకుణ్ణి. అనేక రూపాలూ అవతారాలూ ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను.

అందుచేత మీరు నిర్భయంగా జీవించండి. వెళ్ళండి. శివుడివల్ల మీకు ఈరోజు నుంచీ ఏ భయమూలేకుండా వరం ఇస్తున్నాను. శంకరుడు సజ్జనుడు. సర్వేశ్వరుడు. భక్తపరాధీనుడు. భక్తవత్సలుడు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధికప్రియం. సుదర్శన శివులకన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి.

చతుర్ముఖా! మరో రహస్యం నీకు తెలుసా? శివుడు తలుచుకుంటే చిటికెలో కోటి సూర్యుల్ని సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవుళ్ళను కోటిమందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఎదీ లేదు. ఆతడు రేయింబవళ్ళు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నా మంత్రాన్ని నా గుణగణాలనూ బక్తితో అయిదుముఖాల గానం చేస్తూ ఉంటాడు. అతడు జ్ఞాని. జ్ఞానాధిదేవత. నేనుకూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తుంటాను, రక్షిస్తుంటాను. (యథా చ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌) సకల శుభాలూ అతడి అధీనంలో ఉంటాయి. శివం కలిగించేవాడు కనకనే శివుడన్నారు. శుభస్వరూపమే అతడు.

శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగానే త్రిశూలధారియై శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కన్నులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే వాహనం దిగాడు. చక్రికి శిరసువంచి భక్తిగా నమస్కరించాడు. ఒక్కసారి తలెత్తి తేరిపారజూశాడు.

రత్నసింహాసనంమీద రత్నాలంకార భూషితుడై కిరీట కుండలాలంకృతుడై వనమాలికాధారియై చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీరదశ్యాముడై చందనచర్చిత సర్వాంగుడై పీతాంబరుడై లక్ష్మీప్రదత్త తాంబూలచర్వణపరాయణుడై అప్పరశ్చామరగ్రాహిణీ సంసేవితుడై విద్యాధరీ నృత్యగీతాస్వాదనరసికుడై విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడు ఎట్టయెదుట కనివిందుచేశాడు.

ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసువంచాడు. సూర్యుడూ కశ్యపుడూ అంజలిఘటించారు.

శ్రీ హరి చిరునవ్వులతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దానిమీద కూర్చున్నాడు. విష్ణుపార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరలు వీచారు. మకరందంకవ్నా మధురంగా మధుసూదనుడు పలకరించాడు.

మహాదేవా! కుశలమా? చాలాకాలమయ్యింది నిన్ను చూసీ, నీతో సంభాషించీ. పోవీలే ఇప్పటికైనా తీరుబాటుచేసుకుని వచ్చావు. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పనిమీద వచ్చి ఉంటే చెప్పు. ముందు అది చూసి తరవాత కబుర్లకి దిగుదాం. అవునూ, నీ ముఖం ఏమిటి కొత్తగా ఉంది. ఎక్కడో కాసింత కోపరేఖ కనపడుతున్నట్టుంది - అంటూ మందహాసం విసిరాడు.

శివుడుకూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరీ! నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణం ఉంది. వృషధ్వజుడని నా భక్తుడున్నాడు. భక్తుడే కాదు నాకు ప్రాణాధికప్రియుడు. అతడిని సూర్యుడు శపించాడు. అందుకని నాకు సూర్యుడిమీద కోపం వచ్చింది. త్రిశూలంతో తరుముకుంటూవచ్చాను. నా పుత్రవాత్చల్యం దెబ్బతింది. సూర్యుణ్ణి సంహరించాలనుకున్నాను. అతడు వెళ్ళి బ్రహ్మను. శరణువేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణుజొచ్చాడు. మనస్సుతోకానీ మాటతోకానీ నిన్ను శరణు కన్నవాడికి ఇక ఏ ఆపదలూ ఉండవుకదా! జరామృత్యుభయాలుకూడా దరిజేరవాయె. వాడు నిర్భయంగా నిశ్శంకగా సంచరించవచ్చు. అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణువేడుకొన్న విరించి సూర్యకశ్యపులను నేనే కాదు ఎవడుమాత్రం ఏమి చెయ్యగలడు? హరినామస్మరణ సర్వకాల సర్వావస్థలలోనూ అభయప్రదమూ మంగళప్రదమూను. నువ్వు జగన్నాథుడవు. అన్నీ తెలిసినవాడవవు. ధర్మ స్వరూపుడవు. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషధ్వజుడు నాకు పుత్రనిర్విశేషుడు. ఈ సూర్యుడి శాపంవల్ల శ్రీవిహీనుడయ్యాడు. అతడిని ఎలా ఉద్ధరిస్తావో ఏమి చేస్తావో ఏమి చెయ్యమంటావో - అంతా నీ ఇష్టం ఆని ముగించాడు శివుడు.

శంభూ! నువ్వు గమనించలేదుగానీ సూర్యుడు శపించిన నాటినుంచి ఇప్పటికి ఇరవైయొక్క యుగాల కాలం గతించింది. వైకుంఠంలో గంటన్నర కాలమంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు. వృషధ్వజుడు కాలధర్మం చెందాడు. కాలమనేది ఆతి దారుణమూ అని వార్యమూకదా! అతడి కొడుకు రథధ్వజుడూ అస్తమించాడు. ఇతడి కొడుకులు ధర్మధ్వజ - కుశధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించి ఉన్నారు. సూర్యుడి శాపం కారణంగా అప్పటినుంచీ వీరందరూ ధనసంపద్విరహితులై గర్భదారిద్య్రం అనుభవిస్తున్నారు. అయితే ధర్మధ్వజ కుశధ్వజులిద్దరూ పరమవైష్టవులు. ప్రస్తుతం రాజ్యభ్రష్టులు. శ్రీవిరహితులు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. కనక త్వరలోనే వారిద్దరి భార్యలకూ లక్ష్మీదేవి తన అంశనూ తన కళనూ అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు సంపన్నులవుతారు. రాజ్యం పొందుతారు. రాజశ్రేష్ఠులవుతారు. శివా! ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమయ్యింది - అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలించాడు. అభ్యంతరమందిరానికి వెళ్ళిపోయాడు. శివుడు తపస్సుకోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మదేవుడూ నిష్క్రమించాడు. సూర్యకశ్యపులూ సెలవుతీసుకున్నారు.

నారదా! ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలాకాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలనూ సంపదలనూ తిరిగి పొందారు. పుత్రవంతులూ అయ్యారు. వారిలో కుశధ్వజమహారాజుగారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్ళుపోసుకుంది. పదినెలలూ మోసి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సద్యోయౌవనవతియై పురిటిమంచం నుంచి లేచి వచ్చింది. పుట్టగానే వేదాలు వల్లించింది కనక ఆ కన్యకకు వేదవతి అని నామకరణం చేశారు.

పురిటి గదినుంచి ఈవలికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవుల బయలుదేరింది. తల్లిదండ్రులూ పెద్దలూ ఎంత వారించినా వినిపించుకోలేదు. నిమిషం ఆగలేక పుష్కరక్షేత్రానికి వెళ్ళి ఒక మన్వంతరకాలం తీవ్ర తసస్సు చేసింది. అయినా ఆమె శరీరం బడలిపోలే వొడిలి పోలేదు. నవయౌవనం అలాగే నిలిచింది. అప్పుడొక అశరీరవాక్కు వినిపించింది-

వేదవతీ! పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు.

ఈ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి గంధమాదనపర్వతశిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగించింది.

ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది పళ్ళూ ఫలాలూ అర్ఘ్యపాద్యాలూ శీతలోదకాలూ భక్తితో సమర్పించింది. అన్నింటినీ స్వీకరించి పాపాత్ముడు మరింత చేరువకి వెళ్ళి వెకిలిగా కుశలప్రశ్నలు వేశాడు. ఆమె సౌందర్యానికి చలిం కామబాణ పీడితుడయ్యాడు. చటుక్కున చెయ్యిపట్టుకుని కౌగిలించుకోబోయాడు. వేదవతి కోపంతో  బుసకొట్టింది. కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్డి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు. కాలూ చేయీ ఆడలేదు. నోటమాటలేదు. జడీభూతుడయ్యాడు.

వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది. స్తుతించింది. కళ్ళు తెరిచింది. రావణుణ్ణి శపించింది. రావణా! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్రబాంధవంగ అంతరిస్తావు. నువ్వు కాముకుడవై నన్ను స్పృశించావు. కౌగిటిలోకి లాక్కోబోయావు. నీ బలం ఎమిటో ఎంతో చూపించు - అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డ  రావణాసురుడు కొంత సేపటికి తెప్పరిల్లాడు. ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతీరూపాన్నీ సాహసాన్నీ మరిచిపోలేక చాలాకాలం విలపించాడు.

సీత - ఛాయాసీత - ద్రౌపది


The marriage of Ganga and Vaikuntha - గంగా-వైకుంఠుల పరిణయం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగా-వైకుంఠుల పరిణయం

శానకాదిమహామునులారా! శ్రద్ధగా వింటున్నారుకదా అని మరొకసారి హెచ్చరించి సూతుడు తరవాత కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణమహర్షిని అడిగాడు -

మహర్షీ! గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావేతప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలయ్యిందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది. చెప్పపూ - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు.

నారదా! గంగాదేవి వైకుంఠానికి బయలుదేరిందికదా! ఆవిడవెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు. రాధాకృష్ణుల శరీరాలనుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడమూ రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడమూ రాధాదేవి అలిగి జలపానం చెయ్యడమూ తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణపరమాత్మను శరణువేడటమూ ఆయన దయతలిచి గంగను తన పాదంనుంచి విడిచిపెట్టడమూ అప్పూడు ఆ గంగాదేవిని వైకుంఠానికి వెళ్లమనడమూ, అక్కడ చతుర్భుజనారాయణుడికి ఇల్లాలివి కమ్మనడమూ - మొత్తం జరిగిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పాడు.

చతుర్భుజనారాయణా! వైకుంఠాధిపా! ఈవిడ పరమ పావని. రాధాకృష్టాంగసంభూత. జలాధిష్ఠాన దేవత. నవయౌవన సంపన్న సుశీల సుందరాంగి శుద్ధసత్త్వస్వరూప. క్రోధాహంకార వివర్జిత. నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవ్వరినీ వరించదు. ఈవిడకు రాధికామంత్రాన్ని ఉపదేశించి ఇక్కడకి తీసుకువచ్చాను. గాంధర్వవివాహ పద్దతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడవు. రసికుడవు. ఈమె సురేశ్వరి. రసీక. అందుచేత మీ ఇద్దరి సమాగమమూ పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు పురుషులలో రత్నానివి. ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా - స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించినవాడిమీద లక్ష్మీదేవి అలుగుతుంది. విడిచి వెళ్లిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడేకాదు పండితుడైనా ప్రకృతిని ఆవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపిణి. పురుషుడంటే ప్రాకృతికుడు.

నువ్వేమో జగన్నాథుడివి. నిర్గుణుడివి. ప్రకృతికి అతీతుడివి. శ్రీకృష్ణపరమాత్మ ద్విభుజుడైతే  అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి. కృష్ణుడి వామాంగంనుంచి ఆవిర్భవించిన మహశక్తి  స్వరూపిణి రాధాదేవి. అందులో దక్షిణాంశ రాధాదేవికాగా వామాంశ లక్ష్మీదేవి. అంతా కలిపిచూస్తే ఈ గంగాదేవి నీ శరీరంనుంచి పుట్టినదే. అందుకే నిన్ను వరిస్తోంది. స్త్రీ పురుషులు అంటే ప్రకృతిపురుషులు అంతా ఎకాంగమే. కాబట్టి స్వీకరించు.

అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి ఒడబరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయారు, వైకుంఠనాథుడు గాంధర్వపద్ధతిలో గంగను వివాహం చేసుకున్నాడు. చందనచర్చలతో పుష్పమాలికలకో ఇద్దరూ శృంగారక్రీడల్లో మునిగితేలారు. నవసంగమసౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మూర్చపోయింది రసికేశ్వరుడి సమాగమం రసికురాలికి అంతట పారవశ్యాన్ని కలిగించడం సహజమేకదా! 

నారదా! ఇలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యమూ సరస్వతీదేవి ఈర్ష్యపడుతూ ఉండేది. గంగ - లక్ష్మి - సరస్వతి - తులసి - నలుగురూ శ్రీహరికి భార్యలుగదా! సరస్వతిని చూసి గంగమ్మమాత్రం ఈర్ష్యపడేదికాదు. చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శపించింది. భూలోకానికి పొమ్మంది ఈ కథ అంతా నీకు తెలిసిందే.

నారాయణ మహర్షి ఇక్కడకి ఆగి రవ్వంత ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి నారదుడికి తులసీకథ వినాలి అనిపించింది. ఆవిడ ఎక్కడ పుట్టింది? పూర్వజన్మ ఎమిటి? ఎవరి అమ్మాయి? ఏ తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా పొందింది? వృక్షత్వం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలన్నీ ఏకరువుపెట్టాడు. నారాయణమహర్షి ఓపికగా బదులు పలికాడు.

వేదవతిగా లక్ష్మీదేవి


Ganga Devi Vishnu Padodbhava - గంగాదేవి విష్ణుపాదోద్భవ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగాదేవి విష్ణుపాదోద్భవ

నారదా! నువ్వు అడగడమూ నేను చెప్పకపోవడమూనా? తప్పకుండా చెబుతాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాలనుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పానుకదా! అప్పటి నుంచీ ఆవిడ జలాధిష్ఠానదేవత అయ్యింది. అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణభూషితయై నిత్య యౌవనవిలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారురంగు మేనిఛాయ. శరచ్చంద్రబింబంలాంటి ముఖం. నిగనిగలాడే శరీరకాంతి. విశాలమైన కటిప్రదేశం. పీనోన్నత వక్షఃస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీపుష్పమాలలతో ఘుమఘుమలాడే కబరీభరం, చెక్కిళ్ళమీద మకరికాపత్రాలు. మంకెన పువ్వుల్లాంటి పెదవులు. దానిమ్మగింజల్లాంటి దంతపంక్తి. తళతళలాడే పరిశుభ్రవస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలిముసుగులో ముఖం దాచుకుని ఒయ్యారంగా శ్రీ కృష్ణుడిమీదకి వాలుచూపులు నిగుడించింది. రెప్పవెయ్యకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనువంతా పులకించింది. సంభోగవాంఛ బలంగా పొటమరించింది. పరవశించిపోతోంది.

ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖమూ కన్నులూ ఎర్రకలువలైపోయాయి. విమానంనుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చిన ఆర్ఘ్యపాద్యాలతో తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విస విసా నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్టించి కూర్చుంది. ఆమె వెంట గోపగోపీజన సహస్రమూ మహర్షిబృందమూ వెల్లగొడుగులు పడుతూ వింజామరలు వీన్తూ వచ్చారు. వారంతా రత్న సింహాసవానికి ఇరువైపులా బారులుతిరి నిలబడ్డారు.

సింహాసనంమీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి. సిందూరం చెమ్మగిల్లింది, నుదుటిబొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారహారాలు ఎగురుతున్నాయి, కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి.

శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురువెళ్ళాడు. బెదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశలప్రశ్నలు వేశాడు. గోపగోపీజనం కృష్ణుడికి నమస్కరించింది. స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవికూడా భయపడుతూనే చేరవచ్చి కుశలప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతునీ పెదవులనూ తడుపుకుంటూ భయం భయంగా తలవంచుకుని నిలుచుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనంమీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది.

తళతళలాడుతున్న కాంతిపుంజంలాగా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి. సనాతని. ఎప్పుడూ పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఉండే ప్రారంభయౌవన. నిత్యకన్య, రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేనిది. శాంతస్వరూప. సౌందర్యరాశి. ఆద్యంతరహిత. స్వామి సౌభాగ్యసంయుత. శుభప్రద. సుభద్ర. కృష్ణుడి అర్థాంగి. వయస్సులో తేజస్సులో కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికత్తె అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది. కానీ సర్వస్నష్టికీ తానే జనని. కృష్ణప్రాణాధిదేవత. ప్రాణప్రియ. రాసేశ్వరి సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని గంగాదేవి రెప్పవెయ్యకుండా తదేకదీక్షతో చూస్తోంది. కన్నులే దోసిళ్ళుగా ఆ సౌందర్యరాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివితీరడం లేదు.

రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుడిని అడిగింది - ప్రాణేశ్వరా! ఈ కల్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముకదృష్టితో నీ ముఖపద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాలుచూపులు నిగుడిస్తూ పులకించి పరవశించిపోతోంది. మేలిముసుగులో ముఖం కప్పుకుని రెప్పవాల్చకుండా చూస్తోంది. నువ్వుకూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు, ఎమిటి ఇదంతా? నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికీ ఇలాంటి చెడ్డపనులు చేన్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనక మనస్సు మెత్తన కనక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వూ నేనూ ఈ గోలోకంనుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టులేవు. నీకు ఇక్కడ భద్రతలేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి.

ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా! విరజా! అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తియై నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది. సప్త సముద్రాలను ప్రసవించింది.

మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడూ అంతే నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయిచేసుకుని ఆవిడ తేజస్సుని విభజించి కొంత రత్నానికీ, కొంత బంగారానికీ, కొంత స్త్రీల ముఖాలకీ, కొంత రాజులకీ, కొంత చిగురాకులకీ, కొంత పువ్వులకీ, కొంత పక్వఫలాలకీ, కొంత పంటలకీ, కొంత రాజదేవమందిరాలకీ, కొంత శిశువులకీ, కొంత క్షీరానికీ పంచిపెట్టావు.

ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదపొదలోనూ కనిపించావు. అప్పుడూ అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది. సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికీ, కొంత యక్షులకీ, కొంత పురుషసింహాలకీ, కొంత దేవతలకీ, కొంత విష్ణుజనులకూ, కొంత నాగజాతికీ, కొంత బ్రాహ్మణులకూ, కొంత మునులకీ, కొంత తపస్వులకూ కొంత సౌభాగ్యవతులకూ, కొంత యశస్వంతులకూ విభజించి ఇచ్చావు.

ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్యమీద కనిపించావు. రత్నదీపాలంకృతమైన మందిరాలలో కనిపించావు. ఆవిడ ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో చందనచర్చలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నిలో లీనమయ్యింది. నువ్వు ఎంతగానో రోదించావు. అప్పుడూ అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత నాకూ, కొంత లక్ష్మీదేవికీ, కొంత నీ మంత్రోపాసకులకూ, కొంత శాక్తేయులకూ, కొంత తపస్వులకూ, కొంత ధర్ముడికీ పంచిపెట్టావు.

మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే  పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమెకూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరినీ నిద్ర లేపాను. గుర్తు తెచ్చుకో. నీ పట్టువస్త్రాన్ని మురళినీ వనమాలనూ కౌస్తుభహారాన్నీ రత్నకుండలాలనూ ఊడలాక్కున్నాను. తరవాత నా సఖీజనం గోలపెడితే పోనీలే అని నీమీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరీ కృష్ణవర్ణుడివైపోయావు ఆ క్షణంలో.

క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనల్లోలాగానే  ఆవిడ శరీరం గుణశ్రేష్ఠమయ్యింది. నువ్వు ఆవిడమీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకీ, కొంత వైష్ణవులకూ, కొంత ధార్మికులకూ, కొంత ధర్ముడికీ, కొంత దుర్బలులకీ, కొంత తపస్వులకూ, కొంత వేదపండితులకూ పంచి ఇచ్చావు.

మహాప్రభూ! ఇవ్వి నీ కథలు. ఇంకా ఉన్నాయి, వినాలనుకుంటే చెప్పు ఒక్కొటొక్కటీ గుర్తు చేస్తాను. నీ కథలు అన్నీ తెలిశాయి కానీ నీ గుణంమాత్రం అంతుబట్టడం లేదు,

ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీ కృష్ణుణ్ణి దెప్పిపాడుస్తూంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తలవంచుకుని నేలగీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగవైపు తిరిగింది. ఎదో మాట్లాడబోయింది. ఆది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగినియైన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్నీ త్రాగివెయ్యడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్యరూపంతో వచ్చి శ్రీ కృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణువేడింది.

రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠలోక బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ త్రాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయ్యింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలూ మునులూ మనువులూ ఎండిపోతున్న గొంతుకలతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగ పడ్డారు. గోవిందా! సర్వేశా! పరప్రకృతీ! వరేణ్య! వరదా! వరిష్ఠా! వరకారణా! గోపికావల్లభా! గోపనాయకా! ప్రభూ! నిరీహా! నిరాకారా! నిర్లిప్తా! నిరాశ్రయా! నిర్గుణా! నిరుత్పాహా! నిర్వికారా! నిరంజనా! స్వేచ్చామయా! సాకారా! సత్త్వస్వరూపా! సత్యంశా! సాక్షీరూపా! సనాతనా! పరమాత్మా! పరమా! పాహి, పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు - గోపగోపీజన సంసేవ్యమానుడై రాధికా వక్షఃస్థలంమీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.

బ్రహ్మాదిదేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఎమి చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తినీ వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది, అందరిదీ ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే. మురళీహస్తూలే. వనమాలాధారులే. మయూరపింఛాలంకృతులే. కౌస్తుభభూషితులే. అందరూ శ్రీకృష్టపరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియలేదు. ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్ప్వరూపం కనపడుతోంది. మరుక్షణంలో రూపం కనపడుతోంది. ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం. ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుతం. ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు. మరుక్షణంలో రాధాసమేతుడై కనపడుతున్నాడు. రాధారూపంలో కృష్ణుడూ, కృష్ణరూపంలో రాధ కనపడుతున్నారు. ఎది స్త్రీ రూపం? ఏది పురుషరూపం? బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇదికాదు పద్ధతి అనుకొని కళ్ళుమూసుకుని హృదయపద్మంలో ఉన్న శ్రీ కృష్ణపరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్టయెదుట రాధావక్షఃస్థలస్థితుడైన శ్రీ కృష్ణుణ్ణి దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు.

బ్రహ్మాదిదేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించీ! కుశలమా? దా. కమలాపతీ? క్షేమమా? పైకిరా. మహాదేవా! బాగున్నావా? ఇటు రా. మహాభాగులు మీరంతా వచ్చారు గంగకోనమని. కదూ! రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణువేడింది. నా పాదపద్మంలో దాక్కొంది. మీకు ఇస్తాను. కానీ ఆవిడ భయాన్ని తొలగించండి - అన్నాడు.

ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా! రాధికా! ఈ గంగ రాసమండలంలో నీ శరీరంనుంచి జన్మించింది. శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం. కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్రయైన కన్యక. నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఊన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కళాంశరూపాలు. నువ్వు సాక్షాత్తూ కన్నతల్లివి. దేవేశివి. ఈ గంగ నీకు కూతురులాంటిది.

బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలువెడలింది. అందరూ అమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్టానదేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలచింది, మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలువులోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్ర శేఖరుడు కొంచెం శిరస్సుమీద నిల్పుకున్నాడు.

అటుపైని చతుర్ముఖుడు గంగాదేవికి రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజావిధానాలళో సహా ఉపదేశించాడు. అది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజిం వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి - తులసి - గంగ - సరస్వతి - వీరు నలుగురూ నారాయణుడికి  ప్రియాంగనలు.

అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ మేఘగంభీరస్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా! దేవతలారా! మునులారా! మనువులారా! అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు. భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తంలేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమయ్యింది. సృష్టి అంతా జలమయమయ్యింది. ఇతర విశ్వాలూ ఆ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులూ అందరూ జలమగ్నులయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి, చతుర్వదనా! నువ్వు వెంటనే వెళ్ళి పునస్సృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలమా సృష్టించు. అటుపైని గంగాదేవి వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలనూ అక్కడ బ్రహ్మాదులనూ నేను సృష్టిచేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికి చాలాకాలం గడిచింది. చాలామండి చతుర్ముఖులు ఆంతరించారు. మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం. నాకుమాత్రమే తెలుసు - అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి  నిష్క్రమించాడు.

బ్రహ్మాది దేవతలు పునస్సృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బహ్మదేవుడు సృష్టించిన ప్రతిలోకానికీ క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి అటుసైని శివలోకానికీ ఆపైని బ్రహ్మలోకానికీ అటుతరువాత భూమ్యాదిలోకాలకూ ప్రవహించింది.

నారదా! విష్ణుపాదంలోనుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తింపషబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరింక ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని. వినాలనుకుంటున్నావో చెప్పు తెలియజేస్తాను. అని  ముగించాడు నారాయణ మహర్షి.

గంగా-వైకుంఠుల పరిణయం


Savitri - Yama Samvadham - సావిత్రీ - యమ సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సావిత్రీ - యమ సంవాదం

మందహాస సుందరవదనారవిందంతో ప్రసన్నురాలై దశదిశలకూ కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించింది. 

అశ్వపతీ! నీ మనసులో ఉన్నది ఎమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఎమిటో అదీ తెలుసు. నీది పుత్రవాంఛ. ఆమెది పుత్రికావాంఛ. క్రమంగా రెండూ తీరతాయి. అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది.

అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన ఆదంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయై యౌవనవతి అయ్యింది. ద్యుమత్సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్యప్రేమతో ఆనందిస్తున్నారు. ఎడాది గడిచింది.

ఒకనాడు సత్యవంతుడు సమిధలూ ఫలాలూ పుష్పాలూ తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రికూడా అతని వెంటవెళ్ళింది.

సత్యవంతుడు చెట్టుమీదనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంటపడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు.

సాధ్వీ! ఎక్కడికి వస్తున్నావు? మానవశరీరంతో నావెంట రావడానికి వీలులేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీదేహం విడిచిపెట్టి రా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుషు చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనక నాలోకం తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఃఖాదులన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాదిదేవతలే కర్మబద్దులు. అమరత్వాది సర్వసిద్ధులూ కర్మఫలాలే. విష్ణుసాలోక్యాది చతుష్టయంగానీ సురత్వ మానవత్వ రాజేంద్రత్వాదులుగానీ శివత్వ గణేశత్వ మునీంద్రత్వ తపస్విత్వ బ్రహ క్షత్రియాదిత్వ మ్లేచ్చత్వ జంగమత్వ శైలత్వ రాక్షసత్వ కిన్నరత్వ వృక్షత్వ పశుత్వ వనజీవిత్వ క్షుద్రజంతుత్వ కృమిత్వ దైత్యత్వ దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి.

యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో స్తుతించి ప్రశ్నలవర్షం కురిపించింది. యమధర్మరాజా! కర్మకు హేతువేమిటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానమంటే ఎమిటి? బుద్ది అంటే ఎమిటి? ప్రాణమంటే ఏమిటి? ఇంద్రియాలూ వాటి లక్షణాలూ ఏమిటి? దేవతలంటే ఎవరు? భోగమంటే ఎమిటి? భోక్త ఎవరు? భోజయిత ఎవరు? నిష్కృతి ఎమిటి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు - అని అభ్యర్థించింది.

సావిత్రీ! వేదం ఏది చెబితే అది ధర్మం. ఏది ఆచరించమంటే అది కర్మ ఆది మంగళప్రదం. వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను(దైవకార్యాలను) అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమభక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ మృత్యు జరా వ్యాధి శోక భయాలు ఉండవు.

సాధ్వీ! భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదం. రెండవది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదటిది కోరుకుంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు.

భగవంతుడు అంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజం. అతడే కర్మహేతువు. కర్మఫలప్రదుడు. దేహధారి నశ్వరం.

జగత్సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేది (కర్త) దేహి. అతడే భోక్త. ఆత్మ -భోజయిత(అనుభవింపజేసేది). భోగమంటే విభవభేదం. నిష్కృతియే ముక్తి. సదసద్భేదబీజం జ్ఞానం. వివేచనాశక్తియే బుద్ధి. అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు. దేహధారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వరాంశమై కర్మలకు ప్రేరకమై దుర్నివార్యమై అనూహకమై అనిరూప్యమై అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనస్సు అంటారు.

లోచనాది జ్ఞానేంద్రియాలు అయిదూ శరీరులకు అంగరూపాలై కర్మప్రేరకాలు అవుతున్నాయి అవ్వే మిత్రులూ అవ్వే శత్రువులు. అవే సుఖప్రదాలు. అవే దుఃఖప్రదాలు.

సూర్యుడు వాయువు పృథివి బ్రహ్మాదులు - వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ - దేహధారిని జీవుడంటారు. పరమమూ వ్యాపకశీలమూ నిర్గుణమూ ప్రకృతికి అతీతమూ కారణకారణమూ అయినది బ్రహ్మ అదే పరమాత్మ.

వత్సా! అడిగావుకదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగివెళ్ళు - అంటూ యముడు ముందుకి నడిచాడు.

మహానుభావా! ఎక్కడికి వెడతాను? ఎలా వెడతాను? నా భర్తనూ జ్ఞానసముద్రుడవైన నిన్నూ విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలకన్నింటికి నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గనరక హేతువులైన కర్మలు ఏమిటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మాచరణంవల్ల యోగి అవుతున్నాడు? రోగి అవుతున్నాడు? దీర్ఘజీవి అవుతున్నాడు? అల్పాయుష్కుడవుతున్నాడు? సుఖి కాగలుగుతున్నాడు? దుఃఖి అవుతున్నాడు? అంగవిహీనుడు బధిరుడు అంధుడు పంగువు (కుంటి) ప్రమత్తుడు దాత అతిలుబ్ధుడు చోరుడు - ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఎది? బ్రాహ్మణత్వ తపస్విత్వాదులు ఏ కర్మల ఫలాలు? స్వర్గభోగమూ వైకుంఠమూ లభించాలంటే ఏ కర్మలు చెయ్యాలి? సర్వోత్కృష్టమూ నిరామయమూ అయిన గోలోకం లభించేది ఎలాగ? నరకలోకాలు ఎన్ని? వాటి పేర్లు ఎమిటి? ఎవడు నరకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధిఫలం? ఇవన్ని నాకు తెలియజెప్పు - అని అభ్యర్థించింది సావిత్రి.

ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రీ! ఇంతాజేస్తే నీకు పన్నెండేళ్ళు లేవు. కానీ యోగులకూ జ్ఞానులకూ మించిన జ్ఞానం కనపడుతోంది నీ ప్రశ్నల్లో మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు. అందుకే ఆపేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రీ సమానవు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా - సత్యవంతుడికి నువ్వు సౌభాగ్యదేవతపు సుప్రియవు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతిదేవిలాగా, అగ్నికి స్వాహాదేవి లాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగొ, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా నువ్వు సత్యవంతుడికి సౌభాగ్యదేవతవు. హృదయేశ్వరివి. నీ జ్ఞానానికీ నీ జిజ్ఞాసకూ ఆనందించాను. వరం ఇస్తున్నాను. ఏమి కావాలో కోరుకో - అన్నాడు.

మహాభాగా! సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు నూర్గురు నాకు కలిగేటట్టు వరమియ్యి. నా తండ్రికి నూర్గురు పుత్రుల్నీ మామగారికి చూపునీ రాజ్యలాభాన్నీ అనుగ్రహించు. లక్ష సంవత్సరాల తర్వాత జన్మాంతంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాదించు. జీవుల కర్మవిపాకంగురించీ విశ్వవిస్తారబీజం గురించీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి. కనక తెలియజెప్పు - అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు.

పతివ్రతాశిరోమణీ! అలాగే. నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవకర్మవిపాతం అడిగావుకదూ! ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం. శుభాశుభకర్మలన్నింటికీ అనుభవక్షేత్రం. జీవకోటి తమతమ కర్మానుసారం ఆయా రూపాల్లా ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తుంటారు. మిగతా లోకాలలో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత.

జీవ కర్మ విపాకం


Vastu Doubts - వాస్తు సందేహాలు

వాస్తు సందేహాలు

ఇంట్లో బీరువా ఈ దిక్కున పెట్టాలి?


వాస్తు ప్రకారం, ఇంట్లో బీరువాను నైరుతి మూలలో (దక్షిణ-పశ్చిమ మూలలో) ఉంచడం మంచిది. అలా చేస్తే డబ్బు నిలబడి, ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. బీరువా తలుపులు ఉత్తరం వైపునకు తెరవాలి. ఉత్తర దిశలో బీరువా ఉంచడం కూడా మంచిది, కానీ తలుపులు దక్షిణ దిశ వైపు ఉండాలి.

ఎందుకు నైరుతి మూలలో బీరువా ఉంచాలి?
నైరుతి మూల స్థిరత్వం, భద్రత మరియు సంపదతో ముడిపడి ఉంది. ఇది డబ్బును నిల్వగా ఉంచడానికి మరియు దానిని రక్షించడానికి సహాయపడుతుంది.

బీరువాను నైరుతి మూలలో మాత్రమే ఉంచాలి. దక్షిణ దిశ మరియు పడమర దిశల మధ్య ప్రదేశాన్ని నైరుతి మూల అంటారు. ఈ మూలలో మాత్రమే మనం బీరువాను ఉంచాలి. బీరువా తలుపు తెరిస్తే అది ఉత్తరం వైపు ఉండాలి.

అలాగే పసుపు, కుంకుమలతో స్వస్తికను బీరువాపై ఉంచాలి. అలాగే ఏనుగులతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. ఏనుగు ప్రశంసలు ఎక్కువగా ఉంటే చాలా మంచిది.

కావున బీరువాను సరైన దిక్కున ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Offering in the temple hundi - దేవుడి హుండీలో దక్షిణ

దేవుడి హుండీలో దక్షిణ

దేవుడి హుండీలో ఎంత దక్షిణ వేయాలి, ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

మనసునిండా భక్తితో గుడికి వెళ్లి కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. అయితే ఎవరి స్థామతకు తగ్గట్టు వారు హుండీలో డబ్బులు వేస్తారు. మరి హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే మంచింది...?

మనసు ప్రశాంతత కోసం.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం.. సంతానం, కుటుంబసమస్యల లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలి తెలియక.. ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తుంటారు భక్తలు. ఇక అన్నీ ఉన్నా.. భక్తితో గుడికి వెళ్ళేవారు కూడా ఎందరో. గుడిలో అడుగు పెట్టగానే భాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి.. పాజిటీవ్ వైబ్రేషన్స్ తో హ్యాపీగా ఉంటుంటారు.

అంతే కాదు తమ స్థోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటారు. తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలలో దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తుంటారు. నగలు చేయిస్తారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుపతి హుండీలో రోజు పేదా ధనిక అందరు ఎక్కవ మొత్తం లో కానుకలు వేస్తూ ఉంటారు.

అలా చిన్నా పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఈ విషయం మీకు తెలుసా..?

ముందుగా తిరుమల తిరుపతి నుంచి మొదలుపెడుదాం.. తిరుమలకు ఏడు కొండల పైన ఏడుగురు సప్త రుషులు ఉన్నారు కాబట్టి.. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో రూ.7 వేస్తే.. అనేక రోగనాశనం అని అంటున్నారు. ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండిలో7 రూపాయలు వేయాలట.

ఇక అమ్మవార్ల విషయానికి వస్తే.. విజయవాడ దుర్గమ్మవారితో పాటు నవ రాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి.. శత్రు బాధలు, శని బాధలు దూరం కావాలంటే హుండీలో 9 రూపాయలు వేయాలని అంటున్నారు. అమ్మవారి గుడి అనే కాదు. ఏగుడిలో ఈ సంఖ్య తో డబ్బు హుండీలో వేసినా.. ఆ ఫలితం కలుగుతుందట.

ఇక 11 రూపాయలు ఎందుకు వేయాలంటే.. 11 సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి అంతే కాదు ఎప్పటి నుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయం అవుతాయని అంటున్నారు.

మనం ఏ పూజ చేసినా..గణపతిని ముందుగా తలుచుకుంటాము. అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. ఈ నేపథ్యంలో హుండిలో 21 రూపాయలు వేస్తే దురదృష్టం పోతుందట.. అదృష్టం వరించడంతో పాటు.. పని మొదలు పెట్టిన విఘ్నాలు తొలగిపోతాయి అంటున్నారు. అంతే కాదు గురు అనుగ్రహ సంఖ్య 54. అందుకే హుండీలో 54 రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది.

జాతక దోషాలు తొలగిపోవడానికి.. అనుకున్న కోరికలు నెరవేరటానికి హుండీలో 101 రూపాయి వేయాలట. ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు. ఇక చాలా నిష్టంగా పూజించే శ్రీచక్ర యూల సంఖ్య 108. అందుకే 108 రూపాయలు హుండీలో వేస్తూ.. సకల సిద్ధి కలగడంతో సకల కోరికలు నెరవేరుతాయట

ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు. 116 రూపాయలు హుండీలో వేసి ప్రార్దిస్తే.. పుణ్యప్రాప్తి కలుగుతుంది. సప్త జన్మల పాపం తొలగిపోతుందట. అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పెద్దలు.

Sunday, May 3, 2026

Radha Devi is Ganga Devi - రాధాదేవియే గంగాదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధాదేవియే గంగాదేవి

మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ నది మూడు మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది - అన్నాడు నారదుడు. వెంటనే నారాయణమహర్షి ఆరంభించాడు-

గోలోకంలో ఒక కార్తికపూర్ణిమనాడు రాధామహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవికూడా పూజలు అందుకొన్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాదిదేవతలూ సనకననందనాది మహర్షులూ రాధాకృష్ణులను పరివేష్టించి కొలువుతీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శ్రుతిచేసి కృష్ణస్తుతిరూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు. కానుకలు కురిపించారు. బ్రహ్మ దేవుడు రత్నహారాన్నీ, శివుడు మణిహారాన్నీ కృష్ణుడు కౌస్తుభహారాన్నీ, రాధాదేవి మాణిక్యహారాన్నీ, నారాయణుడు మరో మనోహరమాలికనూ, లక్ష్మి కనకకుండలాలనూ, దుర్గాదేవి బ్రహ్మభక్తినీ, ధర్ముడు ధర్మబుద్దిని, అగ్నిదేవుడు పరిశుభ్రవస్త్రాన్నీ, వాయుదేవుడు మణినూపురాలనూ కానుకలుగా మెచ్చి సమర్పించారు.

బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వుకూడా కృష్ణసంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమరిచిపోయారు. శిలాప్రతిమలైపోయారు. ఆ పారవశ్యంనుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెదికి వేసారారు. దుఃఖం పట్టలేక గోపగోపీజనమూ దేవతలూ పెద్దపెట్టున విలపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు.

ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకీ అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే.

బ్రహ్మాది దేవతలారా! ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్ణరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యానమంత్రస్తోత్ర కవచయుతంగా పూజావిధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్నీ ఆ పూజావిధానాన్నీ గోప్యంగా ఉంచాలి, లక్షకు ఒకడుమాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులూ కొందరు స్వర్గలోకవాసులూగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం. లేకపోతే లేదు.

అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకుని విష్ణుమాయామహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికినవాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు.

శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపగోపీసురబృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైని శివుడు ముక్తిదీపాన్ని వెలిగించాడు.

నారదా! ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్తరూవంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. భుక్తిముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకూ ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వబ్రహ్మాండపూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమతల్లి. 

నారాయణ మహర్షి! కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది ?

నారదా! సరస్వతి శాపంవల్లకదా గంగాదేవి భారతభూభాగానికి వచ్చింది. అయిదువేల సంవత్సరాల తరవాత శాపవిమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతీ పద్మావతీనదులూ లక్ష్మీదేవి తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా లక్ష్మీసరస్వతులతోపాటు నాల్గవదిగా తులసి కూడా నారాయణప్రియ అయ్యింది.

మహర్షీ! నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణుపాదోద్భవ అంటారుకదా! ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలువులో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవూ!

గంగాదేవి విష్ణుపాదోద్భవ


Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...