Tuesday, June 2, 2026

Pushyami - పుష్యమి

పుష్యమి నక్షత్రము

నక్షత్రం - పుష్యమి
అధిపతి - శని
గణము - దేవ
జాతి - స్త్రీ
వృక్షం - పిప్పిలి
జంతువు - మేక
నాడి - మధ్య
పక్షి - నీరుకాకి
అధిదేవత - బృహస్పతి
రాశి - కర్కాటకం

పుష్యమి నక్షత్ర జాతకుల గుణగణాలు

పుష్యమి నక్షత్రము నక్షత్రములలో ఎనిమిదవ నక్షత్రం. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యౌవనము వరకు కష్ట జీవితము గడపి ఒక స్థాయికి చేరుకుంటారు.

ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాటముగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు.

జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురిచేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రంగములో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

వీరు దయ, కారుణ్యం కలిగిన వారు మరియు ఎంతో ఉదారంగా ఉండే స్వభావం కలిగినవారు. ఈ గ్రహానికి బృహస్పతి అధిపతి కావడం వల్ల అంకితభావం కలిగిన, నిజాయితీ కలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు దేవుని పట్ల అంకితభావంతో ఉంటారు.

జీవితంలో శాంతి, సంతోషం మరియు సౌఖ్యాలను పొందడం అనేది వీరి యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంకిత భావం కలిగిన, విశ్వసనీయమైన, సామాజిక స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు సహాయపడతారు.

అంకితభావంతో దేవుడిని ఆరాధకులుగా ఉంటారు. ఈ లక్షణాల కారణంగా, చాలా పేరుప్రఖ్యాతులను పొందడంలో ఆశ్చర్యం లేదు. వీరు తీర్థయాత్రలకు సైతం వెళతారు. వీరికి యోగ, జ్యోతిషశాస్త్రం, మొదలైనవి వాటిలో కూడా ఆసక్తి ఉంటుంది.

వీరు పని చేసే శైలి చాలా సృజనాత్మకంగా ఉంటుంది మరియు వీరు జన్మతః ప్రతిభ కలిగి ఉంటారు. ఒకవేళ ఒక పని ఇవ్వబడినట్లయితే, పూర్తిగా నిజాయితీగాను మరియు నైపుణ్యంతో చేస్తారు కనుక ఆ పని కచ్చితంగా పూర్తవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు.

ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని పొందడం కొరకు వీరు శ్రమిస్తూ ఉంటారు. దైవభక్తితో పాటుగా శాంతియుతమైన మరియు అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటారు.

వీరి మనస్సులో ఏమున్నదనే దానిని వ్యక్తీకరించడం చాలా కష్టం. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

పుష్యమి నక్షత్రం మొదటి పాదం
పుష్యమి నక్షత్ర మొదటి పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు.

కొంత పట్టుదల అతిశయం కూడా వీరికి ఉండవచ్చు. వీరు దేవగుణ ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. కేతుదశలో వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. శుక్రదశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. శుక్ర దశ నుండి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.

పుష్యమి నక్షత్రం రెండవ పాదం
పుష్యమి నక్షత్ర రెండవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు.

వీరు దేవగుణ ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి విద్య విజయవంతంగా సాగుతుంది. విద్యలో ఉన్నతి సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు.

మేధా సంపన్నత కలిగిన ఉద్యోగవ్యాపారాలు చేస్తారు. కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

పుష్యమి నక్షత్రం మూడవ పాదం
పుష్యమి నక్షత్ర మూడవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు.

వీరు దేవగుణ ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగిఉంటారు. విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు.

కేతుదశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభమౌతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది.

పుష్యమి నక్షత్రం నాలుగవ పాదం
పుష్యమి నక్షత్ర నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు.

వీరు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందు ఉంటారు.

కేతుదశ కారణంగా ఉన్నత విద్యను కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్న పూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు. జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది.

పుష్యమి నక్షత్ర జాతకులు పెంచవల్సిన చెట్లు: 
పుష్యమి నక్షత్రం వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం మరియు పూజించడం మంచిది.

పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ధన లాభం

విపత్తార - అశ్విని, మఖ, మూల - కార్యహాని

సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - క్షేమం

ప్రత్యక్ తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - మృగశిర, చిత్త, ధనిష్ట - బంధనం

మిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం

అతిమిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం, లాభం


నక్షత్ర శాంతి: బార్లి, గోధుమలు, బియ్యం, చెరుకు వీటిలో ఏ వస్తువు అయినా సరే యజ్ఞాలు చేసే వారికి అయినా సత్ప్రవర్తన కలిగిన వారికి ఎవరికి అయినా శివాలయంలో దానంగా ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
బృహస్పతిః' ప్రథమం జాయ'మానః ।
తిష్యం' నక్షత్రమభి సంబ'భూవ ।
శ్రేష్టో' దేవానాం పృత'నాసుజిష్ణుః ।
దిశో ను సర్వా అభ'యన్నో అస్తు ।
తిష్యః' పురస్తా'దుత మధ్యతో నః' ।
బృహస్పతి'ర్నః పరి'పాతు పశ్చాత్ ।
బాధే'తాంద్వేషో అభ'యం కృణుతామ్ ।
సువీర్య'స్య పత’యస్యామ ॥


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Punarvasu - పునర్వసు

పునర్వసు నక్షత్రము

నక్షత్రం - పునర్వసు
అధిపతి - గురుడు
జాతి - పురుష
గణము - దేవ
వృక్షం - వెదురు
జంతువు - పులి
నాడి - ఆది
పక్షి - హంస
అధిదేవత - అధితి
రాశి - 1,2,3 పాదాలు మిథునం, 4వ పాదం కర్కాటకం

పునర్వసు నక్షత్ర జాతకుల గుణాగణాలు
పునర్వసు నక్షత్రము రఘువంశ తిలకుడు సీతాపతి అయిన “శ్రీరామచంద్రుని” యొక్క జన్మ నక్షత్రముగా పేరొందినది. కామధేనువు కూడా ఈ నక్షత్రంలో ఆవిర్భవించినది అని నానుడి కలదు. ఇది దోషము లేని నక్షత్రము.

ఒకవేళ గ్రహణము మరియు విఘటికా సమయము మున్నగునవి కూడియున్న యెడల యధావిధిగా శాంతి జరుపవలెను. ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు.

అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. బంగారము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి విద్యల అందు ఆసక్తి అధికముగా చూపిస్తారు. వీరి అభిప్రాయాలు, ఆలోచనలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది.

సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడతారు.

సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది. సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయంశక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది.

వీరు నైతికతను, విషయాన్ని కలిగి ఉంటారు మరియు సంతృప్తి పడే స్వభావం. "సరళమైన జీవితం మరియు అధికంగా ఆలోచించడం” అనే సామెత చక్కగా సరిపోతుంది. దేవునిపై, పురాతన నమ్మకాలు మరియు సిద్ధాంతాలు మరియు సంప్రదాయలపై గొప్ప విశ్వాసం ఉంటుంది. జీవితంలో గొప్ప గౌరవ మర్యాదలను పొందుతారు.

అనైతికం లేదా చట్టవ్యతిరేక పనుల విషయానికి వస్తే, ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా నిలబడతారు. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతుంటాయి కనుక వ్యతిరేక ఆలోచనల నుంచి బాగా దూరంగా ఉంటారు. మెదడు మరియు మనస్సు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. ఇతరులకు సౌకర్యం మరియు మద్దతు ఇవ్వడానికి వీరి యొక్క ప్రత్యేక లక్షణం.

మృధువైన స్వభావం, దయ మరియు కరుణ వంటి స్వభావాలు వీరి వ్యక్తిత్వానికి వెలుగును తెస్తాయి. వీరు ఎంతో శాంతియుతంగా, అంకితభావంగా, తీవ్రమైన, విశ్వాసి, సత్యసంధన, న్యాయాన్ని ప్రేమించేవారు మరియు క్రమశిక్షణ కలిగినవారు. వ్యక్తులతో లౌక్యంగా వ్యవహరించడం మరియు విడదీయరాని స్నేహం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి.

కుటుంబ విషయానికి వచ్చినప్పుడు, వారిని చాలా గొప్పగా ప్రేమిస్తారు మరియు సమాజం యొక్క సంక్షేమం కొరకు ఎంత దూరమైన ప్రయాణించడానికి సందేహించరు. ఒక విలుకాడు తన లక్ష్యాన్ని ఏవిధంగా చేరుకుంటాడో వీరు కూడా, వారి యొక్క ఏకాగ్రత ద్వారా అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు మరియు దేనినైనా ఏ విధంగానైనా సాధిస్తారు.

ఎన్ని సార్లు పరాజయం పొందినప్పటికీ, ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపరు. బహు ప్రజ్ఞాశాలి మరియు ఏ పనినైనా వీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అందువల్లనే అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. వీరు తల్లిదండ్రులు మరియు పెద్దవారిని బాగా గౌరవిస్తారు. స్వభావానికి వస్తే, మీరు శాంతికాముకులు మరియు నిజాయితీతో కూడిన స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లలు కూడా వారు చక్కగా ప్రవర్తిస్తారు.

పునర్వసు నక్షత్రం మొదటి పాదం
పునర్వసు మొదటి పాదం మిధునరాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్ర అధిపతి గురుడు. పునర్వసు నక్షత్ర జాతకులది దేవగణం. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. ధర్మాన్ని రక్షణ చేయడానికి వీరు వెనుకాడరు.

భూసంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వీరికి అనుకూలిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి.

జీవితంలో స్థిర పడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి.

పునర్వసు నక్షత్రం రెండవ పాదం
పునర్వసు నక్షత్ర రెండవ పాదం మిధునరాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్ర అధిపతి గురుడు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు. వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ పని అయినా సౌమ్యతతో సాధిస్తారు.

ఉన్నత ఉపాధ్యాయులుగా, ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.

వివాహంలో జాప్యం ఉంటుంది. శుక్రదశలో సౌఖ్యవంతమైన జీవితం ఆరంభమవుతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్రం మూడవ పాదం
పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు. వీరికి బుధ గురుగ్రహ ప్రభావం ఉంటుంది.

వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంగారు వస్తువుల మీద వీరికి ఆసక్తి ఉంటుంది.

ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది.

పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం
పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది. జాతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం.

ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. వీరి జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షము:
పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం మంచిది.

పునర్వసు నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ధన లాభం

విపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యహాని

సంపత్తార - అశ్విని, మఖ, మూల - క్షేమం

ప్రత్యక్ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - రోహిణి, హస్త, శ్రవణం - బంధనం

మిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం

అతిమిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం, లాభం

నక్షత్ర శాంతి:మేలి రకం బియ్యం మీ ఊరిలోగాని దగ్గరలో గాని పడమర దిశగా ఉన్న శివాలయంలో దానంగా ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
పున'ర్నో దేవ్యది'తిస్పృణోతు ।
పునర్వసూనః పునరేతాం" యజ్ఞమ్ ।
పున'ర్నో దేవా అభియంతు సర్వే" ।
పునః ' పునర్వో హవిషా' యజామః ।
ఏవా న దేవ్యది' తిరనర్వా ।
విశ్వ'స్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా ।
పునర్వసూ హవిషా' వర్ధయంతీ ।
ప్రియం దేవానా-మప్యే'తు పాథః' ॥


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Arudra - ఆరుద్ర

ఆరుద్ర నక్షత్రము

నక్షత్రం - ఆరుద్ర
అధిపతి - రాహువు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - రేల
జంతువు - శునకము
నాడి - ఆదినాడి
పక్షి - పింగళ
అధిదేవత - రుద్రుడు
రాశి - మిధునము

ఆరుద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు
ఆరుద్ర శివుడి నక్షత్రంగా పేరు పొందినది. అధిదేవత రుద్రుడు. ఆర్ద్ర సాధారణంగా దోషం లేనిది. ఈ నక్షత్రం 4వ పాదం నందలి 8 ఘడియలలో జననం మాతృగండం. మరియు తండ్రి యొక్క జన్మ నక్షత్రం జన్మలగ్నం యందు శిశువు జననం పితృగండం. మిగిలిన బంధువులకి కూడా ఇదే వర్తిస్తుంది. ఇలాగే తల్లి సోదరులకి కూడా చెప్పదగును.

శిశువు యొక్క జన్మ నక్షత్రం లగ్నములు ఏకమైన యెడల దోషం కలుగును. అట్లుగాక పాద బేధములైన యెడల దోషం లేదు. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేర్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిగి ఉండెదరు, చింతలేనివారు. శౌర్యము కలవారు. గొప్పగా, గమ్మత్తుగా మాట్లాడగలరు.

వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్నిసార్లు జారిపడినా పట్టువదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు.

ఆరుద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు:
తొందరపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలుపరుస్తారు. లౌక్యము తెలివితేటలు కనబరచుతారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు.

ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు.

వీరు పుట్టుకతోనే మేధావిగా పరిగణించబడతారు. వివిధ విషయాల గురించిన జ్ఞానాన్ని పొందడానికి వీరిలో నిండు ఆసక్తి ఉంటుంది. వీరు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి మరియు అందరితో మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు.

వీరు అన్ని రకాల వాణిజ్య కార్యక్రమాల్లో దిట్ట, మరియు వీరు వ్యాపారం నుంచి పరిశోధన వరకు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఇతర వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారనే దానిని తేలికగా గుర్తించగలరు. అందువల్లనే వీరికి చక్కటి దూరదృష్టి ఉంటుంది. ప్రతిదీ కూడా లోతుగా విశ్లేషించడం వీరి యొక్క అలవాటు.

వీరు తమ కోపంపై నియంత్రణ సాధించడం అత్యుత్తమంగా ఉంటుంది. పరిస్థితులు వీరిని నిరంతరం టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి, అయితే, వాటిని తిప్పికొట్టి తమను తాము రక్షించుకొంటారు. బహుశా అందువల్లనే వారు అనుభవం మరియు పరిణితిని కలిగి ఉంటారు. వీరి సమస్యల్ని వారే పరిష్కరించుకోవడం అనేది వారి యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒక్కటి.

కొన్నిసార్లు వీరు భవిష్యత్తు ఆందోళనలు ఏమీ తెలియని అమాయకమైన పిల్లవాడిలా ప్రవర్తిస్తారు. వీరు అన్ని రకాల సమస్యలను కలిగి ఉన్నప్పటికీ, చివరగా వాటిని అధిగమించగలుగుతారు. వీరు శారీరకంగా శక్తివంతంగా ఉంటారు. ఒకేసారి అనేక పనులు చేయడం అనేది వీరి యొక్క మరో లక్షణం. ఆధ్యాత్మికతకు సంబంధించి వీరికి చక్కటి ఆసక్తి ఉంటుంది.

వీరు “ఎందుకు” మరియు “ఎలా” అనే చట్టాలకు అనుగుణంగా వీరి పని విధానం ఉంటుంది. పరిష్కరించని మర్మాలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు.

ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం:
ఆరుద్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకు వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. ఆచార వ్యవహారాలపై శ్రద్ధ ఉంటుంది.

గ్రహ దశలు : ఈ పాదంలో జన్మించినవారికి మొదట రాహు మహర్దశ 18 సం.లు ఉంటుంది. తదుపరి గురు మహర్దశ 16 సం.లు, శని మహర్దశ 19 సం.లు, బుధ మహర్దశ 17 సం.లు, కేతు మహర్దశ 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా పెనుమళ్లలోని శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామిని అర్చించుకోవడం శుభప్రదం.

ఆరుద్ర నక్షత్రం రెండో పాదం
పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కాస్త గందరగోళానికి గురవుతారు.

గ్రహ దశలు : రాహు మహర్దశ పదమూడున్నర (13.5) సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17 సం.లు, కేతు 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లపాలెంలో కొలువైన శ్రీపార్వతీ సమేత గోకర్ణేశ్వరస్వామిని ఆరాధించటం ఉత్తమం.

ఆరుద్ర నక్షత్రం మూడో పాదం:
వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుంది. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే లాభం దక్కుతుంది.

గ్రహ దశలు : రాహు మహర్దశ 9 సం.లు, గురు మహర్దశ 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17 సం.లు, కేతు 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.

ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం:
లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించటం, నిలకడ సాధించడం చాలా ముఖ్యం. నిదానమే ప్రధానం అన్న సూక్తిని గుర్తుంచుకోవాలి. కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా నెగ్గుకొని రావాలన్న యోచనను సమర్థంగా వినియోగించుకోవాలి.

గ్రహ దశలు : రాహు మహర్దశ నాలుగున్నర సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17 సం.లు, కేతు 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.

దర్శనీయ క్షేత్రం: తూర్పుగోదావరి జిల్లాలోని కూరాడలో కొలువైన శ్రీభద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామిని పూజించడం శుభప్రదం.

ఆరుద్ర నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు:
ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు. తీవ్ర స్వభావి. మాయ భ్రమలకి కారణం రాహువు. ఆవేశం, కోపం అధికం. వైద్య వృత్తిని, చదువుని ఇవ్వగలడు. రాహువుకి అధిపతి దుర్గాదేవి. రాహుకాలంలో దుర్గా దేవికి నిమ్మకాయలో నెయ్యి వేసి దీపం వెలిగించడం శ్రేయస్కరం.

అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - శరీరశ్రమ

సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ధన లాభం

విపత్తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - కార్యహాని

సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - క్షేమం

ప్రత్యక్ తార - అశ్విని, మఖ, మూల - ప్రయత్న భంగం

సాధన తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - బంధనం

మిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం

అతిమిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: జంతువధ నిరోధానికి తోడ్పడాలి. రెండు పప్పు దినుసులు కలిసి ఆహారంగా ఉపయోగించండి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
ఆర్ద్రయా' రుద్రః ప్రథ’మా న ఏతి ।
శ్రేష్టో' దేవానాం పతి'రఘ్నియానా”మ్ ।
నక్షత్రమస్య హవిషా' విధేమ ।
మా నః' ప్రజాగ్మ్ రీ'రిషన్మోత వీరాన్ ।
హేతి రుద్రస్య పరి'ణో వృణక్తు ॥
ఆర్ద్రా నక్షత్రం జుషతాగ్మ్ హవిర్నః' ।
ప్రముంచమా'నౌ దురితాని విశ్వా" ।
అపాఘశగ్మ్' సన్నుదతామరా'తిమ్ ॥

edu shanivarala vratam - ఏడు శనివారాల వ్రతం

ఏడు శనివారాల వ్రతం

ఏడు శనివారాల నోము లేదా సప్త శనివార వ్రతం అనేది హిందువుల సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన వ్రతం, ఇది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం ఏడు శనివారాలు వరుసగా లేదా ఏదైనా శనివారం ప్రారంభించి ఏడు శనివారాల వరకు చేయవచ్చు.

ప్రస్తుత, గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తాం. వీటికి కర్మఫల దాత శనీశ్వరుని ప్రభామే కారణం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా పూజించాలి.

హైందవ సంస్కృతిలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. వారంలోని ఒక్కో రోజున ఒక్కో దేవుడికి కేటాయించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుని శనివారం నాడు పూజిస్తారు.

సప్తగిరులపై వెలసిన తిరుమలేశుడు భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు, అనాధ రక్షకుడైన స్వామి కోసం వేకువజామునే స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు. కానీ శ్రీనివాసుని కృపతోపాటు శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజచేయాలి.

శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి, పూజగదిని శుభ్రం చేసి వేంకటేశ్వర స్వామిని అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి.

శనివారం సాయంత్రం వేంకటేశ్వర ఆలయంలో ఆవు నేయితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.

ప్రారంభం: మీరు ప్రారంభించడానికి ఏదైనా శనివారం ఎంచుకోండి.

పూజ: శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఆయన్ను స్మరించుకోవడం, మంత్రాలు చదవడం, ప్రసాదాలు సమర్పించడం వంటివి చేయవచ్చు.

ఏడు శనివారాలు: ఏడు శనివారాలు వరుసగా లేదా ఎన్నుకున్న శనివారం నుండి ఏడు శనివారాలు చేయవచ్చు.

ముగింపు: ఏడు శనివారాల తరువాత, వ్రతాన్ని ముగించేందుకు ప్రత్యేక పూజలు చేయాలి.

ప్రయోజనాలు: అడ్డంకులు తొలగుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఇది శ్రీనివాసుడి అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ వ్రతం ఆచరించడానికి ప్రత్యేక నియమాలు లేవు, అయితే సాధ్యమైనంతవరకు నిష్టగా ఉండటం మంచిది. ఈ వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు.

Friday, May 29, 2026

Kubera Statue - కుబేర విగ్రహం

కుబేర విగ్రహం

హిందూ సాంప్రదాయం ప్రకారం, కుబేరుడు సంపదకు, ఐశ్వర్యానికి అధిపతి. ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తులు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.

అయితే, కుబేర విగ్రహాన్ని ఇంట్లో ఉంచినప్పుడు కొన్ని నిర్దిష్టమైన నియమాలను పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

కుబేర విగ్రహం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆర్థిక వృద్ధి: ఇంట్లో కుబేర విగ్రహం లేదా యంత్రాన్ని ఉంచడం వల్ల వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రగతి లభిస్తాయని నమ్మకం.

సంతోషం: ఇంట్లో డబ్బు కొరత లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

ధన నష్టం నివారణ: అనవసరమైన ఖర్చులు తగ్గి, సంపాదించిన డబ్బు నిలుస్తుందని అంటారు.

విగ్రహానికి వాస్తు నియమాలు:
కుబేర విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది.

ఉత్తర దిశ (North): కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి. కాబట్టి విగ్రహాన్ని లేదా ఫోటోను ఇంటికి ఉత్తర భాగంలో ఉంచడం అత్యంత శుభప్రదం. 
విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచి, అది దక్షిణ దిశ వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి (లేదా ఈశాన్య మూలలో కూడా ఉంచవచ్చు).

పూజా గది లేదా లాకర్: కుబేర విగ్రహాన్ని పూజా మందిరంలో కానీ, లేదా మీరు డబ్బు, నగలు దాచుకునే బీరువా/లాకర్ దగ్గర కానీ ఉంచవచ్చు.

పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:
కుబేరుడు ఉన్న చోటు ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి.

విగ్రహాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. విగ్రహాన్ని నేరుగా దక్షిణ దిశలో ప్రతిష్టించకూడదు.

నిత్య పూజ/దీపం: వీలైతే ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం, మంగళవారం రోజుల్లో కుబేరుడికి దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించడం మంచిది.

సంప్రదాయం ప్రకారం, సరైన నియమాలతో కుబేరుడిని పూజిస్తే ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీకటాక్షం ఉంటుందని పెద్దలు చెబుతారు.

Lord Dattatreya on Thursday - గురువారం దత్తాత్రేయ స్వామి

గురువారం దత్తాత్రేయ స్వామి

త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం.

గురువారం రోజును గురుగ్రహానికి, దైవ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా పూజించబడతారు. అందుకే గురువారం ఆయనను భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, గురుకటాక్షం, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తాయని విశ్వాసం.

దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు.దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.

గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.

ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.

దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి.

Sundarakanda Parayana Vidhanam - సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ పద్ధతులు అనేకంగా ఉన్నాయి. వారి వారి అనుకూలతలను అనుసరించి పద్ధతిని ఎంచుకోవచ్చు. కొందరు నిత్య పారాయణగా సుందరాకాండను అనుష్ఠిస్తారు.

ప్రతి రోజు ఏడు సర్గల చొప్పున సంవత్సరం వరకు సుందరాకాండను పఠించడం ఒక పద్ధతి. రోజుకి ఇరవై అయిదు సర్గలుగా నిత్యానుష్ఠానం చేసే పద్ధతి శాస్త్రం చెబుతోంది.

అభీష్టసిద్ధికోసం, అనిష్ట పరిహారం కోసం పారాయణ చేసే విధానాలు చాలా ఉన్నాయి.

ముప్పయి రెండు పర్యాయములు పారాయణ ఒక పద్ధతి. మొదటి రోజున సీతాదేవి ఆంజనేయునకు చూడామణినివ్వడం వరకు చదవాలి.

రెండోరోజున మిగిలిన కాండ పారాయణ చేయాలి. అలా 64 రోజుల్లో 32 పర్యాయాలు పూర్తవుతుంది.

72 దినాలలో 24 పర్యాయాలు పారాయణ చేసే విధానముంది. హనుమంతుడు సీతమ్మను చూసేవరకు మొదటి రోజున పఠించాలి.

రెండవరోజున హనుమంతుడు అశోకవన ధ్వంసం చేసిన ఘట్టం వరకు చదవాలి. మూడవ రోజున మిగిలి కాండను పూర్తి చేయాలి. ఇలా 72దినాలు చేస్తే 24 పర్యాయాలు పూర్తి అవుతాయి.

48 దినాలలో 12 ఆవృత్తులు పఠించే విధానముంది. మొదటి రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించే ఘట్టం వరకు, రెండవరోజు విశ్వరూపం సందర్శనం వరకు, మూడవరోజు హనుమ రావణునకు హితోపదేశం చేసే సన్నివేశం వరకు, నాలుగవరోజు కాండాంతం చదవాలి. ఇలా 48 రోజులు చేస్తే 12 పర్యాయాలవుతుంది.

మొదటిరోజున సీతా సందర్శన ఘట్టం వరకు, రెండవరోజున త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు, మూడవ రోజున చూడామణీ ప్రదానం వరకు, నాల్గవరోజున లంకాదహనం వరకు, ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహ్నిక పారాయణ విధి.

ఇలా వివిధ ఆవృతుల విధానాలు ఉన్నాయి. ఇంతే కాకుండా - ఒక్కరోజు మొత్తం సుందరకాండ పారాయణ చేయవచ్చు.

అలా చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదికాలు చేసి అపరాహ్ణాత్పూర్వమే (మధ్యాహ్నం లోపల) పూర్తి చేయాలి. దీనికి శక్తి లేకపోతే రెండు రోజులు పారాయణ చేయవచ్చు.

అలాగే మూడు రోజుల పాటు రోజుకు కొన్ని సర్గల చొప్పున విభజించుకొని పారాయణ చేయొచ్చు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది దినములు పారాయణ చేయవచ్చు.

ఎప్పుడు పారాయణ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజచేసి, సంకల్పం చెప్పుకొని శ్రీసీతారామాంజనేయులను షోడోపచారాలతో అర్చించి, పుస్తకాన్ని పూజించి, పారాయణ ప్రారంభించాలి.

మధ్యలో ఇతరులతో సంభాషించడం కానీ, లేవడంగానీ చేయరాదు. పారాయణాంతంలో క్లుప్తంగా పునః పూజచేసి మంగళ హారతి ఇచ్చి, మంగళ శ్లోకాలు చదవాలి.

పారాయణకు ముందు గురూపదేశం ద్వారా లభించిన శ్రీ సీతారామమంత్రం, ఆంజనేయ మంత్రం జపించడం మంచిది.

ఉపదేశం లేనట్లయైతే 'శ్రీరామయనమః' లేదా 'శ్రీరామ జయరామ జయజయరామ' - అనే మంత్రాన్నీ,'శ్రీ హనుమతేనమః' లేదా 'శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' అనే మంత్రాన్నీ జపించడం మంచిది.

పటిక బెల్లం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అప్పాలు నివేదించి పారాయణ చేయడం మంచిది.


సుందరకాండ పారాయణ అద్భుత పలితాలు:
రామాయణం గొప్ప గ్రంథం. అందులో మొత్తం ఏడు కాండలు ఉన్నాయి. ఆ ఏడు ఆ సందర్బాలకు అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. కానీ ఆ ఏడింటిలో విశిష్టమైనది సుందరకాండ. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని, సీతను వెతికి, కనుకొని తరువాత లంకను దహనం చేసి, సీత ఎక్కడుంది అనే విషయాన్ని రాముడికి తెలియజెప్పడం ఈ సుందరకాండ సారాంశం. రామాయణం అంతా రాముడి గురించి అయితే, సుందరకాండ ఆంజనీయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం.

68 రోజుల పారాయణం చేస్తే కొడుకులు పుట్టలేదని బాధపడేవారికి కొడుకులు పుడతారు. అలాగే పెళ్లికాని ఆడపిల్లల పెళ్లి తొందరగా జరుగుతుంది. రోజూ సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటే వర్షాలు చక్కగా కురిసి, పంటలు పండి, కరువు మాయమవుతుంది. నిత్య పారాయణం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది, అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.

సుందరకాండ చదివేచోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడి గురించి పూజలు జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. కాబట్టి సుందరకాండ పారాయణ చేయగానే ఆవు పాలు బాగా కాచి గోరువెచ్చగా ఉన్న పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా పెట్టాలి. ఇది ఎంతో గొప్ప నైవేద్యం. ఇలా చేస్తుంటే సకల సమస్యలు తొలగిపోతాయి.

సుందరకాండలో ఏది చదివితే ఏ సమస్య తీరిపోతుందని కూడా పండితులు వివరించారు. సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. అంతే కాదు అదంతా చందస్సులో కూర్చబడి ఉంటుంది. సుందరకాండను భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, బాధలు కష్టాలు తొలగిపోతాయి. రోగాలు నయమౌతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మృత్యు భయం పోతుంది.

లంకా విజయం చదివితే భూత-ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడు.

హనుమ నిర్వేదం చదివితే బుద్దిమాంద్యం సమస్యలున్నవారికి ఆ సమస్య తొలగుతుంది.

లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరులు వల్ల మనపై కలిగే దోషాలు తొలగిపోతాయి.

లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

త్రిజటా స్వప్న వృత్తాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి.

సీతారావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది.

సీతా హనుమ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి కలుస్తారు.

అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలు తగ్గుతాయి.

కాకానుగ్రహం చదివితే తెలిసీ తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తపోయూ చేసి ఉంటే అవి తొలగిపోతాయి.

చూడామణి ప్రదానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

కిమ్కరాది రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయం సాధిస్తారు.

లంకాదహన ఘట్టం చదివితే ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి కలుగుతుంది.

మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణం తరువాత బ్రహ్మలోకానికి వెళతారు.

సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...