త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట
బ్రహ్మ యిట్లనియె: ఆ దివ్యవిమానము మనోవేగమున మరొక చోటి కేగినది. మా కచట నీరు కనిపింపలేదు. అందులకు మే మాశ్చర్యము జెందితిమి. ఆ ప్రదేశమందంతట పర్వతములు మధుర ఫలభరితములై కోకిలల కుహూకుహు రాగములుగల వృక్షము శోభలతో నొనరు వనోపవనములు-స్త్రీ పురుషులు పశుసంపదలు పసిడిపంటలు నదీనదములు సెలయేళ్లు వాపీకూప తటాకములు నీటి చిలుపలు యాగశాలలు ఎత్తైన ప్రాకారములు పలు సుందరభవనాలు గల్గి కలకలలాడు నగరములు నిండి కన్నులపసండువుగ నుండును. మే మా దివ్యనగరమునుంగాంచి యిది స్వర్గసీమ గాబోలు! ఇంత మహాద్భుతముగ దీని నెవరు నిర్మించిరో కదా? ఆహా! ఏమి వింత! అనుకొని పరమాశ్చర్య మందితిమి. అంతలో నచ్చట వేటాడుచు విహరించుచు ఇంద్రుని బోలు ఆ నగరపు రాజును విమానముపై తేజరిల్లు జగదంబికయు కనబడిరి. ఆ విమాన మొక్క మూర్తమాత్రమున వేగమున మరొక మనోహరప్రదేశమున కరిగెను.
అచట మేము నందనవనమును నందులో చల్లని పారిజాతపు నీడ చలువలో సుఖించు కామదేనువును గాంచితిమి. దానికి సమీపమందు నాల్గుదంతములుగల మహాగజము గలదు. అచ్చట మేనక మున్నగు నచ్చరలు రాగ తాళ మధుర బావములతో నాట్యమాడుచుండిరి. గంధర్వ విద్యాధరులు నందన వన వాటికలో గుమిగూడి గానములతో ఆనందపరవశులై యుండిరి. ఇంద్రాణీ సహితముగ నింద్రుడు మాకు గనబడెను. రవి యమ వరుణ కుబేరులు నచట నుండిరి. మే మచట నటు లాసురలనుగాంచి విస్మయమందితిమి. అంతలో ఆ నగరపు రాజు దేవరాజువలె అక్షోభ్యుడగు నరవాహనముగల పల్లకిలో నెక్కి బయలువెడలెను. మా విమాన మటులు మాతోకూడ మహావేగమున మరల ముందుకు సాగి సర్వదేవ నమస్కృతమగు బ్రహ్మలోకమును జేరెను. అచట కమలాసనుడగు బ్రహ్మనుగని శివకేశవులు చోద్యమందిరి. ఆ బ్రహ్మసభలో వేదములు సాంగములుగ రూపుదాల్చి వెలుగొందుచుండెను. అచ్చో దివ్యసాగరమును నదీపర్వతములును మాకు నయనానందము గల్గించినవి. అంత శివకేశవు లీ క్రొత్త బ్రహ్మ యెవరని నన్నడిగిరి. నేను రెండవ సృష్టికర్త నెరుంగనంటిని. ఇతడెవరో! నేనెవరనో! ఇదంతయు నాకే మాత్రము దోచుటలేదు' అని నేనను నంతలో మా విమానము మనోవేగముగ ముందునకు సాగెను.
అట్లు మా విమానము సాగిసాగి కైలాసగిరి జేరెను. అచట యక్షగణములు జేరి శివుని భక్తిమీర గొల్చుచుండిరి. కీరకోకిలములు మధుర గానముల నలరొందు మందారవనములును నట గలవు. పరమశివుడు వీణామురజ వాద్యములనుండి వెడలు చల్లని మధురరాగములను చెవులపండువుగ వినుచుండెను. ఆ శివుడు మా విమానమునుగని కైలాసమును వదలి పెట్టెను. ఆ రీతిగ నెలతాలుపు పంచాననుడు దశభుజుడు ముక్కంటి వృషవాహనుడునగు శంభుభగవానుడు కైలాసము నుండి బయటికి వెడలెను. ఆ సాంబసదాశివుడు మొలయందు పులితోలును పైని నేనుగు తోలుత్తరీయమును దాల్చియుండెను. ఆ పురాణదంపతుల కిరుప్రక్కల మహావీరులగు గణపతి కుమారు లుండిరి. అట్లు నంది మున్నగు గణశ్రేష్ఠములు తన కూర్మి తనయులు తన్ను గొలువ శివుడు బయలుదేరెను. ఆ శివగణములు శివుని వెంటజేరి హరహర మహాదేవశంభో యని నినాదములు సేయుచుండెను. ఆ యభినవ శంకరుని గాంచి మేము విస్తుపోతిమి. ఆ శివుడు మాతృకలను గూడియుండెను. పిదప మా విమాన రాజము క్షణములో గాలివాలున ముందుకు దూసికొని పోయినది. శ్రీరమారమణుని మందిరమైన వైకుంఠధామము జేరినది. అచట మేమెన్నడును కనివిని యెరుగని పెక్కులు దివ్యవిభూతులు కనులార గాంచితిమి. మే మా రమణీయమైన పురముగాంచి విస్మయానందము లందితిమి. మా విమానము మఱికొంతముందున కేగెను. అచట రాజీవనయనుడు పీతాంబరుడు అగిసె పూశోభనలరువాడు చతుర్భుజుడు గరుడవాహనుడు దివ్యభూషణభూషితుడు చామరములు చేతదాల్చి చల్లగ మెల్లగ వీచుచున్న రమాకాంతతోగూడి రాజిల్లువాడునగు హరిని మేము మా భాగ్యముకొలది సందర్శించితిమి. ఆ సనాతనుని వైకుంఠునిగనిన మా యాశ్చర్యమునకు మేర లేకుండెను.
అపుడు మా యాసనములందు కూర్చుండి మే మొకరి మొగా లొకరము వింతగ జూచుకొంటిమి. అంతలో నొక పెనుగాలి వాలున మా విమానము మఱికొంత ముందునకు సాగెను. అంతలో మేము పలువిధముల జలచరములతో నువ్వెత్తుగ లేచు కెరటములతో డెంద ముప్పొంగజేయు నమృతసాగరము చూచితిమి. దాని నడుమ మందార పారిజాతాది తరువులు చిత్రవిచిత్ర వస్తువులు పెక్కాసనములు-మేలుజాతి ముత్తియముల హారాలు అశోకవకుళకురవక తరువులు - నలుగడల ఘుమఘుమలాడుచు కనులపండువు సేయుచున్న మొగలి సంపెంగ మున్నగు పూలచెట్లు కోయిలల కుహూకుహూరావ మధిరిమలు-గండుతుమ్మెదల ఝంకారములు గల్గి తనరారు నొక్కదీవి గలదు. ఆ దీవియందు శివాకారమున చెలువొందు మంచ మొకటి సుమనోహరముగ నున్నది. అది నవరత్నకాంతులతో పొదుగబడెను. మేము దూరమందుండియే దాని శోభ కన్నులనిండ తిలకించితిమి. దానిపై నాసనములు పెక్కులు గలవు. ఆ పర్యంక మింద్రచాపము భాతిగ చిత్రశోభలతో నలరుచుండెను. అందొక పరమలావణ్యవతి యగు దివ్యాంగన సుఖాసీనయై యొప్పారుచుండెను. ఆ జగదేకసుందరి రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన కోట్ల మెరుపుకాంతులతో మిరుమిట్లు గొల్పుచుండెను. ఎఱ్ఱజీఱల కనుదమ్మలు గలది, కోట్ల పసిండిచాయల మిసిమివన్నె గలది, రవి బింబములను వెన్నుదన్నుకాంతి గలది. చారు వదన రక్తదంత విరాజిత-లావణ్యసీమ. పాశాంకుశములదాల్చి వరదాభయ ముద్రలతో వాత్సల్యము గురియు తల్లి, చిరుతనవ్వు వెన్నెలలు కనుగొలంకుల ముని పెదవుల చిందులాడునది, అపూర్వసుందరి ఐన శ్రీత్రిభువనేశ్వరీదేవి విరాజిల్లుచుండెను.
ఆ నవ¸యవన దివ్యాంగన తన నవ్వు రాజిల్లెడు మోమునుండి దయామృతము గురియుచుండెను. ఆ దేవిచుట్టును జేరి హ్రీంకార జపనిష్ఠలో మేనులు మరచిన పక్షిబృందములు దేవిని జపించుచుండెను. ఎల్ల రసరాజము లామె సింగారములో చోటు చేసికొన్నవి. ఆమె చిగురునవ్వుల మోహనకాంతుల ముఖకమలముతో బలు తమ్మి మొగ్గలను త్రోసిరాజను గబ్బివట్రువ గుబ్బలతో నొప్పుచుండెను. పెక్కు మేలైన జాతిమణుల సొమ్ములతో బంగారపు కేయూరాంగద కిరీటములతో ధగధగలాడుచుండెను. ఆమె ముఖకమలము శ్రీచక్రము విధముగ నున్న తాటంకవిటంకములతో చెన్నొందుచుండెను. 'జయహో! హృల్లేఖ! శ్రీభువనేశి' యని దేవి చెలియలు ఆమెను స్తుతించుచు దేవీజప పరాయణులై యుండిరి. ఆ దేవి భువనేశ్వరి మహేశ్వరి హృల్లేఖ మొదలుగాగల దేవకన్యలతో కొలువు తీర్చియుండెను. ఆ కొలువులో ననంగ కుసుమాది దేవతలును గలరు. ఇట్లా దేవి షట్కోణమధ్యమున నలరు యంత్రరాజమున నలరుచుండెను. మేమా దేవిని దర్శించి, ఈమె యెవరో? ఈమె శుభనామ మెద్దియో తెలియుట లేదేయని పరమ విస్మయమందితిమి. ఈమె వేయికనుల దయామృతలహరి - వేయికేలుదమ్ముల వరదాయిని - వేయివదనాల సుప్రసాదచంద్రిక యని దూరమందుండియే మాకామె దోచుచుండెను. ఈమె యచ్చరగాని గంధర్వకన్యగాని దేవాంగనకాని కాదు. కాని, ఈ పరదైవ మెవ్వరై యుండునోయని తెలిసికొననేరక మేము సంశయములో కొట్టుమిట్టాడుచుంటిమి.
అంతలో విష్ణుభగవానుడు రవిజ్ఞాన శక్తితో నాచారుహాసినిని జగదంబగ మదినెఱింగి యిట్టనియెను: ఈ భగవతి దేవియే మన కందఱకు తరణభూతురాలు. మహావిద్య; మహామాయ; పరిపూర్ణ; మూలప్రకృతి; అవ్యయ. ఈమె కొంచెపు బుద్ధులవారికి మదికెక్కనిది. యోగగమ్య. పరమాత్ముని యిచ్ఛాశక్తి. నిత్యానిత్యస్వరూపిణి. ఈమె శివస్వరూపిణి; భాగ్యహీనులచేత గొలువబడనిది. విశ్వేశ్వరి వేదగర్భ విశాలాక్షి సర్వాది పరమేశ్వరి సనాతని. ఈ మహాశక్తి ప్రళయకాలము నందు సకల విశ్వమును బరిమార్చి యెల్లజీవుల వాసనలను దనలో విలీన మొనరించుకొని క్రీడించుచుండును. సురలారా! సర్వబీజస్వరూపిణి యీమెయే. ఈమె దివ్య సన్నిధానములో ననంత విభూతులు రూపొంది సొంపు పెంపొందుచున్నవి. చూడుడు, ఓ శివబ్రహ్మలారా! చూడుడు. ఇచ్చటివారెల్లరు మేనుల దివ్యచందనములలందుకొని మేలిమిబంగరు సొమ్ములు దాలిచి ప్రేమభక్తులు వెల్లివిరియగ నీ జగన్మాతకు పరిచర్యలు సలుపుచున్నవారు. నేడు మన మిచ్చోట జగద్ధితయగు శ్రీభగవతిని సందర్శించి ధన్యజీవులము కృతకృత్యులము మహాసౌభాగ్యవంతులము నైతిమి. మనము పూనికతో నేనాడే పుణ్యము చేసికొంటిమో యే తప మాచరించితిమో దాని ఫలితముగ మన కీనాడు శ్రీమాతృదేవి దివ్యదర్శనము లభించినది. త్యాగధనులు పుణ్యభాగులు తపస్సంపన్నులు దానరతులునైన మహాత్ములే యీ భవ్యాత్మ నవలోకింపగలరు. కాని, రాగులు మూఢులు ప్రమత్తులు నా శివాభగవతి నేనాటికిని గాంచనేరరు.
ఈమెయే ప్రకృతులకన్నిటికిని మూలప్రకృతి. ఈ ప్రకృతి జనని పురుషసంగతిజేసి పరమేశ్వర ప్రీతికొఱకీ బ్రహ్మాండములను సృజించి వెల్లడించుచుండును. దేవతలారా! ఈ కనబడు బ్రహ్మాండ మంతయును దృశ్యము. ఈ మాయాదేవియే ద్రష్ట్రి. ఈమెయే విశ్వయోని సర్వేశ్వరి సర్వమాయ పరమశివాత్మిక. ఈ విశ్వమాత యెక్కడ? మన మెక్కడ? లక్ష్మి మొదలుగాగల దేవకాంతల యంద మీమె యందములోని లక్షాంశమునకు సరిపోలవు. ఆనాడు మహాసాగరమునందు మనకు దర్శన మొసంగిన జ్యోతిఃస్వరూప మీ విశ్వజననియే. ఆ మహాదేవియే మనలను బాలురనుజేసి యాడించుచు వినోదించుచున్నది. మున్ను నేను వటపత్త్రపు పానుపుపై పరుండి నా పదారవిందమును కరారవిందముతో ముఖారవిందమున నుంచుకొని ఆ వ్రేలిరసము జుబ్బట్లాడగ జీకుచు కోమలాంగుడనై పెక్కులు బాలక్రీడలు సాగించితిని. అట్టి నాలో నీ జగన్మాతయే చేరి నన్నాడించుచు లాలిజోలలు పాడుచునుండెనని నే డీ మేనుగాంచినతోడనే నా మదికి నిశ్చయజ్ఞానము స్ఫురించెను. నా పలుకులు విశ్వసింపుడు. మనల గన్నతల్లి యీమెయే. నేను పూర్వ మనుభవించిన జ్ఞాన మిపుడు తిరిగి గుర్తునకు వచ్చినది.
అధ్యాయము 36 శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment