Monday, April 6, 2026

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి

కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను వెతకడానికై దూరంగా ఉన్న అడవికి ఎంతో వేగంగా వెళ్లాడు. అప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడంటే; జులపాలు చెవులవరకు వేలాడుతున్నాయి. మెడలో రత్నాలహారపంక్తులు మెరుస్తున్నాయి. చేతిలో వెదురు కర్ర బంగారుకాంతితో ప్రకాశిస్తోంది. శిరస్సుమీద నెమలిఫించం దండలా వుంది. ఎంత ఉత్సాహంతో వెళ్తున్నాడంటే తిందామనుకుని చేతనున్న అన్నం ముద్దను అలాగే పట్టుకున్నాడు. చెయ్యి వికసించిన పద్మంలా ఎర్రగా ప్రకాశిస్తూ వుంటే అన్నంముద్ద తెల్లగా వెలుగుతోంది.

అలా కృష్ణుడు దూడలకోసం అడవిలో దూరంగా వెళ్తున్నవాడై

అడవిదారిలో వెళ్తున్న శ్రీకృష్ణునికి దూడలఅడుగుజాడలు కనబడ్డాయి, వాటిల్ని బట్టి ఇక్కడ గడ్డిమేశాయి, ఇక్కడ నీళ్ళు తాగాయి, ఇక్కడనుండి వెళ్లాయి. ఇక్కడ మందగా నిలిచాయి, ఇక్కడనుండి విడిపోయాయి, దూడలు వెళ్ళిన తోవ ఇదిగో ఇదే ఇదే అంటూ కృష్ణుడు దూడలను వెదకుతూ ముందుకు వెళ్తున్నాడు.

పద్మదళాలవంటి విశాలమైన కళ్ళుగలవాడు కాబట్టే ఏ మాత్రం వెనుకాడకుండా, గడ్డితో ఎంతో ఒత్తుగా పెరిగివున్న చోటా, భయంకరమైన అడవిజంతువులుండే పొదలలోనూ, చెట్లదగ్గరా, కొండప్రాంతాలలోనూ, సరస్సులలోనూ, ఏళ్ళలోనూ, దూడలను వెదికాడు.

ఇలా అంతటా కృష్ణుడు దూడలను వనమంతా వెదకుతూ ఉండగా

అప్పుడు బ్రహ్మ ఇలా అనుకున్నాడు. ఈ శ్రీకృష్ణుడు చూస్తే చిన్నపిల్లవాడు. ఇట్టివాడు అఘాసురుడు దూడలను, గోపబాలురను చంపినప్పుడు ఎలా వాటిని, వాళ్ళను బతికించాడో! భూలోకంలో ఇట్టిది వింతే! అనుకొని వచ్చి ఆ కపట మానవరూపుడైన ఆ శ్రీకృష్ణుని బలం ఎంతటిదో చూడాలనుకుని, అడవిలోకి దూరంగా పోయిన దూడలను, అక్కడ చల్ది కుడుస్తున్న గోపబాలురను ఒకచోట దాచివేశాడు.

అలా అడవిలో దూడలను వెతుకుతున్న కృష్ణుడు, వాటిజాడ తెలియక పోవడంతో దారి తప్పి, తాను గోపాలకులతో చల్ది తిన్న కొలనువద్దకు వచ్చి చూస్తే అక్కడ గోపబాలురూ లేరు. పిలిస్తే ఎవరూ పలుకలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆలోచించి, ఇలా దూడలను, గోపాలకులను మాయం చేయడం బ్రహ్మ చేసిన మోసమే అని తెలిసినవాడై అక్కడి నుండి వెళుతూ

శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు - బ్రహ్మకు నన్ను మోసగించే అవసరం లేదు. అయినా, ఇక్కడ దూడలనూ, గొల్ల పిల్లలనూ, నాకు కనబడకుండా మోసపుచ్చాడు. నేను తిరిగి అతణ్ణి మోసపుచ్చడం అదేమంత పనా? అది ఆశ్చర్యం కాదు. మనకెందుకు? లేగలను, గోపబాలురను మరల తీసుకొని రావడానికి బ్రహ్మను వంచించాల్సిన పనేముంది? అనుకొంటూ బ్రహ్మాండాలనే వంచించగల, మరలించగల సామర్థ్యముండే శ్రీకృష్ణుడు విలాసంగా నవ్వుతూ

నేను బృందావనానికి వెళ్ళి, గోపస్త్రీలతో మీ పిల్లలు లేరు, ఏమయ్యారో తెలీదు అంటూ చెప్పడం దేనికి? ఆ గోపబాలుర తల్లిదండ్రులు సంతోషించేలా నేనే గోపబాలురులా, దూడల్లా వాళ్ళ రూపాలతో తిరుగుతూ వుంటాను. ఇలా శ్రీకృష్ణుడు అనుకున్నవాడై

శ్రీకృష్ణుడు పై రీతిగా భావించినవాడై గోపబాలుర, దూడల రూపాలను తానే ధరించాడు. ఆ ధరించడంలో ఏ మాత్రం తేడా లేకుండా, వాళ్లచేతులు, కాళ్ళు, ముఖాలు, నడుములు, వక్షఃస్థలాలు, నాసికలు, నేత్రాలు, చెవులు, మొదలైన శరీరఅవయవాలన్నీ ఆ విధంగానే ఉండేటట్లుగానూ, వాళ్ళచేతికర్రలు, కట్టుకున్నబట్టలు, వేసుకున్న పూలమాలలు, పట్టుకున్న కొమ్ముబూరలు, అలంకారాలు, వయస్సు, మాట్లాడే మాటతీరు, స్వభావాలు, పూర్వం జరిగిన వృత్తాంతాలను చెప్పేతీరు, వారి వారి కున్న ఆసక్తులు, ఎక్కడా మారుపడకుండా, దూడల రూపాలనూ, గొల్ల పిల్లల రూపాలను శ్రీకృష్ణుడే ధరించాడు.

ఈ చరాచరమైన సమస్తజగత్తులో ఉండే రూపాలన్నీ తానే. అట్టి అన్నిరూపాలలో కనిపించే భగవంతుడు ఇలా గోపబాలురుగా, దూడలుగా రూపం పొంది, అతిశయించడంలో ఆశ్చర్యం ఏముంది? అంతేకాదు, ఆలోచించి చూస్తే ఆ సర్వాత్మకునికి ఇతర రూపమేదైనా లోకంలో ఉందా? ఆ పరమాత్మకు మించి అన్యమైన ఏ రూపం లేదు.

ఓ పరీక్షిన్మహారాజా! దూడలను మళ్ళించండి అనేవాడూ, అలా చెప్పగా మళ్ళించే గోపబాలురూ, దాంతో వెనక్కి మళ్ళిన దూడలూ, అన్నీ తానే అయి శ్రీకృష్ణుడు అడవినుండి బృందావనానికి తిరిగి బయలు దేరాడు.

ఈ రీతిగా శ్రీకృష్ణుడు తానే బాలుర, దూడల రూపాలు ధరించి చరిస్తూ, బృందావనం చేరి, ఎవరెవరిపశువుల దొడ్లలో వారి వారికి చెందిన దూడలను - అంతకు ముందు ఎక్కడెక్కడ వుండేవో అక్కడే నిలిపాడు. అలాగే ఆయా బాలుర రూపాలతో వారివారిఇండ్లలో చేరి, పిల్లనగ్రోవులు ఊదగా

ఇలా కృష్ణుడే గోపబాలుర వేషం ధరించి, వేణువు ఊదుతూ ఉంటే ఆ ధ్వనులు ఒక్కసారిగా తమ చెవులకు ఎంతో ఇంపు కావడంతో తల్లులు లేచి, పిల్లలను ఎత్తుకొని, వాళ్ళశిరస్సులను ప్రేమగా మూర్కొని, దగ్గరగా తీసుకోవడంతో, వాళ్ళలోని మాతృత్వం ఒక్కసారిగా పెల్లుబికింది. దాంతో పాలిండ్లు బాగా చేపుకు వచ్చాయి. అమృతంతో సమానంగా ఉండే తమ స్తన్యాన్ని ఎంతో ఉత్సాహంతో తమ తమ పిల్లలు తాగేలా ఇచ్చారు.

అంతే కాకుండా ఆ బాలుర తల్లులు తమ తమ హృదయాలలో ముంపు గొనేలా వచ్చే ఉత్సాహాలతో, తమ తమ బిడ్డలకు నలుగు పిండితో ఒంటికి నలుగు పెట్టారు. చక్కగా స్నానాలు చేయించారు. మంచి గంధం పూశారు. అలంకారాలు తొడిగారు. నుదుట రక్షా తిలకాలుగా కావిరి బొట్లు పెట్టారు. షడ్రసోపేతమైన పదార్థాలతో భోజనాలు పెట్టారు. ఎంతో ఎక్కువగా ఆదరించారు.

ఓ రాజా! కృష్ణుడు ఈ విధంగా వత్సల, బాలకుల రూపాలను పొందక మునుపు అసలైన ఆ పిల్లలు తమ తమ తల్లులకు ఏ విధంగా ఆనందం కలిగించేవారో ఇప్పుడు కూడా ఆ బాలకులు ఆ తల్లులకు అదే రీతిలో ఆనందం కలుగ జేశారు.

ఆవులన్నీ మిక్కిలి సంతోషంతో తమను కట్టివేసిన చోట్లకు పోయి, అంబే అంటూ అరుస్తున్నాయి. హుంకారం చేస్తున్నాయి. దూడలను మూచూస్తూ మూత్రాన్ని విడిచిపెడుతున్నాయి. దూడల్ని నాకుతూ, అందువల్ల ఎడతెగని రీతిగా ఎక్కువగా కారుతున్న పాలను తమ దూడలకు అభిముఖంగా ఉండి దూడలన్నిటికీ ఇచ్చాయి.

గోపికలకూ, గోవులకూ కూడా తమతమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిమీద మాతృప్రేమ ఎంతో కలిగింది. అలాగే కృష్ణుడు కూడా వారిని తల్లులంటూ ఎంతో స్వచ్చమైన ప్రేమతో వారిమధ్య మిక్కిలి పసితనంతో ప్రవర్తించాడు.

ఆ గొల్లపల్లెలోని వారందరికీ పూర్వం శ్రీకృష్ణునిమీద తమకు ఎల్లప్పుడూ కొత్త కొత్తగా ప్రీతి కలిగినట్లు, ఇప్పుడు తమ బిడ్డలమీద కూడా అటువంటి ప్రీతి రోజు రోజుకూ అధికం కాసాగింది.

ఈ విధంగా కృష్ణుడు తానే దూడల రూపాన్నీ బాలుర రూపాన్నీ ధరించి, తనను తానే రక్షించుకుంటూ, అటు బృందావనంలోనూ, ఇటు అడవిలోనూ గొప్ప మహిమతో ఓ సంవత్సరం నటించాడు. సంవత్సరానికి ఇంకో అయిదారురోజులు తక్కువయి ఉన్నప్పుడు బలరామునితో కలసి శ్రీకృష్ణుడు అడవికి వెళ్లాడు. బృందావనానికి దగ్గరలో దూడలు మేస్తున్నాయి. అక్కడికి చాలా దూరంలో వున్న గోవర్ధనపర్వతశిఖరంమీద గడ్డి మేస్తున్న ఆవులు ఈ దూడల్నీ చూచి

దూడలను చూచిన ఆ ఆవులు, సంతోషంతో హుంకారం చేస్తూ మూపురాల పై దాకా మెడలు పైకెత్తి చాచుతూ, నాలుగు కాళ్ళూ రెండే అయినట్లు దగ్గరగా చేర్చి దాటుతూ, ముఖాలను పొడవైన తోకలను పైకెత్తి పరిగెత్తి వచ్చి దూడలను మింగేస్తాయా అన్నట్లు మూతులతో నాకుతూ తమపాలు తాగించాయి.

అలా ఎప్పుడైతే ఒక్కసారిగా దూకుతూ అవులు వెళ్లాయో, వాటిల్ని మేపుతున్న గొల్లవారు వాటిల్ని అడ్డగించడానికి శక్యం కాకపోవడంతో, కోపంతో కూడి ఎంతో లజ్జించినవారై చొర శక్యంకాని వాటిమార్గంలో తామూ శీఘ్రంగా వాటి వెంటే వచ్చి అక్కడ దూడలను మేపుతున్న తమ పిల్లలను చూచి

అలా తమ బిడ్డలను చూచిన ఆ గోపకులు మా కన్నతండ్రులను చూశామంటూ దగ్గరకు వచ్చి గగుర్పాటు పొందారు. బిడ్డలను ఎత్తుకొంటూ, ఆనందిస్తూ, కౌగిలించుకున్నారు. మనస్సులు నిండిన ఆనందంతో ఆ బిడ్డల శిరస్సులను ఆఘ్రాణించి, ముద్దుచేశారు. ఆ గోపకులు ఎంతగానో ఉప్పొంగి పోయారు. నిలకడ అయిన వారిసంతోషం ఆ దేవుడికే తెలియాలి.

ఈ రీతిగా పిల్లలను దగ్గరగా తీసుకొని కౌగిలించుకొని ఆనందబాష్పాలు నిండిన కనులతో గోపకులు తమ గోవులను మళ్ళించుకొని పోగా, వాళ్ళను చూచి బలరాముడు ఇలా అనుకున్నాడు.

బలరాముడు ఈ సన్నివేశాన్ని చూచి, ఇలా భావిస్తున్నాడు. స్తన్యపానం విడిచిన వయస్సుగల ఈ పిల్లల పైనా, దూడలమీదా గోపాలకులకూ, గోవులకూ ఇంతటి ప్రేమ ఏ కారణంగా పుట్టింది? ఇదివరకు కృష్ణునిపై ఎంత మమకారంతో ఉండేవారో, ఇప్పుడు తమబిడ్డలపై ఆ విధమైన ప్రేమనే చూపుతున్నారు. నాకుకూడా ఈ పిల్లలను, దూడలను చూస్తూవుంటే కృష్ణుణ్ణి చూచినట్లే ప్రేమ కలుగుతోంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు ఇటువంటిది ఎన్నడూ ఎరుగను. ఒక వేళ ఇది మానవుల, లేక దేవతల, లేదా రాక్షసుల మాయ అయి ఉంటుందా? లేకుంటే నా స్వామి అయిన ఆ విష్ణుమూర్తిమాయేనా! ఇతరులు కల్పించే మాయ అయితే నన్ను ఈ విధంగా కలవరపెట్టదు. ఇది నిజంగా విష్ణుమాయే కావచ్చు.

ఓ రాజా! బలరాముడు మొదట సామాన్యబుద్ధితో ఏమీ తెలియనట్లు ఆలోచించి, తరువాత జ్ఞానదృష్టితో చూశాడు. ఇంకేముంది! అసలు విషయం బయటపడింది. ఇలా తనతో ఉండే గొల్లపిల్లలూ, దూడలూ కూడా శ్రీకృష్ణునిరూపాలే అని తెలుసుకొన్నాడు.

యోగద్భష్టితో బలరాముడు బాలురను, దూడలను కృష్ణుని రూపాలుగానే తెలుసుకొనికూడా కంగారుపడుతూ, కృష్ణుణ్ణి చూచి ఇలా అడిగాడు. 'మహానుభావా! ఇంతకుముందు ఈ దూడలన్నీ మహర్షుల అంశలతో పుట్టినవనీ, సంశయం లేకుండా గోపాలకులందరూ దేవతల అంశలతో జన్మించినవారనీ అనిపించేది. ఇపుడు బాలుర, దూడల సమూహాలు అన్నీ నీవే అనిపిస్తోంది. ఏమిటిదంతా?' అని అడిగిన అన్న బలరామునితో కృష్ణుడు ఎంతో గౌరవంగా అసలు విషయాన్ని తెలియజేశాడు. బలరాముడికి విషయం అంతా అర్ధమయింది. ఇలా శ్రీకృష్ణుడు దూడల రూపమూ, బాలుర రూపమూ తానే అయి వ్యవహరించిన సంవత్సర కాలం బ్రహ్మదేవునికి తన కాలమాన ప్రకారం ఒక క్షణంమాత్రమే కాగా, బ్రహ్మ అచటికి వచ్చి, దూడల, గోపబాలుర రూపుడైన బాలకృష్ణుణ్ణి చూచి, నివ్వెరపోయి తనలో ఇలా ఆలోచించాడు.

ఈ గొల్లపల్లెలో ఉండే దూడలూ, గోపబాలురూ కూడా నా మాయాగుహలో నిద్రపోతున్నారు. ఎక్కడికీ వెళ్లరు. ఇప్పుడే లేవరు. అలాంటప్పుడు వీళ్లను వేరుగా సృష్టించడానికి నాకంటే వేరే ఇతరబ్రహ్మలు ఎవరూ లేరు. మరి ఈ బాలురు, దూడలు ఎవరో, ఎక్కడనుండి వచ్చారో, కృష్ణునితో కలిసి తిరుగుతున్నారు. ఆలోచిస్తే భూలోకంలో నేటికి సంవత్సరం అయింది - నేను వీళ్ళను మాయం చేసి. ఇలా అనుకుంటున్నాడు - బ్రహ్మ

ఏ లోకంలో నైనా ప్రాణికోటి బ్రహ్మ సృష్టిస్తేనే పుడుతుంది. బ్రహ్మ అనేవాణ్ణి నేనొక్కణ్ణే గాని సృష్టికర్తగా మరో బ్రహ్మ లేడు. బ్రహ్మగా వీళ్ళను నేను సృష్టించాను. మరి వేరే ఈ బాలుర, దూడల సమూహం ఏ బ్రహ్మ సృష్టిస్తే ఏర్పడింది? విచారించి చూస్తే ఇందరిలో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మే ఇలా రూపొందించాడేమో ననిపిస్తుంది.

అన్ని విషయాలను సులభంగా తెలుసుకోగల నేర్పరియైన ఆ పితామహుడు, జ్ఞానవృద్దుడు. అయిన బ్రహ్మ ఆశ్చర్యపడి వెంటనే ఎంతో సేపు విచారించి ముందు చేయవలసిన కార్యం తెలియక పోవడంతో ఆందోళనపడుతూ,

ఏ రకమైన భ్రమ లేకుండా, జగత్తులన్నిటినీ మోహింపజేయగల విష్ణువును మాయలోపడేటట్లు చేద్దామనుకొని, బ్రహ్మ భ్రమతో తానే మోహంలో పడ్డాడు.

మిణుగురు పురుగుల కాంతి పగటివేళ అణగిపోతుందే కాని ప్రకాశించదు. రాత్రివేళ మంచు చీకట్లో కలిసిపోయి మాయమవుతుంది. విష్ణువు మాయకు పుట్టినిల్లు అటువంటి విష్ణువుపై ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పన్నిన దొరల గౌరవాన్ని అవి చెడగొట్టేస్తాయేగాని పనిచేయవు.

అంతే కాకుండా, ఇంకా

విష్ణుదేవుని నాభికమలంనుండి ఏనాడో పుట్టాను, మంచిజ్ఞానం పొందాను, లోకాలను సృష్టించాను, వయసా? సగం గడచిపోయింది. కానీ భూలోకంలో ఇట్టి నూతనసృష్టులు, ఇటువంటి మాయాచేష్టలు పుట్టడం ఆశ్చర్యం! నాముందే ఇలాంటి మాయలా?

సకలవిద్యాస్వరూపిణి అయిన వాణి తన ముఖంలో ఉందనే గర్వంతో ఉన్న మాయావి అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ తన మనస్సులో పరిపరివిధాల తర్కించి ఆలోచిస్తున్న సమయంలో, అతనికి ఆ గోపబాలురు ఇలా కనబడ్డారు. నీల మేఘశ్యాముడైన ఆ విష్ణుస్వరూపంగానే వీళ్ళూ ఉన్నారు. హారాలతో, మకరకుండలాలతో, స్వర్ణకటకాలు, కంకణాలు, బంగారు మొలతాళ్ళతో, శిరస్సునుండి పాదాలవరకున్న తులసిమాలలతో; చక్కని ఉంగరాలతో, శంఖం, చక్రం, గద, పద్మంతో కూడినచేతులతో, నాలుగుభుజాలతో, పచ్చని పట్టువస్త్రాలతో, వెన్నెలవంటి స్వచ్చమైన నవ్వులతో, దయా స్వభావంగల చూపులతో, కోటిసూర్యుల తేజస్సుతో, అంతం లేని సత్య, జ్ఞాన, ఆనంద రూపాలతో, అణిమాదిగుణాలతో, జాతిభేదం లేనివారై ; శ్రీమహావిష్ణుస్వరూపంతో సమానమైన దేహంతో కూడినవారుగా వారున్నారు. అంతే కాదు, వారు తమకు అధీనం అయిన ఆట పాట మొదలైన సేవాకార్యక్రమాలలో చేరి, ప్రవర్తిస్తున్న ఆకారం పొందిన బ్రహ్మ మొదలు సకల జంగమ స్థావరరూపాలు, అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే అప్టసిద్దులు, పరాశక్తితోపాటు ఆది, జ్ఞాన, ఇచ్చా, క్రియాశక్తులు, మహత్తు, బుద్ధి, మనస్సు, అహంకారంతోపాటు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇలా ఇరవైనాలుగుతత్త్వాలు, సత్త్వరజస్తమోగుణాలు, కలత, కాలం, దానిమార్పు, కారణం, సంస్కారం, కామం, కర్మలు అనే గుణాలు, ఇలా ఇవన్నీ సేవిస్తూ ఉండగా, వేద వేదాంతవిజ్ఞానపరులైన బ్రహ్మవేత్తలకు కూడా తెలియరానివిధంగా ప్రకాశిస్తూ బ్రహ్మకు కనబడ్డారు. వారిని చూస్తూ స్వయంభువుడైన బ్రహ్మదేవునికి గోపబాలురు, గోవులు అన్నీ ఏకకాలంలో పరబ్రహ్మరూపులుగా కనబడగా చూచి

“నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందునుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉంది. వారి వర్చస్సు చూడటానికి నా చూపులకు శక్తి చాలడంలేదు. దీని కంతటికీ మూలకారణ మేమిటి? ఇప్పుడు నే నేమిటి చేయడం? ఆహా! సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది గదా!”

ఇలా అనుకున్న వాడైన బ్రహ్మకు ఆ బాలురరూపాలు మనస్సుతో పాటు పంచజ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు భరింప శక్యంకాకపోవడంతో చేష్టలు దక్కి బాగా అలసిపోయినవాడై

సర్వేశ్వరుడైన ఏ భగవంతునితేజస్సుచే ఈ జంగమ స్థావర రూపమైన సకల జగత్తు ప్రకాశిస్తోందో, అట్టి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని తేజస్సును చూడడానికి సమర్థుడుకాక, సర్వేంద్రియాలశక్తి క్షీణించి, పారవశ్యంతో బ్రహ్మ నిశ్చేష్టుడై నిలచాడు. అప్పుడతడెలా ఉన్నాడంటే, ఒక చిత్తరువులో వేసినచిత్రం ఎలాగైతే చలనం లేకుండా ఉంటుందో అలా ఉన్నాడు.

అవ్యక్త రూపమైన మాయకు లోబడనివాడును, ఉపనిషదర్థవిచారంచేసే విజ్ఞానంచేతకూడా పొంద శక్యం కానివాడును, తనంతట తానే వెలిగే వెలుగుతో అధికంగా ఆనందించేవాడును అయినట్టి శ్రీకృష్ణుని విరాడ్రూపాన్ని చూచి, నిశ్చేష్టుడై ఉన్న బ్రహ్మను చూచి శ్రీకృష్ణమూర్తి

శ్రీకృష్ణుడు బ్రహ్మను చూచి, 'పాపం ఈ చతుర్ముఖుడు బాలభావంతో తానే సృష్టిఅంతటికీ మూలం అయిన బ్రహ్మననే అభిమానగర్వంతో తెలివిదప్పి, నా మహిమను చూద్దామని వచ్చాడు. నా మాహాత్యాన్ని చూడడానికి అతడెంతటివాడు?' అనుకొంటూ జగత్తంతటినీ క్రీడగా చేసి చూపే ఆ శ్రీకృష్ణుడు తాను పన్నిన ఆ మాయ అనే వలను విడదీసి, తనలీలారూపాలైన గొల్ల పిల్లలను, దూడలను అక్కడ మరుగుపరచాడు.

ఆ సమయంలో బ్రహ్మ చచ్చిపోయినవాడు బ్రతికినట్లుగా తేరుకొని ఒక్కసారి ఒళ్ళు తెలుసుకొని సమాళించుకున్నాడు. కాళ్లూ చేతులు కదిలించాడు, కళ్ళు విప్పి చూచే స్థితికి వచ్చాడు. ముందుకు, వెనుకకు, మీదికి, అన్ని దిక్కులకూ దృష్టి సారించాడు. అప్పుడు తన ముందుభాగంలోనే శ్రీకృష్ణమూర్తి ఉండడం కారణంగా నరులు, పక్షులు, జంతువులు తమ జాతిసహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సంపద ఉంది. అందులో ఉన్నవారికెవరికీ కామక్రోధాలు లేవు. అలాంటి బృందావనం చూశాడు - బ్రహ్మ. ఆ బృందావనంలోనే

తనకంటె వేరేమియు లేక సృష్టి స్ధితి, లయాదులకు కర్తలైన త్రిమూర్తులకు మూలపురుషుడైన వాడూ, ఆవుదూడలను వెదకుచున్నవాడూ; సర్వజ్ఞుడై ఒంటరివాడుగా ఉన్నా అజ్ఞానాకారంతో పెక్కుమంది స్నేహితులను పిలిచేవాడూ, బయట, లోపల, ఆది, మధ్య అనే భావాలు లేనివాడైనా అక్కడక్కడా లేగల అడుగుజాడలను వెదికేవాడు, ఎంతో గంభీరుడైనా అటూ, ఇటూ పరిగెడుతూ ఆటలాడేవాడూ, జాతిభేదాలు లేనివాడైనా గొల్లపిల్లాడిస్వభావం అచ్చుపడే శరీరంతో ఒప్పేవాడూ, చేతిలో చల్దిముద్దతో ఉన్నవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మ చూశాడు.

అలా శ్రీకృష్ణుని చూసి, తడబాటుతో బ్రహ్మ ఒక్కసారి తన వాహనం హంస పై నుండి దభాలున భూమిపైకి దుమికి, బంగారు దండంలా కోమలంగా వున్నతన శరీరంతో నేలపై సాష్టాంగపడ్డాడు. తన కిరీటం కొనలో వున్న రత్నాది మణుల కాంతులు ఆ బాలకృష్ణుని పాదాలు సోకేలా నమస్కరించాడు. ఆనందం ఎక్కువ కావడంతో కళ్ళనుండి జారే కన్నీటి ప్రవాహంతో అతని పాదాలను కడిగాడు ఇంకా

ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మ శ్రీకృష్ణునిపాదాలపై పడుతూ లేస్తున్నాడు. మళ్ళీ పడుతున్నాడు లేస్తున్నాడు. ముందు తాను చూచిన శ్రీకృష్ణునిమాహాత్యం అనే సముద్రంలో తన ఉద్ధతిని అణచివేశాడు. తాను చేసిన తప్పిదాన్ని అణచుకున్నాడన్న మాట.

అనంతరం బ్రహ్మ మెల్ల మెల్లగా లేచి నిలుచున్నవాడై కమలాలవంటి కళ్ళు తెరచి, శ్రీకృష్ణుణి చక్కగా దర్శించి, నాలుగు ముఖాలు వంచి, రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ, గొంతు కొంత తడబడగా, ఏకాగ్ర చిత్తంతో, నాలుగుముఖాలతో ఇలా సోత్రం చేశాడు.

శ్రీకృష్ణమూర్తిని బ్రహ్మస్తుతించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను...