అన్ని పురాణాల అర్థ వివరణలో అత్యంత సమర్థమైన వాగ్దోరణి గల సూతమహర్షి గొప్ప గుణాలచేత మహోన్నతులైన ఆ ముని శ్రేష్ఠులకు, శుకయోగీంద్రుణ్ణి చూచి పరీక్షిన్మహారాజు ఈ విధంగా అడిగాడని అన్నాడు.
చంద్రసూర్యవంశాలు విస్తరిల్లిన తీరును, ఆ వంశాల రాజుల చరిత్రలను విన్నాము. ఉన్నవి ఉన్నట్లు మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు మాకు తెలియ చెప్పావు.
మహాత్ముడు, లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు సత్ప్రవర్తనగల యదువంశంలో ఎందుకు జన్మించాడు? ఏవిధంగా నడచుకొన్నాడు. ఎప్పుడెప్పుడు ఏ యే పనులు చేశాడు? చక్కగా వివరించండి.
శ్రీహరి స్తోత్రం జన్మరాహిత్యానికి మందు. మనస్సుకు, చెవులకు ఆనందం. మోక్షాపేక్షకలవారికి స్థానం. అలాంటి శ్రీహరిస్తోత్రాన్ని విని - కసాయివాడు తప్ప, 'ఇక చాలు. నా చెవులకు తృప్తి కలిగింది' అనే మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా? (ఉండడని భావం)
ఇదివరలో దేవతలకు కూడా దాటశక్యం కాని భీష్మాదికురువంశశ్రేష్ఠులతో కూడిన సేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఏ తెప్పసాయంతో ఒక పసిబాలుడి పాదముద్రను దాటినట్లు దాటగలిగారు?
పాండవ వంశాన్ని నిలబెట్టటానికి మహానుభావుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధం చేపట్టి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంవల్ల చైతన్యం లేనివాడినై మా తల్లిగర్భంలో ఉన్న నన్ను రక్షించాడు.
పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు త్రికాలస్వరూపాలతోకూడి, లోకంలోని జనుల వెలుపల లోపల ఉండి, జనన మరణాలను, సంసార మోక్షాలను ఇస్తున్నాడు. ఆయన చరిత్రనంతా చెప్పండి.
('అంతర్బహి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః' - 'ఈ సృష్టి సమస్తంలో లోపల వెలుపల వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు అని శ్రుతి.)
శుకయోగీంద్రా! బలరాముడు రోహిణీదేవి కుమారుడని ఇంతకుముందే చెప్పావు. కానీ, ఇంకొక శరీరం లేకుండా దేవకీదేవి గర్భంలో ఆయన ఎలా ఉండినాడు? కృష్ణుడు మధురలో తనతండ్రి ఉన్న మందిరాన్ని వదలి ఏ విధంగా వ్రేపల్లెకు వెళ్ళాడు? ఎవరి ఇంట్లో ఉండినాడు. ఏమి చేస్తూ ఉండినాడు? తన మేనమామ అయిన కంసుణ్ణి ఎందుకు సంహరించాడు? ఎన్ని సంవత్సరాలు ఈ నేలమీద మానవుడుగా జీవించాడు? ఆయనకు భార్యలు ఎంతమంది? వారితో ఏ విధంగా ప్రవర్తించాడు? ఇంకా ఏమి చేశాడు? ఆ మాధవునిచరిత్ర అంతా నాకు వివరంగా చెప్పండి.
(దేవకీదేవి గర్భంలో ఫలదీకరణ జరిగిన వెంటనే యోగమాయాప్రభావంతో ఆ పిండాన్ని రోహిణీదేవి గర్భంలోకి మార్చటం జరిగింది. తరువాత ఆ పిండం రోహిణిగర్భంలోనే పెరిగి బలరాముడు జన్మించాడు. ఇది ఒక అద్భుతం, అభూత కల్పన అని ఇదివరకు చాలమంది పెదవి విరిచేవారు. కాని, ఆధునిక వైద్యవిజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా!
ఇవే కాదు - మన వేదశాస్త్రపురాణాల్లో అసహజాలు, అసంభవాలు, అభూతకల్పనలు అని అపహసించిన అనేక అంశాలు ఆధునికయుగంలో విజ్ఞానశాస్త్రపరిశోధనల ద్వారా నిరూపితాలౌతున్నాయి.)
అని, పరీక్షిన్మహారాజు శుకయోగితో ఇంకా ఇట్లా అన్నాడు.
నీ ముఖపద్మంనుండి వెలువడిన విష్ణుకథ అనే అమృతాన్ని త్రావి త్రావి నా శరీరం ఉప్పాంగింది. దుఃఖం వదలిపోయింది. దప్పిక, ఆకలి దూరమయ్యాయి. మనస్సు వికాసం పొందింది.
పై విధంగా అంటూ ఉన్న పరీక్షిన్మహారాజు మాటలు విని వ్యాసపుత్రుడైన శుకయోగి ఇలా అన్నాడు.
విష్ణుకథలందే మనస్సు లీనమైనవారిని, విష్ణుకథలు చెప్పేవారిని, విష్ణుకథలు వినేవారిని-ఆ విష్ణుకథాప్రసంగం విష్ణుపాదంనుండి పుట్టిన గంగాజలంవలె పవిత్రుల్ని చేస్తుంది.
(వామనావతారంలో విష్ణుమూర్తి ఒకపాదం పైకెత్తి ఆకాశాన్ని ఆక్రమించాడు. బ్రహ్మదేవుడు ఆ విష్ణుపాదాన్ని తన కమండలంలోని నీటితో కడిగాడు. ఆ నీరే గంగానది అయిందని పురాణగాథ. అందుకే గంగ విష్ణుపాదోద్భవ.)
పరీక్షిన్మహారాజా! చెబుతాను విను. పూర్వం వేలకొలది రాక్షసులు రాజ్యాధికారాలు చేపట్టి తన్నాక్రమించగా, భూదేవి ఆ రాక్షసభారాన్ని మోయలేక గోరూపం ధరించి బ్రహ్మదేవుని దగ్గరకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. బ్రహ్మదేవుడు దయతో భూదేవి నోదార్చి, ఆ భూదేవినీ, దేవతలనూ వెంటబెట్టుకొని విష్ణుమూర్తిని దర్శించాడు. పురుషసూక్తంతో ఆయన్ను స్తుతించాడు. సమాధిస్థితుడయ్యాడు. ఆ విధంగా సమాధి స్థితుడైన బ్రహ్మాదేవునికి ఒకమాట వినిపించింది. తరువాత ఆయన ఓ దేవతలారా! ఓ భూదేవీ! నేను విన్నమాట మీకు వివరిస్తాను అని ప్రియంగా ఇలా అన్నాడు.
దేవతల్లారా! మీరందరూ మీ మీ అంశలతో భూమిమీద యాదవకులంలో పుట్టండి. లక్ష్మీపతి అయిన శ్రీమహావిష్ణువు ప్రేమతో వసుదేవునిపుత్రుడుగా జన్మించి, భూభారాన్నంతా తొలగిస్తాడు.
దేవతాస్త్రీల్లారా! మీరు అందమైన శరీరాలు గలవారై శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుణ్జి పూజించటానికి భూలోకంలో పుట్టండి. ఆదిశేషుడు ఆ విష్ణుమూర్తికళతోనే శ్రీకృష్ణునికి అన్నగా పుట్టి, ఆయనకు ప్రియమైన పనులు చేస్తుంటాడు.
ఈ ప్రపంచం అంతా ఏ మాయచేత మోహబుద్ధిని చెందుతూ ఉంటుందో. ఆ విష్ణుమాయ, విష్ణువుఆజ్ఞచేతనే ఆయన అంశతోనే ఒకానొక పనికొరకు భూమిపైన జన్మిస్తుంది.
(అనిత్యమగు ఈ జగత్తంతా నిత్యమని భ్రమింప చేసేదే మాయ. ఈ మాయనే విష్ణుమాయ, యోగమాయ అని తత్త్వవేత్త లంటారు.)
బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పి దేవతలను సమ్మతింపచేసి, భూదేవిని ఒప్పించి, తన తొలి నివాసస్థానానికి వెళ్ళాడు. తరువాత, యాదవులకు ప్రభువైన శూరసేనమహారాజు మథురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధుర, శూరసేన దేశాలను పరిపాలించాడు.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీమన్నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఏ మథురానగరంలో ఎల్లప్పుడు ప్రీతితో విహరించాడో ఆ మథురానగరమే యాదవరాజులందరికి రాజధాని అయింది.
శూరసేనుని కుమారుడైన వసుదేవుడు ఒకరోజు మథురా నగరంలో దేవకుని కూతురైన దేవకిని వివాహమాడాడు. నూత్నదంపతులు ఎంతో సంతోషంతో రథమెక్కి బయలుదేరుతున్న సమయంలో - ఉగ్రసేనునికుమారుడైన కంసుడు ఉత్సాహంతో, చెల్లెలు దేవకీదేవి, మరది వసుదేవుడు సంతోషించగా, గుర్రాలపగ్గాలు చేపట్టి, రథానికి ముందు భాగంలో పెద్దనగారాలు, మద్దెలలు, శంఖాలు, తప్పెట్లు ఎడతెరిపిలేకుండ మ్రోగుతుండగా, గుర్రాల్ని అదిలించి, రథాన్ని నడపటానికి పూనుకొన్నాడు. దేవకీదేవితండ్రి తనకూతురికి పుట్టింటివారు ఇచ్చే కానుకలు ఇవ్వాలని ఆలోచించి, ప్రేమాభిమానాలతో
(ఉగ్రసేనుడు, దేవకుడు ఆహుకుని కొడుకులు; అన్నదమ్ములు. ఉగ్రసేనుడికి తొమ్మిదిమంది కుమారులు; నలుగురు కుమార్తెలు. కొడుకులలో కంసుడు పెద్దవాడు. దేవకునిపుత్రిక దేవకిదేవి. కంసునికి చిన్నాయన కూతురు. శూరసేనునికి దేవమీఢు డని మరొకపేరు. ఇతని పుత్రుడే వసుదేవుడు.)
సంపదలతో నింపబడిన పదునెనిమిదివందల రథాలను, బంగారు కట్టుగొలుసులు గల నాలుగువందల ఎత్తెన ఏనుగులను, పదివేల గుర్రాలను, ఒయ్యారులైన రెండువందల మంది పనిగత్తెలనూ అరణంగా ఇచ్చి పంపగా, వధూవరులజంట మార్గంవెంట బయలుదేరి వెళ్ళుతున్న సమయంలో
(అరణము - క్రొత్త పెళ్ళికూతురికి పుట్టింటివారు ఇచ్చి పంపే కానుకలు.)
గుర్రాల పగ్గాలు సడలించి, వేగంగా రథాన్ని నడుపుతున్న కంసునిగుండెలు అదిరేట్టు, ఆకాశవాణి హఠాత్తుగా ఇలా పలికింది.
"సంతృప్తితో ఉన్న నీ తోబుట్టువు దేవకి మెచ్చుకొనేటట్లుగ, నీవు ఎంతో ప్రీతిగా రథాన్ని తోలుతున్నావు. మున్ముందు ఏమి జరుగుతుందో నీ వెరుగవు. ఈమె అష్టమసంతానం నీ పాలిటి మృత్యువౌతుంది సుమా!"
అని ఈ విధంగా ఆకాశవాణి పలుకగా, భోజవంశాన్ని చెరిచేవాడైన కంసుడు అదిరిపడి మూపులు కదలుతుండగా ఒరనుండి కత్తిని భయంకరంగా లాగి, జళిపించి, చెల్లెలైన దేవకీదేవి కొప్పును చెదరలాగి, ఒడిసిపట్టుకొని, చెల్లెలనికూడ చూడకుండ తెగించి ఆమెను తెగనరుకుటకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వసుదేవుడు సమీపించి
మదించినవాడు, అగ్నిజ్వాలవలె కోపంతో మండుతున్నవాడు, పాపాత్ముడు అయిన కంసుణ్ణి - వసుదేవుడు పూనికతో తన మంచిమాటలనెడి అమృతధారలతో కొంతకు కొంత శాంతపరిచాడు.
బావా! అన్నవైన నీవు నీ చెల్లెలికి బంగారునాణాలివ్వాలి. చీరలివ్వాలి. మర్యాద చెయ్యాలి. తీయని మృదువైన మాటలతో ఆదరించాలి. అంతేగాని, ఆకాశవాణి పలుకులే నిజమని, నీకు మేలు చేసేవని నమ్మి, చెల్లెల్ని చంపవద్దయ్యా! నీ ప్రయత్నాన్ని విరమించు. ఓర్పు వహించు. నిన్ను వేడుకొంటున్నాను. దేవకిని వధించవద్దు.
అంతమాత్రమే కాకుండా
భోజవంశప్రభువువైన ఓ కంసా! నీవు మంచి వంశంలో జన్మించావు. పుణ్యాత్ముడవు. చెల్లెలు కూతురితో సమానురాలు. అమాయకురాలు, అశక్తురాలు, నీ క్షేమాన్ని కోరుకొనేది ఎలాంటి కల్మషంలేని స్నేహితురాలు ఈ దేవకిని, ఏదో ఆకాశంలోని పలుకులు విని తెగనరకటం న్యాయమా? ఇది చాలాపాపం కనుక కోపంమాని ఆలోచించుకో.
(కోపాన్ని తగ్గించటానికి, పాపపు పనులు ఆపటానికి అప్పుడప్పుడు ప్రశంస అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు వసుదేవుడు చేసిన కంస ప్రశంస దేవకీదేవి ప్రాణాన్ని కాపాడింది.)
మానవులకు దేహంతోపాటే మరణం కూడా పుట్టుతుంది. ఈ రోజైనా, రేపైనా, నూరేండ్లకయినా మరణం తప్పదు. జీవుడు మరణాన్ని పొంది కర్మానుసారియై, పచ్చిగడ్డిమీద ప్రాకే జలగ తనముందు భాగాన్ని పైకెత్తి వేరొక గడ్డిపరకమీద మోపి, తరువాత వెనుకభాగాన్ని ఎత్తి ముందుకు సాగినట్లు -క్రొత్తదేహాన్ని పొంది పాతదేహాన్ని వదలుతాడు. మానవుడు మేల్కొని ఉన్నప్పుడు చూచినవి, విన్నవి, ఆలోచించినవి అతనికలలో క్రమంగా కన్పించినట్లు, మంచి చెడ్డ కర్మల ఫలాలు అతణ్జి వెంబడిస్తాయి.
("జాతస్య హి ధ్రువో మృత్యుః! ధ్రువం జన్మ మృతస్య చ" పుట్టినవానికి మరణం తప్పదు. మరణించినవానికి పుట్టుక తప్పదు - అని గీతాచార్యునివచనం; సృష్టిధర్మం.
మంచిపనికి ఫలం శుభం. చెడుపనికి ఫలం పాపం - అని రామాయణం.)
తాను పూర్వం చేసిన కర్మల ననుసరించే మనిషి మనస్సు అనేక వికారాలకు లోనవుతుంది. ఇంద్రియాలు ఎటువెళ్ళితే ఆ మనస్సు అటే వెళ్ళుతూ ఉంటుంది. మనిషి ఎన్ని జన్మలెత్తినా అతనికర్మఫలాలు నశించవు. అవి అతణ్ణి వదలవు.
నీటికుండ, నీటికుంట, చెరువు, కొలను మొదలగు వాటియందు సూర్యచంద్రాదులు ప్రతిఫలిస్తూ, గాలికి కదలుతూ ఉన్నట్లే, ప్రాణి తన కర్మఫలాలతో నిర్మితమైన దేహాల్లో కోరికలు కలవాడై కదలుతూ ఉంటాడు.
మంచిని, చెడును కలుగచెసేవి కర్మలే! జీవుడికైనా, బ్రహ్మదేవుడికైనా అంతే! ఆలాంటప్పుడు తాను కర్మలు చేస్తూ తనకు జరిగే మంచి చెడులకు ఇతరులు కారకు లనటం ఎందుకు?
అందువల్ల ఇతరుల్ని హింసించ కూడదు. తనకు శుభం కలుగుతుందని ఇతరుల్ని హింసించినట్లయితే దానిఫలితం ఊరకే పోదు. తరువాతనైనా దాన్ని అనుభవించక తప్పదు.
(కర్మఫలం ఈ జన్మలో కాకున్న మరోజన్మలోనైన అనుభవించక తప్పదు. కర్మఫలం-మంచికి మంచి; చెడుకు చెడు.)
ఓ దయామయుడవైన కంసమహారాజా! ఈ దేవకి నీకు వరుసకు చెల్లెలే గాని, నీ కన్నబిడ్డవంటిది; చాలమంచిది. గౌరవించదగినప్రవర్తన గలది. భయపడేస్వభావంగలది; పిన్నది; క్రొత్తగా పెళ్లి అయినట్టిది. చక్కని శోభకలది; భయంతో వణుకుతూంది; నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను. ఆమెను కాపాడు.
అని వసుదేవుడు సౌమ్యంగా, కటువుగా మాట్లాడగా, కంసుడు తన వేడిచూపులనుండి నిప్పులు కుప్పలువడ రాల్చి, దయలేనివాడై తెగించి దేవకిని చంపబోయాడు. అది తెలుసుకొని వసుదేవుడు అతని ప్రయత్నాన్ని ఏ విధంగా వంచించాలా అని ఇలా ఆలోచించాడు.
చావు తప్పదు కదా అని మనిషి తెలివి తక్కువగ పిరికితనంతో ఊరుకోకూడదు. ధైర్యం వహించి, బుద్ది ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు అతడు స్వశక్తితో ప్రవర్తించాలి.
అని వసుదేవుడు నిర్ణయించుకొని
ఆపదలో ఉన్నదేవకిని రక్షించటానికై, పుట్టబోయే కుమారుల్ని వీడికి ఇచ్చివేస్తాననటం ప్రస్తుతానికి మంచిది. ముందు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ఊపిరితో ఉంటే రేపు మరోమార్గం దొరకదా? కొడుకులు పుట్టి, వాళ్ళకు మరణం తప్పనిసరి అయితే - వీడుకూడా బ్రహ్మదేవునిచేత ఏ ఆపదా పొందకుండ ఉంటాడా? అడవిలో పుట్టిన అగ్ని-దావాగ్ని-ప్రక్కనున్న చెట్లను విడిచి, విజృంభించి ఎక్కడో దూరంలో ఉండే చెట్లను; దహించినట్లు-కర్మఫలాన్ని అనుసరించి జననమరణ కారణం దూరదూరంగా పోతుంటుంది. అందువల్ల ఇక నేను తడబడటం ఎందుకు?
పుట్టబోయే కొడుకులను ఇస్తానని, కంసునిబారినుండి దేవకిని రక్షించటం ప్రస్తుతానికి తెలివైన పని. వీడు ఇప్పుడు ఆమెను చంపకుండా వదలితే-కొడుకులు పుట్టేనాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆ నాటికి ఏ దైవమైనా అడ్డుపడక పోతుందా?
'దేవకిఎనిమిదవగర్భంనుండి పుట్టేకొడుకు కంసుణ్జి చంపుతాడని గట్టిగా ఆకాశవీథినుండి వినిపించింది. ఆ మాటలు ఎందుకు తప్పిపోతాయి? తప్పక జరిగితీర్తాయి. అందువల్ల దేవకిని వెంటనే కంసుని బారినుండి విడిపించటం మంచిది' అని వసుదేవుడు అనుకొంటూ
వసుదేవుడు మృదువుగా మాట్లాడుతూ - వెంటనే ఆ క్రూరుడైన కంసుణ్ణి తగు రీతిగా పూజించి మాటలపూలతో గౌరవించాడు. మనస్సు మండుతూ ఉన్నా. ప్రశాంతముఖంతో అతనితో ఇలా అన్నాడు.
(యాదవప్రభువైన శూరునికొడుకు కనుక వసుదేవుడు శౌరి.)
దేవకీదేవికి పుట్టిన పుత్రునివల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని గదా నీవు కోపపడుతున్నావు? ఈమెకు పుట్టే కొడుకుల్ని చంపడానికి వరుసగా నీ కిస్తాను.
అని ఈ విధంగా వసుదేవుడు పలుకగా, కంసుడు విని, అంగీకారసూచకంగా తలయూచి, గుణాన్ని గ్రహించే వానివలె ప్రవర్తించి, దుఃఖిస్తున్న చెల్లెలి కొప్పు వదలి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడు కూడా ఏలాగో బ్రతికి బయటపడ్డానని అనుకొని, భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. కొంతకాలం గడిచిన తరువాత
ఎడతెగకుండా కంసునివల్ల కష్టాలు అనుభవిస్తూ, దేవకీదేవి అందరి దేవతల భావాన్ని తాను పొంది, ఏడాదికొక్కడు చొప్పున ఎనిమిదిమంది కొడుకుల్నీ ఒక కూతురునీ ప్రసవించింది.
(దేవకికి ఎనిమిదిమంది కొడుకులు కల్గారు. వాళ్లు 1) కీర్తిమంతుడు 2) సుషేణుడు 3) భద్రసేనుడు 4)ఉదారధీ 5) మృదుడు 6) సమ్మర్దనుడు 7 బలభద్రుడు 8) కృష్ణుడు పిదప కల్గిన కూతురు - యోగమాయ.
ఆ కన్నబిడ్డలను, వసుదేవుడు ధైర్యం వహించి, సత్యాన్ని పాటిస్తూ, ఇచ్చిన మాటమీద నిలబడి, పుత్రమమకారాన్ని వదలుకొని, దేవకీదేవి మొదటిసారి కన్నకొడుకును కీర్తిమంతుడనేవాణ్ణి వెంటనే తెచ్చి కంసరాజు కిచ్చాడు.
ఆడినమాట తప్పకుండ, సంకోచం లేకుండ, మోసం చేయకుండ, కలత చెందకుండ తన కొడుకులను, చంపేందుకై శత్రువుకు అప్పగించిన ధీరుడు - వసుదేవుడు తప్ప లోకంలో మరొకడున్నాడా?
ఓ పరీక్షిన్మహారాజా! సత్యవ్రతుడికి మాటతప్పడం తప్ప, దుష్కరమైంది ఏముంది? ఆలాగే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మపదార్ధం తప్ప ఇష్టమైంది మరొకటి ఏముంది? భగవద్భక్తిలో నిమగ్నుడైనవాడు త్యాగం చేయలేనిది ఏముంటుంది? ఆలాగే మేలు ఏదో, కీడు ఏదో తెలియనివానికి కీడు అనేది ఏముంటుంది?
(సత్యపాలనే వ్రతంగా కలవాడు, ఇచ్చినమాటకోసం హరిశ్చంద్రునివలె జీవితంలో దేన్నైనా వదలుకోగలడు; అప్పగించిన ఏ పని అయినా చేయగలడు. అలాంటప్పుడు అతనికి కష్టమైంది అంటూ ఏముంటుంది?)
ఈ విధంగా సత్యాన్ని తప్పకుండా కొడుకును తెచ్చి అప్పగించిన వసుదేవునిమాటనిలుకడకు మెచ్చికొంటూ కంసుడు ఈ విధంగా అన్నాడు.
నీ కొడుకును మరల నీవే తీసుకొని వెళ్ళు. వీనివల్ల నాకు భయం లేదు. అందువల్ల వీడిమీద కోపం లేదు. నీ ఎనిమిదవకొడుకే నా పాలిటి మృత్యువట! అందువల్ల అప్పుడే వాణ్ణి వధిస్తాను.
కంసుడు ఆ విధంగా అనగా, వసుదేవుడు తన కొడుకును తీసుకొని వెళ్ళాడు. అయినా అతనికి ఆనందం లేదు. దుష్టుడైన ఆ బావగారిమాటలు విన్నా ఆ తరువాత ఎప్పుడు ఏమౌతుందో అని భయపడుతూనే ఉండినాడు. ఆ తరువాత
('ఆనకదుందుభి' - వసుదేవునికి గల మరొక పేరు. అతడు పుట్టినపుడు ఆకాశంలో విష్ణువు ఈతని పుత్రుడై జన్మిస్తాడని ఆనకములు - అనగా మద్దెలలు, భేరులు మ్రోగాయట. అందువల్ల వసుదేవుడు 'ఆనకదుందుభి' అయ్యాడు (భాగ. 9-715).)
ఒకరోజు నారదమహర్షి తిన్నగా కంసునిమందిరానికి వచ్చాడు. రహస్యంగా అతనితో వ్రేపల్లెలో ఉన్న నందుడు మొదలైనవారు, వారిభార్యలు, కొడుకులు, బంధువులు,(మథురాపురంలో ఉన్న) దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవాది యాదవులందరూ నిజానికి దేవతలేగాని మానవులు కారు. కంసా! నీవు రాక్షసుడవు. దైవస్వరూపుడైన శ్రీమహావిష్ణువు దేవకీదేవికిపుత్రుడై పుట్టి, భూలోకాన్ని చెరిచే దుష్టరాక్షసులనందర్నీ సంహరిస్తాడు అని చెప్పి, స్వర్గలోకానికి వెళ్ళాడు.
నారదుని మాటలు విని మిక్కిలిగా కుమిలి, యాదవులంతా దేవతలనీ, గతంలో శ్రీహరి ఖడ్గంతో హతుడైన కాలనేమి అనే రాక్షసుడు తానే అనీ కంసుడు మనస్సులో
(విష్ణుమూర్తి ఖడ్గం నందకం. కంసుడు గతజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. అతడు దేవాసురయుద్ధంలో విష్ణువుచేత హతుడయ్యాడు. ఈ జన్మలో కంసుడుగా జన్మించాడు.)
(నారదుడు చెప్పినమాటలకు) మనస్సులో మిక్కిలి కలవరపాటునొందిన కంసుడు పెల్లుబికిన కోపంతో చెల్లెలు, మరది అనికూడా చూడకుండా దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. విష్ణుమూర్తిని గుర్తు చేసుకొంటూ దేవకీ వసుదేవులకు పుట్టిన కొడుకులను వెంటవెంటనే వధించాడు. తండ్రి అనికూడా చూడకుండా యదువంశసంజాతుడు, భోజాంధక వంశాలకు రాజు, నిర్మలుడూ అయిన ఉగ్రసేనమహారాజును బంధించాడు. మితిమీరిన పట్టుదలతో విజృంభించి శూరసేనదేశాలను పాలించసాగాడు.
లోకంలో రాజులు తమకు గొప్పజీవితం ఉండాలని, రాజ్యకాంక్షతో తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, బంధువులననా చంపుతారు.
అంతేకాదు. కంసుడు - బాణాసుర, నరకాసుర, జరాసంధ, మహాశన, కేశి, ధేనుకాసుర, బకాసుర, ప్రలంబాసుర, తృణావర్త, చాణార, ముష్టిక, అరిష్ట ద్వివిద, పూతన మున్నగు దుష్టుల్ని తనకు సహాయులుగా చేసుకొని, యుద్దాల్లో యాదవులను ఓడించాడు. యాదవులు తమ పదవులు వదలుకొని దిక్కులేక వలస వెళ్ళి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వదేశాల్లో తలదాచుకొన్నారు. అందులో కొందరు యాదవులు అభిమానాలు వదలుకొని కంసుణ్ణి సేవించారు. ఆ తర్వాత
కంసుడు వెంట వెంటనే దేవకీదేవికొడుకులను ఆరుమందినీ వధించాడు. ఆదిశేషుడనే మహనీయమైన, మనోహరమైన విష్ణుతేజస్సు దేవకీదేవిగర్భంలో ఏడవదిగా ప్రవేశించింది.
ఆ సమయంలో విశ్వరూపుడైన శ్రీహరి, తనను నమ్మి బ్రతుకుతున్న యాదవులకు కంసునివల్ల భయం ఏర్పడుతుందని తెలుసుకొని యోగమాయాదేవితో ఇలా అన్నాడు.
శుభస్వరూపిణివైన ఓ యోగమాయాశక్తీ! నీవు గోపస్త్రీలు, గోపాలకులు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరు కంసునిచేత బంధింపబడి ఉన్నారు. కాని రోహిణి అనే ఒక భార్యమాత్రం ఆ నందగోకులంలో తలదాచుకొని ఉన్నది. ఆమె మంచి గుణగణాలు కలది. దేవకి కడుపులో ఉన్న నా శేషునితేజస్సును నీవు బయటికి తీసి, నేర్పుగా రోహిణిగర్భంలో ప్రవేశపెట్టు. నేను నా అంశతో సకల శక్తులతో వైభవంగా దేవకీదేవికి కుమారుడిగా జన్మిస్తాను. ఆ తర్వాత నీవు నందునిభార్య అయిన యశోదగర్భంలో పుడతావు.
(వసుదేవునిభార్యలు - ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే ఏడుగురు. ఈ ఏడుగురు దేవకుని కుమార్తెలు. దేవకుడు ఆహుకునికుమారు లిద్దరిలో పెద్దవాడు, ఆహుకునిరెండవకొడుకు ఉగ్రసేనుడు.)
నిత్యమంగళస్వరూపిణివైన ఓ యోగమాయాదేవీ! నీవు అనేకవిధాలైన సంపదలకు నిలయమైనదానవు, అన్నికోర్కెలు తీర్చగలదానివీ అయిన నీకు మానవులు కానుకలను, పూజలో భాగంగా బలులను ఇస్తూ భక్తితో నిన్ను కొలుస్తారు.
'అంతేకాదు. మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాల్గుపేర్లుతో దేశంలోని ఆయా స్థానాల్లో నిన్ను పూజిస్తారు అని శ్రీమహావిష్ణువు చెప్పి, వెళ్ళుమని ఆనతి ఇవ్వగా, యోగమాయాదేవి మహాప్రసాదమని అంగీకరించి, వెంటనే విష్ణులోకాన్ని విడిచి, భూలోకానికి వచ్చి
('కాశీక్షేత్రం - దుర్గ; భద్రేశ్వరక్షేత్రం - భద్రకాళి; వరాహశైలక్షేత్రం - విజయ; మాతృకాక్షేత్రం - వైష్ణవి; మానసక్షేత్రం- కుముద; అమరకుండకక్షేత్రం - చండిక; హస్తినాపురక్షేత్రం - కృష్ణ; శ్రీశైలక్షేత్రం - మాధవి; కన్యాకుబ్జక్షేత్రం - కన్యక; మాయానగరక్షేత్రం - మాయ; సుపార్వక్షేత్రం - నారాయణి; రుద్రకోటిక్షేత్రం - ఈశాన; బ్రహ్మక్షేత్రం - శారద; సిద్ధవనక్షేత్రం - అంబిక'.)
యోగమాయాదేవి దేవకీదేవికడుపులో దివ్యకాంతితో వెలుగుతున్న పిండాన్ని మెల్లగా బయటికి తీసి, రోహిణీదేవి గర్భంలో ఉంచి వెళ్ళింది. అప్పుడు మధురానగరప్రజలంతా దేవకీదేవిగర్భం పోయిందని కలత చెందారు.
అంతలో, రోహిణీదేవికి శ్రేష్ఠుడైన ఒక కుమారుడు జన్మించాడు. మిక్కిలి బలవంతుడు కావటంవల్ల బలభద్రుడని, లోకానికి ఆనందం కలిగించేవాడు కనుక రాముడని, దేవకీదేవిగర్భంనుండి (మొదట) బయటికి లాగబడినవాడు కావటంవల్ల సంకర్షణుడని అతనికి పేర్లువచ్చాయి.
రోహిణీదేవికి బలరాముడు పుట్టిన తరువాత
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీమహావిష్ణువుఅంశ వసుదేవునిలో ప్రవేశించగానే అతడు సమస్తప్రాణులచూపులను ఆకర్షిస్తూ, సూర్యతేజస్సుతో ప్రకాశించాడు.
అఖిలమై, సర్వాత్మస్వరూపమై, తేజోవంతమై, భువనాలకంతటికి శుభదాయకమై ప్రకాశిస్తున్న విష్ణుతేజస్సు, వసుదేవుని శరీరంలో ప్రవేశించింది. అలాంటి విష్ణుతేజస్సును అచ్చొత్తినట్లుగా వసుదేవుడు దేవకీదేవిగర్భంలో ప్రవేశపెట్టినాడు. ఆ తేజస్సును గర్భంలో ధరించినందువల్ల, చంద్రునితో కొత్తకాంతులీనుతున్న తూర్పుదిక్కాంతవలె దేవకీదేవి ప్రకాశించింది.
(భువనాలు పదునాలుగు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు ఏడూ అధోలోకాలు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్య లోకాలు ఏడూ ఊర్ధ్వలోకాలు.)
అని చెప్పగా విని, పరీక్షిన్మహారాజు తరువాత ఏమి జరిగిందని అడుగగా, శుకమహర్షి ఈ విధంగా చెప్పాడు.
ఎంతో గొప్పగా బ్రహ్మండ భాండాల నన్నింటిని తన కడుపులో దాచుకొన్న శ్రీహరి, ఈ భూమిని ఉద్ధరించటానికై దేవకీదేవికడుపులో ఒదిగి బాలభానునివలె వృద్ధి పొందాడు.
ఆ తరువాత, దేవకీదేవిగర్భంలో విష్ణుమూర్తి వృద్ధిపొందే కొద్దీ శత్రువుల ముఖాలు వెలవెలపోగా, గర్భవతి అయిన దేవకీదేవి ముఖం తెల్లబడసాగింది. ఉద్యమించే వైరులకీర్తి మాసి నల్లబడిపోగా, ఆమెచనుమొనలు నలుపెక్కాయి. దుర్మార్గుల ఇండ్లలో పొగలెగయగా, ఆమెనూగారు క్రిక్కిరిసిన వెంట్రుకలవరుసతో ప్రకాశించింది. శత్రువులకు ఆహారంమీద కోరికలు అడుగంటగా, ఆమెకు అన్నంమీది కోరిక తగ్గింది. శత్రువులు అలసిపోతుండగా, ఆమెకు అలసట ఏర్పడింది. శత్రువులకు శారీరక మానసిక మాంద్యం కలుగగా, ఆమెకు కూడా బుద్ధిమాంద్యం ఏర్పడింది. శత్రువులు మట్టిలో కలియగా, ఆమెకు మట్టి రుచించసాగింది.
(దుష్టశిక్షణ అవతరిస్తున్న శ్రీహరి తల్లిగర్భంలో పెరుగుతూ ఉండగానే, ఆమెలో వచ్చే మార్పులతోపాటు దుష్టశత్రువుల స్థితిగతుల్లో ఏలాంటి మార్పులు వచ్చాయో, మున్ముందు వాళ్ళు పడేపాట్లు ఏ స్థాయిలో ఉంటాయో భావార్థసూచనగా కవి ఇందులో అద్భుతంగా ధ్వనింపచేయటం గొప్పవిశేషం.)
ఆ తర్వాత, పంచభూతాత్మకుడైన శ్రీమహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉండగా పంచభూతాలు ఆయన్ను సేవించడానికై వచ్చాయా అన్నట్లు ఆ గర్భవతిలో మార్పులు అనేకం అగుపించాయి. జలం ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం చెమటలు పట్టసాగింది. అగ్ని ఆ బాలకుణ్ణి సేవించడానికై వచ్చిందా అన్నట్లు ఆమె దేహకాంతి అధికమై మెరిసింది. వాయుదేవుడు సేవించడానికి వచ్చినాడా అన్నట్లు ఆమె నిట్టూర్పులు అధికమయ్యాయి. ఆ బాలుణ్ణి పూజించటానికి భూమివచ్చిందా అన్నట్లు ఆమె మన్ను తినటం ఎక్కువైంది. ఆకాశం రూపుదాల్చి ఆ బాలుణ్ణి సేవించటానికి వచ్చిందా అన్నట్లు, అంతకు ముందు ఆకాశంవలె శూన్యమై లేదనిపించే ఆమెనడుము లావైంది.
ఆ తర్వాత, ఇంకా దేవకీదేవిగర్భంలో రాక్షసులశత్రువైన శ్రీహరి ఉన్నందువల్ల, ఆమెమొలనూలు నెమ్మదిగా బిగుసుకపోతుంటే శత్రువుల భార్యల మంగళసూత్రాలు సడలిపోతున్నాయి. ఆమె శరీరకాంతి ఎక్కువగా పెరుగుతూంటే - పగవారిభార్యల శరీరకాంతులు తరిగి పోసాగాయి. ఆమెకు ఆభరణాలు బిగువు లౌతూ ఉంటే, శత్రువుల భార్యల ఆభరణాలు తెగిపోసాగాయి. ఆమె కడుపు పెద్దదౌతూ ఉంటే, శత్రువుల భార్యల కడుపులు పగిలి పోసాగాయి. ఆమెకు ప్రసవించే రోజులు దగ్గరయ్యేకొద్దీ, శత్రువుల భార్యలు ముత్తెదువులుగా ఉండే దినాలు క్రమంగా కడచిపోసాగాయి.
ఈ విధంగా లోకాలన్నింటినీ తన గర్భంలో మోస్తున్న శ్రీమహావిష్ణువును, తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి, దుష్టుడైన పండితునిలోని సరస్వతివలె, కుండలోని దీపకళికవలె అన్న కంసుని ఇంట్లో నిర్భంధింపబడి ఉండింది.
దేవకీదేవి చెరలోఉన్నా ఆమె ముఖతేజస్సును, దేహకాంతిని, నడకతీరులోని సొగసును చూచి, కంసుడు ఆశ్చర్యపడి, తరచుగా భయపడుతూ తనలో ఈ విధంగా అనుకొన్నాడు.
దేవకీదేవిగర్భం మనస్సుకు ఆందోళన కలిగేటట్లుగానూ, చూడడానికి భారంగానూ ఉంది. ఇదివరకటి ఈమెగర్భాలు ఇలా లేవు. బహుశః విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించాడేమో!
ఇక నేనేమి ఆలోచించాలి? ఏమి చేయాలి? రోజురోజుకూ దేవకీదేవిగర్భం పెరుగుతూ ఉంది. గర్భవతి అయిన చెల్లెలిని, అబలను నేను ఏ కారణం చూపి చంపేది. న్యాయాన్యాయాల విచారణ ఎందుకులే అని చంపితే - నా ఐశ్వర్యం, కీర్తి, ఆయువూ, ధర్మం అన్నీ నాశనమై పోవా?
వావివరుసలు చూడకుండ ప్రవర్తించే క్రూరుడు, బ్రతికినా చచ్చినవాడితో సమానమని లోకులు నిందిస్తారు. ఆలాంటివాడు నరకానికి పోతాడు. విచారించి చూస్తే దురాలోచనతో జీవించేవాడి బ్రతుకు ఒక బ్రతుకేనా?
అని నిర్ణయించుకొని క్రోర్యాన్ని వదలి, ధైర్యం తెచ్చుకొని, గాంభీర్యాన్ని వహించి, శౌర్యాన్ని ప్రదర్శిస్తూ, చెల్లెలిని చంపటం అనే కార్యం మహాపాపంగా భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించి, ఏమీ మాట్లాడకుండ మౌనివలె ఊరకుండగా
తొలగించేందుకు వీలులేని పెద్దవైరం ఏర్పడింది. మున్ముందు ఏ మౌతుందో? దేవకీదేవికి ఎప్పుడు విష్ణువు పుడతాడో? పుట్టగానే పురిటింటిలోనే వాణ్ణి పట్టుకొని చంపివేస్తాను అని కంసుడు ఆమె ప్రసవించేసమయంకోసం ఎదురు చూడసాగాడు.
దేవకీదేవికి పుట్టబోయే విష్ణువుమీద శత్రుభావన పెంచుకొన్నకారణంగా, కంసుడు, ఇతరవిషయాలన్నింటిని మరచిపోయాడు.
కంసుడు విష్ణుమూర్తి మీది ఎడతెగనికోపంతో తిరుగుతున్నా భోజనంచేస్తున్నా, త్రాగుతున్నాా నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా ఇలా అన్ని వేళల్లో ఆ విష్ణుమూర్తినే తలచుకొంటూ జగత్తంతా విష్ణమయంగా చూడసాగాడు.
(విష్ణువు విశ్వమయుడు కదా! ఒక విధంగా కంసునిది విష్ణుభక్తే - కాకుంటే వైరభక్తి అందువల్లనే ఆ వైరభక్తునికి జగత్తంతా విష్ణుమయంగా గోచరిస్తున్నది.)
ఇంకా, కంసుడు చెవులకు ఏ శబ్దం వినపడినా అది విష్ణుదేవునిమాటేమో అని వింటాడు. కంటికి ఏది కన్పించినా అది విష్ణుమూర్తి రూపమే కాబోలు అని చూస్తాడు. తాను తిరిగేటప్పుడు శరీరానికి గడ్డిపరక తగిలినా అది విష్ణుమూర్తిచేతి దెబ్బేమో అని ఉలిక్కి పడతాడు. ముక్కుకు ఏ సువాసన సోకినా అది ఆ హరిమెడలోని వనమాలికాసుగంధమేమో అని అదరిపడతాడు. ఏ మాటలు పలికినా, అవి విష్ణునామాలని భ్రమపడతాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణుమూర్తిని గూర్చిన ఆలోచనలేమో అని ఆగ్రహపడతాడు.
(భక్తికంటే వైరభక్తే ప్రగాఢమైందేమో! అది వ్యక్తిని హరిదగ్గరికి త్వరగా చేరుస్తుందేమో! అందుకే కాబోలు జయ విజయులు రాక్షసజన్మలెత్తి శ్రీహరికి వైరభక్తులై త్వరగా శాపనివృత్తిని పొందారు.)
ఆ సమయంలో అనుచరులతో కూడి దేవతలు, నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడూ, శివుడూ దేవకీదేవి ఉండే చెరసాల కేగి, ఆమెగర్భంలో శిశువురూపంలో ఉండే శ్రీమహావిష్ణువును ఈ విధంగా స్తుతించారు.
(నలువ - నాలుగుముఖాలు గలవాడు - బ్రహ్మ, ముక్కంటి - మూడుకన్నులు గలవాడు - శివుడు.)
No comments:
Post a Comment