Wednesday, April 1, 2026

Krishna Satakam - కృష్ణ శతకం

కృష్ణ శతకం- నరసింహ కవి

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా 
॥ 01 

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
 ॥ 02 

నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా
 ॥ 03 

హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
 ॥ 04 

క్రూరాత్ముడజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా
 ॥ 05 

చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితివ
వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా
 ॥ 06 

అకౄరవరద! మాధవ!
చక్రాయుధ! ఖడ్గపాణి! శౌరి! ముకుందా!
శక్రాది దివిజ సన్నుత!
శుక్రార్చిత! నన్ను కరుణ జూడుము కృష్ణా!
 ॥ 07 

నందుని ముద్దుల పట్టిని
మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నిను దలంతు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 08 

ఓ కారుణ్య పయోనిధీ!
నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్
నాకేల ఇతర చింతలు
నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా!
 ॥ 09 

వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తివనఘ! మురారీ;
నా దిక్కు చూచి కావుము
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!
 ॥ 10 

పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా!
 ॥ 11 

అష్టమి రోహిణి ప్రొద్దున
అష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!
 ॥ 12 

అల్ల జగన్నాథుకు రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయుఁ
తల్లియునై చన్నుగుడిపెఁ దనరగ కృష్ణా!
 ॥ 13 

అందెలు గజ్జెలు మ్రోయఁగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందునిసతి యా గోపిక
ముందఱ ఆడుదువు మిగుల ముఱియుచు కృష్ణా!
 ॥ 14 

హరిచందనంబు మేనునఁ
గర మొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగ
పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా
 ॥ 15 

పాణి తలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగఁ పింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణా!
 ॥ 16 

మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్
కడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలతు నచ్యుత! కృష్ణా!
 ॥ 17 

బృందావనమున బ్రహ్మా
నందార్భకమూర్తి వేణు నాదము నీవా
మందార మూలమున గో
విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా!
 ॥ 18 

వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీవా
చీరలు మ్రుచిలి యిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!
 ॥ 19 

దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!
 ॥ 20 

అండజవాహన! విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీ వా
కొండల నెత్తితివందురు
కొండిక పనిగాక దొడ్డకొండా! కృష్ణా!
 ॥ 21 

అంసాలంబితకుండల!
కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్
సంసారిరీతి నుంటివి.
హంసేంద్ర! విశాలనేత్ర! అచ్యుత కృష్ణ!
 ॥ 22 

పదియాఱు వేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర ! వసుధను కృష్ణా!
 ॥ 23 

అంగన పసుపున దోవతి
కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా
సంగతి విని దయ నొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!
 ॥ 24 

హా వసుదేవకుమారక!
కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా!
 ॥ 25 

శుభ్ర మగు పాంచజన్యము
నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్
విభ్రము లగు దనుజసుతా
గర్భంబులు పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా!
 ॥ 26 

జయమును విజయున కియ్యవె
హయముల ములుకొలమోపి యదలించి మహా
రయమున ఱొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా!
 ॥ 27 

దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగఁదలచి నీవు నిఖిలాధారా!
దుర్జనులను వధియింపను
అర్జునునకు నీవు సాదివైతివి కృష్ణా!
 ॥ 28 

శక్రసుతుఁ గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా!
 ॥ 29 

దివిజేంద్రసుతునిఁ జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతుఁ బరిమార్చితౌర! రణమున కృష్ణా!
 ॥ 30 

దుర్భరబాణము రాగా
గర్భములోనుండి అభయ కావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!
 ॥ 31 

గిరులందు మేరు వౌదువు
సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ! చంద్రుఁడౌదువు,
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!
 ॥ 32 

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా!
 ॥ 33 

కుక్షిని సకలజగంబుల
నిక్షేపముఁజేసి ప్రళయనీరధి నడుమన్
రక్షక! వటపత్రముపై
దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా!
 ॥ 34 

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలచి విష్ణుడవనఁగా
విశ్వముఁ జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!
 ॥ 35 

అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాది నారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!
 ॥ 36 

మగ మీనమవై జలనిధి
జగతుని సోమకుని జంపి పద్మభవునకున్
నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణ!
 ॥ 37 

అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దరుప పొలుపున నీ వా
నందముగా కూర్మమవై
మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా!
 ॥ 38 

ఆది వరాహుడవయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుఁ జేసి తగన్
మోదమున సురలు వొగడఁగ
మేదిని వడిగొడుగునెత్తి మెరసితి కృష్ణా!
 ॥ 39 

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
ఉరము జీరి వధించితి
నరహరి రూపావతార! నగధర కృష్ణా!
 ॥ 40 

వడుగడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర అఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనున
కడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
 ॥ 41 

ఇరువదొకమాఱు నృపతుల
శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!
 ॥ 42 

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్యన్
విశదముగఁగీర్తినేలిన
దశరథరామావతార! ధన్యుఁడ కృష్ణా!
 ॥ 43 

ఘనులగు ధేనుకముష్టిక
దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిఁ
అనఘాత్మ! రేవతీపతి
యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!
 ॥ 44 

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కపటపు రాజవు బళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
 ॥ 45 

వలపుల తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోక కర్తవు కృష్ణా!
 ॥ 46 

వనజాక్ష! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
మను నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్నజాలరు కృష్ణా!
 ॥ 47 

అపరాథ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముఁడనై చేసితిఁ
జపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా!
 ॥ 48 

నరపశువు మూడచిత్తుడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱుతెఱుఁగ నెంతవాఁడను
హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!
 ॥ 49 

పరనారీ ముఖపద్మము
గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!
 ॥ 50 

పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్ధినిఁ జరింతుకొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా!
 ॥ 51 

దుష్టుఁడ దురాచారుఁడ
దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నినుఁ గొల్వనేరను
కష్టుఁడను ననుఁ గావు కావు కరుణను కృష్ణా!
 ॥ 52 

కుంభీంద్ర వరద! కేశవ!
జంభాసుర వైరి దివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి
గంభీరా నన్నుగావు కరుణను కృష్ణా!
 ॥ 53 

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!
 ॥ 54 

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచే మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడఁగఁ
గరిఁగాచినరీతి నన్నుఁ గావుము కృష్ణా!
 ॥ 55 

పురుషోత్తమ! లక్ష్మీపతి!
సరసిజగర్భాదిమౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుఁడ వగు నాకు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 56 

క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ
పతీ! మిముఁ దలచినవారికి
నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా!
 ॥ 57 

స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్
అంభోజ నేత్ర! జలనిధి
గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా!
 ॥ 58 

శతకోటిభాను తేజుఁడ!
యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా!
రతినాథ జనక! లక్ష్మీ
సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా!
 ॥ 59 

మందుఁడ నేదురితాత్ముఁడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 60 


గజరాజ వరద! కేశవ!
త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ!
భుజగేంద్ర శయన! మాధవ
విజయాప్తుఁడ! నన్నుఁగావు వేడుక కృష్ణా!
 ॥ 61 

గోపాల దొంగ మురహర
పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి! దయతో
నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా!
 ॥ 62 

దుర్వార చక్రధర కర!
శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!
నిర్వాణనాథ! మాధవ!
సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా!
 ॥ 63 

సుత్రామనుత! జనార్దన!
సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా
చిత్రావతార! దేవకి
పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా!
 ॥ 64 

బల మెవ్వఁడు కరిబ్రోవను
బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు రవిసుతునకు
బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా!
 ॥ 65 

పరుసము సోఁకిన యినుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా!
 ॥ 66 

ఒకసారి నీదు నామము
ప్రకటముగాఁ దలఁచువారి పాపప్ము లెల్లన్
వికలములై తొలఁగుటకును
సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా!
 ॥ 67 

హరి సర్వంబునన్ఁ గలఁడని
గరిమను దైత్యుండు పలుక గంబములోనన్
ఇరవొంద వెడలి చీల్పవె
శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా!
 ॥ 68 

భద్రార్చిత పదపద్మ! సు
భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ
భద్రాధిప! కేశవ! బల
భద్రానుజ! నన్నుఁబ్రోవు భయహర కృష్ణా!
 ॥ 69 

ఎటువలెఁ గరిమొఱ వింటివి
యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా!
 ॥ 70 

తటపట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్
ఎటువలె నిపుణునిఁ జేసితి
నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!
 ॥ 71 

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో
హరి! మిముఁ దలచిన వారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!
 ॥ 72 

ఓ భవనంధ విమోచన!
యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా!
యో భక్త కామధేనువ!
యో భవహర! నన్నుఁగావుమో హరి కృష్ణా!
 ॥ 73 

ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్
బ్రీతి సురకోటి పొగడఁగ
నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా!
 ॥ 74 

ఓ పుండరీకలోచన!
యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా!
యో పురసంహార మిత్రుడ!
యో పుణ్యుఁడ! నన్నుఁ బ్రోవు మో హరికృష్ణా!
 ॥ 75 

ఏ విభుఁడు ఘోర రణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు,
నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!
 ॥ 76 

గ్రహభయదోషముఁ బొందదు
బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను,
తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా!
 ॥ 77 

గంగ మొదలైన నదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా!
 ॥ 78 

ఆ దండ కావనంబునఁ
గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!
నాదండ కావరమ్మీ
వేదండముఁ గాచినట్టి వేల్పవు కృష్ణా!
 ॥ 79 

చూపుము నీ రూపంబును
బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా!
పాపుము నాకును దయతో
శ్రీపతి! నిను నమ్మునాఁడ సిద్ధము కృష్ణా!
 ॥ 80 

నీ నామము భవహరణము
నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీనామ మమృత పూర్ణము
నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా!
 ॥ 81 

పరులను నడిగిన జనులకుఁ
గురుచ సుమీ ఇది యటంచు గు!రుతుగ నీవున్
గురుచ్ఁడవై వేడితి మును
ధ్రఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా!
 ॥ 82 

పాలను వెన్నయు మ్రుచ్చిలఁ
ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా!
 ॥ 83 

రఘునాయక నీనామము
లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా!
అఘములఁ బాపుము దయతో
రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా!
 ॥ 84 

అప్పా! యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
అప్పా! ననుఁ గను్గొనవే
యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా!
 ॥ 85 

కొంచెపువాఁడని మదిలో
నుంచకుమీ వాసుదేవ! గోవింద! హరీ!
యంచితముగ నీ కరుణకుఁ
గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా!
 ॥ 86 

వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్
దేవ! వధించుట వింటివి
నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా!
 ॥ 87 

అయ్యా! పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన్ గలుచుఁచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!
 ॥ 88 

కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీవుండుట నే
కంటక మగు పాపములను గడచితి కృష్ణా!
 ॥ 89 

యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా!
విమల మగు నీదు నామము
నమరఁగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా!
 ॥ 90 

దండమయా! విశ్వంభర!
దండమయా! పుండరీక దళనేత్ర హరీ!
దండమయా! కరుణానిధి!
దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా!
 ॥ 91 

నారాయణ! లక్ష్మీపతి!
నారాయణ! వాసుదేవ! నందకుమారా!
నారాయణ! నిను నమ్మితి!
నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!
 ॥ 92 

తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుజుఁడు
పరమ పవిత్రుండు భాగ్యవంతుంఁడు కృష్ణా!
 ॥ 93 

శ్రీలక్ష్మీనారాయణ!
వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా!
ఏలుము నను నీ బంటుగఁ
జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!
 ॥ 94 

శ్రీధర! మాధవ! యచ్యుత!
భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళంబు నెపుడు
మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!
 ॥ 95 

శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁ బతకము
సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా!
 ॥ 96 

అందెలఁ బాదము లందును
సుందరముగ నిల్పినావు సొంపమరంగా
సుందర! మునిజనసన్నుత!
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 97 

కందర్పకోటి సుందర!
మందరధర! భానుతేజ! మంజుల దేహా!
సుందర విగ్రహ! మునిగణ
వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా!
 ॥ 98 

దుర్మతిని మిగుల దుష్టపుఁ
గల్మషములు జేసినట్టి కష్టుండ ననున్
నిర్మలునిఁ జేయవలె ని
ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా!
 ॥ 99 

అనుదినము కృష్ణశతకము
వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా!
 ॥ 100 

భారద్వాజసగోత్రుఁడ
గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహ్వాయుఁడను
శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా!
 ॥ 101 

శతకం

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది. దేవకీదేవి దేవదేవుడై...