Monday, April 6, 2026

The gopas (cowherd boys) and calves are released from the illusion created by Lord Brahma - గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట

గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట

పరీక్షిన్మహారాజా! బ్రహ్మ మోసంతో తమను మాయచేసి దాచి ఉంచిన సంవత్సరకాలాన్ని ఆ గోపబాలురు శ్రీకృష్ణ మాయవల్ల ఎంతో అల్పసమయంగా, రెప్పపాటు కాలంలా భావించారు.

ఈ విశాలవిశ్వమంతాకూడా ఏ మహామహిమాన్వితుడైన విష్ణవుయొక్కమాయలో మోహం చెంది మునిగిపోయి ఉంటుందో, అట్టి భగవంతునిమాయవలననే, ఈ గోపబాలురుకూడా ఒక సంవత్సరకాలం తాము దాగి ఉన్నారన్న విషయం తెలుసుకోలేక పోయారనడంలో ఆశ్చర్యమేముంది?

ఆ గొల్లపిల్లలందరూ కృష్ణుణ్ణి చేరి మిత్రమా! వచ్చావా! మన దూడలన్నీ అడవి మృగాల బాధలేకుండా క్షేమంగా వాటి స్థానాలను చేరుకున్నాయి. నీవు దూడలను వెదకడానికి వెళ్లావు కదా! నీవు వచ్చేవరకూ ఈ పిల్లలెవరూ కూడా కొంచెమైనా చల్దులు తినలేదు చూడు. రా! అంటూ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉండగా అక్కడ వారంతా ముచ్చటలాడుకుంటూ, చల్ది తిన్నారు.

ఈ రీతిగా సరదాగా మాట్లాడుకుంటూ, ఆ గొల్లబాలురతో కలిసి చల్ది ఆరగించి, దారిలో తానింతకు మునుపు కొండచిలువరూపంలో వచ్చిన అఘాసురుణ్ని సంహరించి ఉండగా అక్కడ పడి ఎండిన ఆ కొండచిలువతోలును చూపిస్తూ అడవినుండి మరలివస్తూ

శ్రీకృష్ణుడు తలలో పూలు, నెమలి పింఛం ధరించాడు. వాటి కాంతులు అంతటా ప్రతిఫలించి అతని శరీరభాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూరామోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశమై ఆకర్షింపబడుతుంది. గోపబాలురు సంతోషంతో కృష్ణుని బాహుబలాన్ని స్తుతించారు. కృష్ణుడు గోపబాలురతోకూడి ఉల్లాసంగా మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ ఆనందించారు.

అలా మందకు కృష్ణుడు గొల్లపిల్లలతో వస్తూ ఉంటే ఆ గోపబాలురందరూ, అరణ్యంలో మా అందరినీ ఒక కొండచిలువ మింగేస్తే నందుని కొడుకైన ఈ చిన్ని కృష్ణుడు ఆ కొండచిలువను చంపి, మా అందరినీ ప్రాణాలతో కాపాడాడు అంటూ గొల్లపల్లె అంతా చాటి చెప్పారు.

శుకమహర్షిద్వారా విషయం అంతా విన్న పరీక్షిన్మహారాజు శుకమహర్షితో తిరిగి ఇలా అన్నాడు.

పండితులలో శ్రేష్ఠుడవైన ఓ శుకమహార్షీ! ఆ గొల్లపల్లెలోని గొల్లవారి కందరికీ తాము కని, చక్కగా చూస్తూ, ఎత్తుకుంటూ, పెంచుతున్న తమ కన్నకొడుకుల కన్నా నందగోపునికొడుకైన శ్రీకృష్ణుడు అంత ప్రేమపాత్రుడెలా అయ్యాడో తెలియజేయండి.

పరీక్షిన్మహారాజు ఎంతో ఆశ్చర్యంతో పై విధంగా అడిగేసరికి శుకమహర్షి దానికి సమాధానం చెప్పనారంభించాడు.

శుకుడు పరీక్షిన్మహారాజుతో ఇలా చెపుతున్నాడు "సృష్టిలోని సకలజీవరాశికి తనకు తాను ప్రియమైనట్లు తమ బిడ్డలుగాని, ఇండ్లుగాని, బంగారంవంటి వస్తువులు కాని ఏవీకూడా ప్రియం కావు. సకల ప్రాణికోటికీ పరమాత్ముడే ప్రాణం కాబట్టి, ఈ గొల్లపల్లెలోని వారందరికీకూడా అతడు ప్రేమాస్పదుడైనాడు. ముల్లోకాలకు మేలు చేయడానికే భగవంతుడు ప్రకృతిరూపమాయతో కలిసి దేహధారియై, క్రియారూపాల్లో, భవతి, అనే భూధాతువు ఎలాగైతే ఇతర ధాతుగణాలకు ప్రధానంగా అన్వయిస్తూ ఒప్పుతోందో అలాగే ఎల్ల జీవరాశులలో ఉన్నాడు".

విష్ణుమూర్తిపాదం అనే పడవను ఆశ్రయించిన సుజ్ఞానులు ఒక చిన్నదూడ ఒక అంగవేసి దాటినట్లు, ఈ భవసాగారాన్ని దాటి ఏ ఆపదలూ లేని వారై, మోక్షపదాన్ని చేరుకుంటారు.

కృష్ణుడు అఘాసురుణ్ణి సంహరించడం, తన కెంతో ప్రేమాస్పదమైన గోపబాలురతో చల్ది తినడం, పద్మసంభవుడైన బ్రహ్మకు తన లీలలను - బ్రహ్మ దూడలను పిల్లలను దాచినా, ఆ విషయాన్ని కృష్ణుడెలా నిర్వహించాడో అనే వృత్తాంతాన్ని చదివిన వారికీ, విన్నవారికీ వారికోరిక నెరవేరుతుంది. (ఇది ఫలశ్రుతిగా అన్నమాట.)

మహారాజా! బలరాముడు శ్రీకృష్ణుడు ఎంతో ఆసక్తితో ఆయిదేండ్లు దాటి పౌగండమనే ఆరేళ్ళ వయస్సులో ఉన్నవారై, పశువులను మేపే గోపాలకుల వృత్తితో ఆ బృందావన ప్రాంతంలో పశువులను మేపారు.

ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని, వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేల్కొని, లేగల మందలను తోలుకొని కృష్ణునివద్దకు చేరారు. కృష్ణుడు బలరామునితో కలసి గోపబాలకులు తనను పదే పదే పొగడుతూ ఉండగా, ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అన్ని ఋతువులలోనూ పళ్లు, పూలు, చిగుళ్లు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయని తేనెలను తాగడానికి వచ్చి, జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేకవిధాల చెట్టు, తీగెలు, పొదరిండ్లు ఆ అడవినిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సులలోని నీళ్ళు తామరపూల పుప్పొడిచేత చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైన బలరామునితో ఇలా అన్నాడు.

ఆ వనంలో చెట్లన్నీ కొమ్మల, పూవుల, పండ్ల అధికభారంతో బాగా వంగి ఉన్నాయి. కొమ్మలమీద చిలుకలు అందంగా పలుకుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచిన కృష్ణుడు దానిని అందంగా ఊహిస్తూ, అన్న బలరామునితో ఇలా అంటున్నాడు. అన్నా! చూశావా! ఇలా ఈ భారంతో వంగిన వృక్షాలు చిలుకపలుకుల నెపంతో, సృష్టిలో చరించలేని స్థావర రూపమైన మా యీ వృక్షత్వాన్ని పోగొట్టమంటూ నీకు తెలియజేస్తున్నాయి. ఎలా? కొమ్మలనే తమ హస్తాలతో నీకు పండ్లూ పూలూ సమర్పిస్తూ ఈ చెట్లన్నీ నీ పాదపద్మాలకు మొక్కుతున్నాయి అన్నాడు.

ఈ తుమ్మెదలు తమ ఝంకారంతో అన్నిటిని పవిత్రం చేయగల నీ యశస్సును గానంచేస్తూ నీవెంట వస్తున్నాయి. అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు నీవేనంటూ మునులబ్బందం లేదా ఋషిపక్షులు చుట్టూ చేరి సేవించడానికి వస్తున్నా(రు)యి. నీవు నల్లని వస్త్రం ధరించడంతో నీలమేఘంలా ఉన్న నిన్ను చూచి నెమళ్లు నాట్యం చేయడం ప్రారంభించాయి. గోపవనిత లెలా ప్రియంతో చూస్తారో అలాగే ఈ ఆడులేళ్ళుకూడా నిన్ను చూస్తున్నాయి. నీవు మా అతిథివి అంటూ కోకిలలు మంచి పలుకులు వినిపిస్తున్నాయి. ఈ వనచరులందరూ నీవు అడవికి రావడంతో ధన్యులయ్యారు కదా!

(పరీభృతములు = ఇతరులచే పెంచబడేవి అని వ్యుత్పత్తి. కోయిలలకు గ్రుడ్లు పెట్టడం తెలుసుకానీ వాటిల్ని పొదగడం తెలీదు. కాకికి తానెన్ని గ్రుడ్లు పెట్టిందో తెలీదు. కోయిల తన గ్రుడ్లు తీసుకెళ్లి, కాకి గ్రుడ్లతో చేరుస్తుంది. కాకి అన్నిట్నీ పొదుగుతుంది. అవి పిల్లలయ్యాక కొన్నాళ్లకు 'కుహూ' అంటూ కోయిల పిల్ల లరుస్తాయి. అప్పుడు కోయిల వెళ్లి వాటిల్ని తెచ్చుకొంటుంది. ఇలా కాకులచే పెంచబడేవి కనుక కోయిలలకు పరభృతాలని పేరు.)

కృష్ణుడు బలరాముడితో అన్నా! ఈనాడు నీ పాదస్పర్శతో చివురుకొమ్మలతో, పచ్చికగుబురులతో ఉండే ఈ నేల పవిత్రమయింది. నీ గోటి తాకిడిచే తీగల, చెట్లగుంపులన్నీ ధన్యత చెందాయి. నీ దయాద్బప్టిచే లేళ్లు, యమునానది మొదలు గోవర్ధనాదిపర్వతాలు, హంస, శుక, పిక, మయురాలు, లేళ్ళు, నెమళ్ళు, కుందేళ్ళు మొదలగు జంతువులు విశిష్ట కాంతిని సంతరించుకున్నాయి. నీ విశాల వక్షఃస్థలం తగులగా గోపకాంతల పుట్టుక సఫలమయింది. ఇలా అంటూ ఆ అడవిలో తన గొల్ల చెలికాండ్రూ, తానూ పసులను మేపుకుంటూ, పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు సెలయేళ్ళల్లో, కొండల్లో విహరించాడు.

అలా ఆ వనంలో విహరిస్తున్న కృష్ణుడు పూదేనెను తాగి మత్తెక్కిన తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తూ ఉంటే తనూ జుమ్మని ధ్వని చేస్తున్నాడు. రాజహంసల కేంకారాలతో సమానంగా అతడూ కేంకారాలు చేస్తున్నాడు. నెమళ్లు నాట్యం చేస్తుండగా తానూ పద్మాల్లాంటి చేతులు తిప్పుతూ నాట్యం చేస్తున్నాడు. అడవి ఏనుగుల నడకలతో సమానంగా తానూ గజగమనుడవుతున్నాడు. క్రౌంచ, చక్రవాక పక్షులు కూస్తుంటే అలాగే తానూ పలుకుతున్నాడు. పులులు, సింహాలు తిరిగే చోట తానూ లేళ్ళలో కలిసి పరిగెడుతున్నాడు.

శ్రీకృష్ణుడు అరణ్యంలో దూరంగా మేస్తున్న ఆవుల నుద్దేశించి, వాటికి గల అందమైన పేర్లతో, మేఘ గంభీర స్వరంతో, గొల్లవారంతా తనను కొనియాడుతూ ఉంటే రా! రమ్ము! అంటూ గోవుల్ని పిలుస్తున్నాడు.

(తెలుగువారు గో మహాలక్ష్మి అంటూ పూజించటం సంప్రదాయం. అలాగే పిల్లలకు కూడా భగవంతుని పేర్లు పెట్టడం, గోవులకు పేరుపెట్టుకోవడం, ఆ పేర్లతో వాటిల్ని పిలవడం పూర్వాచారం.)

ఓ రాజా! అరణ్యంలో తిరగడంతో అలసిపోయి ఆ గోపాలకులతొడలపై పడుకునేవాడైన, అన్న బలరాముణ్ణి కృష్ణుడు గౌరవంగా కాళ్ళు, చేతులు ఒత్తుతూ సంతోషింప జేస్తున్నాడు.

బలరామకృష్ణులు ఇద్దరూ ఒకచోట ఉండి, గోపాలకులు పాడుతూ ఆటలు ఆడుతూ ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరిపై మరొకరు చేతులేసుకుంటూ ఉంటే తామూ వారితో కలిసి ఆడుకుంటున్నారు.

ఉపనిషత్ప్రతిపాద్యుడుగా తిరిగే నేర్పరి అరణ్యంలో తిరుగుతున్నాడు. ఆదిశేషుడు శయనంగా పవళించే స్వామి చిగురుటాకుల పక్కపై పడుకుంటున్నాడు. గొప్ప గొప్ప యోగివరులైన వారిహృదయాలలో సంచరించే ప్రభువు కొండ గుహలలో తిరుగాడుతున్నాడు. లక్ష్మీదేవితో సరస క్రీడలాడి అలసిసౌలసే శృంగారి గొల్లవాండ్రతో ఆడి అలసిపోతున్నాడు. చతుర్దశభువనాధారుడైన ధీరుడు అలసి చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాడు. యజ్ఞంలో హవిర్భాగాన్ని ఆహారంగా స్వీకరించే యాగపురుషుడు అడవిలో దొరికే పండ్లను భుజిస్తున్నాడు.

కృష్ణుడు అడవిలో అలా గోపాలురతో పశువుల్ని కాస్తున్న సమయంలో అలసి ఉంటే కొందరు గోపాలురు అతణ్ణి తమ వీపు మీద ఎక్కించుకుని పోతారు. బడలికతో నిద్రపోదామనుకుంటే మరికొందరు ప్రేమతో తమ తొడలనే పాన్పులుగా చేస్తారు. చెమట పట్టినట్లైతే సంతోషంతో చివురాకులతో విసరుతారు. దూరంగా వెళ్ళీ నిల్చుంటే మిక్కిలి బంధుత్వంతో, స్నేహంతో, కొందరు పాదాలు పిసుకుతారు. ఇలా గోపాలకులు వాళ్ల పూర్వజన్మ లెన్నింటిలోనో చేసిన పాపాలన్నీ నశించిపోయేలా శ్రీకృష్ణునికి పరిపరివిధాల సేవలు చేస్తున్నారు.

ఇలా గోపాలురందరూ శ్రీకృష్ణునికి పలు పలు విధాల సేవలుచేస్తూ తమ జన్మలను పునీతం చేసుకుంటున్న సమయంలో శ్రీదాముడనే పేరు గల ఒక గోపాలకుడు బలరామకృష్ణులతో ఇలా అన్నాడు.

గార్థభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుండు వధించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా,...