Tuesday, August 11, 2026

Pushpaka Vimana - పుష్పక విమానం

రామాయణం సుందరకాండ ఏడవ సర్గ - పుష్పక విమానం

మహీకృతా పర్వతరాజి పూర్ణా
శైలాః కృతా వృక్షవితాన పూ
ర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః
పుష్పం కృతం కేసరపత్ర పూర్ధమ్‌॥

సువర్ణ, వైడూర్యకాంతు లీనే రావణుని భవనం మెరుపులతో, రంగు రంగుల పక్షులతో అలరారే ప్రావృట్కాల మేఘమండలంలా ఉంది. వాటిలో ఆయుధశాలలు. ధనురాగారాలు, శంఖశ్రేణులు.

విశాలములూ మనోహరములూ అయిన గిరిశిఖరాలమీద చంద్రశాలలూ, దోషరహితాలూ, రాక్షస, దేవతాపూజార్హాలూ, సువర్ణ శోభితాలూ, మయశిల్పి నిర్మితాలూ అయిన గృహరాజాలు గోచరించాయి.

మహామేఘంలా ఉన్న సువిశాల భవనంలో రాక్షసేంద్రుని ప్రధాన సేనాబలం ఉన్నది. దానికి సాటివచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన స్వర్గంలా ఉంది. రత్నశోభ లీనుతున్నది.

కేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరిశిఖరంలా ఉంది. ఆ భవనంలో నారీరత్నాలు మేఘాలలో మెరుపులవలె ఉన్నారు. ఆకాశంలో విహరించే పుణ్యపురుషుల విమానంలా ఉంది. రాజహంసలే వాహనాలుగా ఉన్నట్లుంది.

అది పుష్పకం.

రంగు రంగుల శిలలతో శోభించే పర్వత శిఖరంవలె రత్నఖచితమై, గ్రహపరివేష్టిత చంద్రమండల సదృశమై, విచిత్ర మేఘాలయమై గోచరించింది.

అ ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంతో, పర్వతాలు తరు సముదాయంతో, తరువులు పూలగుత్తులతో, పూలు పరాగ సముదాయంతో ఉన్నాయి.

సౌధాలు సుధాధవళములు.

సరోవరాలు, పద్మసంభరితాలు. పద్మాలు కేసరపూర్ణాలు. చిత్ర చిత్రంగా ఉన్నాయి.

భవనాలన్నిటికంటె ఉన్నతంగా రత్నద్యుతులతో అలరారుతున్నది పుష్పకవిమానం.

కొన్ని పక్షలు వైడూర్యమణిమయాలు. మరికొన్ని రజితఖచితాలు. ప్రవాళ, స్వర్ణ నిర్మితాలు కొన్ని. సర్వమూ స్వర్ణమయం. సర్పాలు, జాత్యశ్వాలు అన్నీ చక్కగా చెక్కివుంచారు.

పగడాలతో, బంగారుతో పూవులు చెక్కిన రెక్కలు కొన్నింటికి, వయారంగా వంగిన రెక్కలతో కొన్ని, మదనుని సమక్షంలో ఉన్న పక్షులవలె ఉన్నాయన్నీ. కేసరాలు వీడని కలువలు పట్టిన తొండాలతో గజరాజులు. పద్మహస్తయైన లక్ష్మీదేవి స్వరూపం. వసంతకాలంలో వికసించిన తరు శోభతో నిండిన పర్యతరాజులా వున్నదది.

రావణుని పూజలతో, రక్షణతో అలరారే లంకానగరంలో తిరిగి తిరిగి సీత జాడ దొరకక విచారిస్తున్నాడు హనుమంతుడు.

సుగుణ సంపదతో రాముని ప్రియురాలయిన జానకిదేవిని అన్వేషిస్తూ పరి పరి విధాల అలోచనలు సాగిస్తూ సాగుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.

రావణ భవన మధ్యంలో రత్న శోభితమూ సువర్ణగవాక్ష సంభరితమూ, గగన సంచారయోగ్యమూ అప్రతిమానమూ అయిన పుష్పకాన్ని చూస్తున్నాడు.

ఏకాగ్రమయిన తపోదీక్షతో కాని దాన్ని నిర్మించలేరు అది మన మనస్సుని ఊహననుసరించి సాగిపోగలశక్తి కలది. వాయువేగంతో ప్రయాణం చేయగలదు.

త్రైలోక్యవర్తనులూ, మహాత్ములూ, శ్రీ యశో విరాజితులూ అయిన దేవతల భవనంలా కనిపిస్తున్నది.

శరత్కాలచంద్రునివలె ఉన్నది. దర్శన మాత్రంచేత మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తుంది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరిశిఖరంలా వుంది.

మాంచి తిండిపుష్ఠీ, తీవ్రగమనమూ, విశాలనేత్రాలూ కల గగన చారులయిన రాక్షసులు దాన్ని పరిరక్షిస్తున్నారు.

వసంతసుమశోభతో, వాసంతాధిక మనోహరంగా ఉన్నదది

అంతఃపురం

Anveshana - అన్వేషణ

రామాయణం సుందరకాండ ఆరవ సర్గ - అన్వేషణ

సూర్యకాంతులీనే ప్రాకారంతోవున్న రావణభవనంవైపు అడుగుపెట్టాడు. సింహ రక్షితమయిన అరణ్యంలా ఉన్నదది.

ఏనుగుల మీద, గుర్రాలమీద, రథాలమీద మహాయోధులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు రజత, సువర్ణ, దంత వినిర్మితాలు. సింహ శార్దూల చర్మాలంకృతాలు.

భవనం నిండా రంగురంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, రత్న వినిర్మితాసనాలు, విచిత్రభూషణ శోభతో అలరారే యువతీ జనం.

శంఖ, భేరీ, మృదంగ నాద తరంగాలతో సముద్రంవలె ఉన్నది. పూజలు, హోమాలు సాగుతున్నాయి.

ఆ భవన పరిసరాలలోవున్న ప్రహస్త, మహాపార్శ్వ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి, సుమాలి, జంబుమాలి, రశ్మికేతు, సూర్యశత్రు, వజ్రకాయ, వక్ర, శుకనాస, శఠ, వికట, హ్రస్వకర్ణ, రోమశ, దంష్ట్రాసుర, ధూమ్రాక్షాది మహాయోధుల భవనాలన్నీ తిరిగాడు.

రావణ భవనానికి అల్లంత దూరంలో కాలజీమూత౦లా ఉన్న కుంభకర్ణుని మందిరం అంతా అన్వేషించి, విభీషణుని సౌధం కూడా శోధించాడు. ఇంద్రజిత్తు అవాసంకూడా తిరిగి, తిరిగి లంకేశ్వరుని సౌధంలో ప్రవేశించాడు.

ఆ భవన ప్రాంగణంలో ఐరావత సదృశాలయిన మత్తేభాలు వర్షకాల మేఘాలవలె వున్నాయి. వాటి ఘీంకారాలు మబ్బులు ఉరుము తున్నట్టున్నాయి.

శూల, ముద్గర, శక్తి, తోమరాయుధధారులై ఎందరో వికృతా కారులయిన రాక్షసులు అప్రమత్తంగా రక్షణభారం నిర్వహిస్తున్నారు.

సాగుతున్నాడు. హనునుంతుడు.

బంగారు తెరలతో, లేయెండ కాంతితో పాలకీలు, పొదరిళ్ళు, కుటీరాలు, క్రీడాగృహాలు, దారు వినిర్మిత పర్వతశ్రేణులు, వినోదమందిరం, మరొకవంక కేళీ విహార భవనం.

ఇంకా ముందుకు పోగా మయార నర్తనాలతో మందరగిరి సదృశంగా ఉన్న సౌధం.

ధైర్యశాలురు బలికర్మలు నిర్వర్తించిన పరమశివ భవనంలా ఉన్నదది. ఆ భవనంలోని మణి రత్నకాంతులు సూర్యకిరణాలవలె వెలుగు లీనుతున్నాయి.

బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు. అంతటా మధువు, మద్యం నింపిన మాణిక్య కలశాలు; చూడగా అది కుబేర భవనంలా ఉంది.

విశాల ప్రాంగణాలు.

బంగారు వడ్డాణాలు, అందెలు గలగలలాడే నారీ రత్నాలు, అంతటా శ్రవఃపేయంగా మృదంగ నిస్వనాలు.

సాగుతున్నాడు హనుమంతుడు.

పుష్పక విమానం

Chandra Darsanam - చంద్ర దర్శనం

రామాయణం సుందరకాండ అయిదవ సర్గ - చంద్రదర్శనం

వెన్నెలలు విరజిమ్ముతూ, ఆకాశ మధ్యానికి చేరాడు చంద్రుడు. గోశాలలో వృషభంలా వున్నాడు. సర్వభూతకోటినీ ప్రకాశింపజేస్తూ, లోకాల పాపాలు నశింపజేస్తూ, సముద్రాన్ని ఉప్పాంగిస్తూ, భూలోకంలో శోభామయమయిన మందరగిరివలె, ప్రదోషవేళ సాగరంవలె, సరోవరంలో వికసించిన పద్మంలా కనిపించాడు.

చూస్తున్నాడు హనుమంతుడు.

వెండి పంజరంలో హంస వలె, మందరగిరి గుహలో సింహం వలె, మత్తేభంమీద వున్న మహావీరుని వలె- గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు.

మొనదేరిన వాడికొమ్ముల ఆబోతులా, అకాశానికి పొడుచుకు వచ్చిన శిఖరాలుగల పర్వతంలా,
బంగారు పూతపూసిన దంతాలుకల గజరాజులా వున్నాడు.

రాతిబండ నెక్కిన మృగేంద్రం, రణమధ్యంలో నిలిచిన గజేంద్రం, రాజ్యసుఖం పొందిన నరేంద్రునివలె వున్నాడు చంద్రుడు.

చీకటి తొలగి, కాంతి వెల్లివిరిసింది, రాక్షసుల మాంసభక్షణ వాంఛ పెరిగింది. ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలగాయి. 

వీణానాదాలు వీనులవిందు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియుల గాఢ పరిష్వంగంలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణికోటి రౌద్రరూపంతో విహరిస్తున్నది.

ప్రయాణ యోగ్యమయిన రథాలు, అశ్వాలూ, వాటికితోడు భద్రమయిన ఆసనాలూ కల ఆ భవనాలలో మదిరాపానమత్తులు యధేచ్చా విహారం చేస్తున్నారు.

ఆ రాక్షస జనంలో పరిహాస ప్రసంగాలు, భుజాస్ఫాలనాలు. ఒకరిపై ఒకరు విసురులు.. ఓహ్! కోలాహలంగా ఉంది.

మరీ మత్తులో ఉన్న కొందరు ఎదురుగా ఉన్న అందకత్తెల మీద వాలుతున్నారు.

స్త్రీ జనంలో

కొందరు సుఖంగా నవ్వుతూ, మధురమధురంగా పలుకుతున్నారు. కొందరు అలకతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. మరి కొందరు హాయిగా నిద్రపోతున్నారు.

గజ ఘీంకారాలు, మహావీర విశ్వాసాలు, పడగలు విప్పిన సర్పాల బుసబుసలతో నిండిన మహాహ్రదంలా కనిపించింది.

సజ్జన సత్కారాలు కూడా ఉన్నా యక్కడ.

ఆ రాక్షసగణంలో ధీమంతులూ, కార్యకుశలులూ. శ్రద్ధాళువులూ ఉన్నారు.

రూప, గుణసంపన్నులయిన పురుషులూ వారికి యోగ్యులయిన పరిశుద్ధ హృదయులయిన వారి ప్రియురాండ్రనూ చూశాడు.

సిగ్గు తెరలో వెలిగే భామలు కొందరు. భర్తృపరిష్వంగంలో పరవశించేవారు కొందరు. ప్రియుల అంకసీములో అంగనలు.

మేడల పై భాగాలలో విహరించే భామామణులు. మదనమంత్ర పరాయణలు కొందరు. ధర్మాచరణ మర్మమెరిగిన మహిళ లెందరో!

మేలిముసుగు జారగా బంగారు శోభతో కొందరు. కొలిమిలో కరుగుతూన్న బంగారు కాంతి శరీరాలు కొన్ని.

చంద్రకాంతితో మరెందరో! వారిలో కొందరు విరహవ్యధలో ఉన్నారు. అభిసారికలు, వాసవసజ్జికలు! మెరపు తీగెల మాలల వలె ఉన్నా రందరూ.

అందరు కనిపించినా, సీతాదర్శనం కాలేదు. హనుమంతునికి. సనాతన ధర్మశీల, పతివ్రతా శిరోమణి, రామహృదయేశ్వరి గోచరించ లేదు. రామవిరహంతో ఆ యిల్లాలు అస్పష్ట చంద్రరేఖవలె, ధూళిసోకిన బంగారు కణికలా, వాయుధూత మేఘశకలంవలె ఉంటుంది, అనుకుంటూ అన్వేషణ సాగిస్తున్నాడు.

కనిపించలేదు సీత. శోకవశు డయాడు హనుమంతుడు.

Entering the City - నగరప్రవేశం

రామాయణం సుందరకాండ నాల్గవ సర్గ - నగరప్రవేశం

ప్రవిశ్శ నగరీం లంకాం
కపిరాజ హితంకరః
చక్రే
థ పాదం సవ్యం చ
శత్రూణాం సతు మూర్ధని”.

కోట ద్వారాలవంక చూడకుండా ప్రాకారంమీది నుండి దిగుతూ శత్రువు శిరస్సుమీద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు, నగరంలో రంగురంగుల పూలతో అలరారే రాజవిధులలో సాగుతున్నాడు. అటూ ఇటూ ఐరావతాలవంటి భవనాలు. వాటినుండి నవ్వుల రువ్వులు. భేరీ
భాంకారాలు. తెల్లని మేఘాలవలె పద్మాకారంతో కొన్ని, స్వస్తికాకృతితో కొన్ని భవనాలు కన్పించాయి.

కాలి అందెల చప్పుళ్ళు, మువ్వల వడ్డాణాల ధ్వనులు. అప్సరసల అందాన్ని అపహసించే రమణీమణులు తార, మంద్ర, మధ్యమ స్థాయి భేదాలతో మధురంగా గానం చేస్తున్నారు.

ఒక్కో భవనం నుండి ఇంకో భవనానికి వెడుతున్నాడు. సింహగర్జనలతో జెబ్బలు చరుచుకుంటూన్న వీరులు. ఉదాత్తానుదాత్త, స్వరిత స్వర సంపన్నులయి మంత్రపాఠం చేసే వేదవేత్తలు.

గొంతెత్తి రావణస్తోత్రాలు వినిపించేవారు.

రాజవీధులనిండా ఆయుధధారులయిన రాక్షస వీరులు.

కోటలోని మధ్యప్రాకారంలో చారచర్య నెరిగిన మేధావులు.

వృషభ చర్మాలు ధరించిన యజ్ఞదీక్షితులు, జటాజూటధారులు, ముండిత శిరస్కులు, దర్భాయుధదారులు, అగ్నిగుండాలే ఆయుధాలుగా కలవారు, దండ, ముద్గరాది ఆయుధాలతో అలరారేవారు, ఏకాక్షులు, ఏకకర్ణులు, లంబోదరులు, భీకరాకారులు, వంగిన ముఖాలవారు, వికృత
దేహులు, పొట్టివారు, కత్తులు, ధనుస్సులు, శతఘ్నులు, పరిఘలు పట్టి తిరిగే కవచ ధారులు, పొట్టి పొడుగూకాని, అంతలావూ, మరీ సన్నం కానివారు.

రూపవంతులు, తేజస్వంతులు, పతాకశోభితధ్వజదండధారులు, పాశహస్తులు, పట్టిస, అశని, శక్తి వృక్షాది ఆయుధపాణులు.

సాగుతున్నాడు హనుమంతుడు.

మంచిగంధం పూసుకుని, సువాసనలీనే పూలమాలలు వేసుకుని, రత్నాభరణ భూషితులై విహరించేవారు, గోచరించారు.

అంతఃపురం సమీపిస్తున్నాడు,

వందల యోధులు పహరా యిస్తున్నారు. పర్వత శిఖరం మీద ఉన్న ఆ గృహ ద్వార తోరణం బంగారంతో నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాలు. వాటిలో పద్మ సరోవరాలు. 

మత్తగజాలు, ఉత్తమ జాతి అశ్వాలు, రథాలు, విమానాలు, మృగాలు, పక్షులు.

రత్నమాణిక్యకాంతులతో గోడలు.

అంతటా అగరుగంధ ధూపం. అందులో అడుగుపెట్టాడు హనుమంతుడు.

చంద్రదర్శనం

రామాయణం సుందరకాండ

Monday, August 10, 2026

Lankini - లంకిణి

రామాయణం సుందరకాండ తృతీయ సర్గ - లంకిణి

తాం రత్న వసనోపేతాం
గోష్ఠాగారావతంసికాం 
యంత్రాగార స్తనీ మృద్దాం
ప్రమదా మివ భూషితాం

మేఘం వలె వ్రేలాడుతూన్న శిఖరాలుకల లంబ పర్వతంమీదుగా లంకా నగరంలో అడుగుపెడుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.

అందమైన ఉద్యానవనాలు, స్వాదు జలపూరితా లయిన సరోవరాలు, శరత్కాల మేఘాల వలె భవనాలు. సముద్రపు చల్లనిగాలి. చక్కని ద్వారతోరణాలు. ప్రాంగణాలలో మత్తేభాలు. సర్పరక్షితమయిన పాతాళలోక రాజధాని బోగవతిలా ఉంది లంకానగరం.

విద్యుల్లతలు నిండిన మేఘాలతో కాంతివంతమై, చండమారుతంతో అలరారే అమరావతిలా ఉంది.

మయూరాలు, రాజహంసలు, క్రౌంచమిథునాలు - వీటి కలస్వనాలకు తొడుగా నగర నర నారీ జనుల ఆభరణాల ధ్వనులు, భేరీ భాంకారాలు.

నగరం నలుమూలలా ఆయుధ ధారులయిన రాక్షస యోధుల పహరా!

చూస్తున్న హనుమంతుడు: ఈ నగరంలో సామాన్యు డెవడూ అడుగు పెట్టలేడు. అంగద, సుషేణ,
కుముద, మైంద, ద్వివిదులూ వీరితోపాటు కేతుమాల భల్లూకపతి, కుశపర్వ వానరయూధపతి, మా  ప్రభువు సుగ్రీవుడు, తప్ప మారెవరూ యిటు చూడలేరు, అనుకున్నాడు.

అ సమయంలో రామ లక్ష్మణుల పరాక్రమం స్మృతికి వచ్చి హనుమంతునికి ఆనందం కలిగింది.

చూస్తున్నాడు హనుమంతుడు.

రత్నకాంతులే ఆచ్చాదన వస్త్రంగా, గోశాలలే భూూషణాలుగా, యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకున్నట్లుంది లంకానగర నారీరత్నం.

నగర గృహాలలోని దీపకాంతులవల్ల లంకలో చీకటి అనేది లేకుండా పోయింది.

అప్పటికి లంకానగరాధిదేవత వికృతాకారంతో హనుమంతుని ఎదుట నిలిచి గర్జించి: ఇక్కడి కెందుకు వచ్చావు? నీ పేరేమిటి? లంకలో అడుగుపెట్టడం నీ తరం కాదు. ముందు నీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఎమిటో చెప్పు, అంది.

హనుమ: ఈ వికృత నేత్రాలతో పురద్వారంలోనే ఉన్న నువ్వెవరవు? ఎందుకింత అట్టహాసం చేసి భయపెడుతున్నావు! నీ కథేమిటి?

లంకిణి : మహాత్ము డయిన ఈ రాక్షసేశ్వరుని ఆజ్ఞానుసారం లంకానగర రక్షణ చేస్తున్నాను. నన్ను కన్ను గప్పి లంకలో అడుగుపెట్టడం ఎవరితరం కాదు. సిద్ధంగా ఉండు, నీ ప్రాణాలు హరిస్తున్నాను.

హనుమ: ఈ విశాల ప్రాకార, తోరణాలతో అలరారే లంకానగరాన్ని చూడాలనే కుతూహలంతో వచ్బాను. ఈ ఉద్యానవనాలు, చిన్ని చిన్ని అడవులు, పెద్ద పెద్ద భవనాలు చూచి పోవాలనివించింది.

లంకిణి : ఓరి దుర్భుద్ధి! వానరాధమా! నా అనుమతి లేకుండా ఈ నగరం చూడగలవా!

హనుమ: అమ్మాయీ, నగరం చూస్తాను. చూసీ, వచ్చిన దారినే వెడతాను.

ఆ ధోరణి లంకిణికి నచ్చలేదు. తన అరచెయ్యి విప్పి గుండె మీద చరిచింది. ఆ పిడుగుదెబ్బకు హనుమంతుడు ఒక్క అరుపు అరిచాడు.

ఉత్తరక్షణంలోనే ఎడమ పిడికిలి బిగించి ఒక్కపోటు పొడిచాడు. ఆ పోటుకే లంకిణి అవయవాలు పట్లు తప్పి, కళ్ళు తేలవైచి నేలమీద వాలింది. ఆయనకు జాలి కలిగింది.

అంతలోనే లంకిణి గద్గద స్వరంతో: ఓ మహాపరాక్రమ సంపన్నుడా! రక్షించు, రక్షించు. బలధైర్యాలు కలవారు నియమవ్రత పరాయణులని ఎరుగుదును. నేనీ లంకా నగరాధి దేవతను. నన్ను నువ్వు ఓడించావు. నీ కింక తిరుగులేదు. ఇది బ్రహ్మ వాక్కు.

ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు. నాటితో లంకానగర వాసులకు భద్రం లేదని గుర్తుంచుకో, అన్నా డొకప్పుడు స్వయంభూ బ్రహ్మ, అది నిజం.

సీతాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించింది. నువ్వు నిశ్చింతగా ఈ నగరంలో ప్రవేశించి కర్తవ్యం నిర్వర్తించుకు వెళ్ళు. స్వేచ్చగా సీతాన్వేషణం కొనసాగించు, అంది.

Trikutagiri - త్రికూటగిరి

రామాయణం సుందరకాండ ద్వితీయ సర్గ - త్రికూటగిరి

అమరావతిలా గోచరించే లంకానగరాన్ని చూస్తూ, తాను దిగిన త్రికూటగిరిమీద విహరిస్తున్నాడు.

ఆ కొండమీది చెట్లనుండి జారిన పూలతో నిండిన హనుమంతుడు విచిత్రంగా ఉన్నాడు.

నూరుయోజనాలు దాటివచ్చినా ఆయనలో ఈషణ్మాత్రం ఆయాసం కాని, క్లేశంకాని కనిపించడంలేదు.

ఇటువంటి విశాలసాగరాలు మరో యిన్ని అనాయాసంగా దాటగలను, అనుకుంటూ నడుస్తున్నాడు.

పచ్చిక బయళ్ళతో, సుగంధభరిత పుష్పాలతో నిండిన లతలతో అల్లుకొన్న వృక్షసంతతులతో నిండిన వనాలు చూశాడు. దట్టంగా అలముకున్న వృక్షాలు నిండినచోట పర్వతం అంతా వృక్షగిరిలా కనిపించింది.

ఆ గిరిశిఖరంమీద ఉన్నది లంకానగరం.

అంతటా దేవదారువులు, కర్ణికారాలు, ఖర్జూరాలు, కరవీర, కుంకుమ, దేవకాంచనాలు. ఏపుగా పెరిగిన ఏడాకుల అరటి, విరగబూసిన వేగిస, వావిలి మొదలైన వృక్షాలు.

అలా తిరుగుతున్నాడు.

వాటి కొమ్మలు కొన్ని మొగ్గ తొడుగుతూంటే, కొన్ని పూల బరువుతో వంగుతున్నాయి. అంతటా వివిధ జాతుల పక్షుల కలస్వనాలు. అక్కడక్కడ దిగుడుబావులు, విశాల సరోవరాలు. వాటినిండా కమలాలు, కలువలు కలహంసనాదాలు.

లంకానగరాన్ని సమీపిస్తున్నాడు.

చుట్టూ పెద్ద కందకం. కందకంనిండా రకరకాల పూలతోరణాలు.

కొటచుటూ బంగారు కాంతులీనే ప్రాకారం.

కామరూపఛారులయిన రాక్షసులు కనురెప్ప వెయ్యకుండా కాపలా కాస్తున్నారు. వందలాది బురుజులు. బురుజులపై పతాకాలు. బంగారు లతా తొరణాలు. శరత్కాల మేఘాలవలె విశాలమయిన భవనాలు.

విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరం త్రీకూటగిరి శిఖరంమీద అలరారు తీరు చూస్తుంటే ఆకాశంలో తేలుతున్నట్లనిపించింది.

ప్రాకారమే కటిస్థలంగా కందకాలలోని నీరే చీనాంబరంగా, కోట గోడలమీది శతఘ్నులూ, శూలాలూ, కేశపాశంగా, బురుజులే ఆభరణాలుగా వెలిగే ఆ నగరాన్ని విశ్వకర్మ మనస్సంకల్పంతో అవతరింపజేసినట్లున్నాడు, అనిపించింది.

దానిలో భవనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకనాడు కుబేరుని రాజధాని అది. ఖడ్గ, శూలపాణు లయిన రాక్షసవీరులు తమ వాడి కోరలతో అటూ యిటూ నడుస్తుంటే నాలుకలు చాచి కోడెత్రాచులే కదులుతున్నట్లనిపించింది.

అలా ఆ నగర ప్రాకార రక్షణ విధానాన్ని చూస్తూ హనుమంతుడు: ఈ లంకలో అడుగుపెట్టడం అసాధ్యం, పెట్టినా దుర్భేద్యమయిన దీనిని స్వాధీనం చేసుకోవడం మరీ కష్టం. ఈ రాక్షసులు సామ మార్గాన మాటలతో లొంగరు. దానం యిక్కడ పని చెయ్యుదు. భేదం అసలే వ్యర్థపదం. ఇక యుద్ధమే శరణ్యం. అయితే వానరయోధులలో సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు మాత్రమే సముద్రం దొటి యిక్కడకు రాగలరు. మిగిలినవారిక్కడ కాలు పెట్టలేరు, 

అనుకుంటూ కొంతసేపు తిరిగి: ఇంతకూ సీతాదేవి యింతకాలం యిక్కడ జీవించి ఉన్నదో, లేదో
చూడాలి. అప్పుడు అనంతర కర్తవ్యం ఆలోచించాలి.

అయితే, ఈ విశాలదేహంతో నేను లంకలో తిరగడం మంచిది కాదు. ఈ క్రూర రాక్షసగణం కంటబడకుండా అన్వేషించాలి.

దేశ కాల పరిజ్ఞానం లేని దూతవల్ల సర్వమూ వినాశనమే ప్రాప్తిస్తుంది, కనక ఈ నగరంలో జాగరూకంగా సాగాలి.

నా అంత వాడు లేడు అనుకునే దూతకు అర్థానర్థ పరిజ్ఞానం ఉండదు. అటువంటి అవలక్షణం నాకు లేదు. ఆ గర్వం దరిజేరితే సర్వం వ్యర్థమే. ఇప్పుడు నేను రాక్షస రూపంతో తిరిగినా వీరు పసిగట్టగలరు.

ఈ నగర రక్షణ విధానం చూస్తుంటే గాలికూడా వీరికి తేలియకుండా కదలడానికి వీలులేనట్లుంది.

ఇప్పుడింక ఒకటే దారి.

నేను బాగా చిన్న శరీరంతో రాత్రిపూటనే ఈ నగరమంతా తిరగాలి, అనుకుంటూండగా సూర్యుడు అస్తమించాడు.

హనుమంతుడు పిల్లిపిల్ల అంత అయాడు. లంకా నగరం వైపు సాగుతున్నాడు.

రజత కాంతులు, సువర్ణ శోభలు, మాణిక్య దీప్తులు.

వీటితో అలరారే ఏడెనిమిది అంతస్థుల భవనాలు. రంగురంగు కాంతులీనే నవరత్నాల జాలరులతో గవాక్షాలు.

ఊహాకందని వైభవంతో ఉన్న ఆ నగరం అద్భుతంగా ఉందీ,

అటువంటి లోకొత్తరమయిన నగరాన్ని చూచిన సంతోషం. రామ పత్నిని, ఎలా చూడడం, ఎక్కడుంటుందా అనే విచారం. అంతలో ఆయన యత్నానికి తోడుపడడానికో అన్నట్టు చంద్రుడు ఉదయించి పైకి వస్తున్నాడు. తామరతూడువంటి కాంతులు, పాలవెన్నెలలు, ధవళశంఖరోచులు.

సరోవరంలో విహరించే తెలని హంసలా ఉన్నాడు నీలాకాశంలో చంద్రుడు.

Ramayana Sundara Kanda - రామాయణం సుందరకాండ

రామాయణం సుందరకాండ పారాయణం

శ్రీమద్రామాయణం 

శ్రీ సమృద్ధమూ, విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ అయిన అయోద్యానగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కొసల్య, సుమిత్ర, కైకేయి అనే పేర్లుగల ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు కలిగారు.

వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు లక్ష్మణుడూ కూడా వచ్చారు.

పదమూడు సంవత్సరాలకాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ సాధు హింసకులయిన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి మారీచుని సాయంతో) సీతను అపహరించాడు.

రామలక్ష్మణులు సీతను వెదకుతూ కిష్కింధ చేరారు.

చేరిన వారిని దూరాన ఋశ్యమూక పర్వతం మీద ఆప్తసచివులతో వున్న సుగ్రీవుడు చూశాడు.
చూస్తూనే గజగజలాడిపోయి పరుగు లంకించుకున్నాడు, అనుచర సమేతం.

గుట్టలు, మిట్టలు, కొండలు, కోనలు దూకుతున్నారు వారందరూ. కొంతదూరం సాగిన తరువాయి హనుమంతుడు సుగ్రీవుని ఆపి:

ప్రభూ! ఏమిటీ పరుగు, ఎక్కడకీ ప్రయాణం? అన్నాడు.

సుగ్రీవుడు: హనుమా! చూశావా ఆ కోదండపాణుల్ని, కరవాలధరులను, ఆజానుబాహు దేహులను. విషం క్రక్కే కోడెత్రాచుల వంటి కరవాలాలు, తాళప్రమాణంలో వున్న ధనుస్సులు, ముల్లోకాలనూ భస్మం చేయగల శక్తి సంపన్నులయిన వీరిని మా అన్నగారు వాలి నన్ను చంపడానికి పంపాడు.

హను
: ప్రభూ! భయగ్రస్త హృదయానికి శంకలు ఎక్కువ. నిజానికి వారెవరో ఎందుకు వచ్చారో తెలియకుండా ఎందుకీ పలాయనం. మీరిక్కడే ఆగండి. నేను విషయం తెలుసుకొని క్షణంలో తమకు నివేదిస్తాను.

అని భిక్షుక రూపంలో రామలక్ష్మణుల ముందు చేతులు జోడించి, తలవంచి నిలబడి:

ఆర్యా! దివ్యకాంతులతో విరాజిల్లే మీ శరీర కాంతీ, చతుర్దశ భువనాలనూ గజగజలాడించ గలిగిన మీ ధనుర్భాణాలూ, కరవాలాలూ మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇవన్నీ వీరవరులయిన రాజ పురుష లాంఛనాలు.

కాని - జటాజూటాలూ, నారచీరలూ ధరించి ముని బాలకులవలె వున్నారు. ఇది ఆశ్చర్యంగా వుంది. తమ రెవరు? ఏ పనిమీద యిటు వచ్చారు, అన్నాడు.

రామ లక్ష్మణులు మాట్లాడలేదు. అప్పుడు హనుమ: 

మన్నించండి. నేనెవరినో తమకు చెప్పలేదు. ఈ కిష్కింధకు అధిపతి వాలి. ఆయన తన తమ్ముడయిన సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి, ఆయన భార్యను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. నేను సుగ్రీవుని అనుచరుడను, అన్నాడు.

రాముని వదనం సంతోషంతో వికసించింది. తమ్ముని వైపు తిరిగి:

నా నృగ్వేద వినీతస్య
నా యజుర్వేద ధారిణః
నా సామవేద విదుషః
శక్యమేవం విభాషితుం

అని హనుమంతుని ధీశక్తినీ, వాక్చాతుర్యాన్నీ ప్రశంసిస్తూ,

లక్ష్మణా! ఈ కపిప్రవరుని సంభాషణ ఎంత ఉదాత్తంగా వున్నదో చూశావా!

వేదత్రయం అధ్యయనం చేసి, ఆరుశాస్త్రాలూ, కంఠపాఠం అయి, నవ వ్యాకరణాలూ కరతలామలకం అయినవాడు కాని యిలా మాట్లాడలేడు. అంతేనా!

మాట్లాడుతూన్నప్పుడు తల విసరడం, కనుబొమలు ఎగరవేయడం, నుదురు బిగించడం వంటి వికారాలేమీ లేవు. ఇంకా చూశావా;

అ విస్తరం అ సందిగ్ధం
అ వలంబితం అవ్యధం

చెప్పవలసిన విషయాన్ని ముక్తసరిగా మూడు ముక్కలలో చెప్పాడు. అంతమాత్రాన మనకు వినబడకుండా అక్షరాలు మ్రింగేయలేదు; సాగతీత సంగీతంలేదు. గొంతు చించుకుని తను బాధపడి, మన చెవులకు కఠోరంగా అరవలేదు. సంస్కార సంపన్నమై మధ్యమస్థాయిలో హృదయాహ్లాదకరంగా మాట్లాడాడు.

ఇంత ప్రతిభ కల సచివుడుంటే - ముల్లోకాలనూ జయింఛగలం. కనుక ఇతనితో నువ్వు సముచితంగా మాట్లాడు, అన్నాడు.

తనంత వాడయిన లక్ష్మణుని ఈ విధంగా హెచ్చరించి రాముడు మాట్లాడడం ఇతఃపూర్వం ఎప్పుడూలేదు, అనంతరం అసలు కనబడదు.

రామాయణంలో ఈ చివరినుంచి ఆ చివరకు చదివిన వారికి కూడా రాముని నోట యిటువంటి ప్రశంస ఎవరికీలేదు. ఆయన ప్రశంసించిన వారే, లేరు. హనుమంతుడు తప్ప.

అంటే-

హనుమంతుడు వచ్చి మాట్లాడిన మూడు మాటలలో ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించి, ఆ శక్తిని అభినందించిన ఉత్త
నాయకుడు రామచంద్రుడు. అటువంటి ఉదాత్తశీలుని అభినందనలను అరనిమేషంలో అందుకున్న అద్భుత ప్రతిభాశాలి హనుమంతుడు.

వాల్మీకి రామాయణంలో హనుమంతుని పాత్ర ఇలా ప్రవేశించింది.

అంటే మాట్లాడడం అనే విద్య హనుమంతుని వెంట తిరిగి సర్వ మానవ ప్రాణీ నేర్చుకోవాలని భావించాడు మహర్షివాల్మీకి.

ఎందువల్ల?

మాట ఒక్కటే మానవ ప్రాణికి లభించిన వరం. మిగిలిన ఆహార, నిద్రా, భయ, మైథునాదులు సృష్టిలో అన్ని ప్రాణులకూ సహజమే,

భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో స్నేహంచేసాడు. 

భూగోళంలోని వానర సంఘాలకు అధిపతి - వాలి - మహా బలిష్ఠుడు.

చతుర్దశ భువనాలనూ విలవిలలాడించిన లంకేశ్వరుడైన, రావణుని వంటి మహావీరుని తన చంకలో ఇరికించి సముద్రాల ముంచి వదలిన వీరుడు వాలి.

అంతటివాడు - రాముడు విడిచిన ఒకే ఒక్క బాణంతో నేలకూలినాడు. అది చూసిన వానర యోధులు గజ, గవయ, గవాక్ష, గంధమాదన, నల, నీల, మైంద, ద్వివిదాదులందరూ కొయ్యబారిపోయారు.

నోట మాట లేకపోగా, గట్టిగా ఊపిరి పీల్చలేకపోయారు.

వాలి నేల కూలిన వార్త వినీ వినగానే హుటాహుటి వచ్చింది. వానరేశ్వరుని భార్య తార.

వస్తూనే భర్త దగ్గర కూలబడి ఏడ్చింది, ఏమేమో అనుకున్నది. అందరూ శిలా ప్రతిమలవలె నిలబడి వింటున్నారు. ఆవిడ ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం లేదెవరికీ.

అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి:

మహారాణీ! జగదేక మల్లుడయిన వానరేశ్వరుని పట్టపురాణివి, నువ్వు శోకిస్తున్నావా! సర్వవానరయోధులతో కిష్కింధ నీ కనుసన్నలలో నడుస్తుంది. గుండె నిబ్బరం చేసుకుని నీ బిడ్డను సింహాసనం మీద కూర్చోబెట్టు. నీ బుద్ధిబలం వానరరాజ్యానికి పెట్టనికోట........... అన్నాడు.

అదీ హనుమంతుని ధీశక్తి. అమే కుమారుని సింహాసనం ఎక్కించమన్నాడు.

భర్త మరణం ఎంతగా వేధిస్తున్నా, కన్నకొడుకు రాజు కాబోతున్నాడంటే తల్లి గుండె ఎంత పొంగి పులకించాలి. పయిగా నాటి వరకూ ఆవిడ అలోచన మీదనే వానర రాజ్యం నడుస్తున్నది. ఆ అధికారం పోకుండా ఆమె కొడుకు సింహాసనం ఎక్కుతాడు.

అయితే -

సుగ్రీవుడికి రాజ్యం యిస్తానని మాట యిచ్చాడుకదా రాముడు, ఆ విషయం ఎరగడా హనుమంతుడు!

ఎరగక కాదు- తారవంటి ధీశక్తి సంపన్నురాలు తన కొడుకుని ఆ సమయంలో రాజ్యాధిపతిని చెయ్యడానికి అంగీకరించదని తెలుసు హనుమకు.

అదే జరిగింది.

సుగ్రీవుడు రాజుగా పట్టాభిషిక్తుడయాడు.

వర్షాకాలం వచ్చింది. వానలు తగ్గగానే సీతాన్వేషణకు వానరసేనలను పంపుతానన్నాడు.

అన్నాడు కాని రాజ్య భోగాలలో, మదిరాపాన - మదవతీ, పరీరంభాలలో ప్రపంచాన్నే విస్మరించాడు.

వానలు తగ్గినా సుగ్రీవుని జాడ లేకపోవడంతో రాముడు లక్ష్మణుని పంపించాడు. కోటగుమ్మంలో నిలబడి ధనుష్టంకారం చేశాడు లక్ష్మణస్యామి. కిష్కింధ యావత్తూ కంపించింది. సుగ్రీవుని మత్తు దిగిపోయింది. లక్ష్మణుని వెంట రాముని సమీపించి, పాదాభివాదం చేసి, వానర వీరులను నాలుగు
దిక్కులకు పంపుతూ, దక్షిణదిశగా వెళ్ళేవారికి జాంబవంతుడు నాయకుడనీ, అంగదుడు బలాధిపతి అనీ, హనుమంతుడు సేనాధిష్ఠాత అనీ అన్నాడు.

వారు బయలుదేరుతూండగా రాముడు హనుమంతుని పిలిచి తన అంగుళీయకం యిచ్చి జానకీదేవికి గుర్తుగా చూపమన్నాడు. అంటే ప్రభువయిన రామునికి తన ఎదుట నున్న వారిలో ఎవరు ఎంతటివారో గ్రహించి వారిని ఉచితరీతిని సమ్మానించడం తెలుసు. అది మరో కథ.

వానరవీరులందరూ సముద్రతీరం చేరారు.

అంతవరకూ ఉరకలు వేసిన ఉత్సాహం సముద్ర దర్శనంతో చల్లబడింది.

నాయకుడయిన జాంబవంతుడు వారిని ఆశ్వాసించి, హనుమంతుని లేపాడు. బయలుదేరాడు హనుమంతుడు. 
ఇది వెుదటి నాలుగు కాండలలో కథ, ఇక అయిదవదయిన సుందరకాం౦డ.

ప్రస్థానం

త్రికూటగిరి














































Rukminidevi Anidyothanuniki Namaskarinchuta - రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రు క్మి ణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట బ్రాహ్మణవంశానికే రత్నంవంటివాడా; నీ బంధువులపాలిటి చింత...