Thursday, August 13, 2026

Viswasam - విశ్వాసం

రామాయణం సుందరకాండ 32వ సర్గ- విశ్వాసం

ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి:

అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్ళకు కట్టేలా చెప్పు, అని ప్రశ్నించింది.

హనుమ : అమ్మా!

రామ లక్ష్మణుల ఆకార విశేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ విశాలనయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయా హృదయుడు. సూర్యసమతేజస్వి. పృథ్వికున్నంత ఓరిమి ఉంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తికి ఇంద్రుడు.

సర్వభూత రక్షణతో తన పరిజనరక్షణ కూడా చూసుకునే వాడు. ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలనూ ధర్మపదాన నిల బెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, సజ్జనులకు సాయపడుతూ, ఇహ పరాలను చూసుకుంటూ ఉంటాడు.

రాజనీతి నిపుణుడు, విద్వాంసులను నిరంతరం ఆరాధిసాడు, వినయ, విద్యాసంపన్నుడు, శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు.

ఇక ఆయన అవయవాల విశేషాలు-

విపులాంసుడు, దీరబాహుడు, శంఖకంఠుడం, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా ఉంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఉరఃస్దలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా ఉంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ, శార్దూల, గజ, వృషభ గమనుడు.

దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజన ప్రియంగా మాట్లాడగలవాడు.

ఆయన తమ్ముడు సర్వవిధాలా ఆయననే పోలి ఉంటాడు. వారుభయులూ నిన్ను వెదకుతూ వెదకుతూ మా కిష్కింధలో సుగ్రీవుని చేరారు.

అన్నగారి భయంతో మా రాజు ఋశ్యమూకంపై ప్రవాసంలో ఉన్నాడు. మేమంతా సుగ్రీవ సేవలో ఉన్నాం.

అక్కడకు-

నార చీరలతో, ధనుర్పాణధరులై వచ్చిన వారిని చూసి మా ప్రభువు పరుగు ప్రారంభించాడు. కొంత సేపయోాక నన్ను పిలిచి వారెవరో తెలుసుకురమ్మన్నాడు. వారితో విషయాలన్నీ వివరించి, వెంటబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాను.

ఉభయులూ మాట్టాడుకున్నారు. లక్ష్మణస్వామి మీ కథ చెప్పాడు. అది వింటున్నవేళ మా సుగ్రీవుడు విషాదభర హృదయు డయాడు.

అనంతరం౦-

నిన్ను రావణుడు అపహరించుకు వెడుతుండగా నువ్వు విడిచిన నగల మూటను రాముని ముందుంచగా అయన వాటిని ఒడిలో ఉంచుకుని విలపించాడు. నీకోసం, కొంతసేపటికి ఆయనను ఆశ్వాసించగలిగాము.

అమ్మా!

విరహాగ్నితో ఆయన దేహం తపిస్తున్నది. భూకంపవేళ పర్వతంలా ఆయన హృదయం విచలితవువుతున్నది.

అత్యంత సుందర
యిన ఉద్యానవనాలు, మహానదీ ప్రవాహాలు, సెలయేరులు ఏవి కనిపించినా ఆయన మనస్సు నీ కోసమే పరితపిస్తున్నది.

అమ్మా! ఆ రాజశార్టూలుడు నిస్సంశయంగా ఈ రాక్షస రావణుని సర్వనాశనం చేసి నిన్ను స్వీకరిస్తాడు. అందుకు సుగ్రీవుడు కూడా ప్రతిన పూని ఉన్నాడు. చెప్పాను కదా, వాలిని హతమార్చాడు రాముడని.

అనంతరం వానరులందరూ అన్ని దిశలకూ నిన్ను అన్వేషించడానికి బయలుదేరారు. అందులో నేను లంకకు వచ్చి యిక్కడ నిన్ను చూడగలిగాను.

మా బలాధిపతి వాలిసుతుడు అంగదుడు. ఆయన నాయకత్వంలో మేము వింధ్య పర్వతంమీద ఎన్ని రోజులు గడిపామో, అప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. తిరిగి వెడితే ఆయన మా ప్రాణాలు తీసి వేయడం తధ్యం, అని మేము ప్రాణత్యాగం చేయడానికి కొండ శిఖరం చేరాము.

అంగదుడు తీవ్రంగా రోదిస్తున్నాడు. అప్పుడక్కడకు భయం కరముయిన పెద్ద పక్షి వచ్చింది. జటాయువుకు సోదరుడయిన సంపాతి ఆ పక్షి. మా మాటలలో జటాయువు మరణవార్త విని:

'ఎవడురా నా సోదరుని చంపినవాడు.'

అని గర్జించాడు. అప్పుడు మేము రావణుని చేతులలో జటాయువు మరణించిన వార్త వినిపించగా, ఆ పక్షి యింతసేపు విచారించి, నీ వర్తమానం చెప్పాడు.

అప్పుడు మాకు ధైర్యం కలిగింది.

ఉత్సాహంతో సముద్ర తీరానికి బయలుదేరాం. విశాల సాగరాన్ని దాటడం సాధ్యమా అని మా వారందరూ శోకసాగరంలో మునిగారు. వారికి ధైర్యం చెప్పి నేను బయలుదేరాను.

రాత్రి అంతా లంకానగరం మూల మూలలా వెదికాను. రావణుని చూచాను. నిన్ను చూడగలిగాను. ఇది యింతవరకూ జరిగిన కథ. ఇప్పుడు నన్ను విశ్వసించగలవా తల్లీ!

ధనుర్వేద విదుడయిన రాముడు, ఆయన సేవకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు కుశలంగా వున్నారు. వారి దూతగా నేనిక్కడకు వచ్చాను.

ఇప్పుడు నేను వెళ్ళి మా వానర వీరులకు నీ దర్శనభాగ్య విషయం చెపుతాను. అంతకంటె నాకు కీర్తికరం మరొకటి లేదు.

నా కధ కూడా చెపుతాను విను-

పర్వతాలలో శ్రేష్ఠుమయిన మాల్యవంతం మీద మా తండ్రి కేసరి ఉండేవాడు. ఆయన దేవర్షుల ఆజ్ఞానుసారం సముద్రతీరాన గోకర్ణం వద్ద శంబసాదనుడనే రాక్షసుని కడతేర్చిన మహావీరుడు. ఆ కేసరి భార్యకు నేను వాయువువలన కలిగాను నన్ను హనుమంతుడంటారు ఇది నా విషయం.

ఇప్పటికి నీకు విశ్వాసం కలగాలి, అని చెపుతూంటే సీతాదేవికి ఆనంద బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది.

అంగుళీయకం

aaswasana - ఆశ్వాసన

రామాయణం సుందరకాండ 32వ సర్గఆశ్వాసన

శింశుపా వృక్షంమీద కొమ్ముల నడుమ తెల్లని వస్త్రంతో, మెరుపు తీగలవంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుని చూచింది సీతాదేవి,

చూచీ చూడడంతో ఆవిడ గుండె దడదడ లాడింది. అంతలో ఆశ్చర్యం కలిగింది. వానరు డేవిటీ? ఇంత శరీరమేవిటే? అనిపించింది.

మరింత భయంతో విలపించింది. హా రామా! లక్ష్మణా! అంటూ కన్నీరు విడిచింది.

అ వానరుని మళ్ళీ చూడగా వినయవంతునివలె గోచరించాడు. ఇంతకూ ఇది స్వప్నమా? నేను మేలుకుని ఉన్నానా? మళ్ళీ చూసింది. బాగా వంకర తిరిగిన మూతితో కనిపించాడు. మళ్ళీ భయం కలిగింది. కన్నులు మూసుకుంది.

అంతా కల అనిపించింది.

కలలో కోతిని చూడడం కీడుకి సూచన, అనిపించగానే రా
లక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక, అనుకున్నాక యిది కల కాదనిపించింది.

నిరంతర శోకంతో వున్న నాకు నిద్ర కూడా పడుతుందా! పూర్ణచంద్రవదనుడయిన రాముడు దగ్గరలేని నాకు సుఖం లేదే! సుఖంలేనిదే నిద్ర ఎలా పడుతుంది? నా మనస్సు ఆయనను గురించే ఆలోచిస్తున్నది,

ఆయననే ధ్యానించే నాకు ఆ రూపాలే కనిపిస్తాయి. ఆ విషయాలే వినిపిస్తాయి. బహుశః ఆ కోరిక నెరవేరి ఉండాలి. అయినా విశ్వాసం కలగడం లేదు. అయితే యిది మనస్సుకి కనిసించిందా?

కొదు-

స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాడు, వానరుడు.

శబ్దం వినిపిస్తున్నది, అని చేతులు జోడించి:

సర్వేశ్వరుడయిన ఇంద్రునికీ, దేవగురువు బృహస్పతికీ, ప్రజాపతి బ్రహ్మకూ, అగ్నిహోత్రునికీ నమస్కరిస్తున్నాను.

నేను చూసినదీ, విన్నదీ నిజమే కావాలి, అనుకుంటూండగా హనుమంతుడు చెట్టు దిగి, వినయ వినమితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు.

చేతులు జోడించి శిరసున పెట్టుకున్నాడు.

అమ్మా! ఉత్తమురాలవయిన నీవు నలిగిన పట్టుచిరతో ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవ, దానవ, నాగ, గంధర్వ, యక్ష, కిన్నర గణాలలో ఏ జాతికి చెందినదానవు? వసు, రుద్ర, మరుత్తులలో ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తిలా కన్పిస్తున్నావు. చంద్రునికి దూరమై
అకాశాన్ని వీడివచ్చిన రోహిణీతారవా?

మాంగళ్యరూపిణీ! వశిష్ఠులవారిమీద కోపంతోనో, మరే అనుమానంతోనో ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవివి కావు గదా! నీ సోదరుడుకాని, తండ్రికాని, పుత్రుడుకాని, పరలోకగతులైతే వారికోసం శోకిస్తున్నావా?

నీ కన్నీరు, నిట్టూర్పులు!

వీటికితోడు నీ పాదాలు భూమిని తాకుతున్నాయి - వీటిని బట్టి నువ్వు దేవకాంతవు కావనుకుంటున్నాను. నీలో రాచరికపు ఛాయలున్నాయి.

ఆలోచించగా నువ్వు ఏ 
హారాజు భార్యవో అయి వుంటావనిపిస్తున్నది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీ దేవివి అయి వుండాలి. తపస్విజనోచితవేషంతో సౌందర్యరాశిలా వున్న నువ్వు రాముని భార్యవే అనుకుంటాను.

ఆ మాటలు వింటున్న సీతాదేవి రామనామ శ్రవణంతో :

ఆత్మవేత్త, శత్రుసంహార సమర్ధుడు, రాజసింహుడు అయిన దశరథులవారి కోడలిని.

హాత్ముడు, విదేహాదీశుడు అయిన జనక మహారాజు అనుంగుపుత్రిని.

నన్ను 'సీత' అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. అయోధ్యలో ఆయనతో పన్నెండు సంవత్సరాలు సర్యరాజభోగాలూ అనుభవించాను,

ఆ తరువాయి మా మావగారు మావారి పట్టాభిషేకం నిశ్చయించారు. గురువులు ముహూర్తం పెట్టారు. అధే రోజున ఆ వార్త విన్న కైకేయి;

రామపట్టాభిషేకం జరిగితే-

నేను పచ్చి మంచినీళ్ళు త్రాగను,
గుప్పెడు మెతుకులు కతకను,
నా బ్రతుకంతా యింతే; అంది,

న పిబేయం న ఖా దేయం
ప్రత్యహం మ
 భోజనం
ఏష మే జీవితస్యాంతో
రామో య ద్యభిషిచ్యతే

ఇంతకాలంగా నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు అరణ్యానికి పోవాలి, అంది.

ఆ మాటలు వింటూ దశరధులవారు మూర్చపోయోారు. సత్య ధర్మపరుడు కనుక, ఆవిడ వరం ప్రకారం జరిపించాడు. రామచంద్రుడు రాజ్యంకంటె తండ్రి మాటనే అధికంగా భావించాడు.

సత్యపరాక్రముడైన రామచంద్రుడు తమ ప్రాణాలయినా వదులు తాడు కాని ఎదుటివారికి కష్టం కలిగే మాటకూడా మాట్లాడడు.

అందువల్లనే మనసా రాజ్యాన్ని విడిచి, ఉత్తరీయాన్ని చేతులతో వదిలి తల్లి దగ్గరకు, వచ్చి నన్ను ఆవిడకు అప్పగించబోయాడు.

ఆయన లేని దేవలోకం కూడా నాకు అవసరంలేదు. అందుచేత ఆయనకంటె ముందే నేను అడవిదారి పట్టాను. మాకంటె ముందుగా మా లక్ష్మణుడు నారచీరలు ధరించి వచ్చాడు.

అలామేము ముగ్గురం మా మహారాజు మాట ప్రకారం ఘోరాటవులకు వచ్చాం.

అక్కడ దండకారణ్యంలో వుండగా దుష్టరావణుడు నన్ను అపహరించి యిక్కడకు తెచ్చాడు. వాడిచ్చిన గడువు యింక రెండు మాసాలుంది. అది గడిస్తే ప్రాణత్యాగం తప్పుదు, అని జానకి చెపుతూంటే:

దేవి! నేను రా
దూతను. ఆయన కుశలంగా వున్నాడు. నీ క్షేమ సమాచారం తెలుసుకు రమ్మని నన్ను పంపాడు, అని హనుమంతుడు ఆరంభించాడు.

అమ్మా! వేద వేదాంగవేత్త, బ్రహ్మాస్త్ర కోవిదుడు అయిన దశరథ నందనుడు నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజశ్ళాలి అయిన మీ లక్ష్మణుడు శోక దీన వదనంతో మీకు నమస్కరిస్తున్నాడు, అనగా విని సీత, సంతోష పులకితగ్రాతంతో:

మానవుడు బ్రతికివుంటే నూరేళ్ళకయినా సుఖసంతోషాలు పొందుతాడనే పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది, అంది.

అనంతరం వారుభయులూ ఒకరికొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు. హనుమంతుడు నెమ్మదిగా సీతదగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అదిచూచే సీతకు ఈ వ్యక్తి రావణుడేమో అనే శంక బయలుదేరి:

ఛి! ఛీ! ఎంత పారపాటు చేశాను! నా విషయం అంతా చెప్పడంవల్ణ వీడికి సర్వం తెలిసిపోయింది. నిజంగా వీడు కామరూపంతో వచ్చిన రావణుడే, అనుకుంటూ నేలమీద కూలబడింది.

అది చూసి హనుమంతుడు చేతులు జోడించాడు. సీత యిటు చూడడంలేదు. వేడి నిట్టూర్పు విడిచి:

ఓ మాయావి! ఎందుకిలా నన్ను బాధించి వేదిస్తావు. ఆనాడు జనస్థానానికి మాయసన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉపవాసాలతో కృశించి శోకంతో ఉంటే యింకా సంతాపం కలిగిస్తున్నావు. అని క్షణం అగి.

నిన్ను చూస్తూం టే నా మనస్సుకి సంతోషం కలుగుతున్నది. అంటే నువ్వు రావణుడవు కాదేమో అనుకుంటున్నాను.

నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను అశీర్వదిస్తున్నాను. నాకు రామగుణగానంకంటె ప్రీతి కలిగించేది లేదు. అందుచేత ఆయన విషయాలు చెప్పు, అని లోలోపల తన భర్త పంపిన ఈదూత నా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. కలలో అయినా రామ లక్ష్మణులను చూచే అదృష్టం నాకు లేదు. అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదే, ఇది కలే అయి, కలలో నేను కోతిని చూచి ఉంటే కీడు జరగాలి గాని మనస్సుకి సంతోషం కలగకూడదు కదా!

కాక-

భ్రాంతిలో పడ్డానా! వాత ఉన్మాద ప్రకోపమా! ఏదీకాక యిదంతా మృగతృష్ణయా.

కాదు. ఇది పిచ్చికాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు వానరుడని గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా, అని వెనుదిరిగింది.

ఆవిడ తలత్రిప్పి, తనను చూడకుండా ఉండడంతో హనుమంతుడు ఆవిడ శంకను గ్రహించి:

అమ్మా!

రామచంద్రుడు సూర్యసమతేజస్వి. చంద్రసదృశ శీతల హృదయుడు. సర్వలోక ప్రభువయిన కుబేరునివలె భూమండలాధిపతి. విష్ణుసన్నిభ పరాక్రముడు, దేవగురువయిన బృహస్పతివలె మధురభాషి, సత్యవాది. సౌందర్య శోభితుడు. 
న్మథాకారుడు, అనవసరంగా ఆ(గహించడు.
ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు.

ఆయన 
హారధికుడు. ఆయన భుజబలచ్చాయలో ఈలోకం నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది.

ఆనాడు మాయలేడిని పంపి, రా
చంద్రుని సుదూరానికి పంపి, ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు చూస్తావు.

యుద్ధభూమిలో రాముడు పరాక్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని సర్వనాశనం చేసి తీరతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా వచ్చిన దూతనమ్మా!.

సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా. రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశలవార్త వినాలని ఉన్నాడు. అమ్మా! వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు.

ఈ క్రూరరాక్షసీజన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి వుండడం మా అదృష్టం.

అత్యల్పకాలంలోనే రామలక్ష్మణులు శతసహస్రసంఖ్యాక
యిన వానరసేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి యిక్కడకు వస్తారు.

నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనుమంతుడంటారు నన్ను. దుష్టుడయిన రావణుని తలదన్ని, నిన్ను దర్శించడానికి సముద్రందాటి వచ్చానమ్మా!

నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను, తల్లీ, అన్నాడు.

విశ్వాసం

Subhasuchanalu - శుభసూచనలు

రామాయణం సుందరకాండ 28, 29, 30, 31 సర్గలు - శుభసూచనలు

తస్యాః శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణ విశాల శుక్లం
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మ మివాభితామ్రం

శ్రీమంతుని చుట్టూ చేరే సేవకులవలె సీతాదేవి శుభ శకునాలతో అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలంవలె ఆమె విశాలమయిన ఎడమకన్ను, అత్యంత సుందరమయిన ఎడమ భుజం అదిరాయి.

ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది.

అంతవరకూ ఎండకూ. పెనుగాలికీ దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తేశక్తి పొందినట్లు, శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయ అయింది. రాహువు నోటినుండి బయటపడిన చంద్రబింబంలా ఆమె వదనం వికసించింది.

శోకం తొలగింది.
తాపం వైదొలగింది.
సంతోషం పెల్లుబికింది.
శుక్లపక్ష శశాంకరోచు లీనింది - జానకీ ముఖకల్హారం.

అంతనూ చూస్తూ వింటూ అశోకంలో వున్న హనుమంతుడు, ఈవిడే సీత అనే నిశ్చయానికి వచ్చాడు.

ఇప్పుడింక యీవిడను ఓదార్చాలి. ఓదార్చు లేకపోతే యీవిడ ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్లాడి ఆ మాటలు రామచంద్రునికి నివేదిస్తే అయన ఆశ్యాసన పొందుతాడు.

అయితే, ఈ రాక్షసీ మధ్యంలో యీవిడతో మాట్లాడడం ఎలా! మాట్లాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి, ఎలా అయినా ఈవిడతో మాట్లాడాలి.

నేను వానరుడను. ఏ భాషలో మాట్లాడాలి. మానవ వ్యవహారంలో వున్న సంస్కృతంలో మాట్లాడుతాను.

మరి - రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా! వారి భాషా సంస్కృతమే, ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకుంటే...

అనుకున్నాసరే ఈ భాష తప్ప దారిలేదు, ఆవిడకు అర్థం కావాలంటే.

కొని, నా రూపం నా మాట, వీటితో ఆవిడ నన్ను కామ రూపుడయిన రావణుడని శంకించి భయపడి, కేకలువేస్తే ఈ రాక్షసీజనం వారి ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా! అప్పుడు నేను దీర్ఘకాయుడనై కొమ్మలమీదినుంచి దూకుతూంటే ఈ స్త్రీలు రాక్షసబలానికి తెలియజేస్తారు. వారు ఆయుధపాణులై వస్తారు. వీరితో పోరాడుతూ తిరిగి సముద్రం దాటడం సంభవమా! ఈలోగా వారు నన్ను బంధించినా బంధించవచ్చు లేదా ఈ క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు. ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి వర్తమానం అందదు కదా.

మళ్ళీ ఈ విశాలసాగరాన్ని దాటి ఎవడు రాగలడు. ఈ రాక్షసులతో పోరాడి వీరిని కడతేర్చగలిగినా నేను వెళ్ళడం సాధ్యమా. అదీకాక యుద్ధంలో జయాపజయాలు ముందుగా తేలవే. అటువంటప్పుడు పోరాటానికి దిగడం వివేకవంతుల లక్షణం కాదు.

సరే, యిప్పుడెంత ఆలోచించినా ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళడం అవివేకం.

దూత అవివేకి అయితే సర్వకార్యాలూ నాశనమే.

అయితే యిప్పుడు నేనేం చెయ్యాలి. ఎలా ప్రవర్తిస్తే రామకార్యం సక్రమంగా కొనసాగుతుంది.

ఒకే దారి ఉన్నది. సీతాదేవికి పరమ ప్రీతికరుడైన రామచంద్రుని గుణ గణకీర్తనంతో నేను సంభాషణ మొదలుపెడితే ఆవిడ నిస్సంకోచంగా నిర్భయంగా నా మాటలు వింటుంది. అలా ధర్మార్థహితంగా ఆరంభిసాను. అని అ కొమ్మలలోనే దాగి మధుర గళంతో ఆరంభించాడు.

రక్షితా స్వ స్వ వృత్తస్య
స్వజనస్య చ రక్షితా
రక్షితా జీవలోకస్య
ధర్మస్య చ పరంతపః

దశరథుడనే అయోధ్యా ప్రభువు చతురంగబల సమన్వితుడు. సదాచార నిర్వహణతో ఘనయశస్సు పొందిన వా డాయన.

ఆయన రాజర్షి శ్రేష్ఠుడు.

ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు. ఉత్త
 గుణాలతో, భూత దయాపరుడై ఇక్ష్వాకువంశ శ్రేష్ఠుడై, శ్రీమంతుడై, సర్వభోగాలు సర్వజనానికీ సమకూరుస్తూ, తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు.

ఆయన కుమారులలో జ్యేష్ఠుడు రాముడు. రాముడు సర్వ విషయవేత్త; చంద్రునివలె చల్లనివాడు. ధనుర్థారులలో అంతటివాడులేడు.

ముందు తన నడవడి సక్రమంగా ధర్మబద్ధంగా సాగించి, సర్వ ప్రాణికోటినీ, తనవారినీ రక్షిస్తూ, ధర్మ రక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు.

అయన శత్రువులపాలిట యముడు.

సత్యవాక్పాలన నియమం కారణంగా, తన వృద్దజనకుని మాట ప్రకారం భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి వచ్చాడు.

ఆ మహారణ్యంలో క్రూరమృగాలనూ, దుష్ట రాక్షసులనూ సంహరిస్తూ జనస్థానంలో ఖర దూషణుల నాయకత్వంలో ఉన్న సర్వరాక్షసులనూ నేల కూల్చాడు.

ఆ వార్త విని రావణుడు క్రోధంతో జానకీదేవిని అపహరించాడు. రాముని వంచించి, పర్ణశాలకు దూరంగా పంపి.

రాముడు సీతను వెదకుతూ వెదకుతూ, వానరరాజయిన సుగ్రీవునితో స్నేహంచేసి, మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని ప్రభువుగా చేశాడు.

వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కా
రూప శక్తిగల వానర వీరులు సీతాదేవిని వెదకడానికి నాలుగు దిక్కులకూ బయలుదేరారు.

వారిలో ఒకడను నేను, జటాయు సోదరుడయిన సంపాతి మాటను బట్టి యిక్కడకు వచ్చాను, సముద్రం దాటి.

సీతాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా అలానే ఉన్న దేవిని యిక్కడ చూశాను, అని మౌనం వహించాడు.

సీతాదేవి ఆశ్చర్యంతో, భయంతో తల పైకెత్తి చెట్టు మీదికి చూసింది. సీతకు సంతోషం కలిగింది.

అటూ యిటూ చూడగా చూడగా వాయునందను డయిన హనుమంతుడు ఉదయసూర్య సమంగా కనిపించాడు.

ఆశ్వాసన

Trijata Swapnam - త్రిజట స్వప్నం

రామాయణం సుందరకాండ ఇరువది ఎడవ సర్గ - త్రిజట స్వప్నం

ఓసి మూర్ఖురాలా! నువ్వు ఆత్మహత్యకు సిద్దమయావంటే ఇప్పుడే నిన్ను చీల్చుకు తినగలం, అని కొందరు గర్జిస్తుంటే, వారిలో పెద్దదయిన త్రిజట అప్పుడే నిద్రలేచి:

ఓ పిచ్చినన్నాసులారా! జనకరాజసుతను, దశరథుల యింటి కోడలిని తినడం మీ తరంకాదు. మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడభర్తకు విజయం, లంకకు వినాశనం కలిగే కాలం అసన్నమయినట్లు నా కిప్పుడే కలవచ్చింది; అనడంతో, మిగిలిన వారందరూ భయభీతలై ఆమె దగ్గరగా చేరి;

తెల్లవారుఝామున వచ్చిన కలలు జరిగితీరుతాయంటారు. నీకు వచ్చిన కల వివరంగా చెప్పు, అన్నారు.

త్రిజట: స్వచ్చమైన ఏనుగుదంతాలతో నిర్మించిన పాలకీ. ఎన్నో హంసలు దాన్ని మోస్తున్నాయి. ఆ పాలకీ మీద ధవళవస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న 
తెల్లని పర్వతంమీద సీతాదేవి స్వచ్చవసన ధారియై రామునితో విహరిస్తున్నది.

మరోకల: పెద్ద పర్వతమంత ఏనుగు. దానికి నాలుగు దంతాలు. ఆ ఏనుగుమీద రామ లక్ష్మణులు, వారు సీతాదేవి దగ్గరకు వచ్చారు. ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్తృసన్నిధానంలో ఆవిడ
చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. ఆ ఏనుగు లంకానగరంవైపు వచ్చింది.

మరోకల: ఎనిమిది జతల తెల్లని వృషభాలు లాగే రథం మీద రాముడు సీతా సమేతం ఈ నగరానికి వచ్చాడు. అంతలో ఆయన సూర్యకాంతులీనే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా
వెళ్ళాడు. అలా వెడుతున్న ఆ రామచంద్రుని చూచి ముల్లోకాలూ భయపడుతున్నట్టు అనిపించింది. ఆ తేజోమూర్తిని చూస్తుంటే ఈ పృథ్విలో ఆయనను జయించే వారుండరనే నమ్మకం కలిగింది. పాపాత్ములకు స్వర్గ ప్రవేశార్హత ఉండదుకదా!

ఇంతలో మరోకల: మన రావణ ప్రభువు మత్తుగా త్రాగి, శరీరమంతా నూనెపూసుకుని, ఎర్రనిబట్టలతో, కరవీరపుష్పాలమాలతో, పుష్పకంమీద నుండి క్రిందపడ్డాడు. ఆయనను ఒక స్త్రీ (నల్లని వస్త్రాలు ధరించి, జుట్టులేనిది) యీడుస్తున్నది.

అంతలో నూనె త్రాగుతూ, గంతులువేస్తూ, నవ్వుతూ, ఇంద్రియాల పట్టుతప్పి తిరుగుతూ, గాడిదల రథం మీద బయలుదేరాడు. వెడుతూ వెడుతూ క్రిందపడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా ప్రేలుతూ ఎదుటవున్న దుర్గంధభూయిష్టమయిన గోతిలో ములిగాడు.

అంతలో ఎర్రనిచీరతో, బురదశరీరంతో ఉండే నల్లనిస్త్రీ ఒకతె 
న ప్రభువుకి ఉరిత్రాడుపోసి దక్షిణదిశగా ఈడ్చుకుపోయింది. అదేదశలో కుంభకర్ణుడూ కనిపించాడు.

రావణకుమారులందరూ బుర్రగొరిగించుకుని, నూనె పూసుకున్నారు. రావణుడు వరాహంమీద, కుంభకర్ణుడు ఒంటెమీద, ఇంద్రజిత్తు మొసలిమీద దక్షిణంగా పోతున్నారు.

విభీషణుడు మాత్రం తెల్లనివస్త్రాలు, పువ్వులు ధరించి, శంఖ దుందుభి ధ్వానాలు సాగుతుంటే, నృత్య గీతాలతో నవ్వుతూ నాలుగుదంతాల ఏనుగు మీద తెల్లగొడుగునీడలో ఉన్నాడు. ఆయనతో వాని మంత్రులు నలుగురూ ఉన్నారు.

మన రాక్షసులందరూ ఎర్రని వస్త్రాలు, పూలు ధరించి, తప్పతాగి తిరుగుతున్నారు. ఈ లంకానగరం చతురంగబలసమేతం సాగరాభిముఖంగా పోయి ములిగింది.

మరో క్షణంలో,

ఈ నగరాన్ని రామదూతయైన వానరు డొకడు అగ్ని దగ్ధం చేసినట్లు.

రాక్షసనారీజనం తెగత్రాగి విపరీత ధ్వనులతో, పరుష భాషణాలతో, ఆడుతున్నట్లు,

కుంభకర్ణాదు లందరూ గోమయంతో నిండిన గుంటలో పడినట్లు నా కలలో చూశాను.

ఇదంతా చూస్తుంటే-

ఈ లంకకు ముప్పు వచ్చినట్లే, నిస్సందేహంగా రాముడు లంకా నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు.

అందుచేత మనమందరం ఈ సీతాదేవిని శరణువేడాలి. ఇంతకంటె మనకు దారిలేదు. ఈ జనకరాజ నందన మనలను కరుణతో కాపాడుతుంది. నా మాట విని మీరందరూ ఆవిడపాదాలమీద పడండి.

అదిగో చూశారా! ఆవిడ పద్మదళ విశాలనయనం ఎలా వికసిస్తున్నదో ఆమె ఎడమభుజం అదురుతున్నది చూడండి.

అది శుభసూచన.

రామచంద్రుడు ఎదురుగా వున్నట్టు ఆమె శరీరం అంతా పులకిస్తున్నది!

అదిగో, ఆ చెట్టు కొమ్మమీద పక్షికూత విన్నారా! ఎంత సంతోషంగా వినిపిస్తున్నదో! చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్లు లేదూ! అని త్రిజట అంటూంటే సీతాదేవి సంతోషభరిత వదనంతో-

నీ కల నిజమయితే మీ అందరికీ నేను అభయం యిస్తాను, అంది.

శుభసూచనలు

vishaadam - విషాదం

రామాయణం సుందరకాండ ఇరువది అయిదు - ఇరువది ఆరు సర్గలు - విషాదం

భయంకర రూపాలు కల ఆ క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్కులు వినలేక జానకీదేవి దుఃఖ సంతప్తహృదయంతో:

మీ రందరూ కలిసి నన్ను తినవచ్చు నేను మాత్రం మీ ప్రభువును వరించను అని మరింత బయంతో అశోకవృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని బొటబొట కన్నీరు విడుస్తున్నది

పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మొవ్వులా వణుకుతూ ఉన్న సీతాదేవి కేశపాశం ఆడు పాములా విలవిలలాడుతున్నది

రామా! లక్ష్మణా!

అత్తయ్యా కౌసల్యాదేవీ! సుమిత్రాదేవీ!

ఆని విచారిస్తూ, ఎంతటి వారికయినా కాలం చెల్లితే కాని మృత్యువు ప్రాప్తించదు. కాకుంటే నేనింతకాలం రామ విరహంతో యీ దుష్టరాక్షసీజన మధ్యంలో జీవించగలిగేదానినా!

ఇంతకూ కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహుకొద్దివయి ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు, కాగానే, గాలి దెబ్బకు సముద్రంలో మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే యీ జీవితం వరద నీటి దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది.

కృతజ్ఞతా స్వరూపుడు, ప్రియవాదీ, సింహాపరాక్రమ సంపన్నుడు, సర్వజనమనోహరుడు అయిన నా భర్తను ధర్మాత్ములే దర్శించగలరు.

రామునికి దూరమయిన నా బ్రతుకు విషస్పర్శ తగిలిన దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మమో యిలా బాధిస్తున్నది. ఇక యీ జీవితం వదిలెయ్యడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అని విచారిస్తూ

ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడువలేని ఈ మానవదేహంకంటె నీచమయినది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్యజీవితం, అని పరిపరివిధాల శోకిస్తూ, ధూళిలో దొర్లుతూ:

నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచించి తీసుకురాగలిగాడు. ఇప్పుడీ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు పడుతూ బ్రతకడం కష్టం.

రాముడు వినా నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ. బహుశః నాకు వార్ధక్యం, మరణంలేవేమో!

ఏమయినా నా ఎడవుకాలి గోటితో కూడా ఈ రావణుని శరీరాన్ని తాకను. నా తిరస్కారంకూడా వీడికి తెలియడంలేదు. నన్ను చీల్చి ముక్కలు చేసీ నిప్పులో పడవేసినా నేను రావణునివైపు కన్నెత్తి చూడను.

సర్వజ్ఞుడు, సత్ప్రవర్తనపరుడు, దయహృదయుడు అయిన రాముడు ఎందుకింకా నా గురించి ఆలోచించడంలేదో తెలియదు.

జనస్థానంలో పదునాలుగువేలమంది రాక్షసులను ఒంటరిగా నేల కూల్చినవాడు, విరాధునివంటి మహాబలిష్ఠుడయిన రాక్షసుని హతమార్చినవాడు, రావణుని సంహరించగల శక్తి సంపన్నుడు, తనే  బాణ ప్రయోగంతో ఈ లంకానగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్ధ్యం కలవాడు ఎందుకింత
అలస్యం చేస్తున్నాడొ!

అయితే నేనిక్కడ ఉన్నట్లు ఆయన ఎరగడేమో! ఎరిగి ఉంటే యిలా ఉపేక్షించేవాడేనా?

రామునికి వార్త చెప్పగల జటాయును కూడా నా దురదృష్టంకొద్దీ ఈ రావణుడు సంహరించేశాడే!

ఏం చెయ్యను! నన్ను రాక్షస రావణుడు అపహరించినట్లు తెలిస్తే రాముడు తన శరపరంపరతో సర్వరాక్షస సంహారం చేసి తీరుతాడు. సముద్రాన్ని యింకించి, లంకను నాశనం చేసి, ఈ రావణుని పేరు ప్రతిష్ఠలన్నీ మంట గలపగలడు.

ఈనాడు నేను శోకిస్తున్నట్లే, ఈ రాక్షస స్త్రీలందరూ గోలు గోలున విలపిస్తారు.

రాముని కంటబడేవరకే వీడు ఊపిరితో జీవించేదీ. ఆయన కంటబడిన ఉత్తరక్షణంలో యీ లంకానగరంనిండా చితాగ్ని దూమం; గ్రద్దల విహారం.

పూర్తిగా శ్మశానం అయితీరుతుంది.

నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. రావణసంహారంతో యీ లంకా నగరం ధైర్యహీన అయిన స్త్రీవలె పిచ్చెక్కి తిరుగుతుంది.

తప్పదు, ఈ రాక్షస నగరంలో యింటింటా ఆర్తనాదాలు తప్పవు. రా
బాణాగ్నిలో యిదంతా తగులబడితీరుతుంది. రాక్షస యోధాగ్రేసరులందరూ నేల పాలవుతారు.

నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన క్షణంలో రాముడు యీపనిచేసి తీరతాడు.

అయితే, రావణుడు నాకిచ్చిన గడువులో యింక రెండు మాసాలే మిగిలాయి. ఈలోగా అ మృత్యువు వీడికే రాకూడదా. మాంసభక్షకులయిన యీ రాక్షసులకు ధర్మపరిజ్ఞానంలేదు. గడువు దాటిందంటే వీడు నన్ను ఉదయం ఫలహారానికి వండించితీరతాడు.

అంతకంటే వీరెవరయినా కనికరించి యింతవిషం యిస్తే దానితో యమపురి చేరేదాన్ని.

ఇంతవరకూ రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానోలేదో కూడా తెలీదు. నన్ను వీడిన దుఃఖంలో ఆయనే ప్రాణాలు విడిచి ఉంటాడేమో.

అసలు నాకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది. మహాత్ముడు, సర్వశాత్రపారంగతుడు, కుశలుడు, సదాచారపరుడు అయిన రాముడు లేని జీవితం ఎందుకు!  నా వియోగబాధతో ఆయన అస్త్రసన్యాసంచేసి ఆశ్రమవాసుడయ్యాడా!

కాక - ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా. ఏమయినా యింతబాధలోనూ నాకు చావు వచ్చిపడదేం.

మనోనిగ్రహసంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్షులు ధన్యజీవులు.

ఆత్మవిదుడు, 
నోహరుడు అయిన రాముని విడిచి ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడంకంటె ప్రాణాలు విడవడం మేలు.

అంటూన్న సీతమాటలు వింటున్న రాక్షసస్త్రీలు కొందరు భయంతో ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరకు పరుగుపెట్టారు.

త్రిజట స్వప్నం

Rakshasa Pravrtti - రాక్షస ప్రవృత్తి

రామాయణం సుందరకాండ ఇరువది మూడు, ఇరువది నాలుగు సర్గలు - రాక్షస ప్రవృత్తి

రావణుడు అంతఃపురం చేరాడు,

అశోకవనంలోని రాక్షస స్త్రీ లందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో: 

మా ప్రబువు రావణుడంటే ఎవరనుకుంటున్నావో, పులస్త్య వంశంలో ప్రబవించిన మహామహుడు అటువంటి ఉత్తమపురుషుని వరించడానికి బాధపడతావేమే! అని గర్జించిందొకతె.

ఏకజట: ప్రజాపతులు ఆరుగురు. వీరందరూ బ్రహ్మమానసపుత్రులు. వారిలో నాలుగవవాడు పులస్త్యుడు. ఆయన కుమారుడు విశ్రవసువు, 
హాతేజశ్శాలి, మహర్షి, వీరి కుమారుడు మా ప్రభువు, రావణుడు. ఆయనను వరించడం నీ అదృష్టం. 

హరిజట: దేవతా శ్రేష్ఠులను జయించిన 
మ రాక్షస ప్రభువే నీకు యోగ్యుడయిన భర్త.

ప్రఘన: 
హావీరుడు, శూరుడు. యుద్ధరంగంలో వెన్ను చూపని మహాయోధుడయిన మా మహారాజును వరించడానికి సంకోచం దేనికీ? ఆయన తన ప్రీయురాండ్రందరను విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు. వేలసంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. వారినీ, మణి, రత్న, శోబితమయిన అంతఃపురాన్నీ విడిచి నిన్నే ఆరాదిస్తాడాయన.

వికట: దేవ, నాగ, గంధర్య, రాక్షసవీరులను మన్ను కరిపించిన మా 
హారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకంగీకరించవు?

దుర్ముఖి: తెలుసా నీకు; ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు. వాయువు ప్రచండంగా చలించలేడు. లతలు, తరువులు పూలవానలు కురుస్తూంటాయి. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటివాడు మా ప్రభువు. నా మాటవిని అయనను వరించు. లేదా నీ ప్రాణాలుండవు.

సర్వప్రాణికోటికీ ఆహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా వుండు.

నువ్వు మానవస్త్రీవి కనుక మానవుడి భార్యవయావు. బావుంది. కాని యిప్పుడింక మనసు మార్చుకో,

త్రిలోకాలలో వుండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్చగా చరించు.

రాజ్యహీనుడు, ఎందుకూ కొరగానివాడు అయిన రామునికోసం బాధపడకు, అని ఒక్కొక్కరే బెదరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత:

మీ మాటలు సర్వలోకాలకూ అసహ్యమయినవి. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను.

దీనుడయినా, రాజ్య హీనుడయినా రాముడే నా భర్త. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్త్యులవారితో లోపాముద్ర, చ్యవనునితో సుకన్య.

సావిత్రీ - సత్యవంతులూ, శ్రీమతి - కపిలుడు, మదయన్తీ - సౌదానులు, కేశినీ - నగరులు, నల - ద
యంతులు, అలానే నేను రామునితో ఉంటాను, అని నిశ్చలంగా చెప్పింది.

రాక్షస వనితలకు క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో వేధిస్తున్నారు.

శింశుపావృక్షశాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు.

ఆ క్రూరరూపిణులు పళ్ళుకొరికి, పెదవు లాడిస్తూ, గండ్రగొడ్డళ్ళు పైకెత్తి;

ఇది మన ప్రభువుకు తగదు, అని గర్జించారు.

వారిలో వినత;

సీతా! ఇంతవరకూ చూపిన పతిభక్తిచాలు, సంతోషించాం. దేనికయినా అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలోవున్న మానవ భర్తను విడిచి, ఇంద్రస
పరాక్రముడయిన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్యభోగాలతో మహారాణిగా వెలుగుతావు. రాముడికెప్పుడో ఆయువు చెల్లిపోయింది. 
అటువంటి వాడికోసం బాధపడకు. నామాట వినవో, నిన్ను చీల్చుకు తినెయ్యగలం.

వికట: ఓసి దుష్టురాలా! ఇంతవరకూ నీ పాడుమాటలు వింటూ కనికరాంతో వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణీ దాటిరాలేని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు.

రావణుని అంతఃపురంలో వున్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుసావు! నా మాటవిను. సుఖంగా ఉంటావు. మా మహారాజును వరించు.

నవ నవలాడే ఈ యౌవనం స్థిరంగా శాశ్వతంగా వుండదు. అది పోకుండానే సుఖసంతోషాలలో తేలియాడాలి.

చూశావా! ఉద్యానవనాలు, పర్వత, కాననాలు, మా ప్రభువు కనుసన్నలలో మెలిగే ఏడువేలమంది కామినీ జనులు అన్నీ నీ కోసం యిస్తాడాయన

వినిపిస్తున్నదా నా మాట! వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాం

చండోదరి: ఇదిగో యీ శూలం చూశావా! నిన్ను చూసిననాటినుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టబెట్టి, తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది.

ప్రఘన: ఓ సీతా! ఇంక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతునులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెపితే, హాయిగా ఆరగించండి అని -ఆజ్ఞాపిస్తాడు మా ప్రభువు.

అజాముఖీ: దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళ, త్రాగడానికి కల్లూ కావాలి.

శూర్పణఖ : నీ మాట సబబుగా ఉంది అలా కానియ్యి, సర్వదుఃఖాలకూ విరుగుడయిన కల్లు తెప్పించండి త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నికుంభిలాదేవి దగ్గరనాట్యం చేద్దాం.

ఇలా ఎవరికి తోచినట్లు వాఋ గర్జనలు సాగిస్తుంటే బెదరిన హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకి.

విషాదం

Ravanuni Krodham - రావణుని క్రోధం

రామాయణం సుందరకాండ ఇరువదిరెండవ సర్గ - రావణుని క్రోధం

జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు:

నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందా మనుకుంటుంటే నన్నే వంచుతున్నావు. ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు.

నీ మీది అనురాగం నా క్రోధతీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి దయ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏమీ చెయ్యకుండా వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతేర్చి ఉందును.

ఇంకా నీకు రెండు మాసాల గడువుంది. ఈలోపున నువ్వు నా శయనమందిరం చేరి, నన్ను భర్తగా గ్రహించావా, మేలు.

కాదంటే - నిన్ను ఉదయపు ఫలహారానికి వండించేస్తాను. అంటూంటే రావణుని వెంట వచ్చిన దేవ, గంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ, అటువంటి ప్రమాదం రాదని హస్త, నేత్ర సంజ్ఞలతో జానకికి ధైర్యం కలిగించారు.

గుండె దిటవు చేసుకుని సీతాదేవి:

రావణా! ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించే వాడు ఒక్కడూ ఈ లంకలోలేడు, అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్నే కోరుతున్నారు. ఇంద్రునికి శచీదేవివలె నేను రాముని ధర్మపత్నిని. అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాలలో ఉండడు. నీకే పుట్టింది ఈ దుర్బుద్ధి.

ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు.

నువ్వెరుగుదువో, ఎరగవో!
ఆయన మత్తేభం,
నువ్వు చెవులపిల్లివి.

ఈ క్షణం వరకూ నువ్వు ఆయన కంటబడలేదు కనుక సిగ్గులేకుండా తిరుగుతున్నావు నిర్భయంగా.

నావంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూచిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది, ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈపాటికే ఊడిపోవలసింది.

రామాజ్ఞ లేదు కనుక, పాతివ్రత్య నియమానుసారం నేను నిన్ను బూడిద చెయ్యకుండా వదలిపెట్టాను.

ఇంతకూ నీ చావుకోసమే నన్ను అపహారించి తెచ్చావు. యక్షేశుడయిన కుబేరుని సోదరుడవు.

మహాశూరుడవు కదా! ఇలా వంచనతో పర దారాపహరణ నీచకార్యం ఎందుకు చేశావు? అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఎరుపెక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది.

ఉత్తుంగ భుజద్వయంతో రెండు శిఖరాలతో అలరారే మందరగిరిలా ఉన్నాడు.

సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్నా ఆ తీవ్రక్రోధంతో శ్మశాన చైత్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుసకొడుతూన్నట్టు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరగొట్టేట్లు నిన్ను భస్మం చేసేస్తాను, అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగాచూస్తూ:

ఎలా అయినా యీ సీత మనసు మార్చండి. సామ, దాన, భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి.

అని భయంకరాకారంతో సీతవైపు తిరిగాడు.

అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచక రావణునిచేరి, గాఢంగా కౌగలించుకుని:

నాథా! కృశించి, దీనంగా పడివున్న యీ మానవప్రాణితో నీ కేమిటయ్యా. నాతో భోగించు. దీనికి నీ భోగాలు అనుభవించేయోగం లేదు.

మనమీద యిష్టంలేని వారితో వెడితే. శరీరతాపమే తప్ప సుఖంలేదు.

నిన్ను కోరేవారితో భోగం తృప్తినిస్తుంది, అని పాగుడుతూంటే, రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు.

ధర్మనిష్ఠురాలయిన జానకీదేవి గజ గజ వణుకుతూ ఉండిపోయింది.

Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం తరువాత,  ఉపాకర్మ  మొదటి రోజ...