Tuesday, August 25, 2026

Srikrishnudu Lokapavada Nivruttikoraku Syamantakamanini Decchuta - శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట

పరీక్షిన్మహారాజా! సత్రాజిత్తు అనే రాజు మొదట శ్రీకృష్ణునికి చెరుపుచేసి, తర్వాత నమ్రత కలవాడై చెలిమిచేసి పుత్రికనూ, స్యమంతకమణినీ అర్పించాడు.

ఆ మాటలు విని రాజు ఈ విధంగా ప్రశ్నించాడు.

శుకమహార్షీ! సత్రాజిత్తు శ్రీకృష్ణునియెడ ఏ తప్పుచేశాడు? పుత్రికనూ స్యమంతకమణినీ తన ఇష్టానుసారంగా ఏ హేతువువల్ల శ్రీకృష్ణునికి సమర్పించాడు? ఇంతకూ ఆ స్యమంతకమణి అతని కెట్లా లభించింది? నాకు సమగ్రంగా ఈ విషయాలు చెప్పుము.

శుకయోగీశ్వరుడు పరీక్షిత్తుతో ఈ విధంగా చెప్పాడు: రాజా! సత్రాజిత్తు అనే రాజు ఒకడున్నాడు. అతడు సూర్యునిభక్తుడు. అతనిసేవలకు మెచ్చుకొని సూర్యభగవానుడు స్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకసారి సత్రాజిత్తు ఆ మణిని మెడలో అలంకరించుకొని ద్వారకకు వచ్చాడు. 

అతడు రెండవసూర్యునిలాగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. స్యమంతకమణికాంతులకు ద్వారకావాసులకన్నులు మిఱుమిట్లుగొల్పుతున్నవి. వారు సూర్యుడు దివినుండి భువికి దిగివచ్చాడా అని సందేహించారు. వెంటనే వెళ్లి, శ్రీకృష్ణునికి ఈ విధంగా విన్నవించుకొన్నారు.

ఓ నారాయణా! దామోదరా! పద్మాక్షా! చక్రధారీ! సర్వేశ్వరా! గదాధరా! వేదోద్ధారకా! యదుకుమారా! నిత్యశుభకరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

దేవాధిదేవా! ఇంద్రాదులు నిన్ను చూడాలని ఉవ్విళ్లూరుతారుగదా! యాదవవంశంలో జన్మించి, నీవు స్వస్వరూపాన్ని మరుగుపరచి, లోకాల్ని కాపాడుతూ ఉన్నావు. ఇటువంటి నిన్ను చూడటానికి సూర్యుడో, బ్రహ్మదేవుడో ఎవడో ఒకడు తన వెలుగులచేత నాలుగు దిక్కులనూ కప్పిపుచ్చుతూ ఇదిగో ఈ దారినే దగ్గరకు వచ్చాడు.

తనతో ఈ విధంగా చెప్పిన ఆ మందబుద్ధుల్ని చూచి శ్రీకృష్ణుడు నవ్వుకొన్నాడు. వారితో వచ్చినవాడు స్యమంతకమణి ధరించిన సత్రాజిత్తు గానీ సూర్యుడు కాదని చెప్పాడు. తర్వాత సత్రాజిత్తు సకలసంపదలు కలిగి, శుభకార్యాలు జరిగే తన గృహానికి వెళ్లాడు. 

స్యమంతకమణిని తన దేవతామందిరంలో(దేవుని ఇంటిలో) బ్రాహ్మణులచేత నెలకొల్పాడు. ఆ మణి ప్రతిరోజూ నూటఅరవై మణుగుల బంగారాన్ని పుట్టిస్తుంది.

రాజా!, స్యమంతకమణి పూజింపబడుతుండే రాజ్యంలో వ్యాధులు, గ్రహపీడలు, వివిధవంచకులు, మృత్యువు, క్షామం - వీటివల్ల కల్గే భయం ఉండదు.

శ్రీకృష్ణుడు యాదవరాజయిన ఉగ్రసేనునికి, స్యమంతకమణిని ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. సత్రాజిత్తు ధనాశతో మణిని ఈయకపోతే ఏ కీడు కలుగుతుంది?(కలుగదని అతని భావం) అని అనుకొని శ్రీకృష్ణునితో 'నే నియ్యను పో' అన్నాడు.

తర్వాత

సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడు. కుతూహలంతో స్యమంతకమణిని మెడలో ధరించి, జంతువుల్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం అతణ్ణి చంపి, మణిని ఎత్తుకొని పారిపోయింది. జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి, దగ్గరకు వెళ్లి, దిగంతాల దాకా వెలుగులు విరజిమ్ముతున్న ఆ స్యమంతకమణిని చూచాడు.

రాజా! జాంబవంతుడు ఆ మణిని తీసుకొనిపోయి సమీపంలో ఉన్న గుహలో ప్రవేశించాడు. దాన్ని తన ప్రియపుత్రునికి ఆటబంతిగా చేశాడు.

(కొన్ని ప్రతులలో “తన కూరిమిసుతకును” అనే పాఠం కనబడుతున్నది; అప్పుడు జాంబవంతుడు తన పుత్రికకు స్యమంతకమణిని ఆటబంతిగా చేశాడని చెప్పాలి. ఇది ఇతరాంధ్రకావ్యాల సాక్ష్యానికి వ్యతిరేకం. ఎర్రాప్రగడ హరివంశంలో” ... తన తనయుడు శిశువు సుకుమారుండను వానిచేతి కాడ మానికంబును నిచ్చి...” అని ఉన్నది. దీనినిబట్టి జాంబవంతుడు తన కుమారునకే స్యమంతకమణిని ఆటబంతిగా చేశాడని స్పష్టమవుతున్నది.

సంస్కృతభాగవతంలో కూడా “సో
పి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే” అని ఉన్నది. జాంబవంతుడు బిలంలో మణిని కుమారునకు క్రీడాసాధనంగా చేశాడని దీని కర్థం. కాబట్టి “తన కూరిమి సుతునకు” అనే పాఠాన్ని ఇక్కడ గ్రహించడమైంది.)

తర్వాత సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు కనపడకపోవటంచేత దుఃఖిస్తూ

“మా తమ్ముడు స్యమంతకమణిని మెడలో ధరించి, అరణ్యంలో సంచరిస్తుండగా ఆ మణికొరకు శ్రీకృష్ణుడు అతణ్ణి పట్టుకొని చంపాడు. అతనికి నీతినీ, న్యాయాన్నీ పాటించే బుద్ధిలేదు” అని సత్రాజిత్తు నిందవేశాడు. ఆ నింద శ్రీకృష్ణుని చెవినిబడింది. అతడు “నే నే తప్పూ చేయలేదు. కానీ నాపై పడిన ఈ అపవాదును పోగొట్టుకోవటం ఎట్లా?”

అని యుక్తియుక్తంగా ఆలోచించి

తనకు సంబంధించిన వారందరూ ప్రసేనుడు వెళ్ళిన దారిని చూపగా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ప్రయాణించి చివరకు అడవికి వచ్చాడు. అక్కడ భూమిమీద పడిపోయిన ఒక గుర్రాన్నీ, ప్రసేనుణ్ణీ, అతణ్ణి చంపిన సింహాన్నీ, సింహాన్ని చంపి జాంబవంతుడు చేరిన గుహనూ చూచాడు.

శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన వారినందరినీ గుహవాకిట్లో నిలిపాడు. మహామహిమ కలిగినవాడు కాబట్టి, తెగువతో తానొక్కడే గుహలో ప్రవేశించాడు. దానినిండా చిమ్మచీకట్లు క్రమ్ముకొన్నాయి. నేల చదునుగా లేదు. విరివిగా ఉండి, భయం పుట్టించే ఆ గుహ నడిమికి వెళ్లి అక్కడ ఒక బాలుని కెదురుగా వ్రేలాడగట్టిన స్యమంతకమణిని కృష్ణుడు చూచాడు. అతడు దాన్ని అపహరించాలని నిర్ణయించుకొని

శ్రీకృష్ణుడు మెల్లగా అడుగులు వేస్తూ, ఆ బాలునిదగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూచిన దాది గుండెలదిరి, వణకు ఎక్కువై భయంతో అరుపులు పెట్టింది.

దాదిఅరుపు విని, జాంబవంతుడు వచ్చాడు. అతడు శ్రీకృష్ణుణ్ణి చూచి, తన అధిపతి అని గుర్తించలేకపోయాడు. సామాన్య మానవుడు అని అనుకొన్నాడు. అనుకొని శ్రీకృష్ణునితో ఆ గుహలో కయ్యం చేశాడు.

మాంసంకోసం పోరాడే డేగలమాదిరిగా శ్రీకృష్ణజాంబవంతులు ఒకరినొకరు జయించాలనే వాంఛలు కలిగి, ఆయుధాలతో, వృక్షాలతో, చేతుల్తో ఇరవైయెనిమిది రోజులు పోరాడారు.

యుద్ధంలో కత్తులూ, చెట్లూ విరిగి నిరాయుధులయినప్పటికీ, శ్రీకృష్ణజాంబవంతులు శౌర్యాధిక్యంవల్ల వెనుకకు తగ్గలేకపోయారు. వారు పిడుగులవంటి పిడికిటిపోటులే ఆయుధాలుగా యుద్ధం చేయటానికి పూనుకొన్నారు.

శ్రీకృష్ణుడూ, జాంబవంతుడూ అహంకారం అతిశయింపగా, విజయవ్యామోహంతో, ఒకరినాకరు పిడికిళ్లతో పొడుచుకొంటూ అహోరాత్రాలు పోరాడారు. శ్రీకృష్ణుని పిడికిటి గ్రుద్దులకు జాంబవంతుడు బలం కోల్పోయాడు. నిండు అలసట కలిగిన అతని శరీరావయవాలన్నీ నజ్జు నజ్జయ్యాయి. అతడు భయపడి శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

దేవా! నీవు ఆదిపురుషుడవనీ; సర్వేశ్వరుడవనీ, విష్ణుమూర్తివనీ, మహామహిముడవనీ నాకు తెలుసు. సమస్త జీవరాశికీ ప్రాణం ప్రతాపం, ధైర్యం, బలం నీవే. ఈ ప్రపంచాన్ని పుట్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ నశింపజేసే మహేశ్చరునీ నీవే సృష్టిస్తావు, పోషిస్తావు, నాశం చేస్తావు. నీవే పరమాత్మవు. నీవే జీవాత్మవు.

(ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ, నాశంచేసే శివుణ్ణీ శ్రీకృష్ణుడే పుట్టించి, పెంచి, నశింపజేస్తాడని జాంబవంతుడు ప్రతిపాదించాడు. అతడు శ్రీకృష్ణుణ్ణి పరబ్రహ్మంగా భావించాడు. 

లోకాలకు సృష్టిస్థితిసంహారాలు గావించే వారు త్రిమూర్తులు. వారిని సృష్టించి, భరించి, నశింపజేసేది పరబ్రహ్మం. అనగా అది ఏకం. సర్వశక్తిమంతం. నిరుపమానం.)

మహాత్మా! రామావతారంలో నీవు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి కట్ట కట్టావు. ప్రతాపకాంతులచే రాక్షసుల గర్వాంధకారాన్ని పారదోలావు. ఏనుగు పద్మాలను తెగత్రెంచినట్లుగా రావణునితలలను ఖండించావు. 

శాశ్వతంగా లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టంగట్టావు. కరుణించి నన్ను నీదాసునిగా చేశావు. నీవు అపారమయిన దయ కలవాడివి. నేను పొరపాటున తప్పు చేశాను. దాన్ని మరచి, మన్నించుము.

ఈ రీతిగా ఉత్తమభక్తుడైన జాంబవంతుడు స్తుతించాడు. శ్రీకృష్ణుడు బాధను నివారించటానికి అతని శరీరాన్ని నిమిరి మంద్ర కంఠస్వరంతో ఈ విధంగా అన్నాడు.

భల్లూకరాజా! ఈ స్యమంతకమణి మాచేతికి చిక్కిందని అజ్ఞానులు మాకు నింద అంటగట్టారు. మేము ఆ నిందను తొలగించుకొనటానికి నీ నివాసమయిన గుహకు వచ్చాము.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు సంతోషించాడు. అతడు స్యమంతకమణినీ, కన్యారత్నమయిన తన పుత్రికను జాంబవతినీ, శ్రీ కృష్ణునికి కానుకగా ఇచ్చాడు.

ఇది జరగటానికి ముందు ద్వారకనుండి శ్రీకృష్ణునివెంట వచ్చినవారు పన్నెండురోజులు గుహవాకిట్లో ఎదురుచూచారు. శ్రీకృష్ణుడు ఎన్నాళ్లకూ రాకపోయేసరికి వారు విసిగి, దుఃఖించి ద్వారకకు వెళ్లిపోయారు. అక్కడ దేవకీ, వసుదేవుడూ, రుక్మిణీ, మిత్రులూ, చుట్టపక్కాలూ; దాయాదులూ శ్రీకృష్ణుడు గుహలో ప్రవేశించి చిక్కుకొనిపోయా డని విచారించి

ఎవ్వరు చొరరాని ఈ గుహనుండి బయటబడి శ్రీకృష్ణుడు ఈ వేళ ద్వారకాపురి చేరాలని కోరి, పౌరులు జట్టులు కట్టి, క్షేమకర మార్గానికి చేర్చేదీ, శివుణ్ణి సంతోషపెట్టేదీ అయిన దుర్గాదేవిని పూజించారు.

ఆందోళన పడుచున్న మనస్సుతో, దుఃఖంతో ద్వారకానివాసులు పార్వతిని సేవించారు. ఆ దేవి వారితో "శ్రీకృష్ణుడు కన్యామణి అయిన జాంబవతితో, స్యమంతకమణితో సంతోషిస్తూ తిరిగి వస్తాడు” అని పలికింది.

తన ప్రయత్నం ఫలించి, శత్రువులు భయపడుతూండగా శ్రీకృష్ణుడు స్యమంతకమణితో, జాంబవతి అనే కన్యామణితో ద్వారకకు వచ్చాడు.

స్యమంతకమణితో, జాంబవతితో కూడి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూచి ద్వారకావాసులు - మృతిచెందినవాడు బతికి వచ్చినట్లుగా భావించి, వేడుకలతో, వినోదాలతో పరమానందం పొందారు.

శ్రీకృష్ణుడు పరాక్రమంచేత జాంబవతిని స్వీకరించాడు. తర్వాత సత్రాజిత్తును కొలువుకూటానికి రప్పించి, జరిగిన కథంతా చెప్పి అతనికి స్యమంతకమణి నిచ్చాడు. సత్రాజిత్తు సిగ్గుతో మణిని తీసుకొని చేసిన తప్పునకు బాధపడ్డాడు. బలవంతుడైన శ్రీకృష్ణునితోడి వైరానికి భయపడ్డాడు. అతడు ఇంటికి వెళ్లి

శ్రీకృష్ణుడు పాపాత్ముల పాపాలను పరిహరించే సామర్థ్యం కలిగినవాడు. అటువంటి వానిమీద తప్పుచేశా డని నిందవేసే పాపిష్ఠుని పాపానికి హద్దు ఉంటుందా? (అపారమైన ఆ పాపం పోనేపోదు అని అర్థం.)

మితి తెలీకుండా మాట్లాడి నేను ఎందుకు శ్రీకృష్ణునిమీద అసత్యమయిన నిందారోపణం చేశాను? నేను పాపిని. ధనాశాపరుణ్ణి. దుష్టహృదయుణ్ణి. దురహంకారిని. దుర్బుద్ధిని. ఈ అకార్యానికి కారణమయిన ఈ శరీరంవల్ల ఇంకేమి ప్రయోజనం? ఏ విధంగా ఈ పాపంనుండి విముక్తి పొందుతాను? ఏ విధంగా శ్రీకృష్ణుడు సంతుష్టుడై దయతో నన్ను రక్షిస్తాడు?

స్యమంతకమణినీ, కూతురునూ ఇచ్చి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకొంటే నేను బతికి బట్టకట్టవచ్చు. అతడు కూడా సంతోషిస్తాడు. ఇదే ఉత్తమోపాయం. ఇది నిజం. ఇంకొకవిధంగా లక్ష్యం సిద్ధింపదు.

సత్రాజిత్తు ఇంటిలో ఏకాంతంగా ఉండి, స్వబుద్ధితో బహుముఖంగా ఆలోచించి, తాను చేసిన నిర్ణయం సందర్బోచితమయిన నీతి అని నిశ్చయించుకొన్నాడు. తర్వాత - భక్తుల ఆపదలను తొలగించేవాడూ, స్త్రీల హృదయాల్ని దోచుకొనేవాడూ, రాక్షసరాజుల్ని మట్టుపెట్టేవాడూ అయిన శ్రీకృష్ణునికి స్యమంతకమణినీ, సత్యభామనూ సమర్పించాడు.

పద్మనేత్రుడూ, మహాకీర్తి సంపన్నుడూ, నాశరహితుడూ అయిన శ్రీకృష్ణుడు రాజు లనేకులు కొనియాడే సద్గుణాలూ, సత్ప్రవర్తనమూ అనే లక్షణాలతో ప్రకాశించేదీ, పాతివ్రత్యం మొదలైన వానియందు కోరిక కలదీ, చంద్రుణ్ణి మించిన ముఖం కలదీ అయిన సత్యభామను వివాహమాడాడు.

సూర్యుడు స్యమంతకమణిని నీకు ఇచ్చాడు. మాకూ చాలామణులు ఉన్నాయి. కన్యారత్నమయిన సత్యభామ ఒకతే మాకు చాలు - అని చెప్పి, శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తిరిగి మణిని ఇచ్చాడు.

కుంతీదేవితో కూడా పాండవులు వారణావతంలో లక్కయింటిలో కాలిపోయారని శ్రీకృష్ణుడు విన్నాడు. అతడు అన్ని విషయాలూ తెలిసినవాడే అయినప్పటికీ బలరామునితో కలసి హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కృపుడు, విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు మొదలయిన వారినీ చూచి, వారి శోకాన్ని పోగొట్టేమాటలు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు

శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట





Rathidevi Pradyumnasahithayai Gaganamargambuna Dwarakaku Bovuta - రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట

ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి వధించి ఆనందిస్తున్నాడు. అప్పుడు ఆకాశగమనం చేసేరతీదేవి అతణ్ణి తీసుకొని ఆకాశమార్గంలో ద్వారకానగరం పై భాగంలో వస్తుంటే

ప్రద్యుమ్నుడు మెఱపుతీగతో కూడిన మేఘంవలె రతీదేవితో కలసి, ఆకాశంనుండి బయలుదేరి, స్త్రీలు తిరుగుచున్న అంతఃపురానికి వచ్చాడు.

నీలమేఘశరీరుడు, ఆజానుబాహుడు, నల్లని చిక్కని వంకర ముంగురులు కలవాడు, పసుపు పచ్చని వస్త్రం తాల్చినవాడు, విశాల వక్షఃస్థలం గలవాడు; సన్నని నడుముకలవాడు, విచ్చిన కలువరేకులవంటి కన్నులు గలవాడు, చిఱునగవు చిందించేవాడూ, అయిన ప్రద్యుమ్నుణ్ణి చూచి, అంతఃపుర స్త్రీలు ఈ వస్తుండేవాడు కృష్ణుడేమో అని భ్రాంతిపడ్డారు. ఆయన ఎదుటపడకుండా, కంటికి కానరాకుండా తప్పుకొన్నారు.

అంతఃపురస్త్రీలు గుంపులు కట్టి ప్రద్యుమ్నుని విమర్శగా చూడలేదు. వారిలో కొందరు ఇతడు కృష్ణుడే అన్నారు. మరికొందరు ఇతని పోలికలు కొన్ని కృష్ణునిలో లేవన్నారు. ఇంకా కొందరు తొందరపడకుండా ఇత డెవరో ముందుముందు కనుక్కుందా మనుకున్నారు.

అంతఃపురస్త్రీలు వచ్చిన ఆ పురుషుడు కృష్ణుడనుకొని అతనివెంట కొంతదూరం వెళ్లారు. తర్వాత “ఇతడు కృష్ణుని మాదిరిగా ఉన్నాడు గాని కృష్ణుడుమాత్రం గాడు” అని తేల్చుకొన్నారు. తర్వాత వింతగా, మెల్లమెల్లగా ప్రద్యుమ్నుణ్ణి సమీపించారు.

అంతఃపురస్త్రీలందరూ ప్రద్యుమ్నుణ్ణి పరీక్షగా చూస్తూ ఉన్నారు. అప్పు డక్కడకు సద్గుణరాశీ, శ్రీకృష్ణుని పెద్దభార్యా, విదర్భరాజైన భీష్మకుని కూతురూ - రుక్మిణికూడా వచ్చింది. ఆమె కడగంటి చూపులతో ఆ చిన్నవాని వాలకమంతా గమనించింది. వెంటనే ఆమెకు మాతృభావం ఏర్పాడి, చన్నులనుండి పాలుకారటం మొదలయింది. తత్తరపడుతూ, దీనంగా రుక్మిణి చెలికత్తెతో ఇలా అనింది.

కమలాల్లాంటి కన్నులు గలవాడూ, మన్మథుని సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలవారిలో అగ్రగణ్యుడూ, చంద్రబింబాన్ని పోలిన ముఖం, కలవాడూ, సింహంనడుమువంటి సన్నని నడుము గలవాడూ అయిన ఈ పడుచువాడు ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాడో? ఈ శుభలక్షణునికి జన్మనిచ్చిన అదృష్టవంతురాలు పూర్వజన్మలో ఏ వ్రతాలు చేసిందో? ఏ ఉత్తమపుణ్యదంపతులకు ఇతడు జన్మించాడో?

చెలీ! నేను మొదట కన్నబిడ్డకు నీళ్లుపోసి, పాలిచ్చి పురిటింటిలో పెద్దపరుపుమంచంమీద నిద్రపోయాను. నాపసికందును తల్లిపాలకు దూరంచేసి, ఏపాపబుద్ధులు ఏరీతిగా దొంగిలించారో? ఏతల్లి నాముద్దుకూనను అక్కున చేర్చుకొనిందో?

సఖీ! నాసందిటికి దూరమయినప్పటినుండి ఈనాటివరకూ కుమారుని వృత్తాంతం చెవినిబడలేదు. వాడెక్కడున్నాడో? ఏంచేస్తున్నాడో కదా!

నా కుమారుడు ఈనాటివరకూ బతికి ఉంటే, జనులు అతని శరీరసౌష్టవాన్నీ, కార్యదక్షతనూ, యౌవనదశనూ, సౌందర్యాన్నీ ప్రశంసిస్తూ ఉండేవారు. వాడు ముమ్మూర్తులా ఇతనంతవాడయ్యుండేవాడు. ఏ మాత్రమూ అనుమానించాల్సిన పనిలేదు.

చెలీ! ఆ నాటి నా కొడుకే ఈ రూపమూ, రంగూ, నడక, నవ్వూ చూపులూ, గొంతూ, గాంభీర్యమూ, లావణ్యమూ తప్పకుండా ప్రాప్తించి ఉండాలి. ఇతడే అతడు కావటానికి అర్హుడు. మిగిలినవారికి నాప్రాణనాయకునిపోలిక లుండటానికి అవకాశమే లేదు. ఇతనిపట్ల నాకు ఆసక్తి పెరుగుతూంది.

మనస్సు సంతోషపూర్ణ మవుతోంది. ఎడమబుజం అదరుతోంది. కన్నులు ఆనందబాష్పాలతో అతిశయిస్తూన్నాయి. స్తనాలలో పాలు పయికుబుకుతూన్నాయి. మేలు కలుగవచ్చునేమో!

అని ఉయ్యాలవలె అటునిటు ఊగుతున్న మనస్సుతో అనేకవిధాల భావాలకు లోనై

రు
క్మిణి ఇతడు నా కుమారుడే అని చెప్పాలని మొదట సంకల్పించింది. కానీ మనస్సులో మహాసంశయం కలిగిన తర్వాత వీడు నా కుమారుడు కానట్లైతే సవతులు గుంపుగూడి పరిహసిస్తారని భావించింది. (ఇలా ఏ నిర్ణయమూ చేయలేకుంది.)

ఈ విధంగా రుక్మిణి ఆలోచిస్తుండగా కృష్ణుడు అంతఃపుర రక్షకులవల్ల జరిగిందంతా విన్నాడు. వెంటనే, దేవకీవసుదేవులతో పాటు వచ్చాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ, మాటమాత్రమైనా చెప్పలేదు. 

అంతలోనే నారదుడు వచ్చి, శంబరుడు శిశువయిన ప్రద్యుమ్నుణ్ణి అపహరించికొని వెళ్లటం మొదలయిన వృత్తాంతాలు తెలియజేయగా

మరణించిన బాలుడు బ్రతికి చాలాయేళ్లకు మరలా ఇల్లుచేరినట్లుగా ఇతడు వచ్చాడు. ఈనాడు మంచినడవడిగల ఇతణ్ణి ఆకస్మికంగా చూచాము. పూర్వజన్మలో మనము ఎటువంటి తపస్సు చేశామో? (గొప్ప తపస్సు చేసి ఉంటామని భావం)

ఆ విధంగా పలికి అంతఃపురస్త్రీలూ కృష్ణుడూ మొదలయిన వారూ మనోజ్ఞమయిన వస్త్రాలతో, భూషణాలతో, అలంకరించబడిన రతీప్రద్యుమ్నుల్ని సత్కరించి, ఆనందించారు. అప్పుడు రు
క్మిణి కుమారుణ్ణి అక్కున చేర్చికొని

నాయనా! కుమారా! నా చనుబాలు త్రాగటానికి వీలులేకుండా చేసి, నిన్ను శంబరాసురుడు సముద్రంలో పడేశాడా? నిన్ను చూచి ఎన్నేళ్లయిందో! నీవు ఏ విధంగా బ్రతికి బయటబడ్డావు? ఏ పూనికతో యుద్ధంలో శంబరుణ్ణి గెల్చావు? ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతూందయ్యా! ఇంతకాలానికి నిన్ను చూచాను. కృతార్థురాలి నయ్యాన్నాయనా!!

రుక్మిణీదేవి ఈ విధంగా పలికి, కొడుకును చూచి మహానందం పొందింది. కోడలిని పొగడింది. వేడుకలతో కాలక్షేపం చేస్తూ ఉన్నది. ద్వారకా పట్టణప్రజలు కూడా ప్రద్యుమ్నుని రాక విని సంతోషించారు. వారిలో

శ్రీకృష్ణుని భార్యలు లక్ష్మీనారాయణుల కుమారుడయిన మన్మథుణ్ణి చూచి, శ్రీ కృష్ణుణ్ణి చూచినప్పటిమాదిరిగా పరవశిస్తారట! ఇక పరాయిఆడువారు మన్మథుణ్ణి చూచి మోహాంధకారంలో మునిగినవాళ్లు కావటం వింతగాదు గదా!

ఇంతవరకూ చెప్పి శుకుడు ఇంకా ఈ విధంగా అన్నాడు.

శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట





Monday, August 24, 2026

Pradyumna Kumara Charitra Prarambhamu - ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యాడు. తర్వాత అతడు పరమేశ్వరుణ్ణిగూర్చి అనేకపర్యాయాలు శ్రద్ధతో తపస్సుచేశాడు. ఆ తపస్సుకు ఫలంగా రుక్మిణీకృష్ణులకు కుమారుడై పుట్టాడు. ఈ పునర్జన్మంలో మన్మథుడు శ్రీకృష్ణుని మరొకరూపమా అన్నట్లున్నాడు.

ఆ శిశువే తర్వాత ప్రద్యుమ్ను డనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు. అయితే ఆ పసిగందును శంబరు డనేరాక్షసుడు తనశత్రువుగా పసిగట్టాడు. అందువల్ల ఆ బాలుణ్ణి ఒకనాడు పురిటింట్లో తల్లిసందిటిలో ఉన్నప్పుడు అపహరించి, సముద్రంలో పారవేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడు సముద్రజలంలో అడుగుకు పడిపోగా ఒక పెద్దచేప అతణ్ణి పట్టుకొని మింగేసింది. ఆ సముద్రంలో

జాలరులు పట్టుకొంటా రనేభయంతో చేపలు - ఆ సముద్రంలో చిక్కకుండా పారిపోయేవి. అప్పుడు జాలరులు ఆగ్రహించి వాటిల్ని తప్పించుకొని పోనీకుండా అడ్డగించి, వలలు వేసి పట్టుకొనేవాళ్లు.

జాలరులు సముద్రంలో ప్రద్యుమ్నుణ్ణి మింగిన పెద్దచేపనూ, దానివెంట తిరిగేచేపలనూ పట్టీ తెచ్చి, శంబరాసురునికి కానుకగా సమర్పించారు. అతడు వాటిల్ని వండి తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చి వంట ఇంటికి పంపాడు.

పరీక్షిన్మహారాజా! రాజాంతపురంలోని వంటవాళ్లు ఆపెద్దచేపపొట్టను చీల్చినప్పుడు, దానిలో వారికి ఒక రాచబిడ్డ కనిపించాడు. వెంటనే వా రీవిచిత్రాన్ని రతీదేవికి తెలియజేశారు.

ఒకనాడు నారదుడు శంబరుని అంతఃపురానికి వచ్చి ప్రద్యుమ్నుని జననమూ, శంబరుడు ఆ బాలుణ్ణి చంపటానికి చేసిన ప్రయత్నమూ, అతడు చేపకడుపులో ప్రవేశించటమూ రతికి వివరించాడు; 

ఇంతకు మునుపే ఆమె మాయావతి అనేపేరుతో శంబరుని అంతఃపురంలో పాతివ్రత్యం అవలంబిస్తూ, శివునికంటిమంటల్లో భస్మమైపోయిన తన భర్త మన్మథుడు తిరిగి ఎప్పుడు శరీరధారి అవుతాడో అని ఎదురుచూస్తూంది. అందువల్ల చేపపొట్టలో ఉన్నబాలుడు మన్మథుడే అని తెలుసుకోగలిగింది. 

ఆమె తొందరపాటు లేకుండా కొడుకుకోసం తపిస్తున్నదానిమాదిరిగా శంబరునిదగ్గరకువెళ్లి, అతని అంగీకారాన్ని పొంది, వంటవాళ్ల అదుపులో ఉన్న పిల్లవాణ్ణి తెచ్చి పెంచుతూ ఉంది. ఆ బాలుడు పూటపూటకూ పెరుగుతూ యౌవనవంతు డయ్యాడు.

రాజా! ఆ యువకుని సౌందర్యాన్నిగూర్చి ఏమని చెప్పేది? అందగత్తెలు ఎవరైనాసరే ఒకసారి అతనిరూపాన్ని కళ్లారా చూస్తేచాలు - అతనితో భోగించాలని నిశ్చయించి, అతణ్ణి సమీపించే ఆలోచనను, అతని సౌందర్యం వాళ్లకు జనింపజేస్తుంది.

(రూపం అనేది చాలా అర్థవంతమయిన శబ్దం. “రోపయతి విమోహయ తీతి రూపమ్‌! రుపు విమోహనే - మోహింపజేసేది” అని వ్యుత్పత్తి. మోహింపజేస్తుంది కాబట్టి, రూపం అనే పేరు కలిగింది.)

ఈ పడుచువాడు నిజంగా మన్మథుడే! మన్మథుడు గొప్ప అందగాళ్ల సొగసుతో పోల్చటానికి తగిన సుందరుడయ్యాడు. విరాగియై స్త్రీవైముఖ్యం కలిగిన శివుణ్ణి ఘోరతపస్సు చేసినపార్వతికి అర్ధశరీరం సమర్పించేటట్లు చేశాడు. 

సృష్టికర్త అయినబ్రహ్మ కన్నకూతురయిన సరస్వతికోసం వావీవరుసా వదలేటట్లు చేశాడు. దేవేంద్రుడు నిలువెల్లా వేయిమచ్చల గుర్తులు (కన్నులు) పొందటానికి మూలకారకుడయ్యాడు.

అతడు మునీశ్వరుల మనోనిగ్రహం ఏ పాటిదో తూకంవేస్తాడు. స్త్రీపురుషులు పరస్పరమూ ప్రేమించుకొనేటట్లు చేస్తాడు. వాడి వత్తలయ్యే పూలవింటితో మహావిజయాలు సాధిస్తాడు. గట్టితనం లేని చిగురాకుకత్తితో లోకాల్ని బాధిస్తాడు.

ఈ విధంగా ప్రజలందరూ మన్మథునిశక్తులను కొనియాడుతున్నారు. పద్మనేత్రుడూ, ఆజానుబాహుడూ, లోకమోహనస్వరూపుడూ అయిన అతణ్ణి సిగ్గూ, చిరునవ్వూ దాగినచూపులతో చూస్తూ, మాయావతి రతివాంఛను ప్రకటించింది. అప్పుడు ఆమెవాలకం చూచి ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నాడు

(1. పంచబాణుడు అంటే అయిదుబాణాలు కలవాడని అర్ధం. తామరపూవు, అశోకము, మామిడి, మల్లె, నల్లగలువ అనేవి ఆ పంచబాణాలు - ఆ బాణాలు చేసే పనులు - సమ్మోహనం (ఆకర్షించునట్లు చేసేది), ఉన్మాదనం (వెరి పుట్టించేది), తాపనం (కాక ఎక్కించేది), శోషణం (శుష్కింపజేసేది), స్తంభనం (కొయ్యవారేటట్లు చేసేది.))

తల్లీ! ఇన్నాళ్లూ నా కొడుకని అందరికీ నన్నుగూర్చి చెప్పావు. ఇప్పుడు సిగ్గులేకుండా, మాతృత్వాన్ని మంటగలిపి, కాముకురాలివలె ఈ విలాసచేష్టలు చేస్తున్నావు. ఇది ఎంతపాడుపని? సత్ప్రవర్తనకు పేరుపొందిన నీవు నన్ను మోహించటం న్యాయంగాదు.

ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి “నీవు విష్ణువునకు కుమారుడవు. మన్మథుడవు. నేను నీపత్నిని. రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను దొంగిలించి, తల్లినుండి వేరుచేసి సముద్రంలో పారవేశాడు. అప్పుడు పెద్దచేప నిన్ను మింగేసింది. ఆ తర్వాత దానిపొట్టనుండి నీవు బయటపడ్డావు. ఇక జరుగవలసిన పనేమిటో చెప్తాను. విను. (శంబరుడు - జటాసురుని కొడుకు)

ఈ శంబరుడు మాయలమారి. దుర్బుద్ధి. యుద్దాల్లో దేవతలనయినా జయిస్తాడు కాని తానుమాత్రం చావడు. కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయలచేత వీణ్ణి సంహరించు.

పాపపుపనులు చేసే ఈ శంబరుడు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నతల్లి “దేవుడా! నాబీడ్డ ఎక్కడికి పోయాడు? వాణ్ణి, నన్నూ ఎడబాపావుగదా!” అని దూడకు దూరమైన ఆవువలె కిందబడి దుఃఖంతో, బాధతో కుయ్యోమొర్రో అని అనకుండా ఉంటుందా?

(శంబరునివల్ల ఏర్పడిన విద్యకు 'శాంబరీవిద్య' అని పేరు. ఇదొక ప్రత్యేకమైన మాయావిద్య.)

అనిచెప్పి, మాయావతి మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నునికి విరోధులమాయ లన్నింటినీ మట్టుపెట్టే 'మహామాయ' అనేవిద్యను ఉపదేశించింది. ఈ విధంగా

మాయాయుద్ధనిపుణుడూ, ధనుర్భాణాలు ధరించినవాడూ అయిన ప్రద్యుమ్నుడు “ఓరీ రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పడవేశావు. ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను. తొందరగా రారా!” అని అన్నాడు. ఆ సమయంలో శంబరుడు మనోజ్ఞమైన దివ్యవస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్దానికి ఉత్సాహంతో కాలుదువ్వుతున్నాయి.

ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికినమాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తొక్కబడిన పాము మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి, వజ్రాయుధధ్వనివంటి సింహనాదం చేసి, బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుణ్ణి గదతో కొట్టాడు.

శంబరుడు తనమీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తనగదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం చేస్తూ తన గదను అతనిమీదికి విసరివేశాడు.

పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మయునినుండి తాను గ్రహించిన రాక్షసమాయను తోడుచేసికొని ఆకాశాని కెగిరి, ప్రద్యుమ్నునిమీద బాణాలజడివానను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడికూడా పట్టువదలక సర్వమాయలను ధ్వంసం చేసే సాత్త్వికమాయను శంబరునిమీద ప్రయోగించాడు. వాడు సర్ప -గుహ్యక-పిశాచమాయలను ప్రద్యుమ్నునిమీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి

ఏమీ మాటాడకుండా ప్రద్యుమ్నుడు యమునివంటివాడై భయంకరఖడ్గంతో శంబరునితలను నరికాడు. కత్తిదెబ్బకు రాక్షసుని చెవిపోగులలోనూ, కిరీటంలోనూ పొదిగిన మణులు నేలమీద రాలిపోయాయి.

లేతచిగురాకుకత్తితో సర్వలోకాలలో నివసించేవారినీ అస్వతంత్రులుగా చేసే పట్టుదలగలవానికి ఉక్కుకత్తితో శత్రువును సంహరించటం ఒకలెక్కా?

పరీక్షిన్మహారాజా! శంబరుడు చనిపోవటంచేత దేవతలు నిర్భయంగా అతణ్ణి నిందించారు. ప్రద్యుమ్నుని ధైర్యశౌర్యాది గుణాలను స్తుతించారు. ఆనందంతో ఎడతెగకుండా పూలవాన కురియించారు.

రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట





Sree Maha Bhagavathamu Part 10 Utharabhagam - శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

శ్రీరస్తు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

శ్రీకర! పరిశోషిత ర, త్నాకర! కమనీయగుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధా, రా కంపితదానవేంద్ర! రామనరేంద్రా!


అష్టైశ్వర్యాలూ అనుగ్రహించేవాడా!,సముద్రాన్ని ఇంకింపజేసినవాడా! మనస్సును ఆకర్షించే సర్వసద్గుణాలూ కలవాడా! దయకు గని అయినవాడా! భయం కలిగించే బాణపరంపరలు ప్రయోగించి, రావణాసురుణ్ణి నిలువెల్లా కంపింపజేసినవాడా! శ్రీరామచంద్రా!

(శ్రీకరుడు అంటే విష్ణువని అర్ధం. ధనం, ధాన్యం, వస్తువు, వాహనం, పుత్రుడు, మిత్రుడు, బంధువు, దాసుడు అనే ఎనిమిది విధాలైన సంపదను కలిగించేవాడా! అందువల్ల శ్రీకర! అనే సంబోధనకు సాక్షాద్విష్ణుమూర్తి అనే అర్ధం. రాముడు నారాయణుని అవతారం)

మహాగుణవంతులయిన శౌనకాదిమునీశ్వరులతో సకలపురాణాలనూ వ్యాఖ్యానింపగలిగిన సూతుడు ఈ విధంగా అన్నాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు “శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకొన్న తర్వాత జరిగినకథంతా చెప్పండని శుకమహర్షిని అడిగాడు. అప్పుడు ఆ మహాయోగి ఈ విధంగా అన్నాడు.

ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము















Srikrishnudu Rukminidevini Bendli Yaduta - శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

అప్పుడు యాదవశ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణునినగరంలో పెళ్లివేడుకలు మొదలయ్యాయి. పాటలు, వాద్యాలు, ఆటలు ఎక్కడచూచినా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుషులు అందంగా అలంకరించుకొన్నారు. పెళ్లికి దేశదేశాల రాజులు ఆహ్వానింపబడ్డారు. 

వాళ్లు ఏనుగుల నెక్కి వస్తున్నారు. ఆ మదపుటేనుగుల చెక్కిళ్లనుండి మదజలం ధారగా స్రవిస్తూంది. ఆ ధారకు నగరవీథులు తడిసిపోయాయి. ప్రతివాకిలికీ మంగళతోరణాలు కట్టారు. పోక, అరటి బోదెల్ని వాకిళ్లకు అలంకరించారు. కర్పూరం, కుంకుమలతో అలంకారాలు తీర్చారు. 

అగరుపొగలతో పరిమళింపచేశారు. దీపాలు వెలిగించారు. పూర్ణకుంభాలు నిలిపారు. ప్రతి ఇంటి అరుగు, వాకిలి, గడప, స్తంభాలను రకరకాలుగా అలంకరించారు. రంగురంగుల అపూర్వ పుష్పాలనూ, వస్త్రాలనూ, రత్నాలనూ, తోరణాలనూ కట్టి అందగింపచేశారు. పతాకలు గాలికి ఎగురుతూ రెపరెపలాడుతూ ద్వారకానగరం విలసిల్లింది. ఆ సమయంలో

రుక్మిణి శ్రీకృష్ణుని మనస్సును దోచుకుంది. అభిమానవతి. సంపద ఉన్నది. నిబ్బరంగా వ్యవహరించేది. సర్వసంపదలనూ కలిగించేది. మంచివారైన బంధువులను సమ్మానించేది, పవిత్రమైన నడవడిక కలది. హీనమైన దరిద్రాన్ని కూడా పోగొట్ట గలిగింది. మంచి నగలను, వస్త్రాలనూ దాల్చింది. గుణవతులైన స్త్రీలకు తలమానికంవంటిది. ఇన్ని గుణాలున్న రు
క్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తి కలిగేలా వివాహం చేసుకున్నాడు.

అపుడు ప్రజలు తాము తమ భార్యలతో కలిసి వివాహానికి వచ్చి, దయాగుణంతో పైపైకి ఎదిగే లక్షణమున్నవాళ్లూ, పదిమంది చెప్పుకునేలా తేజస్సుతో వెలుగుతున్న వాళ్లూ అయిన రుక్మిణీ కృష్ణులను వారు సకుటుంబంగా దర్శించి, మంచి మనస్సులతో కానుకలను సమర్పించారు.

శ్రీకృష్ణుని వివాహానికి కేకయ, కురు, సృంజయ, యాదవ, విదర్భ, కుంతి రాజ్యాలనుండి వచ్చిన రాజులు చాలమంది నిశ్చయమైన అభిప్రాయంతో వచ్చి పరమానందం పొందారు.

అన్నిదిక్కుల్లో ఉన్న రాజులు, రాజకుమారులు శ్రీకృష్ణుడు ఈ విధంగా రు
క్మిణిని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనన్య సామాన్యమైన కార్యమని ఆశ్చర్యపడ్డారు.

పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మీదేవి అవతారం అయిన రుక్మిణితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీ కృష్ణుణ్ణి పురప్రజలందరూ దర్శించి 'భయంనుండి విముక్తులై' సంతోషంతో పొంగిపోయారు.

అని ఈ విధంగా రు
క్మిణీ శ్రీకృష్ణుల పరిణయగాథను చెప్పిన తరువాత. ఇంకా

భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తికలవాడా! కలువరేకులవలె నీలపువన్నెగల సుకుమారమైన శరీరం కలవాడా! భూపాలకులకు శిరోభూషణమైనవాడా! భూప్రజలచేత పొగడబడే సుగుణరాశి కలవాడా! పద్మాలవంటి చేతులున్నవాడా! అన్నిలోకాలచేత పాగడబడినవాడా! 

సాటిలేనిమంగళస్వరూపా! స్వచ్చమైన, వన్నెకెక్కిన కీర్తి కలిగినవాడా! శత్రువుల గుండెలను చీల్చువాడా! భక్తుల సమూహానికి సహాయం చేసేవాడా; పెద్దవారినీ, పండితులను పోషించేవాడా! భయంకరమైన రాక్షసులను అణచివేసేవాడా!

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sahodaruni Bhangamunaku Khinnayagu Rukminidevini Balabhadrum Duraarchuta - సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

ఈ విధంగా బలరాముడు ముందు వెనుకలు ఆలోచించి రుక్మిణీదేవిని గమనిస్తూ ఇలా అన్నాడు.

అమ్మా! రు
క్మిణీ! నీ తోడబుట్టినవానికి అవమానం జరిగిందని దిగులు పడకు. మా తమ్ముడైన శ్రీకృష్ణుణ్ణి తప్పు పట్టబోకు. ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కడచిన జన్మలో చేసిన కర్మనుబట్టి ఈ జన్మలో జీవికి మంచీ, చెడూ అనేవి కలుగుతూ ఉంటాయి. 

శిక్షించడానికీ, రక్షించడానికీ ఎవడూ కర్త అంటూ లేడు. నీ అన్నకూడా ఈ రోజు ఇక్కడ ఈ అవమానం పొందాడంటే, అదంతా అతడు చేసిన కర్మఫలమే తప్ప మరొకటి కాదు.

బంధువులు ఏదైనా తప్పుచేస్తే అది చంపవలసినంతటి తప్పైనా వాళ్లను చంపకూడదు. క్షమించి విడిచిపెట్టాలి. అది పద్ధతి. అలా కాకుండా చంపామనుకో, పాపం అనేది తప్పకుండా అంటుకుంటుంది. పైగా ముందే చచ్చినవాడిని మళ్లీ చంపవలసిన అవసరం కూడా లేదు.

సృష్టికర్త అయిన బ్రహ్మ రాజులకు ఈ ధర్మాన్ని సృష్టించాడు. రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో తన తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూరహృదయుడై చంపుతుంటాడు.

రాజ్యంకోసం, ధనంకోసం, ధాన్యంకోసం, స్త్రీలకోసం, పరువుప్రతిష్ఠలకోసం, వైభవాలకోసం మానధనులైనవాళ్లు ఆరాటపడతారు. సంపద ఉందనే పొగరుతో ఇతరులను కూడా రెచ్చగొట్టి పోరాటాలకు దింపుతారు.

రుక్మిణీ! విను. లోకంలోని మానవులకు వీడు తనవాడు, వీడు పగవాడు, వీడు తటస్థుడు అనే దృష్టిభేదం దేహాభిమానంవల్ల కలుగుతుంది. ఆ దేహాభిమానం దైవమాయవల్ల కలుగుతుంది. చంద్రుడు, సూర్యుడు వంటివి నీళ్లలో, అద్దాలలో కనిపించి అనేకం ఉన్నాయనిపిస్తుంది. 

కుండలువంటి వాటిలో ఆకాశం కూడా అనేక ఆకాశాలుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ ఒక్కటే అయినా, ఎన్నో శరీరాలలో ఉండి అనేకంగా అనిపింపజేస్తుంది. ఈ శరీరం చావుపుట్టుకలతో కూడింది. ఇది పంచభూతాలతో, పంచప్రాణాలతో, త్రిగుణాలతో కూడింది.

ఈ శరీరం ఆత్మలో అజ్ఞానంచేత కల్పింపబడి జీవుడిని సంసారంలో తిప్పుతుంటుంది. సూర్యుడు దేనితోనూ సంబంధంలేక ఉదాసీనుడుగా ఉండగా దృష్టి, రూపం అనే వానివలె ఆత్మ ఉదాసీనంగా ఉండగా శరీరం, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ప్రకాశమానమవుతాయి.

ఆత్మ అనేదానికి మరొకదానితో కలయికగానీ, ఎడబాటుగానీ లేవు. పెరగడం, తరగడం అనేవి చంద్రకళలకే గానీ చంద్రునికి ఉండవు. అదేవిధంగా చావుపుట్టుకలు శరీరానికే గానీ, ఆత్మకు కాదు. నిద్రపోయినవాడు కలలో విషయాలవలన కలిగే సుఖదుఃఖాల్ని ఆత్మకు అనుభవింపచేస్తాడు. 

జ్ఞానహీనుడు అసత్యమైన విషయాలలో అనుభవాన్ని పొందుతుంటాడు. నిజానికి సుఖదుఃఖాలనేవి ఆత్మకు అంటవు.

పద్మంలాంటి ముఖం కలిగిన రు
క్మిణీ! దుఃఖమనేది తెలియనితనంవల్ల వస్తుంది. జ్ఞానమనే దృష్టితో ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు. విశిష్టమైన జ్ఞానమున్నదానివైన నీవుకూడా అజ్ఞానులవలె శోకింపదగదు.

ఇలా బలరాముడు ప్రబోధించగా రు
క్మిణి దిగులు మానింది. అటుచూస్తే, రుక్మి పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీకృష్ణుడు అతణ్ణి కేవలం ప్రాణాలతో వదలిపెట్టాడు. కృష్ణుని వల్ల తనకు వికార రూపం రావడంతో దానికి రుక్మి చాలా దుఃఖించాడు. ఇంత అవమానం చేసిన శ్రీకృష్ణుని గెలిచి కాని తిరిగి తన పట్టణమైన కుండిన పురానికి పోనని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు.

ఇలా పద్మాలవంటి నేత్రాలుకల శ్రీకృష్ణుడు రాజసంతో రాజలోకాలను గెలిచి వెలిగాడు. వెలుగులీనుతున్న తన నగరానికి చంద్రబింబంవంటి ముఖంగల రుక్మిణిని తెచ్చాడు అంటూ బంధువులందరూ శ్రీకృష్ణుని పొగడ్తలతో ముంచెత్తారు.

శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnudu Satruraajulu Chuchuchunda Rukminidevini Gonipovuta - శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రు
క్మిణీదేవిని గొనిపోవుట

ఆ రుక్మిణి శ్రీకృష్ణుని అందమైన ఆకృతిని చూచింది. ఆయనవయసునూ, శరీరపుమిసిమినీ, వైభవాన్ని గంభీర స్వభావాన్నీ నేర్పరితనాన్నీ కాంతినీ మొదలైన విశేషాలను గమనించింది. సంతోషించింది. ఆమె మన్మథబాణాలకు గురి అయింది.

తన రథాన్ని ఎక్కాలని ఆశపడుతున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు చూచి శత్రురాజసమూహం చూస్తూండగా నక్కల మధ్యఉన్న మాంసభాగాన్ని సింహం ఎలా తెచ్చుకుంటుందో, అలా శ్రీకృష్ణుడు రుక్మిణిని తెచ్చి, అక్కడున్న రాజలోకాన్ని లెక్క చేయకుండా తన రథంమీద ఎక్కించుకున్నాడు.

భూమ్యాకాశాలు నిండిపోయే విధంగా అతడు పాంచజన్య శంఖం పూరించాడు. వెంట బలరాముడు వస్తుండగా ద్వారకానగరంవైపు రథాన్ని మళ్లించాడు. ఆ సమయంలో జరాసంధుడికి లొంగిఉన్న రాజులందరూ శ్రీకృష్ణుని ప్రతాపాన్నిగురించి విని భరించలేక

గొప్పసింహాలకు చెందిన కీర్తిని పనికిరాని నీచమృగాలు దొంగిలించుకుని పోయినట్లు ఈ గోపాలురు మనకీర్తిని, కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకుని, అదిగో కావరంతో వెళుతున్నారు. ఇప్పుడు కాకపోతే ప్రతాపాలు ఇక ఎప్పుడు చూపాలి? 

మీ దగ్గర ఉన్న శస్త్రాలూ, అస్త్రాలూ ఎందుకు? తగలబెట్టడానికా? ఆ రుక్మిణిని వాళ్లబారినుండి విడిపించలేకపోతే ప్రజలు ఏమనుకుంటారు? సందుల్లో, గొందుల్లో చేరి మనగురించి చెప్పుకుని నవ్వుకోరా? (తప్పకుండా నవ్వుకొంటారని భావం)

అని పలుకుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రాజులు మనసుల్లో కోపావేశాల్ని నిలుపుకున్నారు. ఆటోపంతో, కవచాల్ని ధరించి, ధనుస్సు మొదలైన ఆయుధాలను వెంటతీసుకొని వెళ్లారు. ప్రతిజ్ఞలు చేస్తూ, తమతమ రథగజ తురగపదాలైన సైన్యాల్ని వెంట తీసుకుని జరాసంధుడువంటివాళ్లు యాదవవీరుల వెంటపడ్డారు. వాళ్లను చేరి 'నిలబడండి నిలబడండి' అని ఎదిరించి పలికారు. 

బలంతో చెలరేగిపోయారు. కొండలమీద వానచినుకులు కురిపించే మేఘాలవలె యాదవసేనమీద రాజులు బాణాలను కురిపించారు. యాదవసేనానాయకులు ధనుస్సులను ఎక్కుపెట్టి, అల్లెత్రాళ్లను మోగిస్తూ నిలబడ్డారు. అప్పుడు-

శత్రువులు శ్రీకృష్ణుని సేనలను బాణాలతో కప్పివేయడం చూచి ఎక్కువగా భయపడి సింహంనడుమువంటి నడుమున్న రుక్మిణీదేవి సిగ్గుతో బెదిరిన జింక చూపులవంటి చూపులతో శ్రీకృష్ణుడిని ముఖంవైపు చూచింది

ఇలా రుక్మిణీదేవి చూస్తుండగా

కలువవంటి కన్నులుగల రు
క్మిణీ! అదిగో యాదవవీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్నంతటినీ ముక్కలు ముక్కలుగా విరిచిపడేస్తారు. ఈ రోజు శత్రువులు బాగా దెబ్బతింటారు. చెల్లాచెదరైపోతారు. చచ్చిపోతారుకూడా. చూస్తూ ఉండు.

అని చెపుతూ శ్రీకృష్ణుడు రు
క్మిణీదేవికి సాంత్వన వాక్యాలు పలికాడు. అంతలో బలరాముడు మొదలైన యాదవవీరులు ప్రళయకాలంలో ఆకాశంలో అల్లుకుని పిడుగులు కురిపించే నల్లమబ్బులవలె చెలరేగిపోయారు. 

శరవర్షం కురిపించారు. జరాసంధుడు మొదలైన శత్రురాజసమూహంమీద మొక్కవోని ప్రతాపంతో అగ్నిజ్వాలల్లాంటి పదునైన ఇనుపముక్కుల బాణాలను, బల్లెములు మొదలైన రకరకాల బాణాలను తెరిపి లేకుండా కురిపించారు. ఆ దెబ్బకు సైన్యం కకావికలైంది.

మదపుటేనుగులు నరకబడ్డాయి. గుర్రాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఎక్కడ చూచినా రథాల పైకప్పులు కుప్పలుగా పడ్డాయి. కాల్బలం దెబ్బతిని పడిపోయింది. గుర్రాలను, ఏనుగులను, రథాలను ఎక్కివస్తున్న వీరుల తలలు తెగి నేలకూలాయి. 

ముక్కలైపోయిన వక్షాలతోనూ, నడుములతోనూ, చెవులతోనూ, మెడలతోనూ, చెక్కిళ్లతోనూ, చేతులతోనూ రణరంగం భయంకరంగా కనించింది. మరణించినవాళ్ల వెండ్రుకలు నేలపై పరచుకుని పడిఉన్నాయి. పాదాలు, మోకాళ్లు, పిక్కలు ముక్కలైపడ్డాయి. వీరులు ధరించిన మంజీరాలు, భుజకీర్తులు విడివిడిగా చెదరిపడ్డాయి. 

చెవికమ్మలు, కిరీటాలు, హారాలు భ్రష్టమై పడ్డాయి. వీరులప్రలాపాలు వినిపించడం లేదు. గదలు, ఈటెలు, చిల్లకోలలు, గండ్రగొడ్డళ్లు, పట్టాకత్తులు, బల్లెములు, కత్తులు, శూలాలు, చక్రాలు, ధనుస్సులు అన్నీ నడిమికి విరిగి ముక్కలయ్యాయి. రథంపై ఉండే పతాకలు, రాజగౌరవాన్ని చాటే చామరాలు, గొడుగులు నేలకూలాయి.

కవచాలు చీల్చబడిన పీలికలైనాయి. గుర్రాలగుంపులు చెల్లాచెదురై పోయాయి. వాటిడెక్కలు తగిలి? నేలనుంచి దుమ్ము రేగింది. అప్పటిదాకా ఉరుకులెత్తిన తేరులవేగం మందగించింది. 

సూతులు, వంది మాగధులు పొగడడం ఆగిపోయింది. తెరిపిలేకుండా గుర్రాలు సకిలిస్తున్నాయి. తప్పెటలు మోగుతున్నాయి. ఏనుగులగుంపులు 'ఘీ' అని అరుస్తున్నాయి. రథచక్రాలకమ్ములు ఫటఫట శబ్దం చేస్తున్నాయి. గుర్రాలబొద్దులకు పక్కవేలాడుతున్న గంటలు ఘణఘణ మోగుతున్నాయి. 

విజృంభించిన వీరభటుల 'హుం' కారాలు వినిపిస్తున్నాయి. యుద్ధం చేస్తున్న వారిఆభరణాలు ఘణఘణ శబ్దం చేస్తున్నాయి. భేరీ వాద్యాలు ధణధణ మోగుతున్నాయి. మణులతో కూడిన కాలిఅందెలు 'క్రేం' కారం చేస్తున్నాయి. మువ్వల కుప్పలు కిణకిణ మోగుతున్నాయి.

అల్లెత్రాళ్లు 'టం' అని శబ్దం చేస్తున్నాయి. వీరభటులు ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఎదిరించేధ్వనులు వినిపిస్తున్నాయి. రాజుల గుంపులు భేదింపబడుతున్నాయి. రక్తం కాలువలుగట్టి పారడం కనిపిస్తున్నది. భూతాలు, పిశాచాలు కలకలం సృష్టిస్తున్నాయి.

నక్కలు, కాకులు, రాబందులు మొదలైనవి చెలరేగిపోతున్నాయి. గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడ తలలు తెగిన మొండెములు ఇంకా కదులుతున్నాయి.

మాంసం వాసన కమ్ముకుంటున్నది. కొవ్వు మాంసం తింటూ, రక్తం తాగుతూ డాకినీ పిశాచాలు యుద్ధరంగంలో తిరుగుతూ ఆనందిస్తున్నాయి. అప్పుడు

జరాసంధుడు మొదలైనవాళ్లు శ్రీకృష్ణుని ప్రతాపానికి బెదిరి యుద్ధభూమినుండి వెనుదిరిగి పారిపోయారు. అలా పరిగెత్తుతూ అందరూ ఒకచోట చేరారు. ఎదురుగా శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్నవానివలె వేడి నిట్టూర్చులు విడుస్తున్నాడు. 

అతనిముఖం వాడిపోయి ఉంది. అలా ఉన్న శిశుపాలుని చూచి, తక్కినరాజులు శత్రువులచేతిలో పడకుండా ప్రాణాలతో బతికే ఉన్నావు గదా అని ఓదార్చారు.

అని ఈ విధంగా చెప్పినతర్వాత మళ్లీ ఇలా

చేదిరాజా శిశుపాలా! శరీరంలో ప్రాణాలంటూ ఉంటే ఎలాగోలా బతకవచ్చు. బతుకు కలిగిందంటే భార్య ఎక్కడో ఒకచోట దొరకక పోదు. నీవు బతికావు. ఇక నీ భార్య ఎక్కడుందన్న విషయం దేవుడికి తెలుసు. నీవు చింతించడం వద్దు వద్దు.

శిశుపాలా! వినుమని జరాసంధుడు ఇలా చెప్పాడు. మానవుడు తన ఇష్టాలను తానే తీర్చుకోదగినవాడు కాడు. కీలుబొమ్మల్ని ఆడించే తన చేతిలోని బొమ్మను ఆడించినట్లు ఈశ్వరుడు జీవుణ్ణి ఆడిస్తుంటాడు. ఒకసారి సంతోషిస్తాడు. మరోసారి దుఃఖిస్తాడు. ఇదంతా దైవం ఆడించేఆట.

ఇదివరలో నేను మథురానగరంపై పదిహేడుసార్లు దాడిచేశాను. ఏమయింది? శ్రీకృష్ణుడిచక్రాయుధం దెబ్బకు నా సమస్త సైన్యం నేలకూలింది. బలరాముడికి దొరికిపోయాను. అలా పట్టుపడిన నన్ను దయదలచి ఈ కృష్ణుడు విడిపించాడు.

నేను మళ్లీ ఇరవైమూడు అక్షౌహిణులు సైన్యాన్ని సమకూర్చుకొని పద్దెనిమిదోసారి దండయాత్ర చేశాను. శత్రువులను తరిమి కొట్టాను. గెలుపు సాధించాను. గెలుపు వస్తే పొంగిపోలేదు. ఓడిపోతే కుంగిపోలేదు.

ఈ రోజు మన పరిస్థితిని చూస్తే ఎలా ఉందంటే మన రాజులందరూ మూడోకన్ను ఉన్న ఆ శివునితో కూడి ఎదిరించినా మనం ఓడిపోతాం. అంతేకాదు. కాలం అనేది దైవంచేతిలో ఉంది. కాలంచేత ఈ లోకాలన్నీ తిప్పబడుతుంటాయి. అంతేకాదు.

నేడు ఆ యాదవులకు కాలం అనుకూలంగా ఉంది కాబట్టి, ముల్లోకాల్లోనూ మహావీరులమని పేరుపొందిన మనలను ఈ కృష్ణునిభుజబలంతో గెలువ గలిగారు. ఒకవేళ కాలం మనకు అనుకూలంగా వచ్చిందంటే, సమయం కనిపెట్టి, యుద్ధంలో మనంకూడా శత్రువులను జయించగలం.

ఇది చాలా చిన్నవిషయం. ఈ మాత్రందానికి నీవు మనసులో ఏవేవో సందేహాలు పెట్టుకోడం దేనికి?

ఈ విధంగా జరాసంధుడు, అతని అనుచరులైన రాజులు శిశుపాలుని మనోవేదనను తొలగించి తిరిగి తమతమ దేశాలకు వెళ్లారు. శిశుపాలుడు కూడా తన సైనికులతోపాటు తన నగరానికి వెళ్లాడు. 

ఇంతలో రుక్మిణి అన్న అయిన రుక్మి రాక్షసవివాహపద్ధతిలో తన చెల్లెలైనరుక్మిణిని శ్రీకృష్ణుడు అలా తీసుకుపోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిణీసైన్యాన్ని తీసుకుని యుద్ధప్రయత్నంతో శ్రీకృష్ణుణ్ణి వెంబడిస్తూ తన సారథితో ఇలా అన్నాడు.

నేను భీష్మకుడనే మహారాజుపుత్రుణ్ణి. మహాబలవంతుణ్ణి. అలాంటి నన్ను చిన్న పిల్లవానివలె చులకన చేసి, నా చెల్లెలైన రు
క్మిణిని తీసుకుని ఏదో పెద్ద అసహాయశూరునివలె ఈ గొల్లవాడు వెళుతున్నాడు. 

మన రథాన్ని అతని దగ్గరగా పోనివ్వు; పదునెక్కి మెరుస్తున్న ఈ బల్లెములను వరుసగా ప్రయోగించి వాడి పొగరు అణచివేస్తాను. నా ప్రతాపమేమిటో చూపిస్తాను.

శ్రీకృష్ణునిశక్తిని తెలుసుకోలేక రు
క్మి సారథిని గద్దించి శ్రీకృష్ణునికి దగ్గరగా తనరథాన్ని తోలింపజేసి 'ఓ గోవులను కాచుకునేవాడా! వెన్నను దొంగిలించేవాడా! ఒక్కనిమిషం పాటు ఆగాగు' అని నిర్లక్ష్యంగా పలికి బలమైన తన ధనుస్సుకున్న అల్లెత్రాటిని లాగి మూడు పదునైన బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుణ్ణి బాధిస్తూ ఇలా అన్నాడు.

మా చెల్లెలిని తీసుకు పోవడానికి నీవు మాతో తులతూగ గలిగిన వాడివా? నీ వెంతమాత్రపువాడివి? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ నడవడిక ఎలాంటిదో? ఎవ్వరికీ తెలియదు. నీకు మాన మర్యాదలు లేవు. మోసం చేసిగాని ఎదుటపడవు. 

నీ శత్రువులమీదికి నీ అసలు రూపంతో వెళ్లవు. (అన్నీ మారువేషాలే అని అర్ధం). నీవు రాజువు కావు. వావివరుసలు లేవు. మా అమ్మాయిని తిరిగి ఇవ్వు. నీవు గణాలు లేనివాడవు. మా పాపను వదిలిపెట్టు. అలా వదలకపోతే ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన వాడిబాణాలతో యుద్ధరంగంలో నీ గర్వాన్నంతటినీ హరించి వేస్తాను.

రుక్మి ఇలా మాట్లాడుతుండగానే గోవర్ధనగిరినెత్తిన శ్రీకృష్ణుడు నవ్వాడు. ఒకే ఒక్కబాణంతో అతని ధనుస్సును ముక్కలు చేశాడు. ఆరు బాణాలు వేసి, అతని శరీరంలోంచి దూసుకుపోయేలా చేశాడు. ఎనిమిదిబాణాలతో రథానికి కట్టిన గుర్రాలను కూల్చేశాడు. 

రెండు బాణాలు వేసి రథాన్ని నడిపేవాడిని చంపేశాడు. మూడు బాణాలు వేసి రథంపై ఉన్న పతాకను కూల్చాడు. రుక్మి ఇదంతా చూచి, మరో విల్లు అందుకున్నాడు. అలా అందుకోగానే శ్రీకృష్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. రుక్మి మళ్లా ఇంకొక ధనుస్సును చేతపట్టాడు.

శ్రీకృష్ణుడు దాన్నికూడా విరిచేశాడు. ఇలా వరుసగా ఇనుపగద, అడ్డకత్తి, శూలం, డాలు, కత్తి, శక్తి, తోమరం వంటి ఆయుధాలను రుక్మి చేత పట్టుకున్నాడు. అతడు అలా పట్టుకోగానే శ్రీకృష్ణుడు వాటిల్ని ఛిన్నాభిన్నం చేశాడు. అప్పటికీ రుక్మి ఊరుకోలేదు. 

తన రథం దిగి, కత్తి చేతిలో పట్టుకుని శ్రీకృష్ణుని పైకి దూకాడు. పెద్ద పెద్ద జ్వాలలతో అడవి అడవంతా మంటలతో ఎగసి పడుతూంటే - ఆ మంటల మీదికి ఒక మిడుత దాడి చేస్తే ఎలా ఉంటుందో - రుక్మి శ్రీకృష్ణునిపై దూకడం అలా ఉండింది. 

అలా వస్తే - శ్రీకృష్ణుడు అతడి కత్తినీ, కవచాలనూ పొడిపొడి చేశాడు. తన కత్తి తళతళ మెరుస్తూండగా, సర్రున పైకి లాగి రుక్మి కళ్లముందు ఝళిపించాడు. అతడితలను నరుకుతా నని ముందుకు నడిచాడు. అలా నడుస్తూన్న శ్రీకృష్ణునికి రుక్మిణి అడ్డు వచ్చింది. 

శ్రీకృష్ణుని పాదారవిందాలను పట్టుకుని ఇలా ప్రాధేయపడింది.

గొప్పవాళ్ల చేత పొగడబడిన శాశ్వతమైన కీర్తివల్ల వెలుగొందుతున్నవాడా! లోకాలకన్నిటినీ బ్రోచేవాడా! ఏ దిక్కూలేనివారికి దిక్కయినవాడా! దయకు నెలవైనవాడా! సర్వాధికారివి, దేవతలకే దేవుడవు అయిన నిన్ను ఎంతటివాడివో నిశ్చయించుకోలేక నేడు మా అన్న రు
క్మి నీ పట్ల ఎంతో అపచారం చేశాడు. నన్ను దయతో మన్నించి మా అన్నను రక్షించు;

నాథా! సర్వశక్తిమంతుడా! రు
క్మి చేసినపనిలో తప్పులేదని నేను విన్నవించుకోవడం లేదు. ఇతడు దుర్మార్గుడే! కానీ, ఇతణ్ణి చంపితే, మా అమ్మానాన్నలకు కొడుకు పోయాడన్న దుఃఖం కలుగుతుంది. సర్వశక్తి సంపదలూ కలిగిన శ్రీమహావిష్ణువు అల్లుడు అయ్యాడన్న సంతోషంకంటె వారిని పుత్రశోకం కృశింప చేస్తుంది.

అని ఈ విధంగా బొంగురుపోతున్న గొంతుతో రు
క్మిణి ప్రార్థించింది. ఆమె కృష్ణునితో మాట్లాడ్డానికి గొప్పభయంతో ఉంది. ఒళ్లంతా గజగజ వణుకుతున్నది. తల వంచుకుంది. ముఖం వాడిపోయి ఉంది. మాటాడుతూంటే, చెవులమీదనుంచి జడపాయ జారుతున్నది. 

రెండుకళ్లలో కన్నీరు ఉబుకుతున్నది. ఇలాగ ఆ కన్యాతిలకమైనరుక్మిణి - శ్రీకృష్ణునికి నమస్కరించింది. అపుడు తేజోమూర్తి అయిన విష్ణువు ఆమె విన్నపాన్ని మన్నించి రుక్మిని చంపకుండా వెనుతిరిగాడు.

ఇలా రు
క్మిణి ప్రార్ధనను విని, శ్రీకృష్ణుడు రుక్మిని చంపకుండా వదిలేశాడు. 'బావా! ఇటు రా అని చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. అతణ్ణి పట్టుకుని బంధించాడు. ఒక పదునైన కత్తిలాంటి బాణాన్ని తీసుకున్నాడు. అతడి మీసాలు, గడ్డం, తలవెండ్రుకలను పాయలు పాయలుగా గొరిగి వికారరూపుణ్ణి చేశాడు. 

ఆ సమయంలో శత్రు సైన్యాన్ని తరిమేసిన యాదవవీరులు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చారు. అప్పుడు బలరాముడు జీవచ్చవమై బంధింపబడి ఉన్న రుక్మిని చూచి దయతో అతడికట్టుతాళ్లను విప్పించి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.

మహాత్ముడైన శ్రీకృష్ణా! భీష్మకుని కొడుకైన ఈ రు
క్మిని 'తొలగిపో' అని చెప్పకుండా తలనూ, మూతినీ గొఱగడం ఏమైనా బాగుందా? బంధువైనవాడి తలనూ, మూతినీ గొరగడం తలనరకడం కంటె నీచాతినీచం కదా!

ఆదిమధ్యాంతరహితా! శ్రీకృష్ణా! నీకు అందరూ సమానులే. వీడు శత్రువని హాని కలిగించవు. మరొకడు మిత్రుడని మంచిని చేకూర్చవు. అంతటా సమదృష్టితోనే ఉంటావు. ఇది సత్యం. అలాంటి నీవు మరి ఈ రు
క్మి విషయంలో ఎందుకు భేదబుద్ధిని చూపావు?

సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం తరువాత,  ఉపాకర్మ  మొదటి రోజ...