Thursday, August 27, 2026

Balaramudu Suhrudbandhujana Darsanardhamai Vrepalleku Bovuta - బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు బోవుట

ఓ ప్రభూ! బలరాముడు స్నేహితుల్ని బంధువుల్ని చూడాలనే కోరికతో వ్రేపల్లెకు వెళ్ళాడు. అక్కడ ఉన్న చిరకాలస్నేహితులైన గోపాలకుల్నీ గోపికల్నీ కలిశాడు. వారూ బలరామునికి సముచితమర్యాదలు చేశారు. బలరాముడు నందయశోదలను చేరి వారికి నమస్కరించాడు. బలదేవుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని సంతోషంతో కౌగిళ్లలో చేర్చుకొని, దీవించి, తొడపై కూర్చుండబెట్టుకొని, తల మూర్కొని, గడ్డం పుణికి

ఆ నందయశోదలు బలరాముణ్ణి కుశలప్రశ్నలు అడుగుతూ, మమ్మల్ని మీరే కాపాడాలి. మీరు కాక మా రక్షణకు వేరెవరు ఉన్నారు? అని తమ విషయాలను చెపుతూ కాలక్షేపం చేశారు.

వ్రేపల్లెలోని గోపాలకులు తమగ్భహకార్యాలను కూడా వదలిపెట్టి, తృప్తి పొందని మనస్సుతో బలరాముని పాదాలకు వరుసగా నమస్కరించారు.

బలరాముడు కూడా వారికి సముచిత మర్యాదల్ని చేశాడు. తన వయస్సు కల గోపాలకులను చిరునవ్వుతో చేతితో తట్టి పలుకరించాడు.

బలరాముడు తన శరీరకాంతి వెండికొండ కాంతుల్ని ధిక్కరిస్తూండగా స్నేహితులతో కలిసి ఏకాంత స్థలానికి వెళ్లి, ఉండగా

పాదాలకున్న బంగారు కడియాలు ఘల్లుమని శబ్దం చేస్తుండగా, చేతులకున్న కంకణాలు శ్రావ్యంగా ధ్వనిస్తుండగా, సన్నని నడుం వణకుతూండగా, స్తనాలపై కంఠహారాలు నాట్యం చేస్తుండగా, శిరోజాలు కదలాడుతుండగా, మణికుండలకాంతులు చెక్కిళ్ళపై వ్యాపిస్తుండగా గోపికలందరూ వేగంగా

ఆ విధంగా వెడలి శౌర్యసముద్రుడు, సంచితపుణ్యుడు, అగణ్యుడు, చందన, ఘనసార, పటీర, తుషార, సుధారుచికాయుడు, వినయం కలిగినవాడు, రాక్షసుల్ని సంహరించినవాడు, మణులతో అలంకరించుకొనేవాడు, జ్ఞాని, వివేకి, దుఃఖంలేనివాడు అయిన బలరాముణ్ణి చూచి ఓర్పు నశించి కోరికతో ఇలా అన్నారు.

నీ సోదరుడు, పద్మనేత్రుడు అగు కృష్ణుడు నగరస్త్రీలతో విహరిస్తూ సుఖంగా ఉన్నాడా? ఎప్పుడైనా మమ్మల్ని మనస్సులో తలుస్తున్నాడా? లేకక్రొత్త ప్రియురాండ్రతో కూడి ఏమీ మాట్లాడక ఊరకున్నాడా?

తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, కుమారుల్ని, బంధువుల్ని, మిత్రుల సమూహాన్నీ మనస్సులోకూడా అనుకోకుండా తనను నమ్మినవారిని శ్రీకృష్ణుడు వదలిపెట్టవచ్చునా?

బలరామా! యమునానది ఇసుకతావుల్లో మమ్మల్ని ఏ రీతిగా బుజ్జగించాడు? బృందావనానికి వెళ్ళే త్రోవలో మా చెక్కిళ్ళు స్పృశిస్తూ ఎంతగా ఊరడించాడు? పుష్పోద్యానవనాలలో కన్పిస్తే మా స్తనాల్ని స్పృశిస్తూ ఎంతగా ఆదరించాడు? సరోవరాల చెంత మమ్మల్ని కౌగిటిలోకి తీసుకొని నమ్మిక కలిగేట్లు ఎంతగా నమ్మపలికాడు? కృష్ణుడు వీని నన్నింటిని మరచిపోయాడు కాబోలు! 

భార్యలైనవారిని కూడా విడిచిపెట్టేవాడు కృష్ణుడు. నగర కాంతలు అమాయకులై కృష్ణుణ్ణి ఏ విధంగా విశ్వసించి మోసపోయారో?

గోపికలందరు శ్రీకృష్ణుని పరిహాసపూర్వకాలైన మాటల్ని, నవ్వుల్ని, కౌగిలింతల్ని, రతికార్యాలను, భావాలను, వినయాల్ని సరసపు మాటల్ని తలచుకొని తహతహపడే మనస్సులతో మన్మథబాణాలవల్ల కలిగే కష్టాలనూ తలచుకొని దుఃఖించగా

అంతట బలరాముడు గోపికల మనసులోని దుఃఖాన్ని పరియాచకపుమాటలతోడను, కృష్ణునిసందేశాలను చెప్పడంతో పోగొట్టాడు. అక్కడ బలరాముడు రెండుమాసా లున్నాడు. వసంత కాలాన్ని కాళిందీ నదీతీరంలో గడుపుతూ

మామిళ్ళు, నిమ్మలు, మందారాలు, ఖర్జూరాలు, కర్పూరపు చెట్లతో శోభిల్లే ఉద్యానవనాల్తో, ఏలకీ తీగలచే, కదలాడే శ్రేష్ఠమైన మాలతీలతలచే, మల్లెతీగలచే ఒప్పుతూ, అందమైన పొదరిండ్లలోనూ, అలల తుంపురలచే చల్లనైన ఇసుక తిన్నెలపై, పూతేనెలరసం తాగి మత్తెక్కిన తుమ్మెదలతో నిండిన పొదరిండ్లలోనూ, స్వచ్చమైన కాంతికలిగిన కొండచరియల్లో చల్లని చంద్రకాంత శిలావేదికల మీదనూ స్వేచ్చగా సంచరించడంలో ఆసక్తి కలిగిన బలరాముణ్ణి సుందరీమణులు సేవించారు.

ఆ విధమైన వేడుకతో సంచరిస్తుండగా వరుణుని ఆజ్ఞతో వారుణి అనే రసాధిదేవత మద్యంయొక్క యథార్థరూపం పొందింది. అప్పుడు ఆ వనమంతా మద్యం వాసనలతో నిండింది. (బలరాముడు మద్యపాన ప్రియుడు)

ఆ సువాసనలు పీల్చి, బలరాముడూ, గోపాలకస్త్రీలూ వనందగ్గరికి వెళ్ళి మిక్కిలి ఆనందంతో ఆ మద్యాన్ని (కాదంబరి అనే మద్యాన్ని) సేవించి, స్త్రీలు మణులతో కూడిన బంగారపు చేతికడియాలు గల్గిన హస్తాలతో ఝణంఝణమ్మని తాళం వేస్తూ సవ్వడి చేస్తుండగా వేడుకతో ఆడుతూ, పాడుతూ పరవశిస్తూ

గోపాలకస్త్రీలు బలరాముని పౌరుషాన్నీ, పరాక్రమాన్నీ శౌర్యాన్నీ వర్ణించేగీతాలు పాడుతూ వచ్చారు. బలరాముడు - కదంబ పుష్పాల మద్యం(కాదంబరి) సేవించాడు, కళ్లు మత్తెక్కాయి, ముంగురులు మనోహరంగా కదలుతూ ఉన్నాయి.

ఎదమీద పూలహారాలున్నాయి. చెవులకు మణికుండలాలున్నాయి. ముఖంపై చెమటపట్టింది. ఆయన జలకేళి చెయ్యాలనుకొన్నాడు. యమునను తనవద్దకే రమ్మని పిలిచాడు. మత్తులో ఉన్నవాడు పిలిస్తే నేను వెళ్లడమా అని యమున అతని మాట లెక్క చేయక ఆలస్యం చేయగా

బలరాముడు మిక్కిలి కోపంతో యమునను చూచి, నీవు నేను పిల్చినపుడు రాలేదు. కనుక ఇందరూ చూస్తుండగా నా నాగలికొనతో నీవు వందమార్గాలలో వెళ్ళేటట్లు చేస్తానని మిక్కిలి భయంకరాకారుండై పలికాడు.

(బలరాముని ప్రగల్ఫోక్తులు మద్యపానమత్తులో వెలువడ్డాయి. బలరామునికి యమునాఖేది అనే పేరు దీనివల్ల ఏర్పడింది.)

బలరాముడు తన మహా భుజశక్తిని ఉపయోగించి యమునానదిని ముందుకు తనవద్దకు వచ్చునట్లు నాగలిని చాచి, పెకలించి లాగాడు. అప్పుడు యమున భయపడి స్త్రీ రూపం పొంది, బలరామునికి నమస్కరించి ఇలా చెప్పింది.

గొప్ప చేతులు కల బలరామా! నీ పరాక్రమాన్ని స్త్రీలు తెలిసికొనగలరా? ఈ సమస్త భూభారాన్ని వహిస్తున్న శేషుడు కూడా నీ అంశవల్ల కలిగినవాడే. నీ బాహువుల మదం సామాన్యమైందా? కాదుగదా!

యమున బలరాముణ్ణి స్తుతించి, మీపాదపద్మాల్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను కనికరించు అని కోరింది. నీవు నీ తూర్పుమార్గంలో వెళ్ళు అని చెప్పి, గోపాంగనలతో కలసి బలరాముడు యమునలో స్నానమాడాడు.

జలక్రీడ ముగించి సంతోషంతో ఉండే బలరామునికి నీలపువస్త్రాలు, రత్నాలంకారాలు, బంగారపుహారాలు, యమునాదేవి తీసుకొనివచ్చి ఇచ్చింది.

బలరాముడు యమున ఇచ్చిన వస్త్రాల్ని రత్నహారాల్ని బంగారపు హారాల్ని ధరించి దేవేంద్రునివలె ప్రకాశిస్తూ గోపస్త్రీలతో మహోత్సవంలో మునిగి తేలాడు.

ఈ విధంగా నాగలితో ఏర్పడిన యమునానది చీలిక నేటికీ బలరాముని స్వచ్చమైన బాహుబలపరాక్రమానికి గుర్తుగా మిగిలి ఉంది.

బలరాముడు గోపస్త్రీలతో గొల్లపల్లెలో సంతోషంగా ఉన్నాడు. అచ్చట ద్వారకలో - కరూశాధిపతియైన పౌండ్రకవాసుదేవుడు తనరాయబారిని పిలిచి ఇలా అన్నాడు.

కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట







Nrugamaharaju Charitramu - నృగమహారాజు చరిత్రము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - నృగమహారాజు చరిత్రము

శ్రీకృష్ణుని కుమారులగు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలగు యాదవకుమారులు ఉద్యానవనానికి వచ్చారు. అక్కడ వారు యథేచ్చగా సంచరించారు. దాహం వేయడంతో నీటికోసం వెదికారు. వారికి నీళ్ళులేని బావి కన్పించింది. అందులో కొండవలె ఉన్న ఒక తొండను చూచి, దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు.

వారు పరుగున వెళ్ళి, పెద్దతాళ్ళను తెచ్చి బిగించికట్టారు. ఆ తొండను బయటకుతీసే ప్రయత్నం చేశారు. తీయలేక, ఆ విషయం శ్రీకృష్ణునికి చెప్పగా

యదుకుమారులు చెప్పిన మాటలువిని కృష్ణుడాశ్చర్యంతో నీరులేని నూతిలోనికి చూచి, అందున్న తొండను ఎడమచేతితో పైకి తీయగా అది బంగారువర్ణంతో కూడిన శరీరంతో పురుషుడై నిలవగా

కృష్ణునికి జరిగిన విషయమంతా తెలిసినా, అక్కడున్న ప్రజలకు, తన సంతానానికి ఆ విషయం తెలిసేందుకు ఆ పురుషునిచేతనే చెప్పించాలని అతనితో ఇలా అన్నాడు.

సువివేకచరిత్రా! రత్నభూషణాలచే ప్రకాశిస్తూ, సాటిలేనికీర్తితో ప్రకాశించే మంచి రూపంగల నీకు ఊసరవెల్లిరూపం ఏవిధంగా కలిగిందో చెప్పు. వినడానికి ఈ వింత సంగతిని వివరించు.

ఇలా అడగ్గా శ్రీకృష్ణుని పాదపద్మాలకు తన కిరీటంలోని మణులు తగిలేటట్లుగా నుదుటిపై రెండుచేతులు అన్చి, సంతోషంగా వినయంతో నమస్కరించి, ఇలా అంటున్నాడు.

ఓ కృష్ణా! నీవు విశ్వవేద్యుడిస్తే ప్రపంచంలో స్పష్టంగా నీకు తెలియంది ఏది అయిన ఉందా? అయినప్పటికీ నానుండే వినడం మీకు ప్రీతిని కలిగిస్తే శ్రద్ధతో వినుము. నా కథ చెబుతాను అన్నాడు.

నేను ఇక్ష్వాకుడనేరాజుయొక్క కుమారుణ్ణి. బీదవారు వేడినంతనే రక్షించేవాడిని. రాజులు సేవించి గౌరవిస్తూంటే సమస్త భూవలయాన్ని పాలించే సమర్థత కలవాణ్ణి. నావద్ద సంపద ఎల్లప్పుడూ ఉండేది. ప్రకాశవంతమైన కీర్తి అంతటా వ్యాపించి ఉండేవాణ్ణి.

కృష్ణా! మాటలచేత తనను తాను పొగడుకోవడం పాపమంటారు. అది అలా ఉండనీ. నక్షత్రసమూహాన్ని ఇసుక రేణువుల్ని మంచుబిందువుల్ని లెక్కించడం సాధ్యమవుతుంది - కానీ, నేను బ్రాహ్మణసమూహానికి ఇచ్చిన గోవుల్ని లెక్కించడం బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. ఏమని చెప్పేది?

కృష్ణా! గొప్ప తపస్సు, వ్రతం, వేదపఠనాలు చేసే సంసారులై విధింపబడిన కర్మలు ఆచరించే బీదబ్రాహ్మణులకు బంగారు కొమ్ములు, గిట్టలు కలిగి, తొలిఈత దూడలుగల పాడి ఆవుల్ని దక్షిణతో కలిపి నా సంపదకు తగినట్లుగా ఇస్తూ ఉంటాను.

న్యాయంగా సంపాదించిన ధనంతో - గోవులు, భూమి, బంగారు, రత్నాలు, గృహాలు, రథాలు, గజాలు, కన్యాదానం, విద్యాదానం, వస్త్ర, రజత, శయ్యధనాది దానాలనేకం చేశాను. నూతులు, చెరువులు నిర్మించాను. నివేశ స్థలాలను దానం చేశాను. ఈ రీతిగా చేస్తుండగా ఒకరోజు

(1. దేవ, పితృ, మనుష్య, భూత, బ్రహ్మ యజ్ఞాలను పంచయజ్ఞాలంటారు.
2. సప్తసంతానాలు : 1. తటాకం, 2. నిధి, 3. అగ్రహారం, 4. దేవాలయం, 5. వనం, 6. కావ్యం, 7. సంతానం.)

అనఘా! నేను ముందుగా ఆ గోవును కశ్యపుడనే బ్రాహ్మణునికి నిర్మలమైన మనస్సుతో దానం చేశాను. కానీ, ఆ గోవు మందనుండి తప్పిపోయి నామందలో ప్రవేశించింది. 

అది తెలియక నేను ఆ గోవును నేను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠునికి దానమిచ్చాను. అతడు ఆవును తీసుకొని వెళుతున్నాడు. పూర్వం ధారాపూర్వకంగా దానంపట్టిన బ్రాహ్మణుడు

మనస్సులో కోపం కలుగగా ఆ బ్రాహ్మణుడు వేగంగా, పంచెపట్టు వదలితే బిగించుకొంటూ, ఈ ఆవు నాది, దీన్ని దొంగిలించి రాజమార్గంగుండా కొనిపోతున్నావు. నీలాంటివారు ఉన్నారా?

అంటే ఆ బ్రాహ్మణుడు నేను ప్రభువునుండి దానంగా గ్రహించి, ఈ ఆవును తీసుకొనిపోతున్నానని పలికాడు. పూర్వం నేను దానంగా స్వీకరించిన ఆవు 'ఇదే' అని పలికాడు మొదటి బ్రాహ్మణుడు. వారికి అక్కడనే పెద్ద కలహమయింది.

బ్రాహ్మణులిద్దరూ తమలోతాము కలహించుకొని తగవు తీర్చండని నా దగ్గరకు వచ్చారు. పూర్వం ఆవును దానంగా గ్రహించిన బ్రాహ్మణుడు నాతో ఇట్లన్నాడు.

'ఓ రాజా! జనులు అధర్మప్రవర్తనకు పాల్పడకుండా ఆజ్ఞాపించేవాడివైన నీవు ఏ ధర్మమని భావించి ఈ ఆవును మరియొక బ్రాహ్మణునికి దానం చేశావు? పూర్వం నాకు దానం చేసిన ఆవు దారి తప్పి గుంపులో నుంచి వచ్చి, నీ మందలో కలిసింది. 
నీవు దానినే వేరొకరికి దానం చేశావు. దాతవు, చోరుడవు కూడ అయ్యావు అన్నాడు.

బ్రాహ్మణుని మాటలు వినగానే రాజుయొక్కమనస్సు కలతపడింది. “ఇది నాకు తెలియకుండ జరిగిన తప్పు” అని ఆ బ్రాహ్మణునితో చెప్పి “దానికి బదులు నీకు ఒకలక్ష గోధనం ఇస్తాను తీసుకో” అన్నాను.

ఆ బ్రాహ్మణుని మంచిమాటలతో బుజ్జగిస్తూ ఇలా చెప్పాను. నేను నరకబాధ పొందలేను. నన్ను రక్షింపుము - అని చెప్తూ

ఎంతగా కోరినప్పటికీ పట్టుదల వీడకుండా, నీవు పూర్వమిచ్చిన ఆవును తప్ప, దానికి బదులుగా నీ రాజ్యం అంతటినీ ఇచ్చినప్పటికీ గ్రహింపనని పలుకుతూ, అచ్చట ఉండకుండా వెళ్ళిపోయాడు.

రెండవబ్రాహ్మణుణ్ణి కూడా నేను ఆ విధంగానే ప్రార్ధించాను. ఆయనకూడా అంగీకరించలేదు. ఎన్నుకొన్న పదివేల ఆవుల్ని ఇచ్చినా కూడా నేను అంగీకరించను. ఆ ఆవే కావాలన్నాడు. కాలంకడచింది. మరణించాడు. యమభటులు నన్ను తీసుకొని వెళ్ళి యముని ఎదుట నిలబెట్టారు. అతడు నన్ను ఉద్దేశించి ఇలా పలికాడు.

రాజా! ఇక్ష్వాకు వంశాన్ని పవిత్రం చేసినవాడా! నీవు చేసిన దానాలూ, యజ్ఞాలూ పుణ్యకార్యాలూ స్వర్ణ, మర్త్య పాతాళలోకాల్లో ప్రసిద్దాలై పేరుపొందాయి. ముందుగా పాపానికి పొందవలసిన ఫలాన్ని పొంది, తర్వాత పుణ్యకర్మల ఫలితాన్ని పొందాలి అనడం బ్రహ్మ ఆజ్ఞ! దాన్ని కాదనగలమా?

యముడు ఆ రాజును భూమిపైకి తోయించాడు. భూమిపై పడేటప్పటికి ఊసరవెల్లి రూపం కలిగింది. ఆనాటినుండి నేటివరకు ఈ దురవస్థను అనుభవిస్తున్నాను. జీవి పుణ్యపాపఫలాల్ని అనుభవించక తప్పదు. నీ దర్శనఫలితంగా సర్వపాప ఫలాల్నీ పోగొట్టుకొన్నాను - అని కృష్ణుడికి పదే పదే ప్రణామాలు ఆచరించి ఇట్లని పలికాడు.

కృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా నిన్ను చూడగలిగాను. నీ దయకు పాత్రుడనయ్యాను. సర్వసాఖ్యపదవుల్ని పొందగలిగాను.

ఓ కృష్ణా! నీ అనుగ్రహం నాలో ఎల్లపుడు ఉండేటట్లుగా అనుగ్రహించు - అని కృష్ణుని పాదారవిందాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకొని, దివ్యవిమానం ఎక్కి స్వర్గానికి వెళ్లాడు. అక్కడున్న రాజులకు ధర్మబోధం చేస్తూ కృష్ణుడిలా అన్నాడు.

రాజకులాలను దహించేందుకు బ్రాహ్మణులధనం(నిప్పు) అగ్నికణం. రాజకులాల సంపద అనే సముద్రాన్ని ఇంకింపచేసేందుకు బ్రాహ్మణక్షేత్రం బడబాగ్ని. రాజులసంపద అనే కొండల్ని కూల్చేందుకు బ్రాహ్మణులధనం, వజ్రాయుధం. రాజులకీర్తి వెన్నెలను మాపేందుకు బ్రాహ్మణధనం పొద్దుపొడుపు. బ్రాహ్మణులసొమ్ముకంటే విషమే మేలు. విషానికైనా చికిత్స ఉంది కానీ బ్రాహ్మణుల సొమ్ముకు చికిత్స లేదు. కాబట్టి, బ్రాహ్మణులసొమ్మును రాజులు గ్రహించరాదు.

అజ్ఞానంతోనైనా బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించరాదు. నిప్పును తెలియక తాకినా శరీరం బాధపడేటట్లు, అది కాల్చకుండా ఉంటుందా?

ఇతరులవల్ల తన ధనాన్ని పోగొట్టుకొని రాజుకు చెప్పినా రాజుపట్టించుకోక పోతే ఆ బ్రాహ్మణుడు ఏడ్చినపుడు ఎన్ని మట్టికణాలు కన్నీటితో తడుస్తాయో అన్ని వేలసంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించే రాజు కుంభీపాకనరకం అనుభవిస్తాడు. 

అంతేకాదు - అట్టి రాజువంశంలోని పూర్వులు పదితరాలవారూ, తరువాతి పదితరాలవారూ నరకం అనుభవిస్తారు. రాజు అరవైవేలసంవత్సరాలు ఘోరనరకం అనుభవిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతటి తప్పుచేసినా, కొట్టినా, తిట్టినా, ప్రభువు మాత్రం వినయపూర్వకంగా ఉండాలి. 

నేనుకూడా బ్రాహ్మణులకు వినయపూర్వకంగా నమస్కరిస్తాను. అట్లు చేయనివారిని విరుద్ధమైన చెడువర్తనం కలవారిని వెదకి శిక్షిస్తాను. కాబట్టి, మీరు బ్రాహ్మణులపట్ల మిక్కిలి భక్తి గలిగి ప్రవర్తించండి - అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించి, యాదవసమూహం సేవిస్తుండగా, సర్వరక్షకుడు ఆ స్వామి నిజనివాసానికి వెళ్లాడని శుకమహర్షి చెప్పాడు.

ఈ కథను చదివినవారూ, విన్నవారూ పాపాలను పోగొట్టుకొని, ఈ లోకంలో సుఖాన్నీ పిదప కైవల్యాన్నీ కూడా సులభంగా పొందుతారు.

బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు బోవుట







Ushaaniruddha Sahithudai Krishnudu Dwarakapuri Karuguta - ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట

బాణుడు తన రాజధానీ నగరానికి వెళ్ళి, ఉషానిరుద్దులకు వివాహం చేశాడు. నగల్నీ, వస్త్రాల్నీ సేవకజనాన్నీ, శ్రేష్ఠమైన వస్తువుల సమూహాన్ని అడ్డులేని ఆసక్తితో ఇచ్చి నిండుభక్తితో

పరీక్షిన్మహారాజా! ఉషా - అనిరుద్దుల్ని బంగారు తేరుపై ఎక్కించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుని ఆమోదం పొంది తన కుమార్తెతోపాటు అనిరుద్దుణ్ణీ గోవిందునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు.

తర్వాత - కృష్ణడు శివుణ్ణి వీడ్కొల్పి, బాణాసురుణ్ణి అచ్చటనే నిల్పి, మిక్కిలి వైభవంతో చతురంగ బలసమేతుడై - అనిరుద్దుణ్ణి ముందుంచుకొని, మంగళవాద్యాల ధ్వనులు దిగంతాలకు వ్యాపిస్తుండగా తన ద్వారకానగరానికి బయలుదేరాడు.

బాగా వికసించిన ఎర్రతామరలతో, ఎత్తయిన అలలతో కూడిన సరస్సులతో, అధిక ఐశ్వర్యంతో వృద్ధి చెందుతున్నద్రీ, సుఖమనే భారాన్ని మోస్తున్నదీ, ప్రజల దుఃఖాన్ని నివారిస్తున్నదీ, సజ్జనులనే నక్షత్రాలతో ప్రకాశిస్తున్నది అయిన ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు చూశాడు.

ద్వారకానగరంలోని పతాకలు కదుల్తూ శ్రీకృష్ణుని సందర్శించు కుతూహలంతో ఆ నగరలక్ష్మి చేతుల్తో ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. గొప్ప పచ్చలచే అలంకరింపబడ్డ తోరణాలతోనూ, మణులు పొదిగిన భవనాలతోనూ, బంగారం, మణులచే నిర్మింపబడిన గోపురాలూ, భవనాలూ, సౌధాలూ, వీథులున్నాయి.

బంగారు తాపడం చేసిన మేలుకట్టుతో కూర్చిన శుభప్రదమైన ముగ్గులతో ప్రకాశించేదీ; సౌందర్యంకోసం కట్టబడిన అరటిబోదెలచే, అక్షతలచే పుష్పమాలలచే అలంకరింపబడిందీ, కుంకుమ కలిపిన నీటితో తడిసిన వ్యాపారస్థలం కలదీ, శంఖం, దుందుభి, భేరీ, పటహం, కాహళం, మృదంగం మొదలైన వాద్యాలచేతా, స్తోత్రాలతో, వందిమాగధ సంగీత ప్రసంగాలతో మిక్కిలి మనోహరమైన ద్వారకానగరం, అందలి మంత్రులు, పురోహితులు, బంధువులు, నగరప్రముఖులు ఎదురురాగా, బ్రాహ్మణాశీర్వచనాలతో, ముత్తయిదువుల ఆశీస్సుల అక్షతలు స్వీకరిస్తూ, కర్పూరనీరాజనాలివ్వగా నగరప్రవేశం చేసి, సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయం అనే ఈ గాథను చదివినవారు ఎల్లపుడు విజయాన్ని పొంది, ఇహపరలోక సౌఖ్యాల్ని ఆకల్పోన్నతినీ పొందుతారు.

ముని శ్రేష్ఠ! శ్రీకృష్ణుని చరిత్రను వినడంలో నామనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు. శ్రీకృష్ణకథను వినడమే కోరుకొంటాను. దయచేసి శ్రీకృష్ణకథను చెప్పు అనే శుకయోగిని పరీక్షిన్మహారాజు కోరాడు.

శ్రీకృష్ణ కథను చెప్పవలసిందిగా కోరిన పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పాడు.

నృగమహారాజు చరిత్రము







Shivudu Banuni Rakshimpa Srikrishnuni Stuthinchuta - శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

బాణునిపై శివునికి దయ ఉంది. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి, ముకుళితహస్తుడై నమస్కరిస్తూ, పురుషసూక్తం పఠించి, ఇలా స్తుతించాడు.

ఓ కృష్ణా! నీవు బ్రహ్మస్వరూపుడివి; ప్రకాశమే స్వరూపంగా గలవాడివి, సమస్తవేద వేదాంతరహస్యాలు తెలిసినవాడివి, సమాన అధిక భేదాలు లేనివాడివి. అన్నింటా వ్యాపించినవాడివి అయిన నిన్ను నిర్మలాంతః కరణులు ఆకాశం(శూన్యం) వలె చూస్తారు. 

అంతే కాకుండ పంచోపనిషత్తులతో కూడిన నీ దేవతాపరశుభాకారాన్ని చూస్తారు. ఆ ఆకారదర్శనంలో బొడ్డులో ఆకాశాన్ని ముఖంలో అగ్నినీ, శిరస్సులో స్వర్గాన్నీ చెవుల్లో దిక్కుల్నీ కండ్లలో సూర్యుణ్ణీ, మనస్సులో చంద్రుణ్ణీ, కాళ్ళలో భూమినీ, జీవునిలో అహంభావాన్నీ కడుపులో సముద్రాల్నీ, రేతంలో నీటినీ, భుజాలలో ఇంద్రుణ్ణీ, వెండ్రుకలలో వృక్ష ఓషధీ సమూహాల్నీ తలవెండ్రుకలలో బ్రహ్మల్నీ జ్ఞానంలో సృష్టినీ, ప్రజాపతుల్నీ హృదయంలో ధర్మాన్నీ కలిగిన మహాపురుషుడవు. 

లోక సృష్టికొరకు మొక్కవోని కాంతిని దాచి సృష్టికోసం నీ అవతారంయొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్ము ప్రశంసించడానికి మేమెంతవాళ్లం? నీవు సమస్త చరాచర అచరసమూహానికి మూలకారకుడివి, అద్వితీయుడివి, పురాణపురుషుడివి, సమస్తసృష్టికి కారణమైనవాడివి, ప్రభుడివి.

సూర్యుడు మేఘాల సమూహంతో కప్పబడినవాడై అనేక రూపాలు కలిగినవాడయి అనేకరీతులలో కన్పించేటట్టు, నీ అఘటితఘటనాన్ని చేసే అభిప్రాయంలో త్రిగుణాతీతుడవు అయినప్పటికీ సత్త్వం మొదలైన గుణాలతో అనేకరూపాలు కలిగినవాడివై, సత్పురుషులకు చీకటిని తొలగించి, కాంతిని ఇస్తావు.

నీ మాయచే మోహం పొందినవాళ్లు, భార్య, పుత్రులు, గృహం, ఆస్తి మొదలైన సంసారరూపంలోని పాపమనే సముద్రంలోని సుడిగుండాలలో మునుగుతూ తేలుతున్నారు. నీ పవిత్రమైన రూపానుభవాన్ని పొందలేక, ఇంద్రియాధీనుడై నీ పాదపద్మాల్ని చేరేందుకు మార్గం తెలియని మూఢుడు, తనను తాను మోసం చేసుకొనేవాడు అవుతాడు.

ప్రతికూలబుద్ధితో - ఇష్టుడవైన నిన్ను అంగీకరింపక, ఇంద్రియప్రయోజనానుభవం పొందేందుకు అమృతం వదలి, విషం గ్రహించడమే కదా! ప్రపంచసృష్టికీ, పాలనకూ, లయకూ కారకుడివైన నీవు శాంతస్వభావం కలవాడవై, సజ్జనులకు భాగ్యం ఇచ్చేవాడివై, సమానాధికభావం లేనివాడివై ఉండుటచే నిన్ను నేను, బ్రహ్మయు, మునులును సేవిస్తున్నాము. ఇంకా

(పంచ+ఉపనిషత్తులు= నారాయణ, బ్రహ్మ , తైత్తిరీయ, గార్గ, వరాహ - ఉపనిషత్తులు.)

కృష్ణా! నీవు నాశరహితుడివి, అంతం లేనివాడివి, మొదలు, నడుమ, చివర (ఆదిమధ్యాంతాలు) లేనివాడివి. చ్యుతి లేనివాడివి, సమస్తాన్ని ధరించువాడివి. అంతటా నీవున్నావు అన్నీ నీలో వ్యాపించి ఉన్నాయి.

(వాసుదేవుని తత్త్వస్వరూపమిక్కడ చక్కగా చెప్పబడింది.)

అని శివుడు ప్రశంసిస్తే - కృష్ణుడు బాగా సంతోషించి చిరునవ్వుతో శంకరా! నీ మాట సత్యమే! నీకు ప్రియమైన వరం కోరుకో. దాన్నే ఇస్తాను. ఈ బాణుడు చంపదగ్గవాడు కాడు. ఎందుకంటే నాభక్తుడయిన ప్రహ్లాదునిమనుమడు. ప్రహ్లాదునివంశంలోని వారిని చంపనని వరమిచ్చాను. వీనిగర్వం అణచడానికి ప్రయత్నించాను - కనుక

బాణునిచేతులు నాలుగింటిని తప్ప మిగిలినవాటిల్ని ఖండించాను. నీ భక్తులలో మొదటివాడని పేరుపొంది ముసలితనం, మరణం లేకుండా జీవిస్తాడు.

ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుండు పరమానందం పొందాడు. బాణుడు రణరంగమనే యజ్ఞవేదిక పై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధమనే మంటల్లో తన హస్తాలనే సమిధల్ని రక్తధారలనే నేతిధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడయ్యాడు. విజ్ఞానదీపం వెలిగింది. భుజగర్వం అనే చీకటి తొలగింది. ఎల్లప్పుడు పరమేశ్వరధ్యానంలో ఉన్న బాణుడు కృష్ణుడిచ్చిన వరంతో ఆనందించి, గోవిందుని పాదారవిందాలకు వందనం చేశాడు. తరువాత

ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట







Banasurudu Rendavasaari Yudhamunaku Vacchuta - బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట

బాణుని రథంయొక్క చిరుమువ్వల ధ్వనులనే చిన్న గంటల ధ్వనులు ఆకాశాన్ని బద్దలయ్యేలా చేస్తున్నాయి. శత్రుజనులు భయపడేటట్లుగా బాణుని రథం బంగారు ధ్వజస్తంభాలతో, పతాకాలతో ప్రకాశిస్తుండగా, రథచక్రాల కమ్ముల ఒరిపిడికి భూమి కంపించగా, అనుకూలమూ, శక్తిమంతమూ అయిన యౌవనమందున్న గుర్రాల్ని రథానికి పూన్చి, ఎత్తైనరథాన్ని అధిష్ఠించి, దివ్యమైన బాణాలు, విల్లులు మున్నగు అరుదైన ఉపకరణాలను సమకూర్చుకొని బలం, పట్టుదల, శక్తి అధికమై సంతోషం పొంగిపొరలగా యుద్దానికి సిద్ధమై, మిక్కిలి వేగంగా నగరంనుండి యుద్ధభూమికి వచ్చాడు.

బాణాసురుడు రణభూమికి వచ్చి, రంగస్థలంలో మధ్యాహ్నకాల సూర్యునివలె తీవ్రంగా ప్రకాశిస్తూ దావాగ్ని జ్వాలవంటి కృష్ణుణ్ణి ఎదిరించాడు.

బాణుడు శ్రీకృష్ణుణ్ణి ఎదుర్కొని, యుద్ధంలో చెలరేగి, గర్వంతో, నేర్పుతో వేయిచేతులా పుంఖానుపుంఖాలుగా అతనిపై బాణాలు వదిలాడు. కృష్ణుడు వెంటనే ఆ బాణసమూహాన్ని అర్ధచంద్రాకారబాణాలతో ఖండించాడు.

అప్పుడే వికసించిన తెల్లతామరపూరేకులవంటి విశాలనేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుని సంహరించినవాడు, కనుకనే కోపంతో, రోషంతో తీవ్రంగా కదలాడుతున్న ఎర్రతామరరేకులవంటి నేత్రాలు గలవాడై, దితి కుమారులైన రాక్షసులనే గొప్ప అరణ్య సమూహాన్ని కాల్చివేసే దావాగ్నియై విజృంభించి, తనను ఆశ్రయించిన వారిని రక్షించేదీ; నిరంతరం ఇంద్రునిచే రక్షణకై పూజించబడేదీ, దివ్యలక్షణ లక్షితమైనదీ అగు సుదర్శన చక్రాన్ని రాక్షసరాజైన బాణునిపై ప్రయోగించాడు.

ప్రచండసూర్యమండలంలా శోభిస్తూ నూరువేల కొనలుగల వజ్రాయుధంవలె అగ్నికీలలతో కుటిల శత్రువుల గర్వాంధకారాన్ని నశింపజేస్తూ, ఇంద్రాది సమస్త దేవతల స్తుతులు అందుకుంటూ, తన దర్శనంచే రాక్షసులకు శోకం కలిగించేదీ తన స్పర్శతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ, అయిన సుదర్శనచక్రాన్ని కృష్ణుడు ప్రయోగించగా - రత్నాలు పొదిగిన బంగారు చేతికడియాలతో అందగిస్తూ మదించిన ఏనుగుల తొండాల్లాగా వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతుల్లో నాల్గింటిని వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిబోదెల్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసే సమయంలో

శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట







Banasuruniki Sahayabhutundagu Shivunaku Krishnunaku Yudhamaguta - బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

భక్తులపట్ల ప్రేమకలవాడూ, కోరికల్ని తీర్చేవాడూ అయిన శివుడు బాణుణ్ణి తనకుమారులకంటే అధికంగా చూస్తాడు. కనుక, తాను బాణునిపక్షంలో యుద్ధం చేయడానికి కుమారస్వామి, ప్రమథగణాలూ వెంటరాగా శూలం ధరించినవాడై

నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి రేగిన దుమ్ము సూర్యుణ్ణి కమ్మివేసింది. తోకను కదుపగా ఏర్పడిన గాలికి మేఘాలు చెదరాయి. కొమ్ములవిసురుకు బ్రహ్మాండమనే పాత్రమూత పగిలింది. నందీశ్వరునిరంకెలకు ఆకాశం బద్దలైంది. మెడలో వేలాడే బంగారు గంటలధ్వనికి దిక్కులు కలత చెందాయి. నడచివస్తున్న వెండికొండా అన్నట్లు నందీశ్వరుణ్ణి శివుడు అధిరోహించి యుద్దానికి బయలుదేరాడు.

పరమేశ్వరుడు సమరసన్నాహసముల్లాసంతో వెళ్లి ఎదుటివారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన వీరులయుద్దాన్ని చూడడానికి బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు, మొదలైనవారు వచ్చారు. 

శ్రీకృష్ణుడూ - శివుడూ; ప్రద్యుమ్నుడూ - కుమారస్వామీ; కూపకర్ణుడూ - కుంభాండులతో, బలరాముడూ - బలుడూ - సాంబుడూ; రథికులు - రథికులతోనూ, ఆశ్వికులు - ఆశ్వికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, పదాతిదళం పదాతిదళంతోనూ; యుద్ధం చేశారు. సింహధ్వనులతో, హుంకరింపులతో, వింటినారిధ్వనులతో, ఏనుగుల ఘీంకారాలతోనూ, గుర్రపుసకిలింపులతో, తప్పెటల, బాకాల భేరీశబ్దాలతో, మద్దెళ్ల, ఢక్కాలు, శంఖాల ధ్వనులతో బ్రహ్మాండం బద్దలయినట్లు అయింది.

(ఇందు జగన్నాటకసూత్ర ధారి అయిన శ్రీకృష్ణుడు ఒకపక్క భక్తపరాధీనుడగు శివుడు ఒకపక్క యుద్ధభారాన్ని వహించారు. ఇందలి శ్రీకృష్ణుడు జయశీలి. బాణుడు శాపగ్రస్తుడు. విచిత్ర మేమంటే బాణుడు శివునినుండి పొందింది. వరరూపంలో ఉన్న శాపం. ఆ వరమిచ్చింది శివుడే. 

తిరిగి బాణునిపక్షాన యుద్ధం చేస్తున్నదీ, బాణుణ్ణి రక్షించే ప్రయత్నం చేసిందీ - పరమేశ్వరుడే! ఇదొక విచిత్ర యుద్ధసన్నివేసం! అయినా హరిహరుల లక్ష్యంమాత్రం దుష్టశిక్షణం, శిష్టరక్షణమే! బాణుణ్ణి కూల్చడమే! బాణుడు తన ఆరాధ్యదైవాన్నే తనతో యుద్దానికి రమ్మనడం - వాని దురహంకారానికీ, నాశనానికీ పునాది అయింది.)

శ్రీకృష్ణుడు సింహనాదం చేసి తన యుద్ధనైపుణ్యంతో, బాణప్రయోగంతో శివుడు మొదలైన యోధుల్ని బాధించాడు. శత్రుసైనికులు భయంతో కలతచెంది పారిపోయేటట్లు చేశాడు.

కృష్ణుని విజ్బంభణం చూడలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే బాణాలు వేశాడు. కృష్ణుడు వాటిని ప్రతిబాణాలతో పొడిపొడిగా చేశాడు. ఇంకా

శివుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అదే బ్రహ్మాస్తంతోనే దాన్ని తేలికగా తిప్పికొట్టాడు. ఆ ప్రయోగాన్ని చూచి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపడి కృష్ణుని పొగడగా

శివుడు కృష్ణునిపై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ఈ అస్త్రాన్ని పార్వతబాణంతో తుంచాడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని వేయగా కృష్ణుడు ఐంద్రాస్త్రంతో దానిప్రభావాన్ని నిర్మూలించాడు.

శివుడు పాశుపతాస్త్రం వేశాడు. శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం సంధించి, ఆ అస్త్రాన్ని మరల్చాడు. ఈ విధంగా శివుని అస్త్రాలు అన్నిటినీ కృష్ణుడు నిర్వీర్యం చేస్తుండగా

కలతచెంది నిరుత్సాహుడై ఉండే శివునిపై జయశాలి అయిన కృష్ణుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు.

శివుడు సమ్మోహనాస్త్రప్రభావంతో శరీరం స్వాధీనం తప్పగా, చేష్టలుడిగి, నిద్రవచ్చి నందీశ్వరునిమూపురంపై వాలిపోయాడు.

ఈ విధంగా శివుడు నందీశ్వరునిపై నిద్రమత్తులో పడగా, కృష్ణుడు శత్రు సైనికుల్ని బాణపరంపరతో ఖండించాడు. ఖడ్గాన్ని చేపట్టి శత్రుసైనికులలో మిగిలినవారిని బాధించాడు. ఈ రీతిగా రణరంగాన్ని శవాలగుట్టగా చేశాడు.

ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. వాడిబాణాలతో బాధింపగా కుమారస్వామి దేహం రక్తపుముద్దయై బాధపడుతుంటే, శత్రువులు సంతోషంతో కేకలు పెడ్తుంటే యుద్ధం అంటే భయపడి; తన నెమలివాహనంపై రణరంగం నుండి పారిపోయాడు.

యుద్ధభూమిలో శత్రువీరుడైన సాంబుడు కోపోద్రిక్తుడై బంగారు పిళ్లుగల వాడి బాణాలు వేయగా బాణుని కుమారుడైన బలాసురుడు అధైర్యంతో ఓడి పారిపోయాడు.

బలరాముడు వజ్రాయుధంవంటి ముసలంతో కుంభాండ కూపకర్ణుల శిరస్సుపై మోదగా, వారు ముసలం దెబ్బలకు తలలు పగిలి రక్తం కక్కుతూ చచ్చారు.

ఆ సమయంలో బాణునిసైన్యం దీనత్వం పొంది, దిక్కులేనిదై, పారిపోసాగింది. బాణాసురుడు సాత్యకి లక్ష్యంగా ప్రళయకాలాగ్నివలె విజృంభించి యుద్ధం చేసి, సైన్యాన్ని తిరిగి పురికొల్పాడు. ఉభయ సైన్యాలు తీవ్రంగా పోరాడాయి.

ఇరుపక్షాల సైన్యాలు దక్షిణ ఉత్తర సముద్రాలవలె భయంకర యుద్ధం చేశాయి. గదలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు, శూలాలు, చక్రాలు, చురకత్తులు, శక్తులు, బల్లెములు, పట్టినాలు మొదలైన ఆయుధాలతో యుద్ధం జరిగింది. కాళ్లు, వేళ్లు, తలలు, చేతులు తెగాయి. కళ్ళు పాడయ్యాయి. 

గజాలు, గుర్రాలు నేలకూలాయి. గుట్టలుగుట్టలుగా పడున్న పీనుగుల్ని తినడానికై పిశాచాలు, భూతాలు, భేతాళాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఈ భయంకరయుద్ధంవల్ల రణరంగం భీషణంగా మారింది.

బాణాలు కలువపూలుగా; వింజామరలు నురుగులుగ్గా, గొడుగులు తెల్లతామరపూలుగా, రక్తం నీరుగా, ఎముకల గుట్ట ఇసుకరాశిగా, చేతులు పాముల గుంపుగా, తలవెండ్రుకలు నాచుగా తోచుటచే రణరంగం ఎర్రటి నదిలాగా కన్పించింది.

ఆ సమయంలో బాణాసురుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుని పైకి రథాన్ని పరుగెత్తించి, తాను సహస్రబాహుడ ననే గర్వంతో సమీపించి

బాణాసురుడు ఒకసారిగా అయిదువందల చేతులతో ధనువులను ధరించి, మిగిలిన చేతులతో రెండేసి బాణాలను తీసుకొని సంధించేలోపలే శ్రీకృష్ణుడు ఆ బాణాల్నీ, ధనుస్సులనూ ధ్వంసం చేశాడు. సారధిని సంహరించి, రథాన్ని ధ్వంసం చేసి

శ్రీకృష్ణుడు ప్రళయకాలమేఘగర్జనతో సమానమైన శబ్దాన్ని కల్గించే పాంచజన్యాన్ని పూరించాడు. జనులందరూ భయభ్రాంతులయ్యారు. ఆ ధ్వనికి రాక్షసస్త్రీల గర్భాలు విచ్చిన్నమయ్యాయి.

శ్రీకృష్ణుని ఎదురులేని శౌర్యపరాక్రమాలకు భయపడి, బాణుడు పెడమొగం పెట్టి ఏమీ చేయలేక న్యూనతతో ఊరకుండిపోయిన సమయంలో, ఆ సమయంలో బాణునితల్లి కోటర తన కుమారుడైన బాణుణ్ణి రక్షించాలనే తలపుతో వివస్త్రయై కృష్ణుని ఎదుట నిలబడగా, అసహ్యభావంతో అతడు పరాఙ్ముఖుడయ్యాడు. 

బాణుడు మనస్సు బాధపడుతుండగా, తలపాగ ఊడిపోగా బంగారుమణిభూషణాలు పడిపోతుండగా, యాదవులు నవ్వుతుండగా తన నగరానికి పారిపోయాడు. భూతగణాలుకూడా ఎక్కడికో వెళ్ళిపోగా

మూడుతలలు, మిక్కిలి భయంకరమైన మూడుపాదాలు కలిగి కోపంతో శివజ్వరం రాగా చూచి, కృష్ణుడు మెల్లగా నవ్వుతూ

శైవవైష్ణవజ్వరాలు రెండూ, ఉపాయం, సామర్థ్యం, బలం, పరాక్రమం కలిగి పోరాడగా శైవజ్వరం ఓడిపోయింది.

వైష్ణవజ్వరం ధాటికి ఆగలేక భయపడి పారిపోయింది.

శైవజ్వరం దిక్కుతోచక ఏడుస్తూ ప్రాణభయంతో వచ్చి, కృష్ణునిపాదాల పైబడి, నమస్కరించి నన్ను రక్షించు రక్షించు అంటూ ప్రార్థించింది.

ఈ విధంగా ప్రార్థించింది.

కృష్ణా! అవ్యయుడవు, అనఘుడివి, అనంతశక్తియుక్తుడివి, బ్రహ్మరుద్రేందాదులకు ప్రభువైనవాడివి; సర్వాత్మకుడివి; జ్ఞానమయుడివి; జగదుద్భవస్థితి సంహారకారకుడివి; ఉత్తమ జ్ఞాన శక్త్యాదులచే ఒప్పునట్టివాడివి, పరమాత్మస్వరూపుడివి, ప్రభుడివి; నీ మూలప్రకృతి మహిమతో సర్వప్రాణులను మోహపరచునట్టివాడివి; గౌరవప్రదమైన వర్చస్సు కలవాడివి; ఆదిమధ్యాంతాలులేనివాడివి; సచ్చిదానంద స్వరూపుడివీ అయిన నిన్ను సేవిస్తాను.

(షట్‌+ఊర్ములు= షడూర్ములు. 'ఊర్మి' అంటే అల. యోగసాధనకు ఆటంకాలను కల్గించే ఆరువిధాలైన అలజడులే - జీవధర్మాలే షడూర్ములు. అవి క్షుత్‌ (ఆకలి), పిపాస (దప్పిక), శోకం, మోహం, జర (ముదిమి), మరణం. 

ఇవి ప్రతిజీవికి సహజమైనవే. అయితే ఇవి సమపాళ్లలో ఉండవు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. జీవసహజమైన ఈ అలజడులను, ధర్మాలనూ జయించడం యోగసాధనలో ఒక భాగం. షడూర్ములలో ఆకలి(ఆహారం), దప్పికలు - సూక్ష్మశరీర ధర్మాలు; శోకమోహాలు - కారణ శరీరధర్మాలు - జరామరణాలు = స్తూల శరీర ధర్మాలు.

ఈ ధర్మాలు లేనివాడు పరమాత్మ సుజ్ఞానమంటే - ఇతర సాధనాలతో అవసరంలేని, స్వయంప్రకాశకమైన తత్త్వజ్ఞానం. శక్తులు - ఇవి పరమాత్మకు సంబంధించిన సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వాంతర్యామిత్వం - మొదలైనవి.)

కృష్ణా! లోకంలో భగవంతుడు అనేకవిధాలుగా కన్పిస్తాడు. కళ, కాష్ఠ ముహూర్తాలనబడేకాలాలూ, మంచిపనులూ, చెడుపనులూ, ప్రత్యక్షాదిజ్ఞానరూపాలైన జీవునికర్మలూ, స్వభావాలూ, సత్త్వరజోతమోగుణాలచే కూడిన ప్రకృతీ, బీజాంకురన్యాయంతో కార్యకారణరూపమై ప్రవాహమైన ఈ జగత్తు సత్యమేమో అనిపిస్తుంది.

ఇది నీ మాయేగాని వాస్తవం కాదు. ఆ మాయను నివారించగల నీవు పెక్కు అవతారాలెత్తి లోకనిర్మాణనిపుణులైన బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారిని, పుణ్యపురుషుల్ని దేవతల సమూహాన్ని కాపాడుతున్నావు. క్రూరకర్ములగు దుష్టాత్ములను శిక్షిస్తున్నావు. నీ అవతారంయొక్క ప్రయోజనం భూభారాన్ని తగ్గించడమే! అందువల్ల నిన్ను శరణుకోరుతున్నాను.

ప్రవిమలాకారా! సంసారభయాన్ని దూరం చేసేవాడా! భక్తజనులను పోషించడంలో ఆనందం పొందేవాడా! పరమప్రరుషా! దేవా! శాంతమై, పూజనీయమై, తీక్ష్ణమై, ఉదారమై ప్రకాశించే నీ కాంతిచే తాపాన్ని పొందాను. కృశించాను, నన్ను రక్షించు. నీ పాదపద్మాలను సేవించే బుద్ధి కలిగేటంతవరకే మానవులు పాపాలు చెస్తారు. అనాథ రక్షకుడనే బిరుదు కలిగిన నీకు నన్ను కాపాడుట వింతయా?(కాదని భావం)

అనగా శ్రీకృష్ణుడు దయగలవాడై సాధనమైన జ్వరం(వైష్ణవజ్వరం) ఇతరమైన సాధనాలతో నివారణం కాదు. కానీ, నీవు నీ మనస్సులో నన్ను చూచి, (నా తత్త్వం తెలుసుకొని) శరణు కోరావు. కనుక నా వైష్ణవజ్వరతాపం ఇకపై నిన్ను బాధించదు. ఇక మనోవేదన చెందవద్దు.

('సర్వధర్మాలను పరిత్యజించి, నన్నే శరణుపొందు, సర్వపాపాలనుండి నిన్నునేను విముక్తుణ్ణి చేస్తాను. విచారించకు' అనిన గీతాచార్యుని వాక్యం - ప్రస్తుతం - శైవజ్వరశక్తి విషయంలో నిరూపితమైంది.)

ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. ఎవ్వరైనా ఈ శైవ వైష్ణవజ్వరాల కలహాన్నీ నీవు (శైవజ్వరం) విష్ణుప్రపత్తికి సిద్ధపడటాన్నీ మనస్సులో తలుస్తారో అట్టిపుణ్యాత్ములను శీతోష్టజ్వరాలు బాధింపవు అని చెప్పగా ఆ శైవజ్వరం కృష్ణునికి సాష్టాంగంగా నమస్కరించి తన కోరికను అనుసరించి వెళ్లింది. తరువాత బాణాసురుడు శోణపురంలో

బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట







Wednesday, August 26, 2026

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీరకాంతిగలవాడూ, సాటిలేని అదృష్టసంపన్నుడు అయిన నారదుడు దయాబుద్ధిగలవాడైై; శ్రీకృష్ణుణ్ణి సేవించడానికి వచ్చాడు.

ఈ విధంగా వచ్చిన నారదమునిని సుధర్మాసభలో శ్రీకృష్ణుడు, యదు, వృష్టి, భోజ, అంధకవీరులు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉన్నతాసనంలో కూర్చుండ పెట్టి దేవమునిని గౌరవించాడు. నారదుడు అనిరుద్ధుని వృత్తాంతమంతా స్పష్టంగా తెలిపాడు. శ్రీకృష్ణుడు బాణాసురునిపై యుద్దానికి మంచి ముహూర్తం నిర్ణయించి, సైన్యాన్ని సిద్ధం చేసేందుకు వేత్రహస్తుల్ని నియమించి, తానూ యుద్దానికి సిద్ధమయ్యాడు.

(యదు, వృష్టి, భోజ, అంధకములనేవి నాల్గు రాజవంశాల పేర్లు. యదువంశానికి చెందినవాడు నందగోపుడు, ఆయన భార్య యశోద. కృష్ణుని పెంచి పెద్ద చేసినవారు. వృష్టి వంశపురాజు వసుదేవుడు, దేవకీదేవి. శ్రీకృష్ణుని తల్లితండ్రులు, భోజవంశపురాజు కుమార్తె కుంతీదేవి. ఈయనకు కుంతిభోజుడనీ పేరు. అంధక వంశపురాజు ఉగ్రసేనుడు. ఆయన కుమారుడు కంసుడు.

తండ్రిని చెరసాలలో బంధించి సింహాసనమెక్కినవాడు, కంసుని ఆస్థానంలోని మల్లయుద్ధ వీరులైన చాణూరముష్టికులు అంధకదేశీయులు. శ్రీకృష్ణుడు ఈ మల్లయుద్ధ వీరులిద్దరినీ, మేనమామ కంసుణ్ణి సంహరించి, తాతగారైన ఉగ్రసేనుణ్ణి సింహాసనాసీనుణ్ణి చేశాడు.)

శ్రీకృష్ణుడు హారాలు, కిరీటం, భుజకీర్తులు, చేతికడియాలు, ఉంగరాలు, నూపురాలు మున్నకు అలంకారాలూ, ఆభరణాలూ ధరించాడు. చేతుల్లో గద, శంఖం, చక్రం ప్రకాశించగా సువాసనగల చందనం అద్దినవక్షఃస్ధలం పై గల, కౌస్తుభమణి కాంతులు వ్యాపించగా పసుపురంగు పట్టువస్త్రం కుచ్చిళ్లు ఏర్పడేటట్లు కట్టాడు. సారథి దారుకుడు రథాన్ని సిద్ధం చేసుకొనిరాగా, తూర్పుకొండపై సూర్యుడు ఎక్కినట్లు - సంతోషాతిశయంతో - ఆ రథాన్ని ఎక్కాడు.

శ్రీకృష్ణుడు రథం ఎక్కగానే బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ముత్తైదువలు అక్షతలు చల్లారు. వందిమాగధులు కైవారాలు చేశారు. స్తోత్రపాఠకులు చేసే ప్రశంసలకు కృష్ణుడు ఆనందించాడు.

బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన ప్రముఖ యదు, వృష్టి, భోజ, అంధకవీరులు శత్రుబలనిర్మూలనకై చతురంగ బలసమేతులై పండ్రెండు అక్షౌహిణులతో, పూర్వం ఆకాశగంగ భగీరథుని వెంటవెళ్లిన విధంగా కృష్ణుని వెంట నడిచారు.

కొన్ని దినాల తరువాత యాదవవీరులు శోణనగరం హద్దులు దాటి, ఆ నగరాన్ని చేరారు. అంతట

యాదవసైన్యం శోణపురప్రాంతానికి చేరి నదులను, సరస్సులను, విహార స్థలాలనూ, ఉద్యానవనాలను, యజ్ఞస్థలాలను నాశనం చేశారు. అనేక అగడ్తలను పూడ్చారు. యంత్రాలను పాడుచేశారు. గోపురాలను పడగొట్టారు. రాజభవనాల్ని కూలద్రోశారు. ప్రాకారాలను నేలకూల్చారు. అమితోత్సాహంతో తలుపులను బ్రద్దలుకొట్టారు.

యాదవవీరులు శోణపురాన్ని అనేకవిధాలుగా నిరోధించారు. రాక్షసరాజగు బాణుడు కోపోగ్రమూర్తియై సైన సంసిద్ధతకై యుద్ధభేరి మ్రోగించగా

భూమి కుమ్మరిసారెవలె తిరిగింది. ఆదివరాహస్వామియొక్క గిట్టల తాకిడికి కలతచెందిన నదీనదాల్లాగా సముద్రాలు క్రిందుమీదుగా లేచే అలలతో పొర్లాయి. శివుని చేతిలోని శూలం దెబ్బలకు రాలే పిడుగులవలె నక్షత్రాలు నేల రాలాయి. భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది విధంగా మేఘాలు చెల్లాచెదరయ్యాయి. పర్వతాలు కంపించాయి. స్వర్గం క్షోభించింది. దేవతల గుండెలు కలతపడ్దాయి. దిక్కులు చలించాయి. విమానాలు దారితప్పాయి. సూర్యచంద్రులు మార్గం తప్పారు.

యుద్ధసన్నాహానికి సిద్ధపడ్డ బాణుడు బంగారుకవచాన్ని రత్నకాంతులతో కూడిన కిరీటాన్ని కుండలాలను, హారాలను ధరించి ప్రాసం, తోమరం, గద, ఖడ్గం మొదలైన అనేక ఆయుధాలతో తన సైన్యం శత్రు సైన్యాలకు దీటుగా ఇరువైపుల నడువగా ఉన్నతమైన రథం ఎక్కి మహాశౌర్యంతో యుద్దానికి వెళ్లాడు. ఆ సమయంలో

బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట







Balaramudu Teerdhayatraku Januta - బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - బలరాముడు తీర్థయాత్రకు జనుట ఆ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి మొదట ప్రభాసతీర్దానికి వెళ్లి, ప...